పచ్చగా ఉన్న రాష్ట్రం ఓ వ్యక్తి స్వార్థం కోసం .. పదవి కోసం రక్తమోడుతోంది. అధికారం నిలబెట్టుకోవాలన్న తపనతో చేస్తున్న.. చేసిన రాజకీయం మొత్తం ఏపీని ప్రపంచం ముందు ఓ ఆటవిక రాజ్యంగా నిలబెట్టింది. అసలు ప్రజల్ని కాపాడే వ్యవస్థలు ఉన్నాయా అని ఆశ్చర్యపడే రీతిలో దాడులు జరగడం… చూస్తే ఎవరికైనా ఇవేం ఎన్నికలు అనిపించక మానదు. రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ఏపీలోనే కాదు.. మొత్తం ఉమ్మడిఏపీలో ఒకే సారి ఎన్నికలు పెట్టినా పెద్దగా ఘర్షణలు చోటు చేసుకోవు. కానీ క్రిమినల్ మైండ్ ఉన్న పాలకుడు ఎప్పుడైతే… అధికార దాహంతో తెగబడాలని అనుకుంటాడో.. అప్పుడే ఇలాంటివి జరుగుతాయి. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి.. అధికారుల్ని పని చేసుకోనీయకుండా చేసి.. .ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి.. రాజకీయం చేస్తారు.
ఒక్క వ్యక్తి స్వార్థంతో రక్తమోడుతున్న రాష్ట్రం
కారంచేడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు యాభై కార్లలో అనుచరుల్ని తీసుకుని వచ్చి వీరంగం సృష్టించాడు. కారణం లేకుండా రోడ్ల మీద ఉన్న చిరు దుకాణాలను ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలను చూస్తే… మన పోలీసులు..చట్టాలు ఇంత చేతకానివా అని ఆశ్చర్యపోవాల్సిందే. అది మచ్చుకు ఒక్కటి మాత్రమే.. మాచర్లలో ఓటర్లు పోలింగ్ కు రాకుండా చేసిన విధ్వంసం దృశ్యాలు సహా ఎన్నో హింసాత్మక ఘటనలు ఉన్నాయి. రెంటాలలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై చేసిన దాడి దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తిరుపతి, తాడిపత్రి, నర్సరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ. విశాఖ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రశాంతమైన నగరాల్లోనూ దాడులు పెట్రేగిపోతున్నాయి. దీనంతటికి కారణం ఎవరు ?. ఒకే ఒక్కడి స్వార్థం. బెంగాల్ లో ఎన్నికలు అంటే దాడులు, దహనాలు కామన్ అనుకుంటారు. అందుకే అక్కడ ఈసీ మూడు, నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇప్పడు ఆ జాబితాలో ఏపీ కూడా జరిగింది. ఊహించనంతగా హింస చోటు చేసుకుంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో మితిమీరిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించడం కష్టమన్న వాదన ఉంది. అందుకే ఈసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పనికి మాలిన పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేసి పడేసింది. చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని తేల్చి చెప్పింది. కౌంటింగ్ ముగిసిన పదిహేను రోజుల వరకూ బందోబస్తు ఉండేలా ఇరవై ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను కేటాయించింది.
ప్రశాంత ఏపీకి ఈ దుస్థితి ఎవరి వల్ల ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడూ ప్రశాంతంగా జరిగేవి. రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో, పల్నాడులో మాత్రం కాస్త గట్టి ఏర్పాట్లు చేసేవారు. బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు బాక్సుల్ని అపహరించడం .. ఇంకు పోయడం వంటి ఘటనల వల్ల రీపోలింగ్ చేయాల్సి వచ్చేది. కానీ రాను రాను అక్కడ పరిస్థితి మెరుగుపడింది. చెదురుమదురు ఘటనలు తప్ప తీవ్రమైన ఘర్షణలు తగ్గిపోతూవచ్చాయి. గత ఎన్నికల సమయంలోనూ స్మూత్ గా ఎన్నికల ప్రక్రియ నడిచిపోయింది. కానీ ఈ సారి మాత్రం దాడులు, దహనాలు భయంకరంగా మారాయి. పోలింగ్ రోజు పల్నాడు, తాడిపత్రి వంటి చోట్ల జరిగిన దాడుల దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. తర్వాత రోజు కూడా గొడవలు ఆగలేదు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై పట్టపగలు హత్యాయత్నం చేశారు. పల్నాడులో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అన్న పరిస్థితికి వచ్చింది. మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఏపీలో ఇంత తీవ్రంగా హింస పెరగడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే.. పోటీ మాత్రమే కాదు.. నాయకుల మనస్థత్వం కూడా అనుకోవచ్చు. ఏపీలో ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని జగన్మోహన్ రెడ్డి ముందు నుంచీ పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా అన్న కాన్సెప్ట్ లో అల్లర్లు కూడా ఉన్నాయని టీడీపీ నేతలు ముందు నుంచీ ఊహిస్తున్నారు. అందుకే ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని కూడా చెప్పుకున్నారు. ఒక్క శాతం ఓటు బ్యాంక్ లేనప్పటికీ పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ సీట్లను ఇచ్చారు చంద్రబాబు. స్మూత్ గా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాయం కోసమే ఇలా చేశారని అంటారు. అయితే ఘర్షణలు తగ్గలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం పోలీసులు చంద్రబాబు చెప్పినట్లుగా చేశారని ఆరోపిస్తున్నారు. అంటే.. పోలీసులు గట్టిగా ప్రయత్నించకపోతే మరింత ఎక్కువగా ఘర్షణలు జరిగి ఉండేవేమో కానీ.. జరిగిన ఘర్షణలే భయానకంగా ఉన్నాయి. ఎలాగైనా గెలవాలన్న వైసీపీ ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి టీడీపీ కూడా తన క్యాడర్ ను రెడీ చేసింది. దాంతో ప్రతి దాడులు కూడా పెరిగిపోయాయాయి. నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థిగా కొంత మంది దాడి చేస్తే.. ప్రతిగా వందల మంది టీడీపీ కార్యకర్తలు నర్సరావుపేట అభ్యర్థి ఇంటిపై దాడులు చేశారు. చంద్రగరిలో టీడీపీ అభ్యర్థిపై హత్యాత్నం చేశారు.
