అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచానికి జ్వరం వస్తుందని చెప్పుకుంటారు. ఎందుకంటే అమెరికా పరిణామాలపైనే పడి ప్రపంచం నడుస్తోంది. ఈ ప్రభావం నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ సాధ్యం కావడం లేదు. అందుకే అమెరికాలో ఎన్నికలు అంటే తమ దేశంలోనే ఎన్నికలు జరుగుతున్నాయన్న ఓ భావనకు ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు వస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇండియన్స్ మరింత ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో కానీ గెలిచిన వారిని బట్టి అక్కడ భారతీయులకు అవకాశాలు ఉంటాయి. అమెరికా కలలు కల్లలు చేస్తారా లేకపోతే నిజం చేస్తారా అన్నది కాబోయే అధ్యక్షుడి చేతుల్లోనే ఉంటుంది. అది ఒక్కటే కాదు.. అక్కడి రాజకీయ నాయకులు ముఖ్యంగా ట్రంప్ అనుసరిస్తున్న రాజకీయవ్యూహాలు పూర్తిగా భారతీయ రాజకీయ నేతల్ని పోలి ఉన్నాయి. అందుకే ఆయన ప్రచారం భారత్ లో ఎక్కువగా హైలెట్ అవుతోంది. అమెరికాలోనూ వింతగా ఉంటోంది.
మోదీ రాజకీయ వ్యూహాలు పాటిస్తున్న డొనాల్డ్ ట్రంప్
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మూడు రోజల కిదంట పూర్తిగా గార్బేజ్ కలెక్షన్స్ చేసేవారి యూనిఫాంలో ప్రచారం చేశారు. దానికి కారణం డెమెక్రటిక్ అధ్యక్షుడు బైడెన్ .. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమల్ హ్యారిస్‌కు మద్దతుగా జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ “ అని ప్రచార ర్యాలీల్లో గార్బేజ్ మాత్రమే ప్రవహిస్తుంది” అని విమర్శించారు. ఇంతకంటే చాన్స్ రాదనుకున్న ట్రంప్ వెంటనే గార్బేజ్ కలెక్షన్ చేసే వాళ్ల యూనిఫాంతో రాజకీయాలు ప్రారంభించారు. ఈ ఇన్సిడెంట్ చూస్తే ఎవరికైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఆయన మొదట్లో కాంగ్రెస్ ను ఇలాగే కార్నర్ చేసేవారు. మొదటి సారిగా చాయ్ పే చర్చా అనే కార్యక్రమాన్ని ఇలాగే అందుకున్నారు. ఓ కాంగ్రెస్ నేత చేసిన విమర్శతో అవును తాను చాయ్ అమ్ముకునే ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. ఆయన స్ట్రాటజిస్టులు వెంటనే చాయ్ పే చర్చాకు రూపకల్పన చేశారు. ఇలా ప్రచార వ్యూహాల్ని అందుకోవడం భారత నేతల నుంచి ట్రంప్ నేర్చుకున్నట్లుగా ఉన్నారు. ఆయన గార్బేజ్ డ్రెస్‌తో చేసిన రాజకీయం భారత ప్రజల్ని ఇదెక్కడో చూసినట్లుందే అనుకునేలా చేసింది. నిజానికి ట్రంప్ రాజకీయ వ్యూహాలన్నీ భారత రాజకీయ నాయకులవి పోలి ఉంటాయి. గత వారం ఆయన మెక్ డొనాల్డ్స్ లో పని చేశారు. అది మొత్తం స్క్రిప్టెడ్. రిహార్సల్స్ పూర్తి చేసి షూట్ చేసుకున్నారు. ఓ. ప్రవాస భారతీయుడికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చి ఆయన చెప్పించుకున్న మాటలు వింటే ఇలాంటి డ్రామాలు చాలా చూశాం కదా అనుకుంటారు ఇండియన్స్.
