” గెలిచే వరకూ రాజకీయం చేయవచ్చు.. కానీ గెలిచిన తర్వాత రాజకీయం చేస్తే వారిని పాలకులు అనరు .. ” .. ఎందుకంటే పాలకుడు అనేవాడు అందరికీ పాలకుడు. కొంత మందికి కాదు. ఓట్లు వేసినా.. వేయకపోయినా రాజ్యం మొత్తానికి పాలకుడు. నేను ఓట్లేసిన వారికి మాత్రమే పాలకుడ్ని .. మిగతా అందరికీ రాక్షసుడ్ని అని తీర్మానించేసుకుని పాలన పేరుతో నియంతృత్వం చూపించి.. ప్రజల్లో చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకుంటే తాత్కాలిక విజయాలు రావొచ్చు కానీ అంతిమంగా జరిగేది వినాశనమే. అది ఆ పాలకుడికి మహా అయితే ఓటమితో ముగుస్తుంది. కానీ ప్రజలకు.. ఆ ప్రాంతానికి .. ఆ పాలకుడు పరిపాలించిన నేలకు తరతరాల పాటు శ్రమించినా కోలుకోలేని అన్యాయం జరుగుతుంది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ప్రజల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెట్టడం ఎక్కడైనా చూశామా ?
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నానని ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చెప్పారు. కానీ సీఎం అయ్యాక మాత్రం చిచ్చు పెట్టేశారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని సమస్య లేదు. స్వయంగా ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే సమర్థించారు. అదేమీ రాజకీయ ప్రకటన కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ఆమోదంతోనే అప్పటి ప్రభుత్వం అమరావతిని నిర్ణయించింది. ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అందుకే అమరావతి కోసం రైతులు కూడా భూములివ్వడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. ఎన్నికల్లో అమరావతి మార్పు అనే అంశం రాజకీయ తెరపైకి వచ్చినప్పుడు అందరూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వైపే అనుమానంగా చూశారు. చంద్రబాబు అరకొరగా కడుతున్నారు.. తాము వచ్చి కట్టి చూపిస్తామన్నదే ఆ సమాధానం. దాంతో ఎవరికైనా రాజధాని కట్టడమే సమస్య అవుతుంది కానీ.. ఎంపిక కాదు. కానీ అలా చెప్పిన వాళ్లే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. రాజధానిని సమస్యగా చేశారు. ప్రజలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. లేని సమస్యను సృష్టించారు. ఆ సమస్య మీదుగా రాజకీయం చేస్తున్నారు.
బహిరంగంగా కుల దూషణ చేసే సీఎం, మంత్రులు మన దగ్గరే స్పెషల్ !
అమరావతి ఒక కులానిది. ఈ మాట ఎన్ని సార్లు అన్నారో లెక్కే లేదు. స్వయంగా సీఎం జగన్ కూడా ఈ కుల దూషణలో పాల్గొన్నారు. అమరావతిలో అంతా ఓ సామాజికవర్గం వారు ఉంటారని.. అక్కడ అమరావతి కడితే వారు మాత్రమే లాభపడతారని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. నిన్నటికి నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్ పెట్టి ఓ సామాజికవర్గం అంటూ చెలరేగిపోయారు. ప్రతి మనిషికి సామాజికవర్గం ఉంటుంది. ఆ మనిషి కావాలని ఆ సామాజికవర్గంలో పుట్టరు. ఈ సామాజికవర్గాలన్నీ మనుషులు పెట్టుకున్న గీతలే. అయినా రాజకీయం అంటే ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే అనుకునే రాజకీయ నేతలకు ఇదంతా అర్థం కాదు. అమరావతి మీద ఆ కుల ముద్ర వేయడానికి ఎన్నెన్ని కుట్రలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కుల ప్రస్తావన చేయడానికి ఏ మాత్రం సందేహపడని గొప్ప నేత మన సీఎం జగన్. కులాలు మారిపోతాయని ఇంటిపట్టాలివ్వొద్దంటున్నారని రచ్చ చేసిన గొప్ప మేధావి. రాజధానికి అక్కడ భూములిచ్చిన వారిలో అత్యధికం..బీసీ, ఎస్సీ, ఎస్టీలే. వైసీపీ చెబుతున్న కులం కన్నా… రెడ్లే రెండింతల వరకూ భూములిచ్చారని లెక్కలు బయటకు వచ్చాయి. అమరావతి జేఏసీ కన్వీనర్‌గా శివారెడ్డి ముందుండి పోరాడుతున్నారు. అయినా కులం పేరుతో విష ప్రచారం మాత్రం ఆపలేదు. ప్రజల మధ్య.. కులాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రం మానలేదు. పాలకుడు… నిష్కల్మమైన మనసుతో ఉంటేనా ప్రజలకు మేలు జరుగుతుంది. అలా కాకుండా కొంత మందిపై కక్ష చేయాలని రాష్ట్రం కోసం భూములిచ్చారని అకారణంగా పగ పెంచుకుని లేని పోని అవాస్తవలు, అపోహలు ప్రచారం చేసి.. వారిపై ప్రజల్లో వ్యతిరేకత రేకెత్తించాలనుకునే ప్రయత్నాలను ముఖ్యమంత్రితో పాటు ఆయన వంధిగమాగధులు ఇప్పటికీ చేస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఓ వర్గం ప్రజల్ని ఇంతలా వేధించడం ఎక్కడైనా చూసి ఉంటామా ?
