భారతీయ జనతా పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా వాజ్‌పేయి ఉన్నారు. ఉన్నది నాలుగున్నరేళ్లే ఆయనా … చరిత్రలో నిలబడిపోయే మౌలికసదుపాయాల కల్పన చేపట్టారు. అందుకే.. ధైర్యంగా భారత్ వెలిగిపోతోంది అనే కాన్సెప్ట్‌తో .. ధైర్యంగా ఎన్నికలకు వెళ్లారు. కానీ ప్రజలు మరో విధంగా ఆలోచించారు. ఇప్పుడు.. భారతీయ జనతా పార్టీ నరేంద్రమోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి ఆరేళ్లయింది. ఈ ఆరేళ్లలో దేశంలో చెప్పుకోదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటంటే ఒక్కటీ నిర్మించలేదు.. ఒక్క పటేల్ విగ్రహం తప్ప. అంతే కాదు.. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరంగా దిగజారిపోతోంది. మన కన్నా.. బంగ్లాదేశ్ లాంటి దేశాలు ముందుకెళ్తున్నాయి. అందుకే ఇప్పుడు ” దేశం నలిగిపోతోంది” అని ట్యాగ్ లైన్ కరెక్ట్‌గా సరిపోతుంది.
దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్న మోడినామిక్స్..!
మోడీ ప్రభుత్వ ఆర్థిక పరమైన నిర్ణయాలు చాలా కాలంగా.. ఆర్థిక నిపుణుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూంటాయి. ఏ శాస్త్రం ప్రకారం చూసినా.. ఆ నిర్ణయాల వల్ల ఆర్థిక లాభం కలగడం కానీ.. ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కానీ… దేశ సంపదపెరగడం కానీ జరుగుతుందని వారెవరూ ఊహించలేకపోయారు. అమర్త్యసేన్ లాంటి నోబెల్ ప్రైజ్ పొందిన ఆర్థిక వేత్తలు… రఘురాంరాజన్ లాంటి ఆర్బీఐకి గవర్నర్లుగా పని చేసిన పెద్దలూ కేంద్రం నిర్ణయాలు చూసి.. ఇది ఎకనామిక్స్ కాదు మోడీనామిక్స్…తమ సబ్జెక్ట్ కాదు అని.. సైడైపోయారు. మోడీనామిక్స్కి చిన్న ఉదాహరణ… రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ. ప్రజలకు ఆదాయం పెంచితే… ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. కానీ ప్రజలకు ఆదాయం పెంచకుండా.. వారి వద్ద ఉన్న కొద్ది మొత్తాన్ని టాక్సులు పెంచి లాగేసుకుంటే.. ప్రభుత్వానికి తాత్కలిక ఆదాయం వస్తుంది కానీ.. ఆర్థిక వ్యవస్థ మాత్రం కుంగిపోతుంది. ఈ విషయం ఏ మాత్రం అంచనా వేయకుండా.. రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించామని చెప్పి… పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. పది వడ్డించేశారు మోడినామిక్స్ నిపుణులు. ఆ తర్వాత వివిధ పద్దతుల్లో పన్ను వడ్డింపులు జరుగుతున్నాయి. దాని ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దేశం నలిగిపోతోంది.. ఆర్ధికంగా నలిగిపోతోంది. మన కన్నా బంగ్లాదేశ్ వంటి దేశాలు… ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకుంటూ ముందుకెళ్తున్నాయి.
మన కన్నా బంగ్లాదేశ్ ప్రజల తలసరి ఆదాయం ఎక్కువ..!
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చేస్తామని.. మోడీ చెప్పారు. అది తన మోడినామిక్స్తో సాధ్యమని ఆయన నమ్మారు. కానీ ఇది స్వచ్చభారత్.. మేక్ ఇన్ ఇండియా వంటి నినాదాల్లానే మిగిలిపోయింది. ఐదు ట్రిలియన్ డాలర్లకు కాదు కదా.. ఆ దరిదాపుల్లోకి కూడారాలేదు. చైనాను అధిగమించేస్తామని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. అనుకూల మీడియాలో చైనా ఎంత.. పిసరంత అని ప్రచారం చేశారు. కానీ చైనా ఆర్థిక పరంగా కొన్ని వేల అడుగులు ముందుకు వేసింది. భారత్ ఎక్కడో ఉంది. చైనాను అధిగమించాలంటే ఆ దేశ పరుగు ఆగిపోవడం.. భారత్ రెట్టింపు వేగంతో పరుగెత్తడంచేయాలి. కానీ… చైనా పరుగు స్లో అయినా భారత్ వేగం మాత్రం ఆగిపోయింది. చివరికి బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా.. మెరుగ్గా ఆర్థిక వ్యవస్థను రూపొందించుకుంటున్నాయి. ఈ విషయం వాళ్లూ.. వీళ్లూ చెప్పింది కాదు. అంతర్జాతీయ మానిటరింగ్ ఫండ్.. ఐఎంఎఫ్ తన నివేదికల్లో వెల్లడించింది.
