మన దేశంలో ఓ మండలానికి ఎమ్మార్వోనే వందల కోట్ల అక్రమాస్తులు వెనకేసగోలడు. అలాంటి ఆర్డీవో ఎంత సంపాదించగలడు…కలెక్టర్ ఇంకెంత కుబేరుడు కాగలడు ?. వీళ్లను మించి అంతులేని అధికారం అనుభవించే రాజకీయ నేతలు ఇంకెంత ధనవంతులు కాగలరు ?. రాజకీయాల్నే నమ్ముకుని అడ్డగోలుగా కుబేరులు అయిన వారు మన ముందే ఉన్నారు. వారు ఎలా సంపాదించారో తెలుసు. కానీ అది అవినీతి అని నిరూపించే వ్యవస్థలేవీ మన దగ్గర యాక్టివ్ గా లేవు . కేసులున్నా… ఏం చేసినా.. అతను చనిపోయిన తర్వాత కూడా తీర్పులు వస్తాయన్న గ్యారంటీ ఉండదు. ఈ లోపు అవనీతి సంపాదనతో మీడియాలు కూడా పెట్టి రాజకీయాలను శాసించగలరు. అలాంటి రాజకీయ వ్యవస్థ తెచ్చిన చట్టం ఎలక్టోరల్ బాండ్లు. అంటే.. అడ్డగోలుగా ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించి.. ఆయా సంస్థల నుంచి తమ పార్టీకి విరాళాలు తీసుకోవడం. ఇది అచ్చమన క్విడ్ ప్రో కో. ఇది నేరం కాదని.. విరాళాలిచ్చిన వారి పేర్లు బయట పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రమే చట్టం చేసింది. ఆ చట్టం చెల్లదని కేంద్రం చెప్పింది. దీంతో ఈ బాండ్ల క్విడ్ ప్రో కో కు పాల్పడిన వారందరి వివరాలు బయటకు వచ్చాయి. మరి వారిపై చర్యలు తీసుకునే చట్టం మన దగ్గర ఉందా ?.ఉన్నా అంత ధైర్యం వ్యవస్థలకు ఉందా ?
వెలుగులోకి ఎలక్టోరల్ బాండ్ల సంపూర్ణ సమాచారం
ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల జాబితా వెలుగులోకి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించిన సుప్రీంకోర్టు వాటి వివరాలను బయట పెట్టాలని ఆదేశించింది. ఎస్బీఐ వేషాలు వేసే ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు హెచ్చరికలతో ఈసీకి సమర్పించక తప్పలేదు. ఈసీ వాటి వివరాలను ఆన్ లైన్ లో ఉంచింది. అన్ని వివరాలు బహిర్గతమయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీలకే అదీ … లబ్దిపొందిన లేకపోతే దర్యాప్తు సంస్థల రాడార్‌లో ఉన్న సంస్థలే ఈ విరాళాలు ఇచ్చాయి. కొన్ని సంస్థలు.. అసలు వ్యాపారమే లేకపోయినా వందలకోట్లు ఇచ్చాయి.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో.. గురువారం రాత్రి వివరాలు మొత్తం అప్ లోడ్ చేశారు. ఏ పార్టీకి ఏ సంస్థ ఇచ్చిందన్న వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా తెర వెనుక ఏం జరిగిందో ప్రజలు సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈసీ ప్రకటించిన వివరాలను పరిశీలించేకొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు అందులో ఉన్నాయి. ఓ చిన్న గేమింగ్, హోటల్స్ పేరుతో వెబ్ సైట్ కూడా సరిగ్గా లేని కంపెనీ టాప్ డోనర్ గా ఉంది. సంబంధం లేదని వైసీపీకీ 150 కోట్లుకుపైగా విరాళిలిచ్చింది. ఆ కంపెనీకి అన్ని విరాళాలు ఎలా వచ్చాయన్నది సస్పెన్సే. ఎందుకంటే… ఎలక్టోరల్ బాండ్స్ కింద విరాళాలిచ్చేవారు… తమకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో.. పన్ను కట్టారో లేదో చెప్పాల్సిన పని లేదు. ఇక రెండో స్థానంలో మెగా ఉంది. హైదరాబాద్ కు చెందిన ఈ కంపెనీ బీఆర్ఎస్ కు మహారాజపోషకురాలు. అంతే కాదు గత ఐదేళ్ల కాలంలో వైసీపీకి పెద్ద మొత్తంలో ముట్టచెప్పింది. ఏమైనా అనుకుంటారేమోనని బీజేపీకి ఇచ్చింది. చాలా కంపెనీలపై .. ఐటీ దాడులు జరిగిన తర్వాతనే విరాళాలు ఇచ్చారన్న విశ్లేషణలు సోషళ్ మీడియాలో వస్తున్నాయి.
