ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బూతులతో నిండిపోతే ఇప్పుడు అత్యంత సరదా రాజకీయం కనిపిస్తోంది. బూతు నేతలంతా కలుగుల్లోకి వెళ్లిపోయారు. రాజకీయాలంటే వ్యక్తిగత కక్షలు కాదని అనుకునే కూటమి నేతలు ఇప్పుడు సంప్రదాయ రాజకీయం చేస్తున్నారు. అదే సమయంలో అంతకు ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ రాజకీయాలు కాస్త పద్దతిగానే ఉండేవి. బూతులు వినిపించేవి కావు కానీ అగ్రెసివ్ రాజకీయం ఉండేది. ఇప్పుడు ఆ అగ్రెసివ్ రాజకీయానికి బూతులు కూడా తోడయ్యాయి. రేపే ఎన్నికలు ఉన్నట్లుగా పార్టీలు శక్తివంచన లేకుండా తమ రాజకీయాలు చేస్తున్నాయి. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలు పోల్చుకోవడానికి రాముడు- భీముడు అన్నంత తేడాగా కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల రాజకీయాలకు పొంతన లేకుండా పోయింది.
క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత మార్పు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో?. గత ఏడాది జూన్ వరకూ బూతు నేతల విజృంభణ కొనసాగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం ఏపీలో సౌండ్ పొల్యూషన్ పూర్తి స్థాయిలో ఆగిపోయింది. బూతు నేతలంతా ఒక్క సారిగా బుద్దిమంతులయ్యారు. చాలా మంది మాట్లాడటం మానేశారు. అసలు వైసీపీ తరపున మాట్లాడటానికి కూడా ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. వైసీపీ తరపున అధికారికంగా తన వాదన వినిపించడానికి అంబటి రాంబాబు అనే ఓ పెద్ద మనిషి తప్ప ఎవరూ ముందుకు రావడం లేదు. చివరికి వైసీపీకి ఈ గతి పట్టించడంలో కీలక పాత్ర పోషించిన కోటరీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు రావడం లేదు. ఇక జగన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీకి కూడా వెళ్లని విపక్ష నాయకుడు ఎవరూ ఉండరేమో. అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా రాకపోవచ్చు కానీ.. ఆయన ప్రతిపక్ష నేతే. చట్ట ప్రకారం చాన్స్ లేకపోయినా ప్రభుత్వంపై పోరాడే విపక్ష నేత ఆయనే. అయినా ఆసెంబ్లీకి వెళ్లలేదు. అప్పుడప్పుడు ప్రెస్మీట్లు పెట్టి అదే సజ్జల టీమ్ రాసిచ్చినవి చదివేస్తారు. వినేవారికి ఆయన ఎక్కడో బావిలోనే ఉన్నారని ఇంకా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని అర్థం అయిపోతుంది. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకత్వ రాజకీయం ఆయనది. కళ్ల ముందు కనిపించేవాటిని కూడా అలవోకగా అబద్దాలుగా చెప్పేస్తారు..లేకపోతే జరగని వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఎలా చూసినా ఆయన కూడా ఇప్పటికీ కలుగులోనే ఉన్నారు. అదే ఏపీ రాజకీయాలకు మంచిది అయినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ మార్క్ వికృతం లేకుండా రాజకీయాలు సాగుతున్నాయి. దానికి సాక్ష్యం అసెంబ్లీ సమావేశాలు జరిగిన వైనమే. అసెంబ్లీ సమావేశాలు, మండలి సమావేశాలు సాఫీగా సాగిపోయాయి. మండలిలో పూర్తి మెజార్టీ ఉన్నా.. ఏ టాపిక్ మాట్లాడినా సరే వైసీపీ నిర్వాకాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి.. మెల్లగా వాకౌట్ ఫార్ములాతో బయటపడ్డారు. అయినప్పటీకి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేతగా తన పనితీరును చూపించారు. అధికారపక్షాన్ని ప్రశ్నించగలనని నిరూపించుకున్నారు. కానీ అసెంబ్లీలో మాత్రం ఆ పని చేయడానికి ఎవరూ లేరు. రాలేదు. అయితే వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తాము సభకు హాజరైనట్లుగా రిజిస్టర్ లో సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే గిఫ్టులు పట్టుకెళ్లారు. ఈ విషయం అయ్యన్న పాత్రుడు బయట పెట్టడంతో ఆ ఏడుగురు పరువు రోడ్డున పడింది. అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందో వారు తమ తమ నియోజకవర్గాల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేల ప్రధాన విధి..అసెంబ్లీకి హాజరు కావడమే. ఆ విధిని వారు ఎగ్గొట్టి.. పైగా దొంగచాటుగా సంతకాలు పెట్టి.. చిన్న పిల్లల కన్నా ఘోరంగా వ్యవహరించారు.
