దేశం వెలిగిపోతోంది..! … వాజ్‌పేయి హయాంలో బీజేపీ నినాదం. ఇప్పుడు బీజేపీ నినాదం కూడా అదే. కానీ.. ఆ వెలుగులు వచ్చే మూలం మాత్రం మారిపోయింది. నాడు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో వచ్చిన వెలుగులతో దేశం వెలిగిపోతే… నేడు స్మశానానాల్లో ఆరని చితిమంటల కారణంగా ఎగసిపడుతున్న వెలుగులు కనిపిస్తున్నాయి. ఈ వెలుగులకు… ఈ వెలుగులకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ వెలుగుల్లో దేశ పౌరుడికి సంక్షోభ కాలంలో కనీస మద్దతు లభించదు. ఆస్పత్రిలో బెడ్ దొరకదు.. ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్ అందదు.. చివరికి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఓ టీకా కూడా దొరకదు. ప్రజలందరూ ఎవరి ఖర్మను వారు అనుభవించాల్సిందే.
పాలకుల నిర్లక్ష్యం .. ప్రజల పట్ల శాపం..!
దేశంలో ఏం జరుగుతోంది..? 130 కోట్ల మంది ప్రజలు భయంతో బతుకుతున్నారు. రాత్రి పడకుంటే మళ్లీ లేస్తామా లేదా అన్నంత భయంతో బతుకుతున్నారు. అయితే ఈ భయాల్లోనూ రకాలున్నాయి. ఓ పది శాతం మందికి ధీమా ఉంది. ప్రజల సొమ్ములతో కట్టిన ఆస్పత్రులు… అత్యాధునిక వైద్య సౌకర్యాలు తమకు అందుబాటులో ఉంటాయని వారందరికీ ధీమా ఉంది. కనీసం డబ్బులతో అయినా చావకుండా బతకుతామని చాలా మందికి ధైర్యం ఉంది. కానీ.. తొంభై శాంత మంది ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు..?. దేశంలో వైరస్ ఇప్పుడు నలుమూలలా పాకిపోయింది. ఎంతగా అంటే.. చాలా ప్రాంతాల్లో పాజిటివిటీ రేట్ యాభై శాతం ఉంది. అంటే సగానికి సగం మంది వైరస్ బారిన పడ్డారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది. కరోనా వైరస్‌ను తొక్కేశామని.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని స్వకుచమర్ధనం చేసుకున్న పాలకులు ఇప్పుడు.. కూడా అదే పని చేస్తున్నారు కానీ.. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించడానికి సిద్ధపడటం లేదు. నిప్పుల మీద దుప్పటి కప్పినట్లుగా… వైరస్ ప్రభావాన్ని నిపుణులు చెబుతున్నా… పట్టించుకోకుండా.. నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దాని ఫలితమే ఇప్పటి పరిస్థితి. దేశంపై పెను ప్రళయంలా విరుచుకుపడిన వైరస్ ఇప్పుడు స్మశానాలను ఇరవై నాలుగు గంటలూ పని చేసేలా చేస్తోంది. ఆస్పత్రుల్లో ఖాళీ లేకుండా చేస్తోంది.
వైరస్‌ను అవకాశంగా మల్చుకుని పాలన..!
మొదటి విడత వైరస్ విజృంభణను పాలకులు ఓ సంక్షోభంలా చూడలేదు. ఓ అవకాశంలా చూశారు. ఆ ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో.. వైరస్‌ను కట్టడి చేయలేకపోయారు. కానీ తొక్కి పెట్టారు. ప్రజల్ని మభ్య పెట్టారు. వైరస్ అంతమయిందనే భ్రమను కల్పించారు. చివరికి లాక్ డౌన్‌ను కూడా వ్యాపారం.. రాజకీయం చేసేశారు. లాక్డౌన్ అనేది ప్రజలకు కష్టమేమో కానీ.. పాలకులకు మాత్రం… ఆదాయవనరులా మారింది. లాక్ డౌన్ తర్వాత జీఎస్టీ పన్నుల ఆదాయం రూ. లక్షా ఇరవై ఐదు వేల కోట్లకుపెరిగింది. ఎలా పెరిగింది. దేశంలో పేదల కుటుంబాల సంఖ్య పదమూడు కోట్లకు పెరిగింది. మధ్య తరగతి నుంచి పేదల స్థాయికి ఐదు కోట్ల కుటుంబాలు పడిపోయాయి. దేశంలో ఒకరిద్దరు కార్పొరేట్లు తప్ప అందరూ నష్టపోయారు. మరి ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరిగింది..? కరోనా బూచి చూపి వడ్డించిన పన్నులతో పెరిగింది. లాక్డౌన్ దెబ్బకు… సర్వం కోల్పోయిన జనం కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ఆ సమయంలో మరోసారి ఇలాంటి మహమ్మారి వస్తే ఎలా ఎదుర్కొవాలన్న ఆలోచన చేయలేదు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాలు పెంచడానికి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అనుభవాలు నేర్పిన పాఠంతో ప్రజలకు భరోసా ఇద్దామనే ప్రయత్నం చేయలేదు. కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు కనీసం శానిటైజర్ కూడా లభించేది కాదని ఇప్పుడు… శానిటైజర్లు, మాస్కులు… పీపీఈ కిట్లు అన్నీ.. సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నామని కొంత మంది సోకాల్డ్ దేశభక్తులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి మంచివే.. కానీ.. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ఎందుకు పెంచలేదు..? మహమ్మారి మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉందన్న ఆలోచన ఎందుకు చేయలేదు..? అన్నది ఎవరికీ అర్థం కాని విషయం.
