‘నేను రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్నానే తప్ప దేశాన్ని అమ్మను’ .. 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ డైలాగ్. ఎందుకంటే అప్పట్లో మన్మోహన్ సింగ్ పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ డైలాగ్‌తో దేశ ప్రజల్ని ఆకర్షించారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు…? ఆ రైల్వే స్టేషన్‌నే అమ్మేస్తున్నారు. తర్వాత ఎవరూ అమ్ముకోవడానికి కూడా ఏమీ లేకుండా అమ్మేస్తున్నారు. నిఖార్సుగా చెప్పాలంటే దేశాన్నే అమ్మేస్తున్నారు.
నాడు డిమానిటైజేషన్.. నేడు మానిటైజేషన్…! దివాలా పాలన.. !
” కష్టపడి సంపాదించేవాడు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తాడు..!” ” కష్టం తెలియకుండా ఖర్చుపెట్టేవాడు ఏమీ ఆలోచించడు ఏది దొరికితే అది అమ్మేయడానికీ సిద్ధపడతాడు..!” ఈ రెండు రకాల క్యారెక్టర్లు ప్రతి ఒక్కరికి తారసపడి ఉంటాయి. అంత ఎందుకు మనలోనూ ఈ రెండు క్యారెక్టర్లలో ఒకరు ఉంటారు. ప్రభుత్వ పాలకులు కూడా ఈ రెండు వర్గాల్లోనే ఉంటారు. అదృష్టవశాత్తూ మనకు గత 70 ఏళ్లుగా మొదటి రకం పాలకులే తారసపడ్డారు. అప్పో సప్పో చేసి.. రూపాయో.. అర్థరూపాయో పెట్టుబడి పెట్టి వెళ్లారు. ఆ రూపాయో.. అర్థరూపాయో ఇప్పుడు లక్షలకు లక్షలు అయ్యాయి. అలా అయ్యాయని అమ్మేసుకుని తినే వారసులు వస్తే ఏమవుతుంది..? మొత్తం కరిగిపోతుంది.. కళ్లు మూసి తెరిచేలోపు ఏమీ లేని స్థితికి చేరుకుంటాడు. ఇలాంటి జీవితాలు మన కళ్ల ముందు ఎన్ని లేవు…? రిలయన్స్ సామ్రాజ్యం నుంచి తన వాటా తాను తీసుకుని వెళ్లిపోయిన తరవాత అనిల్ అంబానీ ప్రపంచంలోని ధనవంతులో ఒకరు. మరి ఇప్పుడు రూపాయి ఆస్తి లేదని .. అప్పులు కట్టలేనని బతిమాలుకునే స్థితి. అదే అన్న ముఖేష్ అంబానీ ఏమయ్యాడు..? ప్రపంచ కుబేరుడయ్యాడు. అంటే తేడా ఎవరి దగ్గర ఉంది..? ఎవరి ఆలోచనల్లో ఉంది..?. ప్రస్తుతం దేశం కూడా అలాంటి “దివాలా ఆలోచనలు” ” దుబారా మనుషులు ” అంతకు మించి దేశ సంపద పట్ల కనీస బాధ్యత లేని వ్యక్తుల చేతుల్లో ఉంది. దానికి సంపూర్ణమైన ఉదాహరణే మానిటైజేషన్.
70ఏళ్లుగా సమకూర్చుకున్న స్వతంత్ర భారత సంపదను మానిటైజేషన్ పేరుతో అప్పగించేస్తారా..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ పెట్టారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏదో ప్రకటించబోతున్నంత వెలుగుతో ఆమె వచ్చారు. రూ. ఆరు లక్షల కోట్ల మానిటైజేషన్ ప్రణాళిక ప్రకటించారు. ఈ మానిటైజేషన్ ఏమిటంటే ఇల్లూ, వాకిలి అమ్మేసుకోవడం. దేశానికి ఇల్లూ వాకిలి అంటే మౌలిక సదుపాయాలే. రోడ్లు, ప్రాజెక్టులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు. వీటన్నింటినీ అమ్మేసుకోవడం. అమ్ముతున్నారంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమోనని అనుకున్నారేమో కానీ.. దానికి ముద్దుగా మానిటైజేషన్ అని పేరు పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే అసలు నీకు మానిటైజేషన్ అంటే తెలుసా అని ఎదురుదాడి చేయవచ్చు. చేసేశారు కూడా. రాహుల్ గాంధీని మానిటైజేషన్ అంటే తెలుసా అని ప్రశ్నించారు. అసలు దీన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్‌కు తెలుసా..? అని దేశ ప్రజలకు డౌట్. రహదారులు, రవాణా, రైల్వే, విద్యుత్తు, సహజవాయువు, పౌర విమానయానం, షిప్పింగ్, రేవులు, జల మార్గాలు, టెలీకమ్యూనికేషన్లు, ఆహారం, ప్రజాపంపిణీ, మైనింగ్, బొగ్గు, గృహనిర్మాణం సహా 20కి పైగా రంగాల్లో దేశానికి 70ఏళ్లుగా సమకూరిన ఆస్తులను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే.. ప్రభుత్వ ఆస్తులను నగదుగా మార్చే కార్యక్రమం.
ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నిర్మించిన వాటిని అమ్మి సాధించేదేంటి..?
ఓ కుక్కను చంపాలంటే ముందుగా దానపై పిచ్చిదనే ముద్రవేయాలి. ఇది రాజకీయ నేతలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే ఎందుకు ఆస్తులను అమ్మేస్తున్నారంటే వాటి వల్ల ఉపయోగం లేదని ప్రకటించాలి. అదే చేశారు. అంతగా ఆదాయంరాని, వినియోగంలో లేని ప్రభుత్వ రంగ సంస్థలు మానిటైజేషన్ చేస్తున్నామని చెబుతున్నారు. ఇంత కన్నా ఆత్మ వంచన.. ప్రజా వంచన మరొకటి ఉండదు. అమ్మకానికి పెట్టిన రోడ్లు, రైళ్లు, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్లు వంటివి అంతగా ఆదాయం రానివి.. ఉపయోగం లేనివా…?. ఇవి నిజంగానే వినియోగం లేనివీ, ఆదాయం రానివీ అయితే వీటి విక్రయం ద్వారా 6 లక్షల కోట్లు ఎలా సమీకరిస్తారు?. వినేవాళ్లు ఓటర్లయితే చెప్పేవాళ్లు పాలకులు అని ఇలాంటి వాటి ద్వారానే తేలిపోతుంది. ఆస్తులు ప్రభుత్వానివేవని.. నిర్వహణ మాత్రం ప్రైవేటుకు ఇస్తామని నిర్మలా సీతారామన్ నమ్మబలుకుతున్నారు. అలా లీజుకిచ్చి వెనక్కి తెచ్చుకున్న ప్రాజెక్టు దేశంలో ఒక్కటైనా ఉందా..? ఒక్కసారి ప్రయివేటు చేతికి వెళ్లిన ఆస్తులేవీ తిరిగి ప్రభుత్వం చేతికి వచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు చరిత్రలో లేవు. నిజానికి బీజేపీ పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకించింది. మన్మోహన్సింగ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి.. ఇప్పుడు అదే పనిని వేగంగా చేస్తోంది. బీజేపీ తీరు చూసి విస్తుపోవడం తప్ప.. నోరెత్త స్వేచ్చ ప్రజలకు లేకుండా పోయింది.
ప్రపంచం అంతా మన వైపు చూసే అభివృద్ధి చేస్తే అమ్మేయడం ఎందుకు.. ?
దేశం పురోగమిస్తోంది.. దేశం వెలిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. నిజంగా ఓ వ్యక్తి బాగా సంపాదిస్తూంటే ఏం చేస్తారు..? ఆస్తులు కొనుక్కుంటారు. భవిష్యత్‌కు మరింత భద్రత కల్పించుకుంటారు. రేపు ఏదైనా అనుకోని ఉత్పాతం వచ్చి పడినా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రభుత్వాలైనా అలాంటి ప్రణాళికలే వేసుకోవాలి. కరోనా లాంటివి వచ్చిపడినప్పుడు టెన్షన్ పడకుండా బండి నడిపించాడనికి అలాంటివి ఉపయోగపడతాయి. కానీ కేంద్రం ఏం చేస్తోంది..? ప్రస్తుతం కేంద్రానికి నెల వారీ జీఎస్టీ వసూళ్లు రూ. లక్షా ఇరవై వేల కోట్ల వరకూ ఉంటున్నాయి. ఇది జీఎస్టీ మాత్రమే. ఇక పెట్రోల్, డీజీల్‌పై వస్తున్న పన్నులు ఏడాదికి రూ. నాలుగు లక్షల కోట్ల వరకూ ఉంటున్నాయి. ఇక ఆదాయపన్ను దగ్గర్నుంచి ఇతర ఆదాయాలు లక్షల కోట్లలో ఉంటున్నాయి. ఈ సొమ్మంతా ఏం చేస్తున్నారు..?. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఒక్కటంటే ఒక్క భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును గుర్తు చేసుకోండి చూద్దాం..! వాజ్ పేయి హయాంలో చేపట్టిన గొప్ప గొప్ప రోడ్లు, పోర్టులు.. ఎయిర్ పోర్టుల ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయి కానీ మోడీ హయాంలో చేపట్టినవి కానీ పూర్తయినవి కానీ కనిపించనే కనిపించవు. చివరికి బహుళార్థక సాధక ప్రాజెక్టని పూర్తి చేస్తే ఒక్క ఏపీకి మాత్రమే కాదు దక్షిణాది మొత్తానికి ఎంతో ఉపయోగమని కేంద్ర జలవనరుల శాఖనే నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టుకు డబ్బులివ్వడం కూడా దండగనుకునే పరిస్థితి దాపురించింది. ఏడేళ్లలో మోడీ సర్కార్ చేపట్టి పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే.. అది కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను తమ పార్టీ నేతగా చెప్పుకునేందుకు అహ్మదాబాద్‌లో నిర్మించిన అతి పెద్ద విగ్రహం. దాని వల్ల దేశానికి కలిగిన లాభం ఏమిటో ఒక్కరూ చెప్పలేరు. మరి లక్షల కోట్ల సంపదం అంతా ఏమైపోతోంది..?