ఓటుకు నోటును అమెరికాకు పరిచయం చేస్తున్న ట్రంప్ క్యాంపు
ఆయన సపోర్టర్లు కూడా అదే చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ఓట్ల కొనుగోులు ప్రక్రియను అమెరికాకు తీసుకెళ్లారు. నేరుగా డబ్బులిస్తే నేరం కాబట్టి ట్రంప్‌కు ఓటు వేసేలా మోటివేట్ చేసేందుకు ఓ పిటిషన్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చి.. రోజుకు ఒకరికి చొప్పున మిలియన్ డాలర్లు ఆఫర్ చేశారు. చేయడమే కాదు ఇస్తున్నారు కూడా. ఇది రాజ్యాంగవిరుద్ధమని అమెరికా ప్రభుత్వం విచారణ కూడా ప్రారంభించింది. అయినా ఆయన పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇలా ఉంటే.. తర్వాత రాను రాను ఓటర్లకు నేరుగా డబ్బులు పంచే ఇండియా తరహా ఓటింగ్ ప్రక్రియ అమెరికాలో రావడానికి ఎంతో కాలం పట్టదు. ఎలాన్ మస్క్ ఓటుకు నోటు మాత్రమే కాదు ఆయన ట్విట్టర్ ను ఉపయోగించి ట్రంప్ వైపు ప్రజాభిప్రాయాన్ని తిప్పడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి ఇండియా తరహాలో బ్యాలెట్ బాక్సులు, ఓటర్ల జాబితాలో తేడాలు అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడు అయిన మస్క్. .. ట్రంప్ కోసం ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. ఇతర వ్యాపాలన్నింటినీ పక్కన పెట్టారు. ఆయన స్వయంగా దక్షిణాఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తి అయినా వలసదారుల విషయంలో కఠినంగా ఉండాలని వాయిస్ వినిపిస్తున్నారు. ఆయన స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని జో బైడెన్ నేరుగా హెచ్చరికలు జారీ చేశారు, కానీ ట్రంప్ కోసం ఎందాకైనా అన్నట్లుగా ఆయన పయనం సాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ వ్యూహాల కోసం ఇండియా నుంచి ఎవరిరైనా పిలిపించుకున్నారేమో కానీ… మొత్తం ప్రచార శైలి అలాగే ఉంటోంది. తనను గెలిపించకపోతే అమెరికా అల్లకల్లోలం అయిపోతుందని బెదిరించడానికి వెనుకాడటం లేదు.
భారతీయులకు ప్రాధాన్యనిస్తూ పచార సరళి
అమెరికాలో భారతీయ మూలాలున్న ఓటర్లు తక్కువేం కాదు. అందుకే ప్రచారంలో భారతీయుల ప్రస్తావన తరచూ వస్తోంది. స్వయంగా కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న అభ్యర్థి. అక్కడ స్థిరపడిన విదేశీయులు ఓటర్లుగా మారడమే కాదు.. ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలింటే వారిలో భాగం అవుతున్ననారు. ఈ విషయంలో భారతీయులు చాలా ముందు ఉన్నారు. ఒకటి, రెండు తరాలకిందట వెళ్లిన వారు అమెరికా పౌరులుగా మారి నేరుగా పరిపాలన చేయడానికే పోటీ పడుతున్నారు. కమలాహ్యారిస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా పోటీ చేస్తూండటం భారతీయులను మరింత ఉద్వేగానికి గురి చేస్తోంది. అధ్యక్ష పదవికి పోటీ చేసేలా ఓ భారత మూలాలున్న నేత ఎదిగారంటే ఇక కింది స్థాయిలో వారు ఎంత ప్రభావిత స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళ ప్రమీలా జయపాల్. కేరళ నుంచి అమెరికా వెళ్లారు. 2016లో హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ సభకు ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో అమెరికన్ సెనేటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్‌గా కమలా హారిస్ రికార్డులకెక్కారు. ఇప్పుడు ఆమె అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. తొలిసారిగా 2024 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం ముగ్గురు భారత సంతతి అమెరికన్లు పోటీ పడ్డారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసు కోసం జరిగిన పోటీలో డోనల్డ్ ట్రంప్‌తో పాటు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ పోటీ పడ్డారు. డెమొక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరపున దలీప్ సింగ్ 1957లోనే అమెరికన్ కాంగ్రెస్‌లో అడుగు పెట్టారు. ఆయన తర్వాత 50 ఏళ్ల పాటు భారత సంతతి అమెరికన్లు ఎవరూ ఆ దిశగా విజయం సాధించలేదు. ఆ తర్వాత 2005లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన బాబీ జిందాల్ కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం కూడా ప్రయత్నించారు. అమెరికాలోని భారతీయుల్లో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ, దాని అనుబంధ సంస్థలలో పని చేస్తున్నారు. ప్యూ సర్వే ప్రకారం 68 శాతం రిజిస్టర్డ్ భారతీయ అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధం ఉన్నవారు.కేవలం 29శాతం మాత్రమే రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అందుకే ప్రచార సరళి భారతీయులకు ప్రాధాన్యమిస్తూ సాగుతోంది. డాలస్ వంటి చోట్ల తెలుగులోనూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నారంటే ఆ ప్రభావాన్నితక్కువ అంచనా వేయలేం.
