” వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. భారతదేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్యన గోడలుంటాయి.. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం.. కానీ పరాయి దేశస్థుడు ఎవడో వచ్చి ఆక్రమించాలి అని ప్రయత్నిస్తే.. ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు స్మశానాలు నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండాలెగరెస్తాం..”
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బుర్రా సాయిమాధవ్ రాసిన డైలాగ్ ఇది. ఇది ఆయన కలం నుంచి జాలు వారింది కానీ ప్రతి భారతీయుడు గుండెల్లో ఉండే మాట ఇది. భాష మారొచ్చు కానీ భావం మాత్రం మారదు. ప్రతి భారతీయుడు మన దేశంపై ఇతరుల పెత్తనానికి వస్తే ఇదే అనుకుంటాడు. మాకు మాకు వంద ఉండొచ్చు కానీ మా మీదకు వస్తే మాత్రం మొండేల మీద జెండాలెగరేస్తాం. ఇప్పటి వరకూ పాకిస్థాన్ కు మాత్రమే ఇలా చూపించే అవకాశం ఉంది. ఇక ముందు ఏ దేశం అలా వచ్చినా చూపించడానికి దేశం మొత్తం రెడీగా ఉంటుంది. రాజకీయాల కోసం భారత్ ను పావుగా వాడుకునే దేశాలకూ సరైన బుద్ది చెప్పడానికి దేశం వెనుకాడదు. ఇదంతా ఇప్పుడు కెనడా గురించే చెప్పుకునేది.
భారత్‌పై ఖలీస్థాన్ కుట్ర చేస్తున్న కెనడా
కెనడా మరో పాకిస్తాన్ గా మారుతోంది. స్వతంత్ర భారతావనిపై కుట్రలు చేయని వారు లేరు. పొరుగున ఉన్న పాకిస్థాన్ ను రెచ్చగొట్టి దేశంపై ఎన్ని సార్లు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారో చెప్పాల్సిన పని లేదు. భారత్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. సర్జికల్ స్ట్రైక్స్‌తోనే బుద్ది చెప్పాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కన్నా మిన్నగా కెనడా భారత్ పై కుట్రలు చేస్తోంది. భారత్‌లో ఖలిస్తాన్ ఉద్యమమే లేదు. కానీ ఖలిస్తాన్ పేరుతో చిచ్చు పెట్టి దేశ విభజనకు బీజం వేయాలని కెనడా కుట్ర పన్నుతోంది. దానికి కెనడాలో స్థిరపడిన భారత మూలాలున్న సిక్కులనే వాడుకుంటోంది. ఖలిస్తాన్ సపోర్టర్లకు అదే పనిగా మద్దతుగా నిలుస్తూ వారు అక్కడ నిస్సంకోచంగా కార్యకలాపాలు చేపట్టే అవకాశం కల్పిస్తోంది. అదే ఎవరైనా కెనడాలో ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేలా సంస్థను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక దేశం కోసం పోరాడేలా కొంతమందిని రెచ్చగొడి.. ఇండియా నుంచి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తే ఊరుకుంటుందా ?. అంత ఎందుకు కెనడా జనాభాలో ఐదు శాతం మంది వరకూ సిక్కులు ఉంటారు. వారంతా దేశం మొత్తం ఉండరు. కొన్ని ప్రాంతాల్లోనే సమైక్యంగా ఉంటారు. అందుకే కనీసం పది ఎంపీ సీట్లు సిక్కులు గెలుచుకుంటారు. ఇప్పుడు సిక్కుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం మొత్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని.. తమకు కెనడా ఖలిస్తాన్ కావాలని వారు ఉద్యమం చేస్తే కెనడా ప్రధాని ట్రూడో అంగీకరిస్తారా ?. ఇప్పుడు అక్కడి ఖలిస్థానీలకు సపోర్టు చేస్తున్నట్లుగా సపోర్టు చేస్తారా ?. ఎందుకంటే పంజాబ్‌లో ఖలిస్తాన్ కావాలని ఎవరూ అడగడం లేదు. ఖలిస్తాన్ అనే విభజన ఉద్యమాన్ని ఎప్పుడో ప్రజలు వదిలేశారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఉన్నది కెనడాలోని కొంత మంది సిక్కు ఖలిస్తాన్ సానుభూతిపరుల్లోనే. వారికి మద్దతు ఇవ్వడం ద్వారా కెనడా .. ఖలిస్తాన్ సపోర్టర్లను పెంచుతోంది. అలా పెంచుకుంటూ పోతే వారి వల్ల వచ్చే నష్టం భారత్ కు ఎంత ఉంటుందో కానీ కెనడాకు కూడా ఎక్కువే ఉంటుంది. రేపు వారు తమ ఖలిస్థాన్ కెనడాలోనే ఉందని ఉద్యమం చేస్తే.. ఇక్కడ ఇండియా మద్దతు తెలిపితే వారికి ఎలా ఉంటుంది ?. ఇప్పుడు ఇండియాకు కూడా అలాగే ఉంటుంది.