తయారీ పరిశ్రమల్ని అంది పుచ్చుకుంటున్న బంగ్లాదేశ్..! ప్రచారానికే భారత్ పరిమితం..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ..బంగ్లాదేశ్ జీడీపీ కన్నా తక్కువే. అత్యంత పేద దేశాల్లో ఒకటి అయిన బంగ్లాదేశ్ పురోగమిస్తోంది. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. కానీ భారత్ పరిస్థితేమిటి.?. భారత దేశ జీడీపీ మైనస్ 10.3 శాతం గా ఉంటుంది.. అదే బంగ్లాదేశ్ జీడీపీ 3.8 శాతం పెరుగుతుంది. కరోనాను కారణంగా చెప్పే సమయంలో.. ఇది సామాన్యమైన విషయం కాదు. కరోనా లేకపోయినా బంగ్లాదేశ్ జీడీపీ భారత్‌ను మించి పోతుందని ఆర్థిక నిపుణులు లెక్కలతో సహా చెబుతున్నారు. బంగ్లాదేశ్.. తయారీ పరిశ్రమపై దృష్టి పెట్టింది. నైపుణ్యం తక్కువ అవసరమైన ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారుతోంది. చైనాలో ప్రస్తుతం స్కిల్డ్ లేబర్ ఎక్కువ. ఈ కారణంగా నైపుణ్యం అవసరం లేని వస్తువుల తయారీ పరిశ్రమలు ఇతర దేశాలకు వెళ్తున్నాయి. ఇలాంటి పరిశ్రమలను బంగ్లాదేశ్ ఆకట్టుకుంది. చైనా వదలిన ఖాళీని పూర్తి చేసి ఎగుమతులతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా కొత్తగా 80 లక్షల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులయ్యారు. కానీ.. కొత్తగా పరిశ్రమలను తీసుకొచ్చిన.. ఆకట్టుకునే ప్రయత్నం ఏదీ కేంద్రం వైపు సాగడం లేదు. కేవలం… భారతే.. తదుపరి అగ్రదేశం.. అని ప్రచారం చేసుకోవడం మినహా.
అరచేతిలో సర్గం ఇంకెన్నాళ్లు చూపిస్తారు..? ఇప్పుడైనా కళ్లు తెరుస్తారా..?
ఆరు సంవత్సరాలుగా కేంద్రం అరచేతిలో స్వర్గాన్ని చూపుతోంది. గుజరాత్ నమూనాను దేశమంతటా అమలు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయని ఉదరగొడుతున్నారు. కానీ రావడం లేదు. భావోద్వేగ రాజకీయాలు నడుపుతూ.. ప్రజల్ని సోషల్ మీడియా ప్రచారంతో మభ్య పెట్టి… మన దేశంపైకి ఎవరెవరో దండయాత్రకు వస్తున్నారని భ్రమలు కల్పించి.. తాము మాత్రమే రక్షణ కల్పిస్తామని ఆశలు కల్పించి.. పబ్బం గడిపేసుకుంటున్నారు. కానీ.. దేశ ప్రజలు మాత్రం ఆగమైపోతున్నారు. రోజు రోజుకు వారి జీవన ప్రమాణాలు పెరిగిపోతున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల ఆదాయం మాత్రం కుంచిచుచుకుపోతోంది. దేశంలో అభివృద్ధి నినాదానికి చెల్లిపోయేలా… రాజకీయ పార్టీలు కుల, మత రాజకీయాలు చేస్తున్నాయి. అందుకే.. ఈ దుస్థితి… చివరిగా చెప్పడానికి ఒకే మాట ఉంటుంది… అంతకు మించి ఏమీ ఉండదు.. అదే..
“భారత్ నలిగిపోతోంది..”