పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు నెలలకే హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హర్యానాలో బీజేపీకి చాన్సే లేదని అక్కడ అధికార వ్యతిరేకత కొండంత పేరుకుపోయిందని దానికి ఏ మోదీ మ్యాజిక్ కూడా విరుగుడు కాదని సర్వే సంస్థలన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష ఫలితాలను ఇచ్చాయి. అదే సమయంలో కశ్మీర్లో హంగ్ ఏర్పడిన కాంగ్రెస్ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎక్కువ మంది అంచనా వేశారు. ఎందుకంటే జమ్మూలో హిందువులు మెజార్టీలుగా ఉన్న చోట్ల బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. లోయలో ముస్లింలు మెజార్టీ. అక్కడ బీజేపీ పోటీ ఇచ్చినా గెలిచేంత ఉండదు. ఆ విషయంలో బీజేపీ నేతలకూ తెలుసు. అందుకే వీలైనన్ని ఎక్కువ సీట్లు టార్గెట్ పెట్టుకుని అనుకున్నది సాధించారు. లక్కీగా పీడీపీతో పాటు ఇండిపెడెంట్లు అనుకున్నంతగా ప్రభావం చూపకపోవడంతో కాంగ్రెస్ కూటమిలోని పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు 40కిపైగా సీట్లు వచ్చాయి. అన్ని సీట్లు వస్తాయని ఒమర్ అబ్దుల్లా కూడా అనుకున్నారు. ఎలా అయితేనేమీ కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమికి అధికారం చిక్కింది. కానీ అక్కడ బీజేపీ ఓటమి అని తేల్చలేం. కానీ హర్యానాలో మాత్రం బీజేపీ శూన్యం నుంచి విజయాన్ని పుట్టించిందని చెప్పుకోక తప్పదు. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ చేతకాని తనం.
ఓట్లు ఎందుకు వేయాలో చెప్పుకోలేకపోతున్న కాంగ్రెస్
హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసానికి పోకూడదు. కానీ కాంగ్రెస్ అదే చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీని వదులుకుంది. గెలిచేస్తామని సంబరాలుకు రెడీ అయిపోయింది. కానీ చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఇది పూర్తిగా స్వయంకృతం. అహంకారంతో వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రధాన సమస్య ఏమింటే.. ప్రజల్లో తిరిగే నాయకుల్ని.. ప్రజలతో సంబంధం లేని నేతలు నియంత్రిస్తూ ఉంటారు. ప్రజాజీవితంలో కష్టపడేవారు ఈ కోటరీ పేరుతో ఉండే నడిమంత్రుపు నేతల మాటల్ని ఫాలో కావాలి. కానీ వచ్చే పలితాల్ని మాత్రం ఆ ప్రజా జీవితంలో ఉన్న నేతలకే అంటగడతారు. ఇలాంటి పరిస్థితులు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ ఇలా ప్రతి విషయంలోనూ తడబాటుకు గురయ్యారు. చివరికి చేతిలోకి అందిన విజయాన్ని కూడా నేలపాలు చేసుకున్నారు. అందుకే ఇలాంటి కాంగ్రెస్ పార్టీనా పట్టుకుని బీజేపీని ఓడించేది అన్న ప్రశ్న ఇండీ కూటమిలోని పార్టీలకు వస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్‌తో ఇక ఎలాంటి పొత్లులు ఉండవని ప్రకటించింది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఈవీఎంలపై నిందలు వేస్తున్న కాంగ్రెస్ నేతలకు శివసేన వంటి పార్టీలు చురకలు పెడుతున్నాయి. కాంగ్రెస్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఫలితాలు వచ్చిన వెంటనే.. త్వరలో యూపీలో జరగనున్న పది అసెంబ్లీ స్థానాలకు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించేశారు అఖిలేష్ యాదవ్. కాంగ్రెస్‌కు మాట మాత్రంగా చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తమకు బలం ఉందనుకుంటే.. కనీసం మిత్రపక్షాలకు కూడా కాంగ్రెస్ గౌరవం ఇవ్వలేదు. తాము ఎందుకు ఇవ్వాలన్న వాదన వారు వినిపిస్తారు.
