ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని బాగు చేయలేడు..కానీ నాశనం చేయగలడు.. ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. “కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, లక్షల కోట్ల సంపద ఆవిరి” అనే మాట ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఆర్థికపరమైన అక్షరాస్యత విపరీతంగా పెరిగిన తర్వాత స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చి కాస్త గణనీయమైన ఆదాయం సంపాదించే వారంతా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యే వరకూ వారంతా కలల్లోనే ఉన్నారు. ఇప్పుడు వారి కలలు కల్లలవుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మన దేశానికి కాదు.. అమెరికా సహా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. పెట్టుబడిదారుల సంపద అంతా హారతి కర్పూరం అయిపోతోంది. దీనంతటికి ఒకే ఒక్క కారణం డొనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం మాంద్యంలోకి పోతోందన్న భయాలు వస్తున్నా ఆయన మాత్రం చలించడం లేదు. తాను అనుకున్నది చేస్తూనే ఉన్నారు.
అమెరికాను దివాలా తీయిస్తున్నారు !
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్.. మేక్ అమెరికా వెల్తీ ఎగైన్ అనేవి ట్రంప్ నినాదాలు, అమెరికా గ్రేట్ అవ్వాలంటే.. వెల్తీ అవ్వాలంటే ఏం చేయాలి ?. ప్రజలందరూ ధనవంతులు అయితే దేశం కూడా అంతే అవుతుంది. ప్రజలు బీదవాళ్లు అయి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటే ఆ దేశం వెల్తీ ఎలా అవుతుంది ?. ఈ చిన్న లాజిక్ ట్రంప్‌కు తప్ప అందరికీ అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లు, చైనాతో వాణిజ్య యుద్ధం, మార్కెట్లలో అనిశ్చితిని సృష్టించాయి. ఈ అనిశ్చితి కారణంగా స్టాక్స్ ఘోరంగా పడిపోవడం ప్రారంభమయ్యాయి. టెక్ రంగంలోని పెద్ద కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన మొదటి 50 రోజుల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్ 1.7 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ఇది 2009 తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితి. 50 రోజుల్లోనే అమెరికాను ఇంత ఘోరంగా దెబ్బకొట్టి సంపదను తరిగిపోయేలా చేసిన అధ్యక్షుడు మరొకరు లేరు. అమెరికా తయారీ రంగం మీద ఆధారపడింది తక్కువ. టెక్నాలజీ రంగాన్ని శాసించి సంపదను మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలు ఐస్ బర్గ్ ను ఢీకొట్టినట్లుగా ఉన్నాయి. ఎంత వరకూ నీళ్లు వచ్చాయి.. ఎప్పుడు మునుగుతాయో తెలియని పరిస్థితి. చివరికి ట్రంప్ ఆత్మీయుడు.. ఆయనను గెలిపించడానికి ట్విట్టర్ నే కాదు.. తన క్యారెక్టర్ ను కూడా ఉపయోగించిన ఎలాన్ మస్క్ పరిస్థితి ఘోరంగా మారింది. ఆయన సంపద లక్షల కోట్లు తరిగిపోతోంది. ఏడాది తర్వతా టెస్లా ఉంటుందా దివాలా తీస్తుందా చెప్పలేని పరిస్థితి. ప్రమాదాన్ని గుర్చించిన మస్క్.. ట్రంప్‌నకు గుడ్ బై చెప్పి తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారు.
గుడ్డిగా తన దారిలోనే ట్రంప్ !