భారత్‌పై కుట్రలు చేస్తే ఎవరినైనా వదిలి పెట్టరు – నిజ్జర్ చనిపోయింది గ్యాంగ్ వార్‌లో !
ఎవరో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తాన్ టెర్రరిస్టుగా ప్రకటించిన బడిన వ్యక్తిని ఇంకెవరో చంపేశారు. భారతే చంపించిందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపిస్తున్నారు. అవసరమైనప్పుడల్లా కేసును బయటకు తెచ్చి నిందలు మోపుతున్నారు. తాజాగా హైకమిషనర్నే అనుమానితులుగా చేర్చారు. నిజానికి భారత్ తమ అంతర్గత భద్రతకు ముప్పుగా మారినవారు ఏ దేశస్తులైనా చంపే హక్కు కలిగి ఉంటుంది. అమెరికా భద్రతకు ముప్పుగా మారారని బయట ఎంత మందిని చంపడం లేదు. అలాగే ఇండియా కూడా భారత్ కు పెనుముప్పుగా మారితే.. ప్రజలకు సమస్యగా మారుతారని అనుకుంటే .. దేశంపై కుట్రలు చేస్తున్నారని అనుకుంటే చంపేస్తుంది. అయితే ఇక్కడ నిజ్జర్ అనే టెర్రరిస్టును భారత్ చంపలేదు. చంపాల్సినంత పరిస్థితి వస్తే ఎలా చంపాలో భారత్ నిఘా వర్గాలకు బాగా తెలుసు. ఆ నిజ్జర్ అనే వ్యక్తి అసలు కెనడా పౌరుడే కాదు. ఎన్నెన్ని దేశాల్లో తిరిగి ఎన్నెన్ని నేరాలకు పాల్పడ్డారో కెనడాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. నిజ్జర్ అనే వ్యక్తి గ్యాంగ్ వార్ లో చనిపోయాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేసిందా.. గోల్డీ బ్రార్ గ్యాంగ్ మర్డర్ చేసిందా అన్నది వారికే తెలియాలి కానీ ఈ గ్యాంగ్ వార్ పేరుతో చంపేయించింది కూడా భారతేనని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణ. అసలు ఆధారాల్లేవని ఆయనకూ తెలుసు. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే ఈ అంశాన్ని వెలుగులోకి తెస్తున్నారు. ట్రూడో రాజకీయ భవిష్యత్ డొలాయమానంలో ఉంది. ఆయన రేటింగ్ ప్రజల్లో అత్యంత ఘోరంగా పడిపోయింది. మరోసారి గెలవడం అసాధ్యమని రిపోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో కెనడాలో సిక్కుల్ని ఖలిస్తానీలుగా మార్చి మన దేశానికి వ్యతిరేకంగా ఎగదోసి.. ఆ మద్దతు మొత్తం తనకు ఉండేలా చేసుకోవాలనుకుంటున్నారు. అందు కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. కెనడాను మరో పాకిస్తాన్ గా మార్చేందుకు వెనుకాడటం లేదు.
కెనడా ఓవరాక్షన్ చేస్తే భారతే ఆంక్షలు విధించాలి !