ఏడాదిలో కరోనాను ఎదుర్కొనేందుకు ఏం చేశారు..?
కరోనా సాకు చెప్పి… కేంద్రం.. రాష్ట్రాలు వందల కోట్ల విరాళాలు వసూలు చేశాయి. అంతకు మించి.. కొన్ని లక్షల కోట్ల అప్పు చేశాయి. అంతే కాదు.. ప్రజల ఆదాయం పడిపోయిందని.. ధరలు పెరుగుతాయని తెలిసి కూడా.. పెట్రో పన్నులు బాదేశారు. ఇదంతా ప్రజల కోసమేనని చెప్పారు. కానీ… ఆ సొమ్ములతో కనీసం ఒక్క వెంటిలేటర్ అయినా కొనుగోలు చేశారా అన్నది ఇప్పుడు ప్రశ్న. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో భారత్ రెండోది. జీవన శైలి కూడా భిన్నం. భారత్ లాంటి చోట్ల కరోనా వ్యాప్తి అంటూ జరిగితే… కట్టడి చేయడం అసాధ్యమని.. నిపుణులు చెప్పాల్సిన పని లేదు. కామన్సెన్స్ ఉన్న వారు అంచనా వేస్తారు. మరి పాలకులు ఎందుకు అంచనా వేయలేకపోయారు..? . ఇప్పుడు ఆక్సిజన్ లేక ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు..? వైద్యం అందక ఆస్పత్రి మెట్ల మీదనో… ఫుట్ పాత్ల మీదనో చనిపోతున్న వారి దుస్థితికి బాధ్యత ఎవరు తీసుకుంటారు..? అటు వైరస్ భయంతో.. ఇటు కాలే కడుపు భయంతో నలిగిపోతున్న మధ్య తరగతి ప్రజలకు ఎవరు ధైర్యం చెబుతారు…?
హవ్వ.. టీకాలకు డబ్బులు వసూలు చేస్తారా..?
ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారం చేసినట్లు ప్రచారం చేసుకోవడమే కాదు.. ప్రజలకు చెందాల్సిన.. దక్కాల్సిన ప్రయోజనాలను కూడా ప్రచారం కూడా వాడేసుకున్న పాలకులు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నారు. ఏ దేశం అయినా ముందుగా సొంత ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఆమెరికా అయినా ఆఫ్రికా అయినా అదే చేస్తుంది. ఎందుకంటే… ఆ దేశ పౌరులు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే అమెరికా.. తమ దేశ పౌరుల కోసమే .. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ వేస్తోంది. పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికీ… వాళ్ల ప్రజలకు ఆపేసి.. ఇతర దేశాలకు పంపలేదు. కానీ ఇండియా లాంటి దేశం… టీకాలను ఇతర దేశాలకు పంపిణీ చేసింది. రెండు డోసులు టీకాలు వేసుకున్న భారతీయులు.. పట్టుమని రెండు కోట్ల మంది కూడా లేరంటే అది పాలకులు ప్రజలపై చూపిస్తున్న వివక్ష కాదా..? అదే సమయంలో.. విదేశాలకు పదిహేను కోట్లకుపైగా టీకా డోస్‌లు అమ్మకానికి పెట్టారు. కొన్ని ప్రచారం కోసం ఉచితంగా పంపించారు. కెనడాలాంటి దేశాల్లో టీకాలు ఇచ్చినందుకు ఫ్లెక్సీలు పెట్టారంటూ ప్రచారం చేసుకున్నారు. అది మంచిదే .. మరిఇండియాలో అదే టీకాల్లేక విలవిల్లాడుతున్న జనం కళ్ల ముందు కనిపిస్తున్నారు. మరి ఇక్కడేం ఫ్లెక్సీలు పెట్టాలి..?. ఏ దేశ ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారో… వారికి చేస్తున్న సాయం పిసరంత. అయినప్పటికీ.. తాము ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటూ… వారికి తీరని అన్యాయం చేస్తున్నారు. అది టీకా విషయంలోనూ మరోసారి బయటపడింది. కనీసం ఇప్పుడు టీకాలను కూడా ప్రజలకు ఉచితంగా ఇచ్చే ఆలోచన చేయడం లేదు. నలభై ఐదేళ్లు పైబడిన వారికి ఒక్క డోస్ టీకా వేసి.. రెండో డోస్ కోసం ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అందరూ కొనుక్కోవాలని తేల్చేసింది. ధర కూడా.. రూ. ఆరు వందలకుపైగానే నిర్ణయించింది. అంటే ఆది నష్టం.. అంత్య నష్టం మొత్తం ప్రజలకే. మధ్యలో పాలకులకు నిలువుదోపిడీలు సమర్పించుకోవాల్సింే.