బీజేపీతో ముఖాముఖిపోరులో వరుస ఓటములు
కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే శక్తే లేదని దానికి ముఖాముఖి జరుగుతున్న ఎన్నికల్లో వెల్లడి అవుతున్న ఫలితాలే నిదర్శమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ .. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత విశ్లేషించారు. అందులో అవాస్తవం కానీ.. అతిశయోక్తి కానీ లేదు. నిజంగానే బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటి, అరా తప్ప మొత్తం బీజేపీ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ ఇలా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ విజయం సాధించడం లేదు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్,తెలంగాణల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తరలపడిన మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో బీజేపీ గెలిచింది. సర్వేల అంచనాలు కూడా ఆ ఎన్నికల్లో తారుమారు అయ్యాయి. తెలంగాణలో బీజేపీ ప్రధాన పోటీదారుగా లేదు కాబట్టి ఆ రాష్ట్రం లెక్కలోకి రాలేదని అనుకోవచ్చు. ఇక బీజేపీని ఓడించింది కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే. కానీ లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి ఆ ఎన్నికల్లోనూ బీజేపీనే క్లీన్ స్వీప్ చేస్తోంది. అంటే.. అతి కష్టం మీద అసెంబ్లీలో గెలిచినా ఆ పట్టును నిలబెట్టుకోలేకపోతోంది. ఇక యూపీలో బీజేపీ అజేయశక్తిగా మారింది. గుజరాత్ లో ఒకటి, రెండు సీట్లు ఆశించడం కూడా కష్టమే. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలమైన పోటీ ఇస్తుందో చెప్పలేని పరిస్థితి. హర్యానాలో ఈజీగా గెలవాల్సిన చోట .. విజయాన్ని నేల పాలు చేసుకున్నారంటే ఇక ఆ పార్టీతో సాగడం అంటే తోకను పట్టుకుని సముద్రాన్ని ఈదడమేనని ఇతర పార్టీలు అనుకుంటాయి. అందులో సందేహమే ఉండదు. ఇప్పుడిప్పుడే ఆ విషయం బయట పడుతూనే ఉంది.
కాంగ్రెస్ చేతకాని తనమే బీజేపీకి బలం
భారతీయ జనతా పార్టీకి ఎలా గెలవాలో తెలుసు. హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో మెజార్టీ మార్క్ సాధించలేకపోయినా.. జేజేపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రైతుల ఉద్యమం ఇతర సమస్యల కారణంగా బీజేపీ ప్రభుత్వంపై మరింత ఎక్కువగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ ప రిస్థితిని గమనించి చాలా మంది హర్యానా ప్రముఖులు కాంగ్రెస్‌లో చేరిపోయారు. రేజ్లర్ వినేష్ ఫోగట్ వంటి వారు చేరడంతో కాంగ్రెస్‌కు తిరుగులేదని అనుకున్నారు. కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ లీడ్ చూపించింది. రాను రాను బీజేపీ ఊపందుకుంది. పూర్తిగా వెనుకబడిపోయిందనుకున్న గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. ఇది మామూలు విజయం కాదు. ఏటికి ఏదురీది సాధించిన విజయం. ఎలా గెలవాలో బీజేపీకి తెలిసినంతగా ఇప్పుడు ఉన్న ఏ పార్టీకి తెలియదని మరోసారిని హర్యానా ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇందులో కాంగ్రెస్ చేతకాని తనం పాత్ర కూడా ఎక్కువే. ప్రజావ్యతిరేకతతో తమకే ఓటేస్తారని అనుకోవడం వల్లనే ఈ పరాజయం వచ్చింది. తాము పొటెన్షియల్ గవర్నమెంట్ ను ఇవ్వగలమని.. అంత బలమైన నాయకత్వం ఉందని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వేకపోయిందని ఈ ఫలితాలే నిరూపిస్తున్నాయి. హర్యానాలో విజయంతో బీజేపీకి రానున్న రోజుల్లోనూ తిరుగు ఉండదని మరోసారి స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మరోసారి అంధకారం అవుతోంది. కాంగ్రెస్ లాంటి ప్రత్యర్థి ఉండటమే బీజేపీ బలం. ఆ పార్టీ చేతకానితనంతో బీజేపీ మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బీజేపీ జమిలీ ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. అ అస్త్రాన్ని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల అయ్యే అవకాశమే లేదు. ఓటమికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా అవి కారణాలే అవుతాయి కానీ ఫలితం కాదు. బీజేపీ మాత్రం.. తిరుగులేని విజయాలతో ఫలితాలతోనే మాట్లాడుతోంది. బీజేపీని చూసి నేర్చుకునేందుకు కాంగ్రెస్ కూడా రెడీగా లేదు.
