” పెనం నుంచి పొయ్యిలో పడటం పొయ్యి నుంచి గ్యాస్ సిలిండర్‌లో పడటం.. అక్కడ్నుంచి పెట్రోల్‌లో పడటం… ” ఇలాంటివన్నీ భారతీయ జనతా పార్టీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. నరేందర్ దామోదర్ దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచింది. కాంగ్రెస్ పదేళ్ల పాలనపై వ్యతిరేకత… మోదీ ఇంటే బాహుబలిని మించి అన్న ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల సోషల్ మీడియా ఎలివేషన్లతో అధికారం సాధించి ఎనిమిదేళ్లయింది. ఈ ఎనిమిదేళ్లలో సాధించింది ఏమిటి ? గుజరాత్లో పెట్టిన పటేల్ విగ్రహం తప్ప ఇదిగో బీజేపీ కట్టిన గొప్ప మౌలిక వసతుల ప్రాజెక్ట్ ఇదిగో అని చెప్పుకునేది ఉందా ? పేద ప్రజల్ని బాగా ఆదుకున్నారని చెప్పుకోగలరా ? ప్రజలపై బాదుడు లేకుండా చూసుకున్నామని అనుకోగలరా ? . ఏది విశ్లేషించుకున్నా.. ప్చ్ అనుకోకుండా ఉండలేం.
ఎనిమిదేళ్లలో గ్యాస్ ధర రెట్టింపు.. సబ్సిడీ ఎత్తిపోయే !
మొదటగా దేశంలో ప్రతి ఒక్కరిపై ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడే.. గ్యాస్ , పెట్రోల్ ధరల గురించి చూసుకుందాం. రాత్రే వంట గ్యాస్ పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. నిజానికి కేంద్రం ఇచ్చేదేమీ అక్కడ లేదు. అప్పటికే రూ. నలభైకి చేరుకుంది. గ్యాస్ ధర మాత్రం రూ. పదకొండు వందలకు చేరుకువగా ఉంది. అదే ఎనిమిదేళ్ల కిందట ధర చూస్తే రూ. మూడు వందల యాభై ఉండేది. మిగతా అంతా కేంద్రం సబ్సిడీ ఇచ్చేది. నిజానికి ధర అప్పుడూ.. ఇప్పుడూ ఒకటే . కానీ అప్పట్లో పేదలపై భారం పడకుండా కేంద్రం భరించేది. ఇప్పుడు ఆ భారం కేంద్రం .. అంటే మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో విజయవంతంగా ప్రజలపై పడేసింది. ఇక్కడ మనం ఎన్నికలకు ముందు జరిగిన ఓ డ్రామాను గుర్తు చేసుకోవాలి. మన్మోహన్ సింగ్ సర్కార్ చివరి దశలో గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీని ప్రారంభించారు. దీనిపై స్మృతి ఇరానీ దగ్గర్నుంచి అందరూ రోడ్డెక్కి పోరాడారు. ప్రజలు కూడా వారితో జత కలిశారు. చివరికి మన్మోహన్ సింగ్ సర్కార్ వెనక్కి తగ్గింది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది… ఎవరూ నోరెత్తుకండా చేసి నగదు బదిలీని అమలుచేసింది. చివరికి ఆ నగదు బదిలీని.. రూ. ఐదు.. పదికి కుదించి.. అదీ కూడా ఎత్తేసింది. ఇప్పుడు దేశంలో కనీసం ఇరవై శాతంమంది గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్లు మళ్లీ వంట చెరుకు వైపే మళ్లుతున్నారు. ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై శాతం మంది గ్యాస్ వాడలేకపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. పేదలపై ఈ ప్రభుత్వం ఎంత కరుణ చూపిందో సరిగ్గా అర్థం చేసుకోవచ్చు.
పెట్రో పన్నులతో ప్రజల లూఠీ !
