” Why should our farmers not get the right price? Farmers are not begging, they worked hard for it & should get good prices ”
మన రైతులు ఎందుకు సరైన ధర పొందడం లేదు. వారేమీ అడుక్ోవడం లేదు.. వారు కష్టపడ్డారు.. వారి కష్టానికి మంచి ప్రతిఫలం పొందాల్సిందే.. ! … ఈ మాట రాహుల్ గాంధీది కాదు.. వామపక్ష నేతలది కాదు.. విపక్ష నేతలది కాదు.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీది. కాకపోతే మన రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మారిపోతూ ఉంటాయి. ఈ ట్వీట్ ను నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు 2014 ఏప్రిల్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషాలకు చేశారు. అప్పటికే దేశ్ కీ నేతగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం పొందుతున్న ఆయన మాటలు రైతుల్ని విపరీతంగా ఆకర్షించి ఉంటాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హామీ కూడా ఆకట్టుకుని ఉంటుంది. అందుకే రైతులు ఏకపక్షంగా మద్దతు పలికారు. కానీ పదేళ్లు గడిచిన తర్వాత .. పదేళ్ల కిందట ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను బయటకు తీసి.. అప్పుడు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేమిటి అని నిలదీసే పరిస్థితి వచ్చింది. అంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోనట్లే కదా !
రైతుల విషయంలో చెప్పినవేవీ ఎందుకు చేయలేకపోతున్నారు ?
2016లో జరిగిన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2022 నాటికి దేశంలో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని అందులో సగర్వంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని 2019లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో కూడా బీజేపీ చెప్పింది. ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. మోడీ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. 2021లో విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2015-16లో 96,703గా ఉన్న రైతు కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 2018-19 నాటికి 1,22,616 రూపాయలకి పెరిగింది. దీనిని బట్టి అర్థమయింది ఏమిటంటే రైతుల ఆదాయం కేవలం నామమాత్రంగా 2.98 శాతం మాత్రమే పెరిగింది. రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ చేసిన సిఫార్సులకు 2018-19 బడ్జెట్లో మోడీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం యాభై శాతం అదనంగా ఉండాలన్న సిఫార్సును ఆమోదించింది. దీనికి కట్టుబడి ఉంటామని 2022 డిసెంబరులో వ్యవసాయ మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు. అయితే గత దశాబ్ద కాలంలో కనీస మద్దతు ధరల పెంపు యూపీఏ హయాంతో పోలీస్తే కనిష్ట స్థాయిలోనే ఉన్నదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగం కోసం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీనిని పీఎం కిసాన్ అని పిలుస్తున్నారు. ఈ నగదు బదిలీ పథకాన్ని 2019లో ప్రారంభించారు. గత సంవత్సరం డిసెంబరులో పార్లమెంటుకు ప్రభుత్వం అందజేసిన సమాచారం ప్రకారం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. అయితే దేశలోని వ్యవసాయ కార్మికుల్లో కనీసం 55 శాతంగా ఉన్న భూమిలేని రైతులు ఈ పథకం పరిధిలోకి రావడం లేదు.
వ్యవసాయ చట్టాలపై సుదీర్ఘ పోరాటం చేసిన రైతులకు దక్కిందేమీ లేదు !
2020లో మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల ద్వారా వ్యవసాయ వాణిజ్యం పెరుగుతుందని, రైతులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ ఉత్పత్తులను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవచ్చునని తెలిపింది. అయితే ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు ఉద్దేశించినవేనని ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం, అన్నదాతలు దీర్ఘకాలం ఉద్యమించడంతో 2021లో వాటిని కేంద్రం వెనక్కి తీసుకోక తప్పలేదు. ఎంత నిర్బంధం ఉన్నా రైతాంగం అంతే తీవ్రంగా కదల డానికి కారణం కనీస మద్దతు ధర సాధించుకోడానికే. విద్యుత్ ప్రయివేటీకరణ ఆగకుంటే రైతాంగమే కాదు, సామాన్యజనం తీవ్ర ఇబ్బందులు పడతారని రైతులు నమ్ముతున్నారు. పంజాబ్, యూపీ, హర్యానారా రైతులు పట్టుదల గల వారు. వారు ఉద్యమమం కోసం బరిలోకి దిగితే.. ఎన్ని రోజులు అయినా ఉద్యమంలోనే ఉంటారు. దీన్ని రైతు ఉద్యమం నిరూపించింది. ఎంత మంది చనిపోయినా కదల్లేదు. ఇప్పుడు మరోసారి అదే ఉద్యమం ప్రారంభించారు. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని ఎన్నో ప్రజాస్వామ్య ఘటనలు నిరూపించాయి. రైతుల డిమాండ్లపై కేంద్రం ఎప్పుడూ సంతృప్తిగా స్పందించలేదు. వారు పూర్తిగా మద్దతుధరకు చట్టబద్ధతను కోరుతున్నారు.
రైతుల ఆర్థిక భద్రత కోసం చాలా కాలంగా డిమాండ్లు
రైతులు కోరింది ఆర్థిక భద్రత మాత్రమేనని ఉద్యమకారులుచెబుతున్నారు. ఉద్యోగులకు పింఛనున్నట్లు రైతుకుండద్దా? అనేది వారి ప్రశ్న. అందుకే అరవై ఏండ్లు నిండిన రైతులకు నెలకు రూ.పదివేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ పనుల కోసం స్థిరమైన రోజువారీ వేతనాలు కోరడం అన్యా యమేమీ కాదంటున్నారు. ప్రతిపాదిత వేతనం ఏడాదికి రెండువందల రోజు ల పని హామీతో రోజుకు రూ.700 అడగడం ఇవ్వాలంటున్నారు. ఆలయాల నిర్మాణంలో అద్భు తమైన ‘ఫ్రేమ్‌వర్క్’ చేసిన ప్రభుత్వం… వ్యవసాయ ఉత్ప త్తులకు మద్దతు ధర హామీనిచ్చే చట్టపరమైన విధివిధా నాల రూపకల్పనకు ఒక్క నిముషమైనా కేటాయించలేదనేది రైతుల ఆరోపణ. వ్యవసాయ సమస్యలను పరిష్కరించడా నికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని రైతులు కోరడం తప్పేమీ కాదని.. ఈ మధ్యనే స్వామినాథన్‌ను భారతరత్నగా కీర్తించిన మోడీ ప్రభుత్వం ఆ కమిటీ సిఫార్సుల పట్ల జాప్యం చేయడం రైతుల్ని మోసం చేయడం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. గత కొన్నేండ్లు సాగు ఖర్చులు పెరిగాయి. వ్యవసాయం నష్టదాయక ప్రక్రియగా మారిపోయింది. రైతులు తమ మొత్తం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం పొందేలా చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రైతులు, రైతుకూలీలకు పింఛన్లు, పంటరుణాల మాఫీలుండాలి. కరెంటు బిల్లులలో పెరుగుదల ఉండరాదని తెలిపారు.2013 నాటి భూసేకరణ చట్టం పునరుద్ధరణ, ఢిల్లీలో 2020లో జరిగిన రైతుల ఉద్యమం దశలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలనేది కూడా తమ ప్రధాన డిమాండ్లలో ఉన్నాయని రైతు నేతలు కేంద్రానికి తెలిపారు. వీటన్నింటిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు గొప్పవే..కానీ ఎందుకు అమలు చేయరు ?
నిజానికి ఇప్పుడు రైతులు ఉద్యమ పంథాను ఎంచుకోవడం, పొలాలు వీడి, రాదార్ల వెంబడి పడి ముందుకు సాగాల్సి రావడం, బారికేడ్లు తోసుకుసాగడం అనేది కీలక ప్రశ్న అయింది. రైతులు చెపుతున్న స్వామినాథన్ కమిషన్ నివేదికలోని అంశాలను రైతుల ఆశశ్వాసల ఆయువుపట్టు అయిన సాగుశ్రమ జీవన క్రమపు సౌలభ్యానికి ఇంతకాలం ఏ పాలకులూ ఎందుకు పట్టించుకోలేదు? ఈ కమిషన్ నివేదిక ఇప్పటిది కాదు.2004 డిసెంబర్ నుంచి 2006 డిసెంబర్ మధ్యలో ఐదు అంచెల నివేదికలుగా దీనిని అందించారు.అన్ని నివేదికల్లోనూ రైతుల సాగు క్రమంలో వారు ఎదుర్కొంటున్న కరడుగట్టిన కడగండ్లు, రైతులలో తలెత్తుతున్న నిరాశా నిస్పృహలు, ప్రత్యేకించి అన్నదాతల ఆత్మహత్యల గురించి విశ్లేషించుకుంటూ పలు ప్రతిపాదనలను పొందుపర్చారు.రైతాంగం కోసం ఓ కేంద్రీకృత సమగ్రమైన జాతీయ విధానం అవసరం అని స్పష్టం చేశారు. రైతాంగపు జీవనవృత్తి అయిన వ్యవసాయానికి మరింత ఊతం ఇచ్చేందుకు, వ్యవసాయం గిట్టుబాటు పని అని తేల్చేలా చేసేందుకు సరైన చర్యలకు దిగండనే నిక్కమైన నిజాలను సర్కారు ముందుంచారు. అయితే ఏ సర్కారు వచ్చినా ఏమున్నది గర్వకారణం అనే రీతిలో నేతలు ఎన్నికలవేళ స్వామినాథన్ కమిషన్ నివేదికను కళ్లకు అద్దుకున్నట్లుగా మాట్లాడటం నేతలు వంటబట్టించుకున్నారు. కానీ అమల్లోకి మాత్రం రావడం లేదు. భూసంస్కరణ, సాగునీటిపారుదల, రుణాలు, బీమాలు, ఆహార భద్రత, ఉపాధి, ఉత్పాదకత, తోటిపోటీ ప్రపంచంలో ముందుకు సాగేలా వ్యవసాయ రంగం తీర్చిదిద్దే చర్యలు వంటివి స్వామినాథన్ కమిషన్ నివేదికలోని సూత్రాలు అయ్యాయి.మరి కేంద్రం ఇప్పుడు స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించినందుకు, ఇందుకు ఆయన నివేదికనే ఆధారభూతం అయినందుకు ఇక ఈ నివేదిక అమలు చేస్తేనే సరైన గైరవ ఇచ్చినట్లని అనుకోవచ్చు.
ఢిల్లీ శివార్లలో ఇప్పుడు రైతులతో కేంద్రం దాదాపుగా యుద్ధం చేస్తోంది. రైతులు ఢిల్లీలోకి అడుగు పెట్టకుండా కంచెలు వేశారు. సిమెంట్ దిమ్మలు పెట్టారు. లేజర్ గన్ లతో దాడులు చేశారు. లాఠీలు ప్రయోగించారు. చివరికి సూపర్ సోనిక్ సౌండ్ తోనూ ఎటాక్ చేశారు. రైతుల విషయంలో ఇలా చేయడం.. పాలకులకు ఎప్పటికీ మంచిది కాదు. వారిపై ఖలిస్థాన్ ముద్ర వేయడం.. ఆమ్ ఆద్మీ పార్టీని నిందించడం చేయడం సులువే కానీ.. సమస్యకు అది మాత్రం పరిష్కారం కాదు. అందుకే కేంద్రం రైతుల పట్ల సానుకూలంగా ఆలోచించాలి.