దాహమేసినప్పుడు బావి తవ్వుకునే ప్రయత్నాలు..!
కరోనా సెకండ్ వేవ్ వస్తుందని… బ్రిటన్‌లో మ్యూటేషన్ల కలకలం బయలుదేరినప్పుడే అందరూ అంచనా వేశారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం కనీసం జాగ్రత్తలు తీసుకోలేదు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలందరికీ టీకాలు వేయాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రాణాలకు మీదకు వస్తే కాపాడే ఆక్సిజన్‌ను రిజర్వ్ చేసుకోవాలనుకోలేదు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఆశ్చర్యమనిపించవచ్చు కానీ.. టీకాలే కాదు.. ఆక్సిజన్‌ను కూడా.. భారత్ కరోనా ఏడాది రెట్టింపు ఎగుమతి చేసింది. కానీ భారత ప్రజలకు రిజర్వ్ చేయలేదు. ఫలితంగా ఇప్పుడు ఆక్సిజన్ సంక్షోభం ఏర్పడింది. పారిశ్రామిక అవసరాలకు పంపిణీ నిలిపివేసి..ప్రజలకు ప్రాణవాయువు అందించాల్సి వచ్చింది. రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. ఇంతా చేసి.. ఇప్పుడు… విదేశీ వ్యాక్సిన్లకు పర్మిషన్ ఇస్తాం.. టాక్సుల్లేకుండా చేస్తామని కబుర్లు చెబుతున్నారు. కానీ అవి అందుబాటులోకి వచ్చేదెప్పుడు..? వాటిని రెండు డోసులు తీసుకుని ప్రజలు రక్షణ పొందేది ఎప్పుడు..?
నిజమే.. ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తోంది..!
కరోనా కట్టడిలో ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుందని… ఢిల్లీ పాలకులు.. మావైపు చూస్తోందని రాష్ట్రాల పాలకులు… ఓ రేంజ్లో డప్పు కొట్టారు. ఇప్పుడు పరిస్థితి పనిగలవాడు పందిరేస్తే పిచ్చుకలు వాలగానే పడిపోయినట్లుగా అయింది. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది. రాష్ట్రాల వైపుచూస్తున్నారు. మహమ్మారిని ఇంతతేలిగ్గా తీసుకుని ప్రజలను వైరస్‌కు వదిలేశారేమిటా అని చూస్తున్నారు. సెకండ్ వేవ్ వస్తుందని… వైద్య నిపుణులందరూ హెచ్చరిస్తున్నా.. రానే రాదన్నట్లుగా.. విదేశాలకు ఆక్సిజన్, టీకాలు అమ్మేసిన వైనాన్ని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. ప్రపంచంలోని ఏ దేశ పాలకులు ఆలోచన చేయని విధంగా ప్రజలకు వేసే టీకాలకు ఖరీదు కడుతున్న వైనం చెప్పుకుంటున్నారు.
దేశ ప్రజలకు నీతులు చెప్పడానికి పాలకులు చాలా ముందు ఉంటారు. లేకపోతే లాక్డౌన్ విధించాల్సి వస్తుందని టీవీ తెర మీదకు వచ్చి గడుసుగానే హెచ్చరికలు చేస్తూంటారు. కానీ.. ప్రజలు బయటకు రాకుండా.. జీవితాల్ని గడపలేనంతగా దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదని మాత్రం గుర్తించలేరు. ఇంట్లో ఉండి.. సంపాదించుకునేంత స్థాయిలో దేశ ప్రజల్లో రెండు, మూడు శాతం కూడా ఎదగలేదని ఆలోచించరు. ఏ పూట పని దొరికితే.. ఆ పూట కడుపు నిండా తినే స్థితిలో 70 శాతానికిపైగా ప్రజలు ఉన్నారని ఆలోచించరు. కళ్ల ముందు లక్షల మందికూలీల వెతలు కనిపిస్తున్నా.. వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు టిక్కెట్లు అమ్మే గడుసుతనం ఉన్న పాలకులకు ఇవన్నీ కనిపిస్తాయని అనుకోవడం కూడా వృధా. అందుకే.. ఎవరూ ఏమీ చేయలేరు.. అనుభవించాల్సిందే… ఏమీ చేయలేము లింగా..!