” ద కేర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ హ్యాపీనెస్ అండ్ నాట్ దెయిర్ డిస్ట్రక్షన్ , ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ “.. అమెరికా మూడో అధ్యక్షుడు ధామస్ జెఫర్సన్ మూడు వందల ఏళ్ల కిందట చెప్పిన మాట ఇది. ప్రజల జీవితాల్ని నాశనం చేయడం ఎప్పుడూ పాలకులు చేయకూడదు. అది ప్రజాస్వామ్యంలో బేసిక్ ప్రిన్సిపుల్. అది ఆస్తిపరంగా అయినా.. వ్యవస్థల పరంగా అయినా ..రాజకీయ వ్యవస్థలపరంగా అయినా సరే. ఏదైనా విధ్వంసం జరిగితే మళ్లీ నిర్మించుకోవడం కష్టం. కానీ మన దేశంలో ఏం జరుగుతోంది ? ఒక్క సారి తలెత్తి చూద్దామా ? ప
జేసీబీకి మరో పేరు జీహాద్ కంట్రోల్ బోర్డు !
”జిహద్ కంట్రోల్ బోర్డు” ..ఈ పగదం ఎక్కువగా విని ఉండరు. కానీ షార్ట్ కట్లో “జేసీబీ” అంటున్నారు. జేసీబీ అంటే ఇప్పటి వరకూ మనకు తెలిసిన అర్థం వేరు. కానీ ఇప్పుడు దేశంలో జరుగుతున్నదానికి తీసుకోవాల్సిన అర్థంవేరు. జేసీబీ అంటే ”జిహద్ కంట్రోల్ బోర్డు”గా ఉత్తరప్రదేశ్‌లో రూపాంతరం చెందిన ఈ బుల్డోజర్ ఇప్పుడు బీజేపీ పాలిత ప్రభుత్వాలన్నిటికీ ఆదర్శప్రాయంగా మారింది. ఓ బ్రాండ్ గా మార్చుకుని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. యూపీలో బుల్డోజర్ చేసిన అరాచకాలు బయటకు రాలేదు. బుల్డోజర్ బాబాగా పిలిపించుకునేందుకు అక్కడి సీఎం ఆదిత్యనాత్ ఆసక్తి చూపుతారు. ఆ బుల్డోజర్ తో భయపెట్టి నేరస్తుల్ని లొంగ దీసుకుంటున్నామని మీడియా ప్రచారం చేస్తోంది. కానీ అక్కడ జరుగుతోంది వేరనేది ప్రత్యక్షంగా ఉన్న వారికి తెలుసు. అలాండి బుల్డోజర్ విధ్వంసం ఢిల్లీలో జరిగే సరికి దేశమంతా సంచలనం అయిపోయింది. ఢిల్లీలోని జహింగీర్పూరీలో పండుగ రోజు అల్లర్లు జరిగాయి. శోభాయాత్రపై రాళ్లేశారని కారణంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మున్సిపల్ అధికారులుకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని లేఖ రాశారు. అంతే సమస్త అధికార యంత్రాం గం, పదిహేను వందల మంది పోలీసులు, తొమ్మిది బుల్డోజర్ లతో కూల్చివేతలు ప్రారంభించారు. కనీస ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండా, ఏకపక్షంగా కూల్చివేతలకు దిగారు. అక్కడ ఆక్రమణలు అనుకున్న వాటిని మొత్తాన్ని కూల్చివేస్తే ఇంత రచ్చ జరిగేదికాదు. కానీ కొందరినే.. ఇంకా చెప్పాలంటే ఒక్క వర్గాన్నే లక్ష్యం చేసుకోవడంతో విమర్శలు వచ్చాయి. నిజానికి పర్మిషన్లు ఉన్నా లేకపోయినా ఢిల్లీలోని అక్రమ కట్టడాలన్నిటికీ 2023 డిసెంబర్ వరకూ రక్షణనిస్తూ 2011లో ఏర్పడ్డ చట్టాన్నీ చేశారు. దాన్నీ పట్టించుకోలేదు. బుల్డోజర్తో ఏమైనా చేస్తామన్నట్లుగా సాగిపోయారు. బుల్డోజర్లు కూల్చేస్తున్నది కేవలం కట్టడాలను మాత్రమే కాదు..వ్యవస్థలనూ అనుకోవాలి.
విద్వేష రాజకీయాలతో ప్రజల మధ్య ఆగాథం !
