స్వేచ్చ పేరిట విశృంఖలత్వం సమజానికి చేసే హాని అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా యుగంలో ఇది మనుషుల్ని జంతువులుగా మార్చేసింది. ఇప్పుడు మృగాలుగా మార్చేదశకు చేరుకుంది. ఇప్పుడీ విశృంఖల స్వేచ్చకు సంకెళ్లు వేసి బంధించకపోతే రేపు అది ఊహించని దారుణాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తాజా ఉదాహరణే తండ్రి, కుమార్తెల బంధాన్ని విశృంఖలంగా చర్చించుకుని నవ్వుకోవడం. అత్యంత అసభ్యంగా ప్రజల ముందు ఏ మాత్రం తప్పు చేస్తున్నామన్న భావన లేకుండా మాట్లాడుకోవడం. వివాదం అయితే అది కామెడీనే అని సమర్థించుకోడం తప్ప.. అది తప్పు అని గుర్తించే విచక్షణ లేకపోవడం సోషల్ స్వేచ్చ వికృతం గుర్తించలేనంత స్థాయికి వెళ్లిపోయిందని అర్థం చేసుకోవచ్చు.
సమస్య ఒక్క ప్రవీణ్ హనుమంతు కాదు .. అలాంటి వికృత మూర్ఖులు ఎంతో మంది !
ప్రవీణ్ హనుమంతు అనే వ్యక్తి ఐదేళ్ల బిడ్డ, అతని తండ్రిపై చేసిన అసభ్య వ్యాఖ్యలు, దానికి మరో నలుగురు వెకిలిగా నవ్వుకున్న వ్యవహారం సభ్య సమాజాన్ని నివ్వెర పరిచింది. ఇలా ఆలోచిస్తే ఇక చిన్న పిల్లలకూ ఎక్కడ రక్షణ ఉంటుంది. రేపు తమకూ ఓ ఆడబిడ్డ పుడితే ఆ నలుగురి ఆలోచనలు ఎలా ఉంటాయో అంచనా వేస్తేనే ఎంత భయంకరంగా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇలాంటి ఆలోచనలు వారికి ఎలా వచ్చాయంటే.. ఖచ్చితంగా ఆ పాపం సోషల్ మీడియా స్వేచ్చదే. ఈ వ్యూహారంలో ప్రవీణ్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. అందరూ ప్రవీణ్ హనుమంతును అరెస్టు చేశారా..కేసులు పెట్టారా.. అతనితో చర్చ పెట్టుకున్న వారిపై కేసులు పెట్టారా లేదా అన్నది ఫాలో అప్ చేసుకున్