రాజకీయ పార్టీలకు లంచాలిచ్చేందుకే ఆ కంపెనీలు !
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. టాప్ డోనర్స్ జాబితాలో అదానీ, అంబానీ లాంటి వాళ్ల పేర్లు జాబితాలో కనిపించలేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆదాయానికి మించి విరాళాలిచ్చిన కంపెనీల వెనుక ఇలాంటి బడాబాబులే ఉన్నారని క్రమంగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏ పార్టీ కూడా సుద్ధపూస కాదు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల జాబితాలో ఎక్కువగా ఊరూ పేరూ లేని సంస్థలే ఉన్నాయి. వీటిలో అనేక సంస్థలు బడా కంపెనీలకు బినామీలుగా వ్యవహరిస్తున్నవే. ఇవి తమ నికర లాభాలలో పది నుండి వంద రెట్ల వరకూ వెచ్చించి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. ఏ కంపెనీ అయినా తన నికర లాభం కంటే వంద రెట్లు ఎక్కువ విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేయగలదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు తమకు వచ్చిన లాభాల కన్నా వందల రెట్లు అధికంగా ఉదారంగా డొనేషన్లు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి 2019 నుంచి 2023 మధ్య 215 కోట్లు ప్రాఫిట్ రాగా.. తమకు వచ్చిన లాభాల కంటే ఏకంగా 635 అధికంగా రూ. 1,365 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొని పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన విషయం సంచలనంగా మారింది. ఈ కంపెనీ వెనుక ఎవరు ఉన్నది అన్నది తేలుతుందో లేదో స్పష్టత లేదు కానీ … అంత పెద్ద మొత్తం ఎలక్టోరల్ బాండ్లు కొని రాజకీయ పార్టీలకు ఇచ్చారంటే ఖచ్చితంగా బిగ్ షాటే ఉంటారని చెప్పాల్సిన పని లేదు.
లాభాలను మించి రాజకీయ పార్టీలకు విరాళివ్వడంలోనే అసలు గుట్టు
అలాగే క్విక్ సప్లై చైన్ కంపెనీ కూడా నాలుగేండ్లలో 110 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. కానీ అంతకంటే 374 శాతం అధికంగా.. అంటే 410 కోట్ల రూపాయల మొత్తాన్ని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన విషయం బయటపడింది. ఈ కంపెనీ దేశంలో అత్యంత కుబేరుని గ్రూప్‌నకు చెందిన అన్ లిస్టెడ్ కంపెనీగా చెబుతున్నారు. వీటి తర్వాత ఐఎఫ్బీ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మరో కంపెనీ కూడా గత నాలుగేండ్లలో 175 కోట్ల ప్రాఫిట్ పొందగా.. అందులో 53 శాతం అంటే 92 కోట్లను డొనేషన్ గా ఇచ్చేసింది. మరో మూడు కంపెనీలు వచ్చిన లాభాల్లో అత్యధికం సమర్పించుకున్నాయి. మరో డజనుకుపైగా కంపెనీలు తమ ప్రాఫిట్స్ లో 10 శాతంలోపు ఎలక్టోరల్ బాండ్ల కింద డొనేషన్లు ఇచ్చినట్లు ఈసీ వెల్లడించిన గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది.లాభాల కన్నా ఎక్కువ రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడానికి కారణం ఏమిటో కానీ కంపెనీలు తమ నికర లాభాలతో నిమిత్తం లేకుండా పెద్ద మొత్తంలో పార్టీలకు విరాళాలు అందించడం వెనుక ఆ సంస్థలకు ఉన్న ప్రయోజనాలు ఏమిటి? వాటి ఉద్దేశం ఏమిటి? అన్నది సస్పెన్స్‌గా మారుతోంది. వీటిలో కొన్ని కంపెనీలు దొడ్డిదారిన రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికే వెలిశాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది క్విడ్ ప్రోకో తప్పించి మరొకటి కాదు. ఎన్నికల బాండ్ల కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు ఇదే సందేహం కలిగింది.