ఆడలేక మద్దెలఓడు ఈవీఎంలపై నిందలు
సర్వేల్లో గెలుస్తామని వచ్చింది కానీ ఈవీఎంల వల్ల గెలవలకేపోయామని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది.నిజం చెప్పాలంటే ఈవీఎంలు వచ్చిన తర్వాత ఆశ్చర్యకర ఫలితాలు వస్తున్నాయి. అలా అని ఈవీఎంలను నిందించలేరు . ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలను నిందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట్ల కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ లో దాదాపుగా వంద లోక్ సభ సీట్లు కూడా ఈవీఎంల ద్వారానే వచ్చాయి. బీజేపీ నాలుగు వంద సీట్లు టార్గెట్ గా పెట్టుకుని మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈవీఎంలే తెచ్చాయి. అయితే ఈవీఎంలపై నమ్మకం పోకుండా… కొన్ని రాష్ట్రాలకు కాంగ్రెస్ ఖాతాలో వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. ఇలాంటి అనుమానాలు ఎప్పటికీ తీరవు. ఎందుకంటే ఈవీఎంలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ కూడా వాటిని వ్యతిరేకించింది. దేశంలో ఈవీఎంలను వ్యతిరేకించని పార్టీ లేదు . జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ఎంత బాగా పని చేస్తాయో తానే పెద్ద ఇంజనీర్నన్నట్లుగా చెప్పారు.ఇప్పుడు అదే్ ఈవీఎంలపై గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి వారి వల్ల ఈవీఎంలపై ఎవరికైనా అనుమానాలుంటే.. అవి కూడా పోతాయి. ఈవీఎంలను నిందించడం మానేసి తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుంటే ముందు ముందు ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.
బీజేపీపై కోపంతో గెలిపిస్తారులే అనుకున్నంత కాలం కాంగ్రెస్‌కు ఇవే ఫలితాలు
బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా వ్యూహకర్తలే. కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద నడుస్తుందో.. బీజేపీ ఎవరి మీద నడుస్తుందో తెలుసుకుంటే తేడా కనిపిస్తుంది. మోదీ , అమిత్ షాలు ఏ విషయంలోనూ రాజీ పడరు. గెలుపు వస్తే పొంగిపోరు. ఓటమి అయితే కుంగిపోరు. అన్నీ తమకు అనుకూలంగా మల్చుకుంటారు. ఈ ఎన్నికలే కాదు రెండునెలల్లో ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్ర, ఢిల్లీల్లో కూడా హోరాహోరీ పోరు సాగనుంది. మహారాష్ట్రలో బీజేపీ చేసిన విభజన రాజకీయాలతో ఆ పార్టీకి మైనస్ అని చాలా మంది అనుకుంటున్నారు.కానీ హర్యానాలో జరిగింది చూస్తే.. ఎలాంటి ఫలితాలైనా రావొచ్చు. డిల్లీలో పోటీ లో కాంగ్రెస్ ఉండదు. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్ శ్రేణులు మరింత నీరుకారిపోక తప్పదు. అప్పుడు ఇండియా కూటమిలో కూడా లుకలుకలు ఏర్పడుతాయి. హర్యానా చిన్న రాష్ట్రమైనా ఒక కీలక సమయంలో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికలు మోదీకి తిరుగులేని బలాన్ని చేకూర్చాయని చెప్పక తప్పదు. ఈ విజయం ప్రాతిపదికగా ఆయన మహారాష్ట్రలో కూడా గెలిచేందుకు ప్రతిపక్ష శిబిరాన్ని కకావికలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అడ్డుకునే శక్తి కాంగ్రెస్‌కు ఉందని ఎవరూ అనుకోవడంలేదు. ఎదో గాలివాటంగా విజయాలు వస్తే సంతృప్తి పడటం వరకే కాంగ్రెస్ చేయగలిగేది. అదే బీజేపీ లక్ కూడా.