అయితే భారత్ ఇప్పుడు ఎవర్నీ సహించే పరిస్థితుల్లో లేదు. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూసీ చూడనట్లుగా పోయే అవకాశం కూడా లేదు. భారత్ జోలికి వస్తే ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందన్న సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి. భారత్ పై ఆంక్షలు విధించే అవకాశం ఉందంటూ కెనడా లీకలు ఇచ్చింది. తమకు మద్దతు ఉందంటూ కొన్ని దేశాలతో ప్రకటనలు చేయించుకుంది. ఇప్పుడు భారత్ ఆంక్షలకు భయపడే దేశం కాదు. కావాలంటే ఎదురు ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎలాంటి తప్పు చేయని చోట అసలు తలొంచే ప్రశ్నే ఉండదు. వ్యాపారం అంటే ఒక్క భారత్ కే కాదు.. ఇరు దేశాల మధ్య ఉంటుంది. ఆంక్షలు అనే మాట వస్తే రెండు వైపులా ఉంటంది. భారత్, కెనడా దేశాల మధ్య 2023-24 మధ్య కాలంలో 8.9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా భారత్ ఎగుమతులు 4.4 బిలియన్ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే దాదాపుగా సమానం. ఇంకా చెప్పాలంటే కెనడా నుంచి దిగుమతులే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో 600 పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. రెండు చేతులతో కొట్టుకుంటే కలిగే చురుకుదనం ఎక్కువగా కెనడాకే తగులుతుంది. భారత్ తో పెట్టుకుంటే కెనడానే ఎక్కువ నష్టపోతుంది. ఎందుకంటే కెనడా ఆర్థిక వ్యవస్థలో సిక్కులు కీలకం. అందరూ ఖలీస్థానీ సపోర్టర్లు కాదు. సిక్కులు కాకుండా ఇతర భారతీయులు కూడా కెనడా ఆర్థిక వ్యవస్థకు చాలా బలం అందిస్తున్నారు. నడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. కెనడా పౌరుల్లో 7.3 లక్షల మంది హిందువులు, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే 45 శాతం. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. వీరందరూ కెనడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కెనడా పిచ్చి పిచ్చి వ్యవహారాలతో భారత్‌తో విరోధం పెంచుకుంటే.. ఆ ఎఫెక్ట్ సగం కెనడాపై ఉంటుంది. అది ఆ దేశాన్ని దివాలా అంచునకు కూడా చేర్చవచ్చు. భారత్ మానవవనరుల మీద ఆధారాపడిన దేశాల జాబితాలో కెనడా కూడా ఉంటుంది. భారత్ ను కాదనుకుంటే.. శత్రుత్వం పెంచకుంటే ఎంత ఇబ్బంది పడతారో అనుభవంలోకి వస్తేనే తత్వం బోధపడుతుంది.
ఆత్మగౌరవమే అసలైన సంపద
భారత్ ఇప్పుడు సంపద విషయంలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడలేకపోవచ్చు కానీ.. ఆత్మ గౌరవం ముందు ఏ సంపద కూడా సాటి రాదని భారతీయులు ఎన్నో సార్లు నిరూపించారు. అవసరం అయితే మరోసారి నిరూపిస్తారు. సంపాదన ఆగిపోతుందని..ఎగుమతులు ఆపేస్తారని గౌరవాన్ని కెనడా దగ్గర పెట్టాల్సిన అవసరమే లేదు. ఎక్కువగా కెనడా ఓవరాక్షన్ చేస్తే ముందుగా భారతే ఆంక్షలు విధించాలి. కెనడాకు మద్దతుగా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు పంపాలి. ప్రపంచంలో దేశ ఆత్మగౌరవమే అసలైన గుర్తింపు. భారత్ ఏ దేశంతోనూ కావాలని కయ్యం కోరుకోదు. చివరికి మాల్దీవులు వంటి అతి చిన్న దేశంతోనూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటుంది. ఎవరిపైనా బలప్రయోగం చేయాల్సిన అవసరం భారత్ కు రాలేదు. సాయం కోసం ఎవరైనా అర్థిస్తే వీలైనంత సాయం చేసింది కానీ ఎవరి జోలికి వెళ్లలేదు. ఆ అలుసుతో దేశంలో చిచ్చు పెట్టాలనుకుంటే మాత్రం చూస్తూ ఉరుకుంటుందని అనుకోవడం కూడా అమాయకత్వమే. కెనడా వంటి దేశాలకు ప్రస్తుతం అత్యంత ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఒక వేళ కెనడాకు తగ్గినట్లుగా వ్యవహరిస్తే.. తర్వాత మరికొన్ని ఇతర దేశాలు పపంచంలో అత్యధిక జనాభా ఉన్న మన దేశాన్ని చులకనగా చూస్తాయి. కెనడాపై భారత్ తీసుకునే ప్రతి కఠిన నిర్మయానికి దేశ ప్రజలందరి మద్దతు ఉంటుంది. అందులో సందేహమే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులోని మాట.. మేరా భారత్ మహాన్ !