దర్యాప్తు సంస్థల దాడుల తర్వాత బాండ్లు సమర్పించుకోవడం దేనికి సంకేతం ?
ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాత చాలా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు కొన్నాయి. అయితే ఈ విమర్శలపై బీజేపీ భిన్నంగా స్పందిస్తోంది. దాడుల తర్వాతే ఆయా కంపెనీలు విరాళాలు అందించాయని మీకు ఎలా తెలుసు? దాడులకు ముందే బాండ్లు కొనుగోలు చేసి ఉండవచ్చు కదా అని నిర్మలా సీతారామ్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇడి, ఆదాయపన్ను అధికారులు దాడులు జరిపిన తర్వాతే పలు కంపెనీలు 300 కోట్ల విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేసి, రాజకీయ పార్టీలకు సమర్పించుకున్నాయని గతంలోనే కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తే పలు కంపెనీలు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి భారీ మొత్తంలో విరాళాలు అందించాయని స్పష్టమవుతోంది. విరాళాలు అందజేసిన కంపెనీలలో ఎన్ని సంస్థలు ఇడి, సిబిఐ, ఐటి దాడులకు గురై ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయన్నదే ప్రశ్న. అనేక చిన్న కంపెనీలు బడా కార్పొరేట్ సంస్థలకు అనుబంధ సంస్థలుగా కొనసాగుతూ బాండ్లు కొనుగోలు చేశాయి. రిలయన్స్ రిటైల్‌కు అనుబంధ కంపెనీలుగా కొనసాగుతున్న లిస్టింగ్ కాని సంస్థలే ఇందుకు ఉదాహరణగా ఆరోపణలు వస్తున్నాయి. 20 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన విరాళాలు మాత్రమే నమోదవుతాయి. వీటిలో 80 నుండి 85 శాతం విరాళాలు బిజెపి ఖాతాలోనే పడడంతో ప్రతిపక్షాల వాటా పూర్తిగ ాతగ్గిపోయింది. ఎన్నికల బాండ్ల పథకం రాకముందు విరాళాలపై పరిమితి ఉండేది. కంపెనీలు గత మూడు సంవత్సరాల నికర లాభాలలో ఏడున్నర కి మించి విరాళాలు ఇవ్వకూడదు. క్విడ్ ప్రోకోకు అడ్డుకట్ట వేయడానికే ఈ పరిమితిని విధించారు. ఈ విరాళాలను రాజకీయ పార్టీలు, కంపెనీలు తమ పుస్తకాలలో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకతకు ఎక్కువ అవకాశం ఉండేది. ఎన్నికల బాండ్ల పథకం ఈ పరిమితిని ఎత్తేసింది. కంపెనీలు లేదా వ్యక్తులు అపరిమితంగా విరాళాలు అందించవచ్చు. ఇదంతా ఉద్దేశపూర్వక అవినీతి కోసమేనని అనుకోక తప్పదు.
తప్పు చేశారని తేలినా శిక్షించే వ్యవస్థలు లేవు !
రాజకీయ పార్టీలకు విరాళాలు ఒక్క ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మాత్రమే కాకుండా… ప్రుడెంట్ అనే సంస్థ కూడా ఫండ్ ద్వారా ఇస్తోంది. ఈ సంస్థ బీజేపీ కోసమే ఏర్పడినట్లుగా 90 శాతం ఆ పార్టీకే ఇస్తుంది. విచిత్రం ఏమిటంటే… టాప్ డోనర్స్ జాబితాలో రిలయన్స్ కానీ అదానీ కానీ లేదు. వీరు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్దగా రాజకీయ పార్టీలకు విరాళాలు ప్రకటించలేదు. నేరుగా ఖాతాల్లో చూపించేలాగా ఇచ్చి ఉంటారని భావించవచ్చు. మొత్తంగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి వివరాలు బయటకు వచ్చాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చా.. లేదా అన్నది తర్వాత విషయం.. కానీ వారంతా.. పార్లమెంట్ పాస్ చట్టం ప్రకారం విరాళిచ్చారు. తప్పొప్పులు నిర్ణయించి.. తప్పు చేశారని ఎవరు భావిస్తే.. అవినీతి చేశారని భావిస్తే శిక్షించాల్సింది ప్రజలే. ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తాయి. అందుకే ఎలక్టోరల్ బాండ్లు.. ఘోరమైన దోపిడీ. కానీ శిక్షలు మాత్రం ఉండవు.