మరో వైపు కూటమి పార్టీలు ఆడుతూ పాడుతూ పాలన సాగిస్తున్నాయి. వారి పాలన విషయంలో ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. లా అండ్ ఆర్డర్ దారికొచ్చింది. అక్రమ అరెస్టులు లేవు. ఆస్తులు కొట్టేస్తారన్న భయం లేదు. పాలన ఎంత సరాదాగా సాగుతుందో ఎంతో కాలం తర్వాత జరిగిన ఎమ్మెల్యేల ఆట పాటల సందడే సాక్ష్యం అనుకోవచ్చు. రాజకీయం అంటే వ్యక్తిగత కక్షలు అనుకునే నడమంత్రపు నేతలు కాస్త పుంజుకునే సరికి మొత్తం రాజకీయ వ్యవస్థ కలుషితం అయిపోయింది. ఎంతగా అంటే.. ఆ పార్టీ నేతలు.. ఈ పార్టీ నేతలకు వ్యక్తిగత శత్రువులే. ఎదురుపడితే కొట్టేసుకునేంత శత్రుత్వంతో ఉండాలి. లేకపోతే అధినాయకుడు అనుమానిస్తాడు. నిజాయితీ లేదనుకుంటాడు. చివరికి తర్వాత ఎప్పుడైనా తన మీద కోపం వచ్చినా ఆ పార్టీలో చేరకుండా.. అలాంటి నేతలతో ఇష్టం వచ్చినట్లుగా తిట్టిస్తాడు. అదే ఫార్ములా పాటించి చాలా మంది నేతలకు జైలుకైనా పోవాల్సిందే కానీ మరో పార్టీలోకి పోయే అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తున్న వారికి తెలుసు. కానీ కూటమి ఎమ్మెల్యేలు మూడు రోజుల పాటు ఆట, చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో సరదా సరదాగా గడిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మనసారా నవ్వుకుంటున్న దృశ్యాలు చూసి కొంత మందికి నిద్ర కూడా పట్టదు. ఇలాంటి రాజకీయ సన్నివేశాల కోసమే ప్రజలు కూడా చూస్తారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు మరో పదిహేనేళ్ల పాటు వరుసగా సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన మనసులో నుంచి వచ్చే మాటలు అవి. చెప్పుడు మాటలు..తప్పుడు ప్రచారాల గురించి తాను ఏ మాత్రం ప్రభావితం కానని ఆయన చెప్పినట్లవుతుంది. ఇలాంటి ప్రకటనలు.. చంద్రబాబు, పవన్ మధ్య ఉన్న ర్యాపో చూస్తే ఏపీలో నిజంగానే వచ్చే పదిహేనేళ్ల పాటు మరో పార్టీకి చాన్స్ కూడా రాదని అనుకుంటారు. రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేం కానీ గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన రాజకీయం ఏపీలో నడుస్తోంది. రాముడు మంచి బాలుడు అనే ఇమేజ్ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. వైసీపీ పూర్తిగా నిర్వీర్యం కావడం కూడా ఏపికి.. ఏపీ రాజకీయానికి శుభసూచికంగా కనిపిస్తోంది.
తెలంగాణలో భిన్నం!
