ఇప్పుడు దేశంలోఅధికారికంగా రోజుకు మూడు, నాలుగు వేల కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గుండెపోటు ఖాతాల్లో వేసినవి…అనుమతుల్లేని ఆస్పత్రుల్లో చనిపోయిన వారివి… ఆక్సిజన్ అందక చనిపోయిన వారివి.. వెంటిలేటర్ మీద ఉండే తాహతు లేక ప్రాణం పోగొట్టుకున్న వారివి.. చివరికి గోదావరి, యమున నదుల్లో కొట్టుకొచ్చిన వారివి.. ఇలా పోయిన ప్రాణాలు.. లెక్కలోకి రాలేదు. అలా వస్తే.. సగటు సాధారణ పౌరుడు బాధతో విలవిల్లాడిపోతాడు. నా దేశానికేమయిందని మథనపడతాడు. ఏదో ఒకటి చేయాలని తాపత్రయ పడతాడు. ఎందుకంటే.. ఇప్పుడు మన కళ్ల కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఏ ఒక్కరి మరణానికి కారణం కరోనా కానే కాదు. కరోనాకు వైద్యం అందించలేని ప్రభుత్వాల అసమర్థత.. కనీసం ఆక్సిజన్ అందిచలేని దురవస్థ.. వంటి కారణాలతోనే చనిపోతున్నారు…కానీ కరోనా వల్ల కాదు.
దేశంలో కరోనా మరణం లేనే లేదు..!
దేశంలో మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన ఒక్కరిని చూపించండి.. ఒక్కరంటే ఒక్కరిని. కళ్ల ఎదురుగా చనిపోయిన వారంతా కరోనా కారణంగా చనిపోయారని.. మనం సమర్థించకుంటాం. బాధ్యతల్లో ఉన్న వారు తాము కారణం కాదని.. కరోనా కారణం అని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ప్రాపగాండా అదే చేస్తారు. కానీ.. ఒక్క సారి… మనం విశాలంగా ఆలోచిస్తే..అది కరోనా మరణం కాదు.. ప్రభుత్వ హత్య అని స్పష్టంగా తెలుస్తుంది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి ఆక్సిజన్ సరఫరాలో తేడా వచ్చి చనిపోతే .. దానికి కారణం ఎందుకవుతుంది. ఆక్సిజన్ అందించలేని ప్రభుత్వానిదే తప్పు అవుతుంది. ఆయాసంతోనో… ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్తోనే ఆస్పత్రిలో చేరితే… సరైన వైద్యం అందక చనిపోతే.. అది కరోనా మరణం ఎందుకు అవుతుంది. ఇంత కాలం మన పాలనా వ్యవస్థలను సిద్ధం చేసిన వైద్య రంగ వైఫల్యం అవుతుంది. చివరికి ఇంత పెద్ద దేశంలో.. ప్రాణం నిలుపుతుదని ఆశపడే రెమిడెసివర్ ఇంజెక్షన్ దొరక్క పదుల సంఖ్యలో ప్రాణాలు కలిసిపోతున్నాయి. అదే రెమిడెసివర్ ఇంజక్షన్ ఇప్పుడు బ్లాక్‌లో కావాలంటే విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. కనీసం ఓ ఇంజక్షన్‌ను క్రమపద్దతిలో పంపిణీ చేయలేక… ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న పాలక వ్యవస్థ చేస్తున్న హత్యలు ఇవి. అందుకే.. కరోనా వచ్చిన ఏ ఒక్కరూ చనిపోవడం లేదు. కానీ ప్రభుత్వం… పాలకులు అనే వారి నిర్లక్ష్య వైరస్… ప్రజలేమైతే తమకెందుకులే… తమ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తాము చేసుకుంటే సేఫ్ అనుకునే విధంగా మారిన రాజకీయ వ్యవస్థ కారణంగా దేశానికి ఈ దుస్థితి పట్టింది. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా… పాలకులు లైట్ తీసుకునే పరిస్థితులే ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. అందుకే అవి కరోనా మరణాలు కాదు ప్రభుత్వాల హత్యలు.