ఓ వర్గాన్ని టార్గెట్ చేసి మరో వర్గం మద్దతు పొందడమే నేటి రాజకీయం అన్నట్లుగా పరిస్థితి మారింది. విద్వేష వ్యాఖ్యలు ఈ కోణంలోనే పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ రికార్డుల 2014 నుండి 2022 వరకు దేశ వ్యాప్తంగా 878 విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల్లో 54 శాతం విద్వేష ప్రసంగాలకు సంబంధించినవి కాగా, 46 శాతం దాడులవి! ప్రసంగాలతో విషం చిమ్మిన తరువాతే దాడులు జరుగుతూంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2017లో ఈ తరహా సంఘటనలు 284 నమోదయ్యాయి. 2019 నుండి 2022 సంవత్సరాల మధ్య విద్వేష ప్రసంగాల్లో 500 శాతం పెరుగుదల నమోదైంది. దాదాపుగా ఈ అన్ని సంఘటనల్లోనూ ప్రసంగాల తరువాత చెలరేగిన హింసలో తాము టార్గెట్ చేసుకున్న వారిన లక్ష్యంగా చేసుకుంటున్నారు. అనేక ఘటనలు పోలీస్ రికార్డులకు ఎక్కడం లేదు. హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో ముస్లింలను హతమార్చాలంటూ విచ్చలవిడిగా చేసిన ప్రసంగాలపై కూడా స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదు. సైన్యానికి చెందిన ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తోనే ఆ విషయంలో కదలిక ప్రారంభమైంది. ఇలాంటి వాటి వల్ల లబ్ది కలుగుతుందనే రాజకీయం వల్ల చాలా చోట్ల ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి.
దేశ పరిస్థితిపై ఆందోళన చెందుతున్న బుద్దిజీవులు!
దేశంలో రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజల మధ్య పెరిగిపోతున్న విద్వేషం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయం బుద్ది జీవుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్లుపెద్ద ఎత్తు ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితులను వివరిస్తూ లేఖలు రాస్తున్నారు. ఐఏఎస్‌లు ఐపీఎస్‌లే కాదు.. సమాజం పట్ల బాధ్యత.. దేశం పై భక్తి ఉన్న అనేక మంది ఇలాగే తమ అభిప్రాయాలను కేంద్రానికి వినిపించారు. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి అభిప్రాయాలన్నింటికీ రాజకీయ రంగు పులుముతున్నారు. కేంద్రంలో పాలక పార్టీ అయిన బీజేపీని విమర్శిస్తున్నారకుని వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇంత కాలం వారు సంపాదించుకున్న వ్యక్తిత్వాన్ని హననం చేయాడనికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి పరిస్థితుల వల్ల దేశం కోసం మాట్లాడాలనుకునేవారు అంతకంతకూ తగ్గిపోతున్నారు. ఏం జరినా మనకెందుకులే అనే పరిస్థితి వస్తోంది. తాజాగా… ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో పెరిగిపోతున్న విద్వేష ఘటనలపై స్పందించాలని.. తక్షణం చర్యలు తీసుకుని దేశంలో సామరస్యం కాపాడాలని.. ప్రజాస్వామ్య పునాదుల్ని బలోపేతం చేయాలని మాజీ సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. కానీ వారికీ అలాంటి వేధింపులు.. బెదిరింపులు ఎదురవుతున్నాయి.. కానీ వారు చెబుతున్నది నిజమో కాదో.. కాస్త ప్రశాంత వదనంలో ఆలోచించడం లేదు
దేశ ప్రజల్లో ఇప్పటికే కనిపిస్తున్న చీలిక !
భారత దేశం అంటే ప్రపంచంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత భిన్నంతలో ఏకత్వం . ఓ పక్కన గుడి ఉంటుంది.. అదే పక్కన చర్చి ఉంటుంది.. మసీదు ఉంటుంది. ఎవరూ ఎవర్నీ కించపర్చుకోరు. ఎవరూ తమ మతం గొప్పదని గొడవలు పెట్టుకోరు.విదేశీయులు ఎవరైనా మన దేశానికి వచ్చినప్పుడు ఇలాంటి అన్ని మతాల ఆలయాలు ఒకే చోట ఉంటేచాూసి అబ్బుర పడతారు. మత సహనం అంటే ఏంటో ఇండియాను చూసి నేర్చుకోవాలనుకుంటారు. కానీ అది కొన్నాళ్ల క్రితం వరకే. ఇప్పుడేం జరుగుతోంది. రాజకీయాల కోసం.. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. గుళ్లు, ఆలయాలు.. మసీదులు.. చర్చిలు దేన్నీ వదిలి పెట్టడం లేదు. సోషల్ మీడియా సాయంతో ఎప్పటికప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. వారు ఇలాంటి వాటితో రాజకీయంగా బలపడుతున్నారని భావిస్తున్నారు కానీ.. అసలు జరుగుతోంది వేరు. రాజకీయంగా బలపడుతున్నారు కానీ… దేశం బలహీనం అవుతోంది. దేశ ప్రజల మధ్య ఆగాధం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని వారు గుర్తిస్తున్నారో .. గుర్తించనట్లుగా నటిస్తున్నారో స్పష్టత లేదు. ఈ విషయంలో అవకాశం పొందిన ఏ ఒక్క రాజకీయ పార్టీ వెనుకాడటం లేదు. నిన్నామొన్నటిదాకా తెలంగాణ పేరుతో ఆంధ్రులను తీవ్రమైన ద్వేష భావాన్ని తెలంగాణ ప్రజల్లో నింపడం ద్వారా రాజకీయంగా బలపడింది టీఆర్ఎస్ . ఉద్యమం పేరుతో తెలంగాణ మొత్తాన్ని అట్టుడికించింది. కానీ ఇప్పుడు కర్ఫ్యూలు పెడితే పెట్టుబడులు వస్తాయా అని వారే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రాజకీయాల్లో టీఅర్ఎస్ సాధించిన విజయాలు చాలా మందికి స్ఫూర్తి. అది కులమా..మతమా.. ప్రాంతమా అన్నది కాదు.. రెచ్చగొట్టి విజయం సాధించామా లేదా అన్నదే ముఖ్యం. ఎలా గెలిచామన్నది కాదు.. గెలిచామా లేదా అన్నది చూసుకుంటున్నారు. ఫలితంగా గెలుపుకింద జరుగుతున్న ప్రజాస్వామ్య హననాన్ని చూసుకోవడం లేదు.