ఎవరు గెలిస్తే ఏంటి?
అమెరికాలో ఎవరు గెలిస్తే భారతీయులు ఏంటి అనే లెక్కలు సహజంగానే వస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్లస్‌లు మైనస్‌లపై చర్చ ఉంటుంది. ట్రంప్ మొదటి సారి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు ఆయన పూర్తిగా అమెరికా భావజాలాన్ని విస్తృతం చేశారు. ఆయనది బీజేపీ తరహా రాజకీయం. మెజార్టీ ప్రజల్ని మైనార్టీలపైకి రెచ్చగొట్టి వారిని ఓటు బ్యాంకులుగా చేసుకుందామనుకునేటైపు. ఇప్పుడు కూడా అప్ తరహా ప్రచారం చేస్తున్నారు. కమలా హ్యారిస్ గెలిస్తే అక్రమ వలసదారులకు కేంద్రంగా అమెరికా మారిపోతుందని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. కమలా హ్యారిస్ తన భారతీయులు మూలాల్ని దాచుకోనప్పటికీ ఆమె అచ్చమైన అమెరికా అధ్యక్ష అభ్యర్థిగానే ప్రచారం చేస్తున్నారు. ఏ విషయంలోనైనా అమెరికానే ఫస్ట్ అని నినదిస్తున్నారు . ట్రంప్ తో పోలిస్తే కమలా హ్యారిస్ ప్రచారం హుందాగా సాగుతోంది. భారతీయ వాననలు ఉండటం లేదు. సగటు అమెరికన్ కోరుకునే హుందాతనం ఆమెలో కనిపిస్తోంది. అమెరికా అగ్ర రాజ్యంగా గౌరవాన్ని నిలుపుకోవాలన్నట్లుగా ఆమె తీరు ఉంది.
ఓట్లు ఎక్కువ వచ్చినా ఓడిపోవచ్చు అదే అమెరికా అధ్యక్ష ఎన్నికల స్టైల్ !
జార్జిబుష్ జూనియర్ మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన కంటే డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ జార్జిబుష్ జూనియర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ భిన్నంగాఉంటుంది. యాభై రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు అధ్యక్షుడ్ని తేలుస్తాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతినిధుల ఓట్లన్నీ వస్తాయి. ఇలా రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించడమే కీలకం. ఎక్కువ రాష్ట్రాల్లో మెజార్టీ సాధించడం విషయం కాదు.. ఎక్కువ ప్రతినిధుల ఓట్లు లభించే రాష్ట్రాల్లో మెజార్టీ సాధించడం కీలకం. మొదటి నుంచి రిపబ్లికన్లు, డెమెక్రాట్ల మధ్య రాష్ట్రాల మద్య పోరు ఉంటుంది. కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. స్వింగ్స్ స్టేట్స్ కీలకం. గత ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతుగా నిలిచి ఈ సారి కమలా హ్యారిస్ వైపు ఏదైనా ఒక్క స్టేట్ మారిన ఫలితం ఆమెకు అనుకూలంగా వస్తుంది. కమలా హ్యారిస్ కు అయినా అంతే.
అమెరికా అంటే ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వారి దేశం అనుకుంటారు. కానీ అది ధనవంతమైన దేశమే. ఉన్నత ఆలోచనలు ఉన్న దేశమా కాదా అన్నది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సరళి తెలియచేస్తోంది. అక్కడి ఎన్నికల ప్రమాణాలు కూడా రాను రాను దిగజారిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. అమెరికాలో జరుగుతున్న ఎన్నికలు భారత్ పై కానీ భారతీయులపై కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ఏమైనా నిర్ణయాలు ఉన్నా ఒక్క శాతం ప్రజలపై కూడా ఎఫెక్ట్ ఉండదు. కానీ అమెరికా అంటే మనకు ఓ ఎమోషన్. అందుకే ఆసక్తి ఎక్కువ.