పాలకులు స్వకార్య ధురంధరులు – స్వామికార్య వంచకులు..!
దేశాని పాక్షికత వైపు నడిపించడాన్ని పాలకులు ఎప్పుడు ప్రారంభించారో.. అప్పుడే పాలనా వ్యవస్థ తీరు కూడా మారిపోయింది. తమకు ఓటు వేసేవారే పౌరులు.. ఇతరులు కాదన్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తమకు ఓటు వేసేవారిని కూడా కాదని.. తమకు ఆత్మీయులైన అతి కొద్ది మంది బాగు మాత్రమే పాలకులు చూసుకుంటూ.. ప్రజల్ని గాలికొదిలేస్తున్నారు. ఓ పార్లమెంట్ భవనం.. ప్రధానమంత్రి ఇల్లు కట్టడానికి కేంద్రానికి ఎలాంటి కరోనా ప్రమాదకర పరిస్థితి కనిపించడం లేదు. దేశ ప్రజలకు టీకా వేయడం కన్నా… కొత్త ఇల్లు .. భవనం కట్టడం కేంద్రానికి అత్యవసరంగా కనిపిస్తోంది. రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ప్రజల్ని గాలికొదిలేసి.. రాజకీయ లక్ష్యాలను… సాధించడానికి దేనికైనా దిగజారే పరిస్థితి. కేంద్రం ఎలా ఉంటే.. రాష్ట్రాలు అలా ఉంటాయి. పెద్దన్న కరెక్ట్‌గా ఉంటే.. కింద వారు తప్పులు చేయడానికి భయపడతారు కానీ.. ఇక్కడ పెద్దన్నే అందరికీ మార్గదర్శకం చేస్తున్నారు. కంపెనీలను ఎలా చేతులు మార్చాలో చేసి చూపిస్తున్నారు. రాజకీయప్రత్యర్థులను ఎలా వేటాడాలో ఉదాహరణలుగా వివరిస్తున్నారు. కిందటి వారు అదే చేస్తున్నారు. కానీ ఆ పైన ఉన్న వారు.. మహమ్మారి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలో చూపించడం లేదు.. అందుకే కిందవారికీ తెలియడం లేదు. ఆ అవసరం కూడా లేదనుకుంటున్నారు. ప్రపంచం మా వైపు చూస్తోందని.. ఢిల్లీ పాలకులు.. దేశం మా వైపు చూస్తోందని రాష్ట్రాల పాలకులు.. . ఆరని కాష్టం సాక్షిగా ప్రచారం చేసుకుంటూ… విలాసవంతమైన భవనాల్లో కాలు బయట పెట్టకుండా సేదదీరుతున్నారు. స్వకార్యాలు సాధించడానికి అధికారం అందా ఉపయోగించుకునే ధురంధరులు వీరు.. ప్రజల కోసం పని చేయాల్సిన స్వామికార్యాల్లో మాత్రం నయ వంచకులు.
భక్త్ అమిత్ జైస్వాల్ కథే … మృతులందరిదీ..!