ఏడేళ్లలో పెంచిన సంపద ఎంత..? అమ్ముకుంటానంటున్నది ఎంత..?
‘అభివృద్ధిలో దూసుకుపోతున్నాము… అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నాము.. ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తోంది అంటూ పాలకులు రెచ్చిపోతూ ఉంటారు. అంతగా దూసుకుపోతూంటే జాతి ఆస్తులను అంగట్లో పెట్టి అమ్మడం ఎందుకు..?ఇప్పటికే ఏడేళ్లలో 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించారు. సంపదను సృష్టించడం, దానిని తన జాతి ప్రజలకు అందించడం ప్రభుత్వం ప్రాథమిక విధి. ఈ దేశంకోసం.. ఎందరో మహామహులు మేధోశక్తినీ, ప్రజల సొమ్మునూ ధారపోస్తే కానీ ప్రభుత్వరంగంలో పలు సంస్థలను ప్రారంభం కాలేదు. దేశ స్వాలంభనకు వెన్నముకగా నిలిచిన సంస్థలు అవి. దేశం తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసింది ప్రభుత్వ రంగ సంస్థలే. ఇప్పుడు వాటిని ..దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టబోతున్నారు. రైల్వే శాఖలో ఇప్పటికే ప్రైవేటు జోక్యం పెంచేశారు. ముక్కలు చెక్కలు చేసి అదానీకి కట్ట బెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీని సైతం అమ్మకానికి పెట్టేశారు. ఈ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర్నుంచి విమానాశ్రయాలు.. రోడ్లు అన్నీ ఉన్నాయి. చాయ్ అమ్మాను కానీ దేశాన్ని అమ్మబోనన్న ప్రధాని మోడీ అచ్చమైన రాజకీయ నాయకుడనిపించారు. ఏడేళ్లకే దేశాన్ని అమ్మకానికి పెట్టేశారు. దీన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు..! ఎందుకంటే పాలకులందరిదీ ఒకే మైండ్ సెట్.
” దక్షుడు లేని యింటికిఁబదార్థము వేఱొక చోట నుండి వే
లక్షలు వచ్చుచుండినఁబలాయనమై చనుఁగల్ల గాదు ప్ర
త్యక్షము వాగులున్ వరద లన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగనట్టి తటాకములోన భాస్కరా!
భాస్కర శతకంలోని పద్యానికి అర్థం ..” గండిపడిన చెరువులోకి ఎంత పెద్ద ప్రవాహం వచ్చినా నిండదు. వచ్చినవి వచ్చినట్లుగా పోతూంటాయి. అదే విధంగా, ఒక కుటుంబానికి ఎన్ని విధాలుగా ఎంత ఆదాయము వచ్చినా… ఆ సంపదను ఒక పద్ధతి ప్రకారము నిర్వహించు సమర్థుడైన యజమాని లేక పోతో .. అదంతా వ్యర్థము అవుతుంది. వృధా అయిపోతుంది. ఖచ్చితంగా ప్రస్తుతం దేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉంది 70 ఏళ్ల పాటు పాటు దేశం కూడబెట్టుకున్న సంపద అంతా పరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
కొన్నాళ్ల కిందట డిమానిటైజేషన్ పేరుతో ప్రజల్ని రోడ్ల పాలు చేశారు. ఆ దెబ్బకు బలైపోయిన జీవితాలెన్నో. ఇప్పుడు మానిటైజేషన్ పేరుతో రంగంలోకి దిగారు. ఇంకెన్ని కుటుంబాలు చితికిపోవాలో. కానీ ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రపంచంలోనే కుబేరులవుతారు. భారత్‌కు మిగిలేది అదొక్కటే ట్యాగ్.