అది బడుగు బలహీనవర్గాల రాజధాని !
ప్రభుత్వానికి 33, 771 ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇచ్చారు. ఇలా ఇచ్చిన రైతుల సంఖ్య 29754. అంటే.. దాదాపుగా ఒక్కొక్క రైతు.. ఒక్కొక్క ఎకరానికి కొద్దిగా ఎక్కువ మాత్రమే సగటున ప్రభుత్వానికి ఇచ్చారు. 29 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంకా డీటైల్డ్ గా చూసుకుంటే.. ఒకటి నుంచి రెండున్నర లోపు ఎకరాలను అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు 6,278 మంది, రెండున్నర నుంచి ఐదు ఎకరాల్లోపు ఇచ్చిన వారు 2,131 మంది, ఐదు నుంచి పది ఎకరాలలోపు ఇచ్చిన వారు 765 మంది. పది నుంచి ఆపై ఎకరాలు ఇచ్చిన వారు వందల్లో కూడా లేరు. 69 శాతం మంది రైతులు ఎకరంలోపు ఇచ్చారు. వీరంతా..నిరుపేద రైతులు. భూములు ఇచ్చినవారిలో 90 శాతం మంది రెండున్నర ఎకరాలలోపు ఉన్నవారే. వీరిని మధ్యతరగతి కేటగిరి కింద వేయవచ్చు. కేవలం 3.3 శాతం మంది మాత్రమే.. ఎగువ మధ్యతరగతి, ధనికవర్గాలు. సామాజికపరంగా చూసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 75 శాతం ఉన్నారు. మిగిలిన పాతిక శాతంలో కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ వంటి అగ్రకులాలకు చెందినవారున్నారు. కానీ ప్రజల్ని విభజించాలన్న ఒక్క లక్ష్యంతో.. తమ రాజకీయ మనుగడుకు ఊతంగా ఉంటుందన్న దురాశతో ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. అక్కడ భూములిచ్చిన వాళ్లంతా ఒకే కులం అన్నారు. వారంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లని అన్నారు. ప్రభుత్వం రాజధాని రైతులపై ఎలాంటి సానుభూతి చూపిండం లేదు. వారందర్నీ దారుణంగా ట్రీట్ చేస్తోంది. రాజకీయంగా అమరావతిని బలిపశువును చేసి.. తాము లబ్ది పొందాలనుకుంటోంది. కానీ ఈ క్షుద్ర రాజకీయంలో బలైపోతోంది చిన్నకారు రైతులే. బడుగు బలహీన వర్గాలే.
త్యాగం చేసిన రైతులకు ఇంత అన్యాయం చేసి ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ?
రోడ్డు వెడల్పు చేయాలంటే తమ స్థలం తీసుకోవద్దని కోర్టుకెళ్లే వాళ్లు పదుల సంఖ్యలో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదని రచ్చ చేసేవారు కొందరుంటారు. అసలు ప్రభుత్వం మీద నమ్మకం లేని వాళ్లు మరికొందరు ఉంటారు. పరిశ్రమ కోసం ఎక్కడైనా భూసేకరణ చేయాలంటే “నందిగ్రామ్” లాంటి ఘటనలు లేకుండా జరగడం అసాధారణం. అలాంటిది.. ఒకటి కాదు.. వంద కాదు.. వెయ్యి కాదు.. ముప్పై మూడు వేల ఎకరాల భూముల్ని దాదాపుగా 29వేల మంది రైతులు పైసా పరిహారం తీసుకోకుండా ఇచ్చారు. తర్వాత వారికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నది దైవాధీనం. అమరావతి అభివృద్ధి చెందితే వారు బాగుపడతారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం కోసం వారు త్యాగం చేశారు. జీవనోపాధి కల్పించిన భూముల్ని ఇచ్చారు. కానీ వారికి తిరుగుటపాలో లాభం రాలేదు. ఎంతో వచ్చేస్తుందని వారు అపర కుబేరులయిపోతారన్న జెలసీ మాత్రం వారిపై అన్ని ప్రాంతాల వారు కల్పించుకున్నారు. ఆ జెలసీని విద్వేషంగా మారిన నాటి ప్రతిపక్షం.. నేటి పాలక పక్షం.. అదే పునాదిగా మూడు రాజధానులకు శ్రీకారం చుట్టింది. మొత్తాని ఆ రైతుల్ని నిట్ట నిలువుగా మోసం చేసింది. ఎవరైనా తమకు మేలు కలిగితేనే ప్రభుత్వానికి సహకరిస్తారు. ప్రభుత్వంపై నమ్మకం కూడా ఉండాలి. అలా నమ్మకం పెట్టుకుని రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పుడు మిగులుతోంది అవమానాలు.. లాఠీదెబ్బలు. మూడు రాజధానులు కాకపోతే ముఫ్పై రాజధానులు పెట్టుకోవచ్చు. కానీ ఇలా రైతుల్ని మోసం చేసి కాదు. కానీ అడ్డగోలుగా అదే చేసిన పాలకులు.. ఇప్పటికీ తప్పు తెలుసుకోకుండా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు.