ఇప్పుడు మీడియాలో.. సోషల్ మీడియాలో ఒక పేరే ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. ఒక్క కరోనా మృతుడి పేరే ఎక్కువ ప్రచారం అవుతోంది. ఆ పేరు అమిత్ జైస్వాల్. అమిత్ జైస్వాల్ కరోనాతో చనిపోయాడని మీడియా చెబుతోంది. కానీ ఆయనకు కరోనా సోకిన మాట నిజమే కానీ.. చనిపోయింది మాత్రం కరోనాతో కాదు. వైద్యం అందక అత్యంత దయనీయమైన స్థితిలో అమిత్ జైస్వాల్ కరోనాతో మృతి చెందారు. అమిత్ జైస్వాల్.. ఆరెస్సెస్‌లో క్రియాశీల కార్యకర్త. 42 ఏళ్ల జైస్వాల్ టిట్టర్లోనూ మోడీని ఫాలో అవుతారు. మోడీ కూడా ఆయన ట్వీట్లకు స్పందిస్తారు. బాగా చెప్పావు బ్రదర్ అంటూ ట్విట్టర్ వేదికగా భుజం తడతారు. మోడీ తనను ఫాలో అవుతారని జైస్వాల్ తనకు కనిపించిన వారందరికీ గర్వంగా చెప్పుకునే వారు. గతేడాది అయోధ్య వెళ్లి నగరం మొత్తం రామజన్మభూమి ఎల్ఈడీ బోర్డులను అమిత్ జైస్వాల్ ఏర్పాటు చేశారు. మోదీ, యోగీని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేవారు కాదు. కరోనా నియంత్రణకు మోడీ చేపట్టిన కార్యక్రమాలను చప్పట్లు కొట్టడం.. దీపాలు వెలిగించడం.. వంటి వాటిని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ.. ఆయనకు కరోనా సోకిన తర్వాత పరిస్థితి అర్థమైంది. ఆయన్ను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. ఆయన పరిస్థితి విషమిస్తోందని కనీసం ఆస్పత్రి బెడ్‌కు సిఫార్సు చేయాలని మోదీకి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ మెసేజ్‌ను యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు కూడా ట్యాగ్ చేశారు. కానీ ఆపదలో మాత్రం మోడీ నుంచి రిప్లయ్ రాలేదు. ఢిల్లీలో యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి పలకరింపు లేదు. వైద్యం అందక జైస్వాల్ చనిపోయాడు. పాక్షికత పాలనలో.. జైస్వాల్ లాంటి.. కరుడుగట్టిన భ క్తులకే దొరకని ప్రాణదానం.. ఇక ఎవరికి దక్కుతుంది..?
ప్రపంచం ముందు పోయిన భారత్ పరువు..!
పిచ్చి పాలకులు.. ఏం చేస్తున్నారో..ఎవరికీ తెలియడం లేదు…! దేశ ప్రజలు తమ కోసం ఏదో చేస్తున్నారని అనుకుంటారు. కానీ.. గ్రౌండ్లోఎవరు ఎలాఆడుతున్నారో బయట కూర్చుని చూసేవారికే తెలుస్తుందన్నట్లుగా… ఏ పక్షపాతం లేకుండా ఇండియాలో పరిస్థితిని పరిశీలిస్తున్న ప్రపంచ మీడియా భారత ప్రజల్ని చూసి జాలి పడుతోంది. యూపీలోని ఆస్పత్రులను సందర్శించిన సీఎన్ఎన్ బృందం.. ఆక్సిజన్ అందక ప్రాణాల మీదకు వస్తున్న రోగుల దుస్థితిని ప్రపంచం ముందు పెట్టింది. మోడీ తీరును తప్పుపట్టింది. ఆయన విధానాల్లోని లోపాలను ఎత్తి చూపింది. ఒక్క సీఎన్ఎన్ మాత్రమే కాదు.. విదేశీ పత్రికలన్నీ ఇప్పుడు ఇండియా ప్రజలపై జాలి చూపిస్తున్నాయి. మోడీ నిర్లిప్తతను ప్రస్నిస్తున్నాయి. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ….ది గార్డియన్ పత్రిక.. భారతలో పరిస్థితులపై కవర్ స్టోరీని ప్రచురించింది. ది డార్కెస్ట్ అవర్ పేరుతో అరుంధతి రాయ్ రాసిన కథనాన్ని ప్రచురించారు. భారత ప్రజలపై మారణహోమం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే ఇండియన్ మీడియా కూడా నోరెత్తుతోది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కనిపించడం లేదంటూ ఔట్లుక్ పత్రిక ముఖచిత్ర కథనం ప్రచురించింది. మా ప్రధాని కనిపించడం లేదు.. అని అర్థం వచ్చేలా ఆ వ్యాసం ఉంది. ఫేడింగ్ ఛార్మ్ అంటూ ది వీక్ పత్రిక కథనాం వైరల్ అవుతోంది. కరోనాపై పోరాటంలో చేపట్టాల్సిన చర్యలను మోడీ తక్కువగా అంచనా వేశారని… ఇదీ దేశ ప్రజలకు శాపంగా పరిణమించిందని ది వీక్ పత్రిక విశ్లేషించింది. అయితే విమర్శించే విదేశీ పత్రికలపై.. భారతదేశ ఔన్నత్యాన్ని భగ్నం చేస్తున్నారనే ఆరోపణలు.. దేశీయ పత్రికలపై యాంటీ నేషనల్స్ ముద్ర వేయడం… పాలకులు ఇప్పటి వరకూ చేసిన పని. ఇప్పుడు కూడా అదే చేస్తారు. ఎందుకంటే… ప్రజల్ని కాపాడటం ఎలాగూ చేతకాదు కాబట్టి…!