లీడర్లు హ్యాపీ – బలయ్యేది క్యాడరే
కేవలం ఇక్కడ ఎలాగైనాగెలవాలన్న రాజకీయ నేతల మనస్థత్వం కారణంగానే ఈ గొడవలు జరిగాయని చెప్పక తప్పదు. మరి ఇందులో బలయ్యేది ఎవరు అంటే పార్టీ క్యాడరే. లీడర్లు భద్రంగా ఉంటారు. కానీ గొడవల్లో పడిన వారు వ్యక్తిగత శత్రువుల్ని పెంచుకుంటారు. ఓ అభ్యర్థిపై హత్యయత్నం చేసిన వారిని పొరపాటున అదే అభ్యర్థి ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే తనపై దాడి చేసిన వారిని సింపుల్ గా వదిలేస్తారా.. అలా వదిలేస్తే చేతకాని వాళ్లని అంటారని.. ఇష్టం లేకపోయినా పగ తీర్చుకోవాల్సిందే. ఈ తరహాలోనే ఫ్యాక్షనిజం స్థాయికి గొడవులు వెళ్లిపోతాయి. ఇలాంటి వాటిని అదుపు చేయాల్సింది రాజకీయ నేతలే. కానీ వారే ప్రోత్సహిస్తున్నారు. తమ క్యాడర్ ను బలి చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు జరుగుతున్న హింస పోలింగ్ హింసనే. ఫలితాలు వచ్చిన తర్వాత జరిగే హింస ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణం గత ఐదేళ్లుగా సాగిన రాజకీయమే. ప్రభుత్వం మారితే ఇంత కాలం ప్రతిపక్షంలో ఉండి బాధలు పడిన వాళ్లు.. ఏ మాత్రం ఖాళీగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేతలపై చేసిన దాడులు.. దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబాలను వదలకండా వేధించారు. అది ఒక్క స్థాయిలో లేదు. అన్ని స్థాయిల్లోనూ ఉంది. అందకే అధికారం మారితే .. మా తఢాకా చూపిస్తామని హెచ్చరిస్తూ.. సంయమనం పాటిస్తున్నారు. అయితే ఫలితాలు వచ్చిన రోజున మాత్రం.. ఏపీలో ఊహించని హింస చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల హింసలో దేశాన్ని విస్మయపరిచే ఘటనలు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ బెంగాలే ఎన్నికల హింసకు ఉదాహణగాఉంది. ఇప్పుడు ఏపీ కూడా ఈ ఖాతాలో చేరింది. ఇంత భయంకరంగా మారుతుందో చెప్పడం కష్టం.
కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడు !
కత్తిపట్టుకున్న వాడు కత్తికే బలవుతాడన్న ఓ నానుడి ఉంది. హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తే అదే హింసా రాజకీయాలకు బలైపోవాల్సి వస్తుంది. కానీ ఈ లోపు ఎంతో మంది ప్రజలు నష్టపోతారు. ప్రజాస్వామ్యంలో హింస ఎప్పుడూ సమ్మతం కాదు. కానీ అధికార దాహానికి అలవాటుపడిన నాయకులు తమ క్యాడర్ ప్రాణాలతో చెలగాటమాడటానికి కూడా రెడీ కావడంతోనే సమస్యలు వస్తు్న్నాయి. వ్యవస్థల్లో అధికారులను సైతం భయ పెట్టడం.. వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేని విధంగా వ్యవస్థల్ని మార్చడంతో ఇప్పటికే అరాచక శక్తులు తమ పనితనాన్ని చూపాయి. ఇలాంటి వారిని పీచమణించేందుకు ప్రజలు తమ విజ్ఞతను చూపి ఉంటారని ఆశిద్దాం !