“ కుల, మతాల రాజకీయాలు దేశానికి పట్టిన అతి పెద్ద దరిద్రం”. వాటి కేంద్రం ప్రజల్ని రెచ్చగొట్టి చేసే ప్రతీ రాజకీయం ప్రజల విభజన పెంచుతుంది కానీ.. ప్రజల్ని కలిపే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు దేశాన్ని అతి సుదీర్ఘ కాలం నడిపిన కాంగ్రెస్.. కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు భావించిన బీజేపీ ఇవే ఫార్ములాను నమ్ముకుంటున్నాయి. మతం కేంద్రంగా మెజార్టీ ప్రజల్ని ఏకం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తూండగా.. బీజేపీకి కౌంటర్ గా కులాన్ని ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ. కులగణన పేరుతో చేపట్టిన రాజకీయం ఇప్పుడు ప్రజల మధ్య విభజనను మరింతగా తెస్తోంది. ఈ రాజకీయాలు చూసి ఆలోచనాపరులు ఈ దేశ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు.
రాహుల్ కుల విభజన
“తెలంగాణలో కులగణన చేశాం. 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. సంపద మాత్రం వీరి వద్ద లేదు” అని యాభై ఏళ్లు దాటిపోయిన యువనేత, కాంగ్రెస్ పార్టీకి శల్య సారధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో వ్యాఖ్యానించారు. కుల వివక్ష ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఉద్దేశం ఏమిటో ఇక్కడ స్పష్టం. అగ్రకులాల పేరుతో కొంత మందిపైకి మిగిలిన ప్రజల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ పేరుతో ఎగదోసి .. వారందర్నీ మద్దతుగా మార్చుకోవాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అంటే కులం కారణంగా ఆ పది శాతం మందిని ఏం చేసినా తప్పు లేదన్న భావన రాహుల్ గాంధీ మాటల్లో వ్యక్తమవుతోంది. కులగణన దేశవ్యాప్తంగా చేయాలని.. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తామని చెబుతున్నారు. కొత్త తరానికి ప్రతినిధిగా ఉండాల్సిన నాయకుడి ఆలోచనలు ఇంత వెనుకబడి ఉంటాయని ఎవరూ ఆనుకోలేరు. కులాల ప్రకారం.. జనాభా ప్రాతిపదిక ప్రకారం అవకాశాలు కల్పించడం సాధ్యం అవుతుందా?. అసలు కులానికి ప్రాతిపదిక ఏమిటో రాహుల్ గాంధీ నిర్వచించగలరా?. ఇవాళ బీసీ కులాల్ని ఎస్సీల్లో కలుపుతామని రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. అంటే కులాలను.. కులాల కేటగిరీల్ని కూడా రాజకీయాలు మార్చేస్తున్నాయి. అంటే కులం అనేది మనం మార్చుకుంటే మారేదే కదా. అలాంటప్పుడు ఈ కుల వ్యవస్థను లేకుండా చేస్తామని పార్టీలు ఎందుకు చెప్పడం లేదు? పైగా కుల రాజకీయాల కోసం మొత్తం వ్యవస్థను కుళ్లిపోయేలా చేస్తున్నారు.
రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తేస్తామని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. వారిలో టాలెంట్ ఉన్న వారికి మెరిట్ ప్రాతిపదికన అవకాశాలు వస్తున్నాయి. రిజర్వేషన్ల కేటగిరీలో ఇంకా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ వర్గాలు ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నాయో ఆయనకు అవగాహన ఉందా?. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీనే అత్యధిక కాలం పరిపాలించింది. దేశాన్ని పరుగులు పెట్టించాల్సిన దశలో కాంగ్రెస్ పార్టీ సారధ్యం వహించింది. చైనా ఇండియా కన్నా పేద దేశంగా ఉన్నప్పుడు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు చైనా అమెరికాతో పోటీ పడే ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది. కానీ భారత్.. చైనాతో పోటీ పడి ఓ బ్రిడ్జిని నిర్మించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకుందా అంటే.. కిందకి పైకి చూడటం మినహా ఏమీ చేయలేం. గుజరాత్లో కట్టిన అతి పెద్ద పటేల్ విగ్రహం తయారు చేసింది చైనాలోని కంపెనీలే. చైనాలో సాధిస్తున్న విజయాలు బయటకు తెలిసింది తక్కువే. అక్కడ పాలకుల వల్లే ఇదంతా సాధ్యమయింది. కాంగ్రెస్ పార్టీ పాలకులకు ఎందుకు సాధ్యం కాలేదు?. ఎందుకంటే వారు అప్పుడు.. ఇప్పుడు ప్రజల్లో విభజన తెచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి పవర్ ను తమ గుప్పిట్లో పెట్టుకుందామని అనుకుంటున్నారే తప్ప…దేశాన్ని, ప్రజల్ని అభివృద్ధి చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇప్పుడు భారత ప్రజలు తమ కులాల ప్రకారం అయినా తమకు అవకాశాలు కల్పించాలనే పరిస్థితికి తెచ్చారు. ఇంత తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తన భావజాలం మార్చుకోలేదు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కాస్త ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ఉండేవారేమో కానీ ఆయన కుమారుడు రాహుల్ గాంధీ మరీ వెనుకబాటు రాజకీయాలకు కేంద్రంగా మారుతున్నారు.
కులగణన తప్పు కాదు.. కానీ సామాజికంగా, ఆర్థికంగా ఉన్న వారిని రెచ్చగొట్టి వారి వెనుకబాటు తనానికి ఇతరులే కారణం అన్న భావన ప్రజల్లోకి పంపించడం చాలా తప్పు. దేశంలో ధనవంతులు ఎంత శాతమో.. అందరికీ తెలుసు. దేశ సంపద మొత్తం పిడికెడు మంది గుప్పిట్లో ఉంది. మిగతా దేశ ప్రజలు వారి కోసం కష్టపడుతున్నారు. ఇందులో కులాలు లేవు…మతాలు లేవు. ఇదంతా బహిరంగరహస్యం. అయినా ప్రజల్ని పిచ్చి వాళ్లను చేయడానికి.. తమ చేతకాని తనం వల్ల వెనుకబడిపోయిన ప్రజలను ఇప్పటికీ ఓటు బ్యాంక్ గా వాడుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. అసలు కులం అనే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని గతంలో ఉద్యమాలు జరిగేవి. ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి..కానీ కులాల్నే ఆయుధాలుగా చేసుకుంటున్న రాజకీయాల్లో ఆ నినాదాలు కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా మారిపోతున్నాయి. దేశ ప్రజలను కులాల ప్రకారం చీల్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్న సంగతి రాహుల్ గాంధీకి తెలియక కాదు. కానీ ఆయనకు కాంగ్రెస్ వారసత్వం ముఖ్యం.. మళ్లీ అధికారం చేపట్టి.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలన్నా లక్ష్యంతో ఉన్నారని ఈ కుల రాజకీయాలతోనే స్పష్టమవుతోంది.
బీజేపీని బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీనే !
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా చేస్తున్న కుల, ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా మరో పార్టీ ఎదగలేని పరిస్థితుల్లో భారతీయ జన సంఘ్ మతం అస్త్రంతో తెరపైకి వచ్చింది. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. బీజేపీ వ్యూహాత్మక మత రాజకీయాలతో దేశంలో పాతుకుపోయింది. ఇప్పుడు హిందూత్వం అనేది ఓ బ్రాండ్ గా మారిపోయింది. నిజానికి హిందూత్వం అనేది ఓ జీవన విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలను తెలివిగా ఉపయోగించుకున్న బీజేపీ.. హిందువుల పార్టీ బీజేపీ అనే భావన తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. పనిలో పనిగా అభివృద్ధి మంత్రాన్ని కూడా జపించింది. అందుకే ఈ రోజు ఈ స్థితిలో ఉంది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ నిలదొక్కుకునేందుకు మతం కార్డు విస్తృతంగా వాడింది. కానీ ఇప్పుడు చాలా వరకూ ఆ భావన తగ్గించుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పర మత సహనాన్ని పాటిస్తోందని చెప్పుకోవాలి. రాజకీయ పరంగా ఇతర మతాలపై ద్వేషాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కుల రాజకీయాలను ఎదుర్కోవడానికి మతం అస్త్రంగా బీజేపీ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. బీజేపీ దేశాన్ని విభజిస్తుందని అప్పట్లో అందరూ విమర్శించారు. అందుకే బీజేపీ మార్క్ రాజకీయాలను ఇప్పటికీ చాలా మంది హిందువులు అమోదించరు. కానీ దేశంలో లౌకికత్వం అంటే.. హిందువులు మాత్రమే పాటించాలన్నట్లుగా .. ఇతర మతాలకు పూర్తి స్వేచ్చ.. హిందువులకు మాత్రమే ఆంక్షలు ఉండాలన్న లౌకికత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారు. అందుకే బీజేపీకి ఆదరణ పెరిగింది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలోపేతానికి ప్రత్యక్షంగా సహకరించింది. ఇప్పటికీ అదే చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద ప్రాంతీయ పార్టీ మాదిరిగా మారిపోయింది.
కులాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఆలోచనలు చేయాలి !
బీజేపీ దేశవ్యాప్తంగా బలపడింది. ఇప్పుడు బీజేపీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తాము కులంతో వస్తామని.. అలాగే రావాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. కానీ ఇది 1980లు కాదు.. 2025 అనే సంగతి ఆయనకు గుర్తు లేకుండా పోయింది. రాజకీయ పార్టీలు కులాల ప్రకారం సీట్లు ఇస్తున్నారు కానీ.. ప్రజలు మాత్రం కులాల ప్రకారం ఓట్లు వేయడం లేదన్నది నిజం. ఏ సామాజికవర్గం కూడా ఏ ఒక్క పార్టీపై అభిమానం చూపి గుంపగుత్తగా ఆ పార్టీకి ఓట్లు వేయరు. ఆయా రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పరిస్థితుల ఆధారంగా ప్రజలు పార్టీల వారీగా చీలిపోతున్నారు కానీ.. కులాల ప్రకారం కాదు. కులమే బలం అయితే.. చాలా నియోజకవర్గాల్లో మెజార్టీ ఓటర్లు ఉన్న చోట్ల.. ఆ వర్గం అభ్యర్థులు ఓడిపోరు. కుల రాజకీయాల వల్ల దేశ ప్రజల్లో విభజన వస్తుందేమో కానీ..ఓట్లు మాత్రం ఏకపక్షంగా మారే అవకాశాలు మాత్రం ఉండవు. ఇప్పుడు యువతరం కోరుకుంటున్నది కులం కాదు. అభివృద్ధి, తమ జీవన ప్రమాణాలు మెరుగుపర్చే పాలకుల కోసం వారు చూస్తున్నారు. తమ ప్రతిభకు తగ్గ కొలువులు .. అవకాశాలు కల్పించే వారి కోసం చూస్తున్నారు. ప్రజలు కూడా ఉచితంగా వచ్చే వాటి కంటే.. తమ కాళ్లపై తాము నిలబడేవారి కోసం చూస్తున్నారు. ఉచితాలకు ఆశపడుతున్నారని రాజకీయ పార్టీలు అనుకుంటాయి కానీ.. అంత కంటే ఎక్కువ ఉచితాలు హామీగా ఇచ్చిన పార్టీలు ఓడిపోతున్నాయన్న సంగతిని మాత్రం మర్చిపోతున్నారు.
భారత ప్రజాస్వామ్యం .. కులం, మతం, ప్రాంతం డబ్బు అనే ఛాందసవాదం నుంచి ఎప్పుడో బయటకు వచ్చింది. బయటకు రానిది రాజకీయ నేతలే. వాటి వల్లే తాము గెలుస్తామని అనుకుంటున్నారు. ప్రజలు విలక్షణంగా ఇస్తున్న తీర్పులను వారు అర్థం చేసుకోవడం లేదు. రాజకీయ పార్టీలన్నీ తమ సంప్రదాయ రాజకీయ అస్త్రాలైన కులం, మతం, ప్రాంతం, ఉచితాలను వదిలేసి.. అభివృద్ధి ప్రాతిపదికగా ఎజెండాను ప్రకటిస్తే.. ఈ నిజం బయటపడుతుంది. కానీ ఎవరూ అందుకు సిద్ధంగా లేరు. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి మధ్య వయస్కుడైన యువనాయకుడు కూడా దాన్ని గుర్తించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్ కనిపించడం కష్టం అనుకోవచ్చు.