ప్రజలకు అసలు ప్రమాదం పాలకులే..!
కాష్టాల్లో కాలుతున్న చితిమంటల దారుణాలు ఇప్పటితో ఆగిపోవు. ప్రపంచంలో మరే దేశంలోనూ తీవ్ర ప్రభావం చూపని సెకండ్ వేవ్ ఇండియాలో విజృంభిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం పాలకులే. వారి నిర్లక్ష్యం.. అన్ని వైపుల నుంచిప్రజల పై ముప్పేట దాడి చస్తోంది. కరోనా కంటే అత్యంత ప్రమాదకర విధానాలతో ప్రజల్నిపూచిక పుల్లల్లా చూసిన పాలకుల తీరు వల్లే ఇప్పుడు కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి. 130 కోట్ల మంది జనాభాలో .. కోటి మంది చనిపోతే పోయారనుకునే దౌర్భగ్య స్థితి పాలకుల్లో వచ్చినప్పుడే… ఈ దేశంలో ప్రజలు సగం చచ్చిపోయారు. మిగతా వారు దుర్భర పరిస్థితుల్లో బతకాల్సిందే. దేశ ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాలు.. అడుక్కునేవాడి దగ్గర కూడా పన్నులు వసూలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి. జీఎస్టీ పేరుతో.. ఆక్సిజన్ మీద కూడా పన్ను వసూలు చేసే ప్రభుత్వాలు.. ఆదాయపు పన్ను పేరుతో డబుల్ టాక్సేషన్ కూడా విధించే ప్రభుత్వాలు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మాత్రం… ఖర్చు గురించి ఆలోచిస్తున్నారు. ఫలితమే ఈ మారణహోమం.
ముందుగా చెప్పుకున్నట్లుగా.. కరోనా అనేది మరణాలకు కారణం కాదు. అదేమీ మహమ్మారి కాదు. అసలు మహమ్మారి.. పాలకుల్లో ఉండే తెంపరితనం.. నిర్లక్ష్యం.. రాజకీయ క్యాన్సర్..మాత్రమే. ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూసే.. దౌర్భాగ్య రాజకీయపరిస్థితే ప్రస్తుత దేశం దస్థితికి కారణం. కనీస వైద్యమివ్వలేని స్వరాజ్యమెందుకు..? ఊపిరి పోయలేనిసు వికాసమెందుకు..? నిజాన్ని బలికోరే సమాజమెందుకు..? బంగరు భవితకు పునాది కాగల యువత.. పాలకుల నిర్లక్ష్యానికి చితిమంటల్లో కాలుతూంటే.. చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వవిజయాల విభవం. అమ్మ భారతి బలి ఇచ్చేస్తోంది రాచకురుపీ రాజకీయం. ప్రజలు ఇప్పుడు కరోనా కంటే డేంజరయిన రాజకీయ వైరస్‌లో చిక్కుకున్నారు.