“మతం ప్రజల పాలిట మత్తు మందు” లాంటిదని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. దీన్ని అంగీకరించని వారెవరూ ఉండరు. అందరూ అంగీకరిస్తారు. కానీ ఆ మత్తులో మునిగి తేలడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఈ పరిస్థితి చివరిగా ఏపీలోకి వచ్చిందనుకోవాలి. ఇప్పటికే దేశం మొత్తం వ్యాపించేసింది. సర్వమతాల సారం దేవుడొక్కడే. ఈ భావన అందరిలో ఉంటే.. మత మార్పిళ్లు ఉండవు. మత రాజకీయాలు ఉండవు. ఎవరు నమ్మే దేవుడు చెప్పే విలువల్ని వారు ఆచరిస్తారు. అందరూ దేవుళ్లూ.. మంచి, మానవత్వమే బోధిస్తారు. కానీ ఎప్పుడైతే ఇందులోకి రాజకీయం చొరబడిందో.. అప్పుడే… అమానవత్వం వచ్చి చేరింది. ప్రజల్ని భావోద్వేగాల పరంగా విడదీసి రాజకీయం చేస్తున్నారు. ఫలితంగా.. దేశం అంటే.. మతం ప్రకారం విడిపోయి.. ఎవరికి వారు తిట్టుకుంటూ దేశభక్తిని నిరూపించుకోడం అన్నట్లుగామారిపోయింది. ఈ క్రమంలో కొంత మందిని భారతీయులు కాదన్నట్లుగా ముద్రవేసి.. వారిపైకి మెజార్టీ ప్రజల్ని రెచ్చగొట్టి.. రాజకీయం చేసేస్తున్నారు. ఫలితంగా దేశంలో మతం అనే మత్తు మందు అంతకంతకూ ప్రభావం చూపుతోంది.
దేవుడంటే నమ్మకం.. ఆ నమ్మకంతోనే రాజకీయం..!
దేవుడంటే అందరికీ భయం..భక్తి. నమ్మకం.. సెంటిమెంట్. ఒకప్పుడు దేవుడితో రాజకీయం అనే ఆలోచన కూడా రాజకీయ నేతలు రానిచ్చేవాళ్లు కాదు. కానీ కొంత మంది దేవుడ్ని ఎలా రాజకీయాలకు వాడుకోవచ్చో చూపించిన తర్వాత అందరూ ఎవరికి వారు దేవుడిపై పడ్డారు. ఆ ఫలితమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు. మామూలుగా అయితే..ఇలాంటి ఘటనలు జరిగితే.. కుట్రదారుల్ని కనిపెట్టి… ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. కానీ ఇప్పుడు రాజకీయంగా ఎదురుదాడి చేసి.. వివాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. నిందితుల్ని పట్టుకుని అసలేం జరిగిందో చెప్పాల్సిన ప్రభుత్వం మంత్రులు.. ఎవరు ప్రశ్నిస్తారో… వారే రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఎదురుదాడి చేయడం ప్రారంభించారు.
ఖచ్చితంగా కుట్రే..! కానీ ఎందుకు పట్టుకోవడం లేదు..!?
ఒక సారి జరిగితే యాదృచ్చికం.. రెండు సార్లు జరిగితే.. యాక్సిడెంటల్ .. కానీ పదుల సార్లు జరిగితే.. అది ఖచ్చితంగా కుట్ర పూరితమే. ఆ విషయం అంచనా వేయడానికి క్రిమినాలిజీలో పీజీలు అక్కర్లేదు. కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది..? ఘటనల వెనుక బాధ్యుల్ని కనిపెట్టి… అసలు కుట్రేమిటో కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ.. ఏపీ సర్కార్ ఏం చేస్తోంది..? అచ్చంగా రాజకీయం చేస్తోంది. దేవుళ్ల పై జరుగుతున్న దాడుల్ని ఆజ్యం పోసి మరీ పెంచుతోంది. రెచ్చగొట్టే వివాదాస్పద ప్రకటనలు చేసి… ప్రజల్లో మరింత ఆందోళనలు రేకెత్తిస్తోంది. చంద్రబాబు ప్రశ్నిస్తే చంద్రబాబు చేయించాడంటారు. లోకేష్ ప్రశ్నిస్తే లోకేష్ చేయించాడంటారు. బీజేపీ ప్రశ్నిస్తే బీజేపీ నేతలే చేయించారంటారు. ఇలా ఎదురుదాడి చేసి.. ఆ ఆలయాల్లో జరుగుతున్న వ్యవహారాల్ని రాజకీయం చేస్తూ పోతున్నారు కానీ.. అసలు వాస్తవాలేమిటో బయట పెట్టడం లేదు. పైగా.. విపక్షాల్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించడం ఇందులో అసలు ట్విస్ట్. రంపం ఆధారం దొరికిందని పోలీసులు హడావుడిగా మీడియాకు చెప్పారు. ముందుగా ఆ రంపం ఆధారంగా… నిందితుల్నిపట్టుకోవాల్సిన పోలీసులు… కొత్త కొత్త వెర్షన్లతో మీడియా ముందుకొస్తున్నారు. దీంతో ప్రజల్లో నమ్మకం పోతోంది.
అసలు ఆలయాలు రాజకీయ అంశం ఎందుకవుతాయి..!?
అసలు ఆలయాలు రాజకీయ అంశం కాదు. రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ కుట్ర పూరితంగా సమాజంలో అలజడి రేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు.. ప్రభుత్వం ఆలయాలు ఏమై పోయినా.. తమ మనోభావాలకు వచ్చిన ఇబ్బందే లేదని భావిస్తున్నట్లుగా ఉండటం వల్లే.. విపక్షాలు… ఈ అంశాన్ని టేకప్ చేస్తున్నాయి. కానీ ఇలా ప్రశ్నించడం కూడా ప్రభుత్వానికి నచ్చడం లేదు. ప్రభుత్వం తల్చుకుంటే నిందితుల్ని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఆ మాత్రం కేసుల్లో కూడా నిందితుల్ని పట్టుకోకపోతే.. పోలీసు వ్యవస్థ విఫలమైనట్లే భావించాలి. రాజకీయంగా అధికార పార్టీ ఎవరిని అరెస్ట్ చేయమంటే.. వారిని ఏదో కేసు చూపించి అరెస్ట్ చేయడానికి అర్థరాత్రి.. అపరాత్రి లేకుండా పని చేసే పోలీసులు … సమాజంలో అలజడి రేపే ఇలాంటి ఘటనల వెనుక అసలు నిందితుల్ని మాత్రం.. పట్టుకోలేకపోవడానికి వారి అసమర్థత కారణం కాదు.. అంతకు మించి బలమైన ఒత్తిడి ఏదో ఉందన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది. అలాంటిదేమీ లేదని నిరూపించాల్సింది ప్రభుత్వమే.
ప్రజలూ బాధ్యులే..!
ప్రభుత్వంపై కుట్ర జరిగిందా.. లేకపోతే ఆలయాలపై కుట్ర జరిగిందా.. లేక హిందూ విశ్వాసాలపై దాడి చేస్తున్నారా.. అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే. కుట్రలను చేధించి నిజాలను ప్రజల ముందు ఉంచాలి. దోషలను శిక్షించాలి. కానీ ప్రభుత్వమే అలా చేస్తోందన్న అభిప్రాయం వల్ల .. ఏ ఒక్కరూ దొరకడం లేదు. అల్లర్లు జరిగితే మాకే నష్టం అని ఎదురుదాడి చేస్తూ… ఓటు బ్యాంక్ రాజకీయాన్ని తెర వెనుకగా.. అధికార పార్టీ చేస్తోందన్న అనుమానాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సి ఉంది. కులాలు.. మతాలు.. ప్రాంతాల వారీగా రాజకీయం చేసే నేతలు.. వారి జీవితాలతో.. భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని గుర్తించాలి. అప్పుడే.. ప్రజాస్వామ్య భారతం సరైన దిశలో వెళ్తుంది.