అయినా పరిస్థితిని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారు. తాను అనుకున్నట్లుగా ప్రపంచదేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించారు. వెంటనే మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. నిజానికి ఈ సుంకాల పెంపు వల్ల అమెరికా బాగుపడుతుందా అంటే .. చాన్సే లేదు. అమెరికా పది దెబ్బలు కొడితే.. ఇతర దేశాలు కనీసం నాలుగు దెబ్బలు అయినా కొడతాయి. సున్నితంగా ఉండే వాడికి ఆ నాలుగుదెబ్బలే తట్టుకోలేని విధంగా ఉంటాయి. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఇదే. ట్రంప్ విధించిన సుంకాలు చిన్న చిన్నవి కావు. అవి అమెరికాలోని ప్రతి దిగుమతిపైనా ప్రభావం చూపుతుంది. చివరికి టాయిలెట్ పేపర్ల ధరలు కూడా పెరగనున్నాయి. అమెరికాకు కెనడా ఎగుమతి చేస్తున్న కలపపై ఇప్పటివరకు 14 శాతం ట్యాక్స్ వసూలు చేస్తుండగా.. దాన్ని ఒకేసారి 27 శాతానికి పెంచారు. అమెరికాలో పేపర్ ఉత్పత్తుల కోసం పేపర్ మిల్లులు మొత్తం కెనడా నుంచి వచ్చే కలప పైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. అమెరికాలో ఉపయోగించే టాయిలెట్ పేపర్లలో 30 శాతం, పేపర్ టవళ్లలో 50 శాతం వాటా ఈ కెనడా కలపదే. మరి రేట్లు పెరగకుండా ఉంటాయా ?. ఇది ఒక్క టాయిలెట్ పేపర్ గురించి మాత్రమే. చెప్పుకోవాలంటే.. అమెరికా తయారీ రంగం బలహీనం.. అత్యధికం దిగుమతుల మీదే ఆధారపడి ఉంటుంది. అయినా ట్రంప్ పన్నులు బాదేశారు. దీని వల్ల అమెరికా ప్రజల జీవన ఖర్చు 30 శాతం వరకూ పెరిగే చాన్స్ ఉంది. ఇది ప్రజల్ని పేదవాళ్లను చేస్తుందా..? ధనవంతుల్ని చేస్తుందా? . పన్నులు విధించడం ద్వారా .. పన్నులు తగ్గిస్తానని చెప్పడం ద్వారా ట్రంప్ గొప్ప పని చేశానని అనుకుంటున్నారు. ఇతర దేశాల దిగుమతులపై పన్నులు వేస్తే.. అవి కట్టాల్సింది అమెరికన్లే. అయితే ఇతర దేశాలపై ఆ ప్రభావం ఉండదని కాదు. భారత్ లాంటి దేశాలు అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసే వస్తువుల ధరలు భారం అయితే అమెరికా ప్రజలు కొనడం మానేస్తారు. దాని వల్ల అమెరికన్లకు ఆ వస్తువులతో అవసరాలు తీరవు. ఇటు భారత్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గతుంది. దాని వల్ల అసలు ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం ఏర్పడుతుంది కానీ అమెరికా బావుకునేదేమీ ఉండదు.
భారత ఆర్థిక వ్యవస్థపై భయంకర దాడి
మోడీని మిత్రుడని పొగిడేసి.. భారత్ ను తీవ్రంగా దెబ్బకొట్టేందుకు టారిఫ్‌ల ద్వారా ట్రంప్ ప్రయత్నించారు. ట్రంప్ విధించిన 25 శాతం సుంకం కారణంగా భారతదేశ GDP 31 బిలియన్ డాలర్లు తగ్గిపోతుందని ఆర్థిక సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. ఇది మొత్తం GDPలో దాదాపు 0.72 శాతం. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 77.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అయ్యేది సాఫ్ట్ వేర్, సాఫ్ట్ వేర్ అధారిత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ప్రతీకార పన్నుల్లో భాగంగా వించిన టాక్సుల ప్రభావం ఐటీ రంగంపై చాలా ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన సహజంగానే కనిపిస్తోంది. ఐటీ రంగం ఇప్పటికే ఆర్థిక అనిశ్చితితో కొట్టు మిట్టాడుతోంది. ఇప్పుడు సుంకాల అంశం మరింత ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే ఐటీ సేవలలో నియామకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఐటీ సంస్థలు విచక్షణా వ్యయం , కొత్త నియామకాల గురించి జాగ్రత్తగా ఉంటున్నాయి. లార్జ్-క్యాప్ కంపెనీలు తమ కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహంలో భాగంగా ఫ్రెషర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ పరిస్థితి మాస్ లేఆఫ్స్‌కు దారి తీయవచ్చని చెబుతున్నారు. డాట్-కామ్ సంక్షోభం, సబ్‌ప్రైమ్ సంక్షోభం మొదలైన వాటి కారణంగా ఉద్యోగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి భారత్ ఒక్కటే నష్టపోతుందా అంటే.. అమెరికాకూ నష్టమే. ట్రంప్ విధించిన సుంకాల వల్ల సాఫ్ట్ వేర్ సేవలు పొందలేకపోతే ఆమెరికాలో సేవల రంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అది అమెరికా అర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొడుతుంది.
మెల్లగా మాంద్యంలోకి అమెరికా – ప్రపంచవ్యాప్తంగా ప్రభావం
ట్రంప్ సుంకాలు, ఆయన ఆర్థిక విధానాల వల్ల అమెరికా మాంద్యంలోకి జారిపోతోందన్న అభిప్రాయం మొదటి నుంచి ఉంది. ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. నిరుద్యోగిత పెరుగుతోంది. వ్యాపారాలు తగ్గిపోతున్నాయి. సూచనలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు తగ్గడం, వ్యాపారాలు మూతపడడం లాంటివి అమెరికా లాంటి ఆర్థిక శక్తిమంతమైన దేశంలో జరిగితే దాని పరిణామాలు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉంటాయి. అమెరికా ఇప్పటికే 2008 మాంద్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటోంది. అప్పట్లో నిరుద్యోగం 10శాతానికి చేరింది. ఇప్పుడు ఆటోమేషన్, AI , పన్నులు వంటివి కలిసి ఇంకా దారుణమైన మాంద్యాన్ని తెచ్చి పెడుతుందని అంచనా వేస్తున్నారు. చిన్న వ్యాపారాలు ఇప్పటికే ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో ఇబ్బంది పడుతున్నాయి. ఇంకా ద్రవ్యోల్బణాన్ని పెంచుతా అని ట్రంప్ అంటున్నారు. దీని వల్ల అవన్నీ దివాలా తీసే అవకాశం ఉంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ దెబ్బతినడం వల్ల రిటైర్మెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ కోతకు గురయ్యాయి. ఆర్థిక మాంద్యాన్ని ఇప్పుడు అమెరికా తట్టుకునే పరిస్థితి లేదు. యువత ఉద్యోగాలు లేకపోతే దొంగతనాలు, మోసాలు వైపు చూస్తారు. ఇక్కడ అసలు సమస్య అమెరికా ఒక్కదానిది కాదు. అమెరికలో మాంద్యం వస్తే దిగుమతులు, ఎగుమతులు తగ్గితే చైనా, యూరప్ , భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలవుతాయి. అమెరికా బలహీనపడితే చైనా, రష్యా వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు పూర్తిగా రంగంలోకి దిగుతాయి. అప్పుడు అమెరికా మరిన్ని చిక్కుల్లో పడుతుంది. డాలర్ విలువ పడిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతోంది. బంగారం, క్రిప్టో కరెన్సీల వైపు జనం చూస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. పది గ్రామాల బంగారం రేటు లక్ష వరకూ పోవడానికి ట్రంప్ నిర్వాకాలే.. మాంద్యం భయాలే కారణం. అలాగే క్రిప్టో కూడా. అది అందనంత దూరానికి ఇప్పటికే పోయింది. అమెరికా ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి, ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతోంది. మాంద్యం వస్తే అది కేవలం తాత్కాలిక సమస్య కాదు మొత్తం వ్యవస్థనే కూల్చే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం ప్రభావ పడుతుంది. ఇలాంటి విపత్తును తీసుకు వస్తోంది డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ చేయబోతున్న విధ్వంసం .. తీసుకురాబోతున్న మాంద్యం నుంచి ప్రపంచం బయటపడటం అంత తేలిక కాదు. ఈ పాపం అమెరికా ప్రజలదే.