ప్రజలు మత్తు నుంచి బయటపడితే దేశం.. ప్రజాస్వామ్యం కోలుకుంటుంది !
మనది ప్రజాస్వామ్యం. నేతల్ని మనమే తయారు చేసుకుంటాం. మన పాలకుల్ని మనమే ఎన్నుకుంటాం. నేతలెవరు పుట్టకతో రాలేదు. అందరూ మనం ఎన్నుకున్నవారే. కానీ వారు ఇప్పుడు మన బుర్రల్లోకి చేరి.. భావోద్వేగాలను రెచ్చగొట్టి.. భయపెట్టి.. మరో రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి.. వారినే పాలకులుగా ఎన్నుకోవాలనుకుంటున్నారు. అది ఇప్పుడు వికృత రూపం దాలుస్తోంది. కులం, మతం, ప్రాంతం చుట్టూ తిరుగుతోంది . సోషల్ మీడియా ప్రభావంతో ప్రజలు కూడా సులువుగా ఈ ట్రాప్‌లో పడిపోతున్నారు. వారిని ఓ రకమైన మత్తులో ఉంచి.. ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మత్తు ఎంత దారుణంగా ఉందంటే… ఆ రాజకీయ నాయకుడు అడ్డగోలుగా తప్పు చేసి దొరికినా సమర్థించేంతటి మత్తు ఉంటోంది. అది అవినీతో.. మరొకటో… కాదు.. అడ్డగోలుగా హత్యలు చేసినా సమర్థిస్తున్న దారుణమైన పరిస్థితులు మన కళ్ల ముందు కనిపస్తున్నాయి. అలాంటి వారు పాలకులు అయితే.. ప్రజాస్వామ్యం ఎంత హీన స్థితికి చేరుతుందో చెప్పడం కష్టం. కనిపించేవి అలాంటి వాటికి సాక్ష్యాలే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. వీరందర్నీ ఎన్నుకున్నది ప్రజలే. అయితే అందరూ కాదు. మనదిమెజార్టీ స్వామ్యం. ఎక్కువ మంది ఎవరు ఎన్నుకుంటే వారే. అందుకే.. మెజార్టీ ప్రజలు చైతన్యవంతులుకావాల్సి ఉంది. దేశానికి.. కావాల్సింది.. ప్రజల్ని రక్షించే పాలకులు.. ప్రజల జీవితాల్ని కాపాడే పాలకులు. అలా కాకుండా విధ్వంసం చేసే వారిని ఎన్నుకుంటే ఇప్పటి పరిస్థితులే కనిపిస్తాయి. ఇప్పుడేఇలా ఉంటే ముందు ముందు కట్టు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఈ పరిస్థితుల్ని ముందుగానే ఊహించి.. మనదేశాన్ని మన పాలకుల్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత… మనపైనే ఉంది. దేశాన్ని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
అంతరాత్మ ఇది తప్పు అని చెప్పినా ఇతరుల మెప్పు కోసమో.. తాత్కలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం అని మహాత్మాగాంధీ అంటారు. ఈ విషయాన్ని దేశ భవిష్యత్‌ను నిర్ధారించాల్సిన ఓటర్లు ఒకటికి పది సార్లు మననం చేసుకోవాలి. ఓటును దేశం కోసం ఉపయోగించాలి. అప్పుడే పాలకులు దేశం కోసం పని చేసేవారొస్తారు. దేశ ప్రజల్ని కలిపే వారొస్తారు.