“ప్రజలు రెక్కలు, ముక్కలగా చేసుకుని కష్టపడి పన్నులుగా కట్టే సొమ్మును పాలకులు రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ఏమంటారు?” .. ఖచ్చితంగా దేశద్రోహం అనే అంటారు. ఎందుకంటే ప్రజలు పన్నులుగా కట్టే ప్రతి పైసా దేశం కోసం ఉపయోగించాలి.కానీ రాజకీయ పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం ప్రజలకు తాయిలాలు పంచి పెట్టేందుకు ఉపయోగిస్తున్నాయి. ఫలితంగా దేశ సంపద అంతా అనుత్పాదక వ్యయంగా మారుతోంది. అభివృద్ధి ఆగిపోతోంది. ఉపాధి నిలిచిపోతోంది. అంతిమంగా ప్రజలు ప్రభుత్వాలపై ఆధారపడి బతికేలా చేసి.. ఉత్పాదక వర్గంగా ఉన్న అతి కొద్ది మంది నుంచి పన్నులు పండుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అంతిమంగా దేశానికి నష్టం చేస్తున్నారు. ఇది దేశద్రోహం కాక మరేమిటి?
మేనిఫెస్టో అంటే ఉచిత పథకాల క్రియేటివిటీ
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ ప్రభుత్వానికి ఉండే అధికారాలు చాలా పరిమితం. ఎంత అంటే చివరికి ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని లెఫ్టినెంట్ గవర్నర్ అని ఏకంగా పార్లమెంట్ లోనే కేంద్రం చట్టం చేసింది. అలాంటి చోట జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు చూస్తే ఇదా రాజకీయం అని పన్నులు కట్టే మధ్యతరగతి ప్రజలు నీరసపడిపోతారు. ఒకరు ఫ్రీ బస్ అంటారు. మరొకరు ఫ్రీ మెట్రో అంటారు. ఒకరు మహిళలకు నెలకు రెండున్నర వేలు అంటే మరొకరు మూడు వేలు అంటారు. గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖాయమని మేనిపెస్టోలో ప్రకటించాయి. సాధారణంగా మేనిఫెస్టో అంటే.. తమ విజన్ ఏమిటో ప్రజల ముందు ఆవిష్కరించాలి. ప్రజల బతుకుల్ని ఎలా బాగు చేస్తామో చెప్పాలి. కానీ గత రెండు, మూడు దశాబ్దాలుగా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తాము దోచుకున్నంత దోచుకుని ప్రజలకు ఎంతో కొంత పడేయడం అనే రాజకీయం ప్రారంభించారు. ప్రజలు కూడా అలాంటి వాటికి ఆశ పడటం ప్రారంభించిన తర్వాత ఇక ఎవరూ ఆపడానికి లేకుండా పోయింది. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇప్పుడే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా… నగదు బదిలీ పథకాలు తప్ప మరేమీ ఉండటం లేదు. వాటికే ప్రజలు ఓట్లేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. గెలుపే ముఖ్యం కాబట్టి ప్రకటనలు చేసేస్తున్నారు.
ఈ ఉచిత పథకాలు దేశానికి చేస్తున్న నష్టాన్ని అంచనా వేస్తే కాస్త ఆలోచించేవారికి మన రాజకీయ వ్యవస్థపై విరక్తి పుట్టేస్తుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలనే తీసుకందాం. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులు ఇప్పుడు ప్రభుత్వాలను నడపడానికి సరిపోవడం లేదు. భరించలేనంత పథకాన్ని భారాన్ని రెండు ప్రభుత్వాలు నెత్తికెత్తుకున్నాయి. ఫలితంగా అప్పుల ఊబిలో ఇరుక్కున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతో అలవి మాలిన హామీలు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం రూ. 21వేల కోట్లను రుణమాఫీగా అమలు చేసింది. వెంటనే రైతుబంధు అమలు చేయాల్సి వస్తోంది. ఉచిత బస్సు కోసం ఇప్పటికే రూ. రెండు వేల కోట్ల వరకూ ఖర్చు పెట్టి ఉంటారు. కానీ ఇప్పటికీ అమలు చేయాల్సిన పథకాలు బోలెడన్ని ఉన్నాయి. ఏడాది కాలంలోనే రూ.లక్షా నలబై వేల కోట్లు అప్పు చేశారని కానీ ఓ చిన్న అభివృద్ది పని కూడా చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందులో ఎంత నిజం ఉందేమో కానీ.. అప్పులు చేసి పెద్ద ఎత్తున పథకాల పేరుతో పంచేశారు. ఏపీలోనూ అదే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న కాలంలో తాకట్టుపెట్టడం, అప్పులు తేవడం.. ప్రజల ఖాతాల్లో కొద్దిగా జమ చేసి మిగతాది దిగమింగడం అన్నట్లుగా సాగిపోయింది. ఆ పార్టీని ఓడించడానికి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పథకాలు తాము చెప్పినవి అయినా కొనసాగించక తప్పదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మనీ మింటింగ్ సిటీస్ ఉన్న రాష్ట్రాల్లో జీతాల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ?
సంక్షేమం అంటే ఏమిటి?
అప్పనంగా డబ్బులు పంచడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమం కాదు. రోడ్డు మీద ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే.. డబ్బులు ఇవ్వడానికి ఎవరికీ మనసొప్పదు. కానీ ఆకలి తీర్చడానికి మాత్రం సిద్దంగా ఉంటారు. ఐదు రూపాయలు ఇవ్వబుద్ది కాదు కానీ యాభై రూపాయుల పెట్టి ఆకలి తీర్చవచ్చు. ఎందుకంటే మన సొమ్ము సద్వినియోగం అవుతంది.. ఒకరి ఆకలి తీరుతుందన్న నమ్మకం. అది కళ్ల ముందే జరుగుతుంది కాబట్టి మన సొమ్ము దుర్వినియోగం కాలేదన్న సంతృప్తి ఉంటుంది. కానీ అతనికి ఐదు రూపాయలు ఇస్తే..దానికి మరికొంత మంది ఇచ్చినవి పోగేసుకుని లిక్కర్ కొనుక్కుంటే ఏం చేయగలం?. మన సొమ్ము దుర్వినియోగం అయినట్లే. అతని కడుపు నింపడం సంక్షేమం అయితే..డబ్బులు ఇవ్వడం ఉచిత పథకాలు అమలు చేయడం వంటిది. దేశంలో సాయం చేయాల్సిన నిజమైన పేదలు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా వారికే పథకాలు అందేలా చేసినప్పుడే … ప్రజలు రెక్కలు ముక్కుల చేసుకుని కష్టపడి కడుతున్న పన్నులకు సార్థకత ఉంటుంది. ఉదాహరణకు ఉచిత బియ్యంను తీసుకుంది. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రూపాయలకే కిలోబియ్యం ఇస్తున్నాయి. కుటుంబానికి పాతిక కేజీల వరకు ఇస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్నాయి. ఈ తెల్ల రేషన్ కార్డులు నిజంగా అర్హుల వద్దే ఉన్నాయా ? . వైట్ రేషన్ కార్డుల సంక్నే పరిగణనలోకి తీసుకుంటే దేశంలో 90 శాతం కుటుంబాలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నట్లే. వాస్తవానికి ఆ బియ్యం ఖచ్చితంగా అందాల్సిన వారికి అందేలా చూస్తే.. 70 శాతం మంది అనర్హులు ఉంటారు. అఅంటే.. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతోంది. దీనికి ఎవరు బాధ్యులు?. ప్రభుత్వాలు ఎందుకు అనర్హుల్ని ఏరి వేసే ప్రయత్నం చేయవు?. ఇది ఒక్కడే కాదు.. ప్రతి మహిళకు రెండున్నర వేలు ఇస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇస్తాయి. అంత అవసరం ఏముంది ?. ముందుగా చెప్పుకున్నట్లుగా డబ్బులు సాయం చేయడం అన్న కాన్సెప్టే తిరోగమన సూత్రం. అది సోమరుల్ని తయారు చేస్తుంది. నిధుల్ని దుర్వినిోయగం చేస్తుంది.
లక్షల కోట్ల పథకాల సొమ్ము అనర్హుల ఖాతాల్లోకి !
ఐదేళ్లలో రైతులకు రూ.లక్ష కోట్ల పంపిణీ చేశామని ఓ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంటుంది. మరి ఈ ఐదేళ్లలో ఎంత మంది రైతులు ఆ లక్ష కోట్లతో బాగుపడ్డారు ? ఒక్క రైతు కూడా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తాము బాగుపడ్డామని చెప్పరు.. చెప్పలేరు కూడా. ఎందుకంటే వారు బాగుపడరు కాబట్టి. ఒక్క రైతుల విషయంనే కాదు.. పథకంలో నేరుగా నగదు బదిలీ చేసినా ఆ పథకంలో ఒక్కరు కూడా బాగుపడరు. ఎందుకంటే ఉచితంగా వచ్చే వాటికి విలువ ఉండదు. ఊరకనే ఇచ్చే డబ్బులకూ విలువ ఉండదు. కష్టపడి సంపాదించుకున్నప్పుడే దేనికైనా విలువ…నిలకడ ఉటుంది. అందుకే ప్రభుత్వాలు చేయాల్సింది ఉచితంగా డబ్బులు పంచడం కాదని.. ప్రజలకు ఆదాయ మార్గాలు చూపించడమని రాజకనీతి నిపుణులు చెబుతూంటారు. ఆరోగ్యశ్రీ కింద ఐదేళ్లలో పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతూ ఉంటారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులు.. వైద్య రంగం కోసం అంతకు మూడింతలు ఎక్కువ ఖర్చు పెడతారు. ఆ మొత్తం పెట్టి నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టవచ్చు. గ్రామలవారీగా వైద్యులను అందుబాటులోకి తీసుకు రావచ్చు. టెక్నాలజీ సాయం అందరి ఆరోగ్యాన్ని మానిటర్ చేసి ఉచితంగా చికిత్సలు చేయవచ్చు. కానీ ఆ డబ్బును దుర్వినియోగం చేయడానికైనా సిద్ధపడతారు కానీ.. హెల్త్ ఇన్ ఫ్రా మాత్రం పెంచరు. అలాగే విద్యా రంగంలో కూడా. నాడు నేడు అని… తల్లికి వందనం, అమ్మఒడి పేరుతో వేల కోట్లు నగదు బదిలీ చేస్తారు.. అంతే మొత్తం విద్యావ్యవస్థ మెరుగుదలకు వాడితే..పేద పిల్లలు తమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకునవారు. కానీ ఇప్పుడు వారికి పదమూడు వేలు ఇవ్వడమే.. గొప్ప సంస్కరణ అన్న భావనకు తీసుకెళ్లి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూండటంతో మొత్తం వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. బావి భారత భవిష్యత్ అంధకారంలోకి పోతోంది.
ఆ డబ్బుతో విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వొచ్చు !
భారత దేశానికి ఉన్న వనరులు, ప్రజలు పన్నులుగా కడుతున్న మొత్తాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయడం లేదు. పూర్తిగా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ సొమ్మును ఓటు బ్యాంకుకు పంపిణీ చేసి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇది చాలా ప్రమాదకమైన ఆట. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే.. ఇప్పుడు వంద రూపాయలు ఇస్తే తర్వాత వెయ్యి రూపాయలు కోరుకుంటారు. ఇవ్వకపోతే అసంతృప్తికి గురవుతారు. ఒకప్పుడు ప్రభుత్వాలపై అసంతృప్తి అంత ఎక్కువగా ఉండేది కాదు. ఐదేళ్ల తర్వాత ప్రజలు తీవ్రంగా తిరస్కరించేవారు కాదు. పరిపాలన ఎలా ఉందో చూసి ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చూస్తే గొప్ప సంక్షేమం పేరుతో పథకాలను ఇచ్చిన వారిని అంతే గట్టిగా పాతాళానికి తొక్కేస్తున్నారు. ఎందుకంటే వారు అంత కంటే ఎక్కువ ఆశిస్తున్నారని అయినా అనుకోవాలి.. లేదా ఉచితాల వల్ల నష్టపోతున్నామని అయినా గుర్తించాలి. కానీ రెండో అంశమే కరెక్ట్ అని అనుకునేందుకు రాజకీయ పార్టీలు దైర్యం చేయడం లేదు. ప్రజలు ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు అని చెప్పి వారికి ఎక్కువ పథకాలు ప్రకటిస్తున్నారు. పథకాలు ప్రకటించని పార్టీ ఒక్కటి కూడా ఉండటం లేదు. ఒక్క పార్టీ అయినా పథకాలు ప్రకటించకుండా..తాము సుపరిపాలన అందిస్తామని .. అవసరమైన వారికే సంక్షేమం అందిస్తామని చెబితే ప్రజల నుంచి వచ్చే స్పందన తెలుసుకోవచ్చు.కానీ అలాంటి ప్రయత్నమే చేయడం లేదు.
కొద్ది రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్ల మీటింగ్ లో ఓ మాట చెప్పారు. అర్హులు కాని వారికి పథకం ఇస్తే మిగిలిన వారు కూడా మాకెందుకు ఇవ్వరు అని అసంతృప్తి చెందుతారు. అదే అర్హులకే ఇస్తే.. వారు రియలైజ్ అవుతారు. చంద్రబాబుకు ఈ విషయంలో స్పష్టత ఉంది. అలాగే ఇతర నేతలకూ ఉంటుంది. కానీ వారు కూడా.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేద్దామని అనుకోలేరు. ఎదుకంటే ప్రజలు ఓడిస్తారన్న భయం. నిజానికి గత ఎన్నికల్లో తాము ఎలాంటి పథకాలను అమలు చేయబోమని చెప్పినా ఈ ఫలితాలు వచ్చి ఉండేవి. కానీ ఆ దైర్యం చేయలేదు. ” భారత్ మాతాకీ జై ” అని నినాదాలు చేయడం మాత్రమే దేశ భక్తి కాదు. అలాంటి దేశభక్తి వల్లే పెద్దగా ఒరిగేదేమీ ఉందు. అసలైన దేశ భక్తి దేశ ప్రజలు పన్నులుగా కడుతున్న సొమ్మును దుర్వినియోగం చేయకుండా.. దేశం కోసం .. నిజంగా అవసరమైన వారి సంక్షేమం కోసం వినియోగించడమే. ముఖ్యంగా పాలక బాధ్యతల్లో ఉన్నవారికి..రాజకీయ పార్టీలకు ఈ దేశభక్తి ఉండాలి. అలా లేకపోవడం దేశద్రోహమే అవుతుంది.