బిల్లులు వెనక్కి తీసుకున్నా చిచ్చు రాజకీయం మాత్రం కొనసాగింపు !
అభివృద్ధి వికేంద్రీకరణకు పాలనా వికేంద్రీకరణకు మధ్య తేడా ఏమిటో ప్రజలు తెలుసుకునే వెసులుబాటు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు. బిల్లులు పెట్టి చట్ట విరుద్ధమని తెలిసి వెనక్కి తీసుకున్నారు. కానీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ప్రాంతాలు, కులాల, మతాల వారీగా విడగొట్టేసి.. రాజధాని సమస్యను మాచ్కం పెంచి పోషిస్తున్నారు. అసలు లేని సమస్యను సృష్టించారు. దానికే పొగపెట్టి.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చేసేశారు. కానీ ఇప్పుడు రెండున్నరేళ్ల కింద పరిస్థితి ఎలా ఉదో..ఇప్పుడూ అలాగే ఉంది. కానీ దాని వల్ల సాధించిందేమిటి ?. ఎవరైనా బాగుపడ్డారా..? రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు రోడ్డెక్కని ఏ వర్గం లేదు. అధికారంలోకి వచ్చే పార్టీలు శాశ్వతంగా ఉండవు. కానీ ప్రభుత్వం మాత్రం శాశ్వతం. ప్రభుత్వంపై నమ్మకాన్ని నిలబెట్టాల్సింది పార్టీలే. తమకు ఓ సారి అధికారం దక్కింది కాబట్టి.. మొత్తంగా ఇష్టం వచ్చేసినట్లుగా చేస్తామని చూస్తే.. మొత్తంగా ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఆ ప్రభావం.. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీపై మాత్రమే ఉండదు.. పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై ఉంటుంది. తర్వాత వచ్చే ప్రభుత్వాలపై కూడా ఉంటుంది. ప్రభుత్వం మాటలను ప్రజలు విశ్వసించడం మానేస్తారు.ఇప్పుడు అదే జరుగుతోంది.
ప్రజల్లో విభజన అనే విష బీజం నాటేశారు.. ! ఇక ఫలితం అనుభవించాల్సింది రాష్ట్రం ప్రజలే !
అమరావతి రైతులు తమ పోరాటం తాము చేస్తున్నారు. వారికి పోటీగా ఓ వైపు ఉత్తరాంధ్ర నుంచి ..మరో వైపు రాయలసీమ నుంచి మేధావుల పేరుతో కొంత మంది బయలుదేరారు. ఒక ప్రాంతంపై ఒకరు.. రెచ్చగొట్టే వ్యఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో విషబీజాలు నాటారు. వాటి ఫలితం ముుదు మందు దారుణంగా ఉంటుంది. కాస్త అటూ ఇటూగా మూడు ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఉద్యమాలు వస్తాయి. రాజకీయ పార్టీలకు అవసరం వచ్చినప్పుడు వాటిని పెంచి పోషిస్తాయి. అధికారంలో ఉన్న వారే చేస్తే.. తామెందుకు చేసి లబ్ది పొందకూడదని ఇతరులు అనుకుంటారు. రాజకీయాల్లో విలువలు ఒకరు పాటిస్తేనే ఉండవు. అందరూ పాటించాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
కనీస మాత్రంగా ప్రజల గురించి ఆలోచించకుండా వారిని పావులుగా వాడుకుని రాజకీయం మాత్రమే చేయాలనుకున్న పాలకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి పాలకుల పాలబడిన రాష్ట్రాన్ని ఎవరూ కాపాడుకోలేరు. ప్రజలే కాపాడుకోవాలి.