అయితే తెలంగాణలో మాత్రం పూర్తి భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. రాముడుకి భీముడు ఎంత భిన్నమో.. ఏపీ రాజకీయాలతో పోలిస్తే తెలంగాణ రాజకీయాలు అంత భిన్నంగా కనిపిస్తోంది. రాజకీయ వేడి రేపే ఎన్నికలన్నంత స్థాయికి చేరిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం కన్నా రేవంత్ పై వ్యతిరేకత పెంచడం ద్వారానే తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని బీఆర్ఎస్ పెద్దలు అనుకుంటున్నారు. కేసీఆర్ ఆలోచన ఎలా ఉందో కానీ కేటీఆర్ మాత్రం వ్యక్తిగతంగా కూడా రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ పార్టీ నేతలతో అడపాదడపా సమావేశం అయినప్పుడు .. రేవంత్ ను వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనరు. ప్రభుత్వాన్నే అంటారు. కానీ కేటీఆర్ మాత్రం అందుకు భిన్నం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని గౌరవించాల్సిన అవసరం లేదని ఏకవచనంతోనే సంబోధిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ ను రేవంత్ దూషిస్తున్నారని ఆయన గౌరవంగా మాట్లాడితే తమ మాటలు కూడా గౌరవంగా ఉంటాయని అంటారు.అయితే బీఆర్ఎస్ లో అలా మాట్లాడేది పై స్థాయిలో కేటీఆర్ ఒక్కరే. హరీష్ భాష కూడా పరిధులు దాటదు. కానీ కేటీఆర్ ను రేవంత్ ను ఎలా దూషించాలనుకుంటారో అన్ని మాటలు అనలేరు కానీ..ఆయన నేతృత్వంలో నడుస్తున్న సోషల్ మీడియాతో అనిపిస్తున్నారు. పైగా తాను తిట్టించే తిట్లు విని రేవంత్ ఆత్మహత్య చేసుకోలేదని ఆయనకు సిగ్గు లేదని అంటూ ఉంటారు. అలాంటి మాటలు ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తాయి. అక్కడ ఆగిపోయాయి… ఇప్పుడు తెలంగాణకు వచ్చాయి. చివరికి అవి అరెస్టులకు దారి తీస్తున్నాయి. ఓ సీనియర్ జర్నలిస్టు, ఆమెతో పాటు పని చేస్తున్న యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేసినా తెలంగాణ సమాజం నుంచి కనీస స్పందన రాలేదంటే.. ప్రజలు ఏమనుకుంటున్నారో రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని.. అందుకే తిడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనపై కోపం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉచిత బస్సు వల్ల లక్షల మంది మహిళా ప్రయాణికులు రవాణా చార్జీలు మిగుల్చుకుంటున్నారు. ఐదు వందలకే సిలిండర్ వస్తోంది. కొంత మందికి కాకపోయినా మెజార్టీ రుణమాఫీ చేశారు. సంక్షేమం విషయంలో బీఆర్ఎస్ కంటే ఎంతో మెురుగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందలేదన్నది నిజం. ఎక్కడో ఒకరికి పది లక్షలు ఇచ్చి మిగతా వారిని ఆశ పెట్టడం.. కట్టడం పూర్తి కాని డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించి ఓట్లు పొందడం మినహా బీఆర్ఎస్ హయాంలో బెంచ్ మార్క్ సంక్షేమం లేదు. కానీ రేవంత్ మాత్రం.. మాట ఇచ్చాం కాబట్టి ఎక్కడో చోట తెచ్చి అమలు చేయాలన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నారు. తమను ఎందుకు తిడతారని రేవంత్ అడుగుతున్న ప్రశ్నకు బీఆర్ఎస్ నేతల వద్ద సమాధానం లేదు. కానీ యూట్యూబ్ ల ద్వారా తిట్టించడం ద్వారా రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్న అభిప్రాయాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని రేవంత్ ఎలా ఎదుర్కొటారన్న సంగతిని పక్కన పెడితే.. ఈ తిట్లు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మాత్రం కలుషితం చేస్తున్నాయి. ప్రజలు ఈ తిట్లపై విరక్తి చెందితే అన్ని రాజకీయ పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు అనేది దుస్సంప్రదాయం. ప్రజా సమస్యల కోసమే పోరాటం చేయాలి.. వ్యక్తిగత సంబంధాలు వచ్చే సరికి.. ఆప్యాయంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. గతంలో ఏపీలో అయితే కనిపిస్తే కాల్చేసుకునేంతగా టీడీపీ, వైసీపీ నేతలు శతృత్వం పాటిస్తే.. ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్ని గుణపాఠాలుగా నేర్చుకుని… తెలంగాణ రాజకీయాలు ఆ తప్పులు చేయకుండా చూసుకోవాల్సి ఉంది. ప్రజలు స్పందించడం లేదు కదా.. వారి అంగీకారం ఉందనుకోవడం మూర్ఖత్వమే. ప్రజలకు ఉన్న హక్కు..ఓటింగ్ రోజు వినియోగించుకుంటారు. అందుకే రాజకీయ నేతలు ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు.