రూ. 5వేలు !. ఒక్క మనిషికి రూ. ఐదు వేలు..! అదే ఇంట్లో నలుగురు ఉంటే రూ. 20వేలు ! ఆరుగురు ఉంటే రూ. 30వేలు !.. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య తరగతి కుటుంబాలకు కొత్తగా ఇచ్చేందుకు ప్రవేశ పెట్టిన పథకం కాదు. పేద వాళ్లా.. మధ్య తరగతి వాళలా.. ఉన్నత తరగతినా అన్నది చూడకుండా అందరి దగ్గర్నుంచి లాక్కునేందుకు పెట్టిన పథకం. ఇది అమల్లోకి వచ్చింది కూడా. వసూలు కూడా చేస్తున్నారు. అదే పెట్రో పన్నుల వడ్డింపు పథకం. కేంద్రంలో ప్రభుత్వం మారక ముందు ప్రజలపై ఈ భారం పరిమితమే. రాను రాను ఇది పెనుభారంగా మారింది. సామాన్యుల కష్టాన్ని ఆదాయాన్ని నేరుగా జేబు నుంచి దోపిడి చేస్తున్నారు. ప్రజలు ఈ విషయం గుర్తించకుండా కేంద్ర, రాష్ట్రాలు పకడ్బందీగా రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి.
కేంద్రం ప్రజల నుంచి చేస్తున్న దారి దోపిడి రూ. 4 లక్షల 53 వేల కోట్లు !
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం 2020-21లో రూ. 4 లక్షల 53వేల 812 కోట్లు ఎక్సైజ్ పన్నులను పొందింది. భారత దేశ జనాభా 130 కోట్ల మంది అనుకుంటే సగటున ఒక్కొక్కరి నుంచి రూ. ఐదు వేలకుపైగా వసూలు చేసినట్లే. నలుగురున్న ఓ కుటుంబం నుంచి ఏటా ఒక్క పెట్రో పన్నుల ద్వారా రూ. 20వేలు కేంద్రం వసూలు చేస్తోంది. ఆ కుటుంబానికి నెలకు రూ. పది వేల ఆదాయం ఉన్నా.. లక్ష ఆదాయం ఉన్నా.. ఈ వసూలు కామన్. గతంలో ప్రభుత్వాలు ప్రజల మీద కాస్త కనికరం చూపేవి. ఈ ప్రభుత్వానికి అవేమీ లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 2014 తరువాత గత ఏడేళ్ల కాలంలో ఎక్సైజ్ పన్ను పెంచుకుంటూ పోయారు. 2014లో ఎక్సైజ్ సుంకం కేవలం 8 శాతం. ఇప్పుడు ఎంతో తెలుసా.. 35 శాతం. ఇది కేవలం కేంద్ర ఎక్సైజ్ పన్ను. అప్పట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 109 డాలర్లు ఉన్నప్పుడు, రిటైల్‌గా పెట్రోల్ ధర లీటర్ రూ.71 ఉండేది. ఆ తరవాత అంతర్జాతీయ పరిణామాల్లో బ్యాలెర్ ధర 30 డాలర్లకు కూడా పడిపోయింది. ఆ సమయంలో కేంద్రం రేట్లు ఏ మాత్రం తగ్గించి ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా .. ఎక్సైజ్ టాక్స్ లు పెంచుతూ ఆ నిధులను తన ఖాతాలో వేసుకోవడం ప్రారంభించింది. 2013 -14లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.53వేల కోట్లు మాత్రమే. కానీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి వచ్చిన ఆదాయం ఏకంగా నాలుగు లక్షల కోట్లు ఎక్కువ. ప్రజల్ని ఎంత దారుణంగా దారి దోపిడి చేస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రాలేం తక్కువ కాదు. అంతకు మించి పన్నుల వడ్డన !
పైన చెప్పుకున్నది కేవలం కేంద్రం వసూలు చేసే పన్ను మాత్రమే. అన్ని రాష్ట్రాలు విడిగా వ్యాట్ వసూలు చేస్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు వసూలు చేసే పెట్రో పన్నులు రూ. 2 లక్షల 17వేల కోట్ల 650 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వ్యాట్ అమలు చేస్తాయి. విడిగా సెస్‌లు వేస్తాయి. కేంద్రంతో పోటీగా పన్నులు వసూలు చేస్తూంటాయి. ఏ మాత్రం మహమాట పడే అవకాశం కూడా లేదు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిపి వచ్చే ఆదాయంలో రూ. ఆరు లక్షల 71వేల కోట్లు కేవలం పెట్రోల్ డీజిల్మీదనే కేంద్ర రాష్ట్రాలు వసూలు చేసుకుంటున్నాయన్నమాట. ఇక మనం కొనే ఉప్పులు, పప్పులన్నింటి మీద కట్టే జీఎస్టీ వేరు. అదీ కాక ఎవరైనా ఐదు లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తే ఆదాయపు పన్ను ఉంటుంది.. అది వేరే. ఇలా పన్ను మీద పన్ను వేసుకుంటే సగటు మధ్య తరగతి జీవి తన సంపాదనలో ఎంత ప్రభుత్వానికి పెడుతున్నారో ఊహించడం పెద్ద కష్టమే కాదు.
ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించకుండా రూపాయిల్లో తగ్గించి కేంద్రం డ్రామా !
ఎక్సైజ్ పన్ను పర్సంటేజీని తగ్గించలేదు కేంద్ర ప్రభుత్వం. కేవలం రూ. ఐదు, రూ. పది మాత్రం తగ్గిస్తున్నట్లుగా ప్రకటించాయి. కేంద్రం తాను విధిస్తున్న ఎక్సైజ్ ట్యాక్స్‌లో పర్సంటేజీని లేకపోతే సెస్‌ను తగ్గించాల్సి ఉంది. కానీ చేయలేదు. తెలివిగా రూపాయల్లో తగ్గించింది. తామేమన్నా తక్కువ తిన్నామా అని ఇతర ప్రభుత్వాలు కూడా అదే చేశాయి. అందుకే ఈ తగ్గింపు ఎంతో కాలం ఉండదని.. మరో నెల రోజుల్లోనో.. రెండు నెలల్లోనే తగ్గింపు అంతా కవర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మన దేశ ప్రజలు అల్ప సంతోషులు. తగ్గింది కదా అని సంతోషపడతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ.. ఎక్సైజ్ పన్ను శాతాన్ని తగ్గించడం లేదు. పెట్రోల్‌పై పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 స్థాయిలో ఉంచితే లీటర్ పెట్రోల్ కేవలం రూ.66 వస్తుంది. పెంచిన పన్నులు కేంద్ర రాష్ట్రాలు తగ్గిస్తే చాలు ప్రజలకు ఊరట లభిస్తుంది.
కేంద్రం పన్నులు పెంచిన ప్రతీ సారి రాష్ట్రాల దోపిడీ..కానీ పెంచలేదని పోసుకోలు కబుర్లు !
పన్నుు పెంచింది కేంద్రం కాబట్టి కేంద్రమే తగ్గించాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కానీ కేంద్రం పన్నులు పెంచిన ప్రతీ సారి రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగింది. పెట్రోల్ పై వేసే వ్యాట్ 31 శాతం ఉంటే.. పెట్రోల్ రేటు పెరిగేకొద్దీ ఆ మేరకు వసూలయ్యే మొత్తం పెరుగుతుంది. పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లీటర్‌పై ఈ పన్నుల రూపంలో వచ్చేది కేవలం రూ.25 లోపే. కేంద్రం రేట్లు పెంచి వంద దాటించడం వల్ల రాష్ట్రానికి కూడా లీటర్‌పై రూ. 40 వరకూ వస్తుంది.ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాచేసి రాజకీయం చేస్తున్నాయి. తప్పంతా కేంద్రందే అంటున్నాయి. తప్పు కేంద్రంది మాత్రమే కాదు…రాష్ట్రాలది కూడా..!
కేంద్ర, రాష్ట్రాల మధ్య వాటా పంపకంలో తేడాలతోనే ప్రస్తుత రాజకీయం !
రాజ్యాంగం ప్రకారం కేంద్ర పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే కేంద్రం పెట్రో పన్నుల రూపంలో వసూలు చేస్తున్న రూ. నాలుగున్నర లక్షల కోట్లలో దాదాపుగా రూ. రెండు లక్షల కోట్లు మళ్లీ రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కానీ కేంద్రం ఇక్కడే తెలివిగా ఆలోచించింది. అత్యధిక మొత్తం సెస్‌ల రూపంలో వసూలు చేస్తోంది. దీంతో రాష్ట్రాలకు పంపిణీ చేసేది తగ్గిపోయింది. ఈ కారణంగా రాష్ట్రం వసూలు చేసే పన్నలు కాక కేంద్రం వసూలు చేస్తున్న పెట్రో పన్నుల్లో 41 శాతం ఇవ్వడం లేదని రాష్ట్రాలు అంటున్నాయి. కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పంపకాల మధ్యే ఇప్పుడు అసలు రాజకీయ పంచాయతీ జరుగుతోంది. సెస్సులు వసూలు నిలిపివేస్తే రేట్లు తగ్గుతాయని అంటున్నాయి. అంతే కానీ తాము మాత్రం ఆదాయాన్ని తగ్గించుకోవాలని అనుకోవడం లేదు.
వసూలు చేస్తున్న లక్షల కోట్లు ఏమవుతున్నాయి ?
రాజకీయ పార్టీల్లో ఉండే నేతలు విచ్చలవిడిగా వనరులు దోచుకుని ధనవంతులవుతున్నారు. కానీ పాలకులు మాత్రం ప్రజల్ని పన్నుల పేరుతో బాదేస్తున్నారు. లక్షల కోట్లు ఏమవుతున్నాయో.. ఎవరికీ తెలియదు. అన్ని లక్షల కోట్ల పన్నులు వసూలు చేస్తున్నప్పుడు దేశంలో దిమ్మతిరిగిపోయే రీతిలో మౌలిక సదుపాయాల్ని కల్పించాలి. కానీ ఏడేళ్ల కాలంలో దాదాపుగా పాతిక లక్షల కోట్ల రూపాయాల్ని కేవలం పెట్రో పన్నుల రూపంలోనే వసూలు చేసిన కేంద్రం… ఏ గొప్ప మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ చేపట్టిందో ఎవరికీ తెలియదు. బుల్లెట్ ట్రైన్ అన్నారు అది ఎక్కడ ఉందో తెలియదు. ఇటీవలే లక్ష కోట్లతో గతి శక్తి అనే పథకాన్ని ప్రకటించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ గతి శక్తిని నాలుగేళ్లుగా చెబతూనే ఉన్నారు. ఏం చేస్తారు.. ఎలా చేస్తారు.. అన్నదానిపై స్పష్టమైన విజన్ డాక్యుమెంట్ దానికి ఉందో లేదో స్పష్టతలేదు. గాలిలో కబుర్లు మాత్రం బాగానే చెబుతున్నారు. దేశంలో ఆర్థిక వృద్ధి ఎలా ఉందో.. చెప్పడం కష్టం. ఐదేళ్ల కింట నోట్ల రద్దుతో ప్రారంభమైన కష్టాలు.. కరోనాతో గోతిలో పడేశాయి. దేశవ్యాప్తంగా కొన్ని వందల, వేల కుటుంబాలు ఆత్మహత్య మార్గాన్ని ఎంచుకున్నాయంటే దాని కంటే పెద్ద విషాదం మరొకటి ఉండదు.
ప్రభుత్వాలు ప్రజల్ని ఆదాయ వనరుగా చూడటం మారితేనే ఫలితం !
ప్రభుత్వాలు ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. వారికి ఉపాధికల్పించాలి. ఉద్యోగాలివ్వాలి. వారు సంపద సృష్టిస్తూంటే దాని మీద ఆదాయాన్ని రాబట్టుకోవాలి. అదీ ప్రభుత్వాల లక్షణం. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కరోనా దెబ్బకు ప్రజలు అల్ల కల్లోలం అయిపోయినా పన్నులు పండుకుంటూనే ఉన్నారు. ప్రజల ఆదాయం పెరిగే మార్గాలను చూపించడంలేదు. ఈ కారణంగానే ప్రభుత్వాలంటే ప్రజలకు విరక్తి పుట్టేస్తోంది. ఎవరొచ్చినా పన్నుల బాదుడు తప్ప.. ఏమీ ఉండదని అనుకుంటున్నారు. అయితే దేశంలోఅత్యధిక మంది ఆలోచనలు లేని వాళ్లే. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు స్టిక్ అయిపోయిన వారు.. విచక్షణ మరిచిపోతున్నారు. ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడుతోంది. ఈ పరిస్థితి మారితేనే ఎప్పటికైనా ప్రజలకు విముక్తి కలుగుతుంది. లేకపోతే.. దారి దోపిడీలకు సిద్ధంగా ఉండాల్సిందే..!