ఎనిమిదేళ్ల కిందట.. పెట్రోల్ ధర రూ. 70 ఉండేది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర 120 డాలర్ల వరకూ ఉండేది. కానీ ఇప్పుడు క్రూడాయిల్ ధర 100 డాలర్లే ఉంది. కానీ పెట్రోల్ ధర ఎంత రూ. 110. ఈ మధ్య దయతలిచి కాస్త తగ్గించారు కానీ రూ. 120 దాకా వెళ్లింది. మోదీ అదృష్టమో ఏమో కానీ ఆయన ఎనిమిదేళ్లకిందట పగ్గాలు చేపట్టగానే క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఆప్రయోజనాన్ని బదిలీ చేయలేదు. కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్‌ను అమాంతం పెంచేసింది. వరుసగా పెంచుకుంటూ పోయింది. ఒక్క లీటర్ పెట్రోల్ మీద కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ టాక్స్ రూ . 30వరకూ ఉంటుంది. రాష్ట్రాలు మరో ఇరవై వసూలు చేస్తాయి. ఇతర పన్నులు కలుస్తాయి. సెస్‌లు… సర్ చార్జీలు అదనం. అన్నీ కలిపి ప్రజలను పిండేస్తున్నారు. ఈ ఆదాయంలో ప్రధానమైన వాటా కేంద్రానికే వెళ్తుంది. యూపీఏ హయాంలో ఏటా రూ. 60 వేల కోట్ల ఎక్సైజ్ టాక్స్ పెట్రో ఉత్పత్తులపై వస్తే ఇప్పుడు అది రూ. 4 లక్షల కోట్లకు చేరింది. కేంద్రం ఎక్సైజ్ టాక్స్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా ఆ శాతం మేర వ్యాట్ తగ్గిపోతుంది. కానీ కేంద్రం ఆ పని చేయడం లేదు.
పెట్రో, గ్యాస్ ధరల మంటతో మండిపోతున్న నిత్యావసరాలు !
పెట్రో, గ్యాస్ ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని చెప్పడానికి ఆర్థిక నిపుణులు కావాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రంలో ఆర్థిక నిపుణులకు మాత్రం ప్రజలు ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కున పన్నులువస్తాయని ఆశ పుడుతున్నట్లుగా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడు కడుపు నింపుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ట స్థాయి శాతానికి చేరుకుంది. అంటే మోడీ సర్కార్ చెప్పే పీక్ అభివృద్ధి చేరుకుందనన్నమాట. వినియోగదారుల ఆహార ధరల సూచిక మార్చిలో 7.7శాతం నుంచి 8.4శాతానికి పెరిగింది. గ్రామీణ భారతదేశంలో ఆహార ధరలు 8.5శాతం వేగంగా పెరిగాయి. వంట నూనె రేట్లు చూస్తే మన దేశం శ్రీలంక అయిపోయిందేమో అని అనుకోవడం సహజమే.
నెలకు రూ. లక్షన్నర కోట్ల జీఎస్టీవసూలు !
నెలకు రూ. లక్షన్నర కోట్ల జీఎస్టీ వసూళ్లు అవుతున్నాయి. కేంద్రం ఈ వివరాల్ని ఘనంగా ప్రకటిస్తోంది. గత ఏడాది ఇది నెలకు రూ. లక్ష కోట్లు ఉంటే గొప్ప. ఇప్పుడు రూ. లక్షన్నర కోట్ల వస్తుంది. ఇలా పన్ను వసూలు చేయడమే అభివృద్ధి గా చెబుతున్న ప్రభుత్వం మరింత పన్ను వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్రజల వద్ద నుంచి ఇంత పెద్ద మొత్తం వసూలు చేస్తున్నామన్న కనీస స్పృహ కూడా లేకుండా విచ్చలవిడిగా పన్నులు పెంచుతోంది. తాజాగా జీఎస్టీ శ్లాబులు మార్చి మరో యాభై వేల కోట్ల ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించుకుంది. 5 శాతం శ్లాన్ను తొలగించి.. కొత్తగా మూడు, ఎనిమిది శాతం శ్లాబ్‌లు తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్టీకి అదనంగా ఆదాయపు పన్ను, పెట్రో పన్ను, ఎక్సైయిజ్ పన్ను, ఇంటి పన్ను. చెత్త పన్నులు.. ఇంకా అదనంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఏమైనా పనులు పడితే లంచాలు చెల్లించుకోవాల్సింది కూడా జనమే. పన్ను స్వామ్యం అంటే ఇదే మరి. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ఈపన్ను స్వామ్యం విపరీతంగా పెరిగింది. ప్రజల ఆదాయంలో సగం పన్నుల రూపంలో వసూలు చేసే పరిస్థితి వచ్చేసింది.
నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ !
మోదీ పాలనలో పేదలకు.. పేదలకు అత్యంత చీకటి అధ్యాయం ఏదైనా ఉందా అంటే నోట్ల రద్దు. అసలు నోట్ల రద్దు ఎందుకు చేశారో కేంద్రం ఇంత వరకూ చెప్పలేదు. ప్రజలు నానా కష్టాలు పడుతూంటే..యాభై రోజుల్లో ఫలితాలు కనిపించకపోతే నన్ను తగలబెట్టేయండి అని మోదీ నినదించారు. ఇప్పటికి ఏల్లు గడిచిపోయాయి. కానీ నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదు. డిజిటల్ లావాదేవీల గురించి కొత్తగా చెబుతూంటారు.. కానీ ప్రజల నగదు చెలామణి ఏ మాత్రం తగ్గలేదు సరి కదా.. యాభై శాతం పెరిగింది. నవంబర్ 4, 2016న రూ.17.97 లక్షల కోట్లుగా ఉన్న ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, అక్టోబర్ 8, 2021 నాటికి రూ. 28.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ పెంపు ఏకంగా 57.48 శాతం ఉంది. అంటే కేంద్రం తన లక్ష్యంగా అడ్డంగా విఫలమయిందన్నమాట. నోట్ల రద్దు చేయాల్సిన పని లేదు. వారు చెప్పిన మొదటి కారణం బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఎక్కడ ఉన్నా బయటకు వస్తుందని చెప్పి.. ప్రజల్ని రెచ్చగొట్టారు. వారు ఎన్ని సమస్యలు పడినా దేశం బాగుపడుతుందని పంటి కింద బాధను దిగమింగారు. రోడ్డు మీద టీతాగడానికి చిల్లర పైసలు లేక బాధపడినా భరించారు. తమ డబ్బులు తాము తీసుకునేందుకు బ్యాంకుల ఎదుట, ఏటీఎంల ముందు పడిగాపులు పడినా క్షమించారు. కానీ నల్లధనం మాత్రం బయటకు రాకపోగా.,. వచ్చినదంతా వైట్ అయిపోయింది. అదెలా అయిందో పాలకులకే తెలియాలి. బ్లాక్ మనీ రాలేదు.. నగదు చెలామణి తగ్గలేదు. నకిలీ నోట్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని అర్బీఐనే ప్రకటించింది. అంటే ఆ లక్ష్యం కూడా నెరవేరలేదన్నమాట. నోట్ల రద్దు కారణంగా కొంత మంది నిరాశానిస్ప్రహలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికీ వైద్యానికి డబ్బులు చేతికి అందక వందల మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. పెళ్లిళ్లు ఆగిపోయాయి. తిండి.. తిప్పలకూ ఇబ్బంది పడిన వారు ఉన్నారు. వీటన్నింటికీ కేంద్రమే కారణం. ముందూ వెనుకా చూడకుండా నోట్ల రద్దు చేయడమే కారణం. ఆ కారణంగా కోట్ల మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు.
లాక్ డౌన్ మరో చీకటి ఆధ్యాయం !
అచ్చంగా నోట్ల రద్దు మాదిరిగానే ఓ రోజు టీవీలోకి వచ్చేసిన మోదీ ఓ రోజు జనతా బంద్ అన్నారు. తర్వాత రోజు నుంచి లాక్ డౌన్ అనేశారు. అంతే దేశం స్తంభించిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థనూ కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. అప్పటికే వృద్ధిరేటు కనిష్ఠ స్థాయికి పడిపోతున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా మరింత కుంగదీసింది. దేశ జీడీపీ పదకొండేళ్ల కనిష్ఠానికి పడిపోయి.. 3.1 శాతానికి పరిమితమైంది. పరిస్థితులు కఠినంగా మారిపోయాయి. పరిశ్రమలు, వాణిజ్యం, మార్కెట్లు పతనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ నిలకడ కోల్పోయింది. ఫలితంగా జీడీపీ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. లాక్డౌన్ వల్ల చాలా తీవ్రంగా దెబ్బతిన్న రంగం ఇదే. రాకపోకలు నిలిచిపోవడం సప్లై చైన్‌పై ప్రభావం పడింది. గ్లోబల్ వ్యాల్యూ చైన్ దెబ్బతింది. దేశీయ ఉత్పత్తులు నిలిచిపోయాయి. లాక్డౌన్లో లెక్కలేనన్ని ఉద్యోగాలకు కోత పడింది. నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఇక నిరుపేదల కష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. కనీసం స్వస్థలాలకు చేర్చడానికి రైలు టిక్కెట్లు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితి . ఇతరులు ఇస్తే కరోనా వైరస్ పెంచారని విమర్శలు చేసే పాలకులు మనకు ఉన్నారు. ఈ కరోనాతో బతికిన వాళ్లు బతికారు.. పోయిన వాళ్లు పోయారు. బతికిన వాళ్లను ప్రభుత్వమే కాపాడుకున్నట్లుగా కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
దేశమంటే మట్టి అని నిరూపించే ప్రయత్నం !
బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఓ రకమైన భావన తీసుకొచ్చింది. అదే జాతీయవాదం. జాతీయ వాదం అంటే.. ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న మనలో ఓవర్గాన్ని వ్యతిరేకించడం. అంటే మనలో మనమే కొట్లాడుకోవడం జాతీయవాదం. మరో వర్గం వారిని చూసి మన దేవుడి పేరుతో నినాదాలు చేయడం జాతీయవాదం. గుళ్లు…గోపురాలు.. మసీదులు.. కూల్చివేతలు.. సమాధులు.. స్మశానాల పేరుతో రాజకీయం చేయడం జాతీయవాదం. ఎవరైనా కాదంటే… వారిపై నైతికంగా దాడి చేయడం. ఇంతకు ముంచి ఈ ఎనిమిదేళ్ల కాలంలో జరిగింది ఏదీ లేదు. ప్రజల బతుకులు బాగుపడిందీ లేదు. దేశమంటే ప్రజలు అని.. గుర్తించలేకపోతున్న పాలకుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోంది.
మళ్లీ మళ్లీ గెలవడం అసలైన విజయం కాదు.. ప్రజాకోణంలో పాలన చేయడమే విజయం !
అధికారంలో ఉండటం ఎందు కోసం ? ప్రజలకు మేలు చేయడానికే. ఆ ప్రజలకే మేలు చేయలేక పోతే.. తామే అధికారం అనుభవించి దేశాన్ని నాశనం చేస్తే అది దేశద్రోహం అవుతుంది కానీ దేశభక్తి అనిపించుకోదు. పాలకులు ఇప్పటికైనా ప్రజా కోణంలో పాలన చేయాలి. పేదల్ని బతకనివ్వాలి. మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేయకుండా ఉండాలి. ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది ఇదే. దేశాన్ని విభజించకుండా ప్రజల్ని కలిపి ఉంచి.. వారి బతుకుల్ని బాగు చేయాలి. ఈ మార్పు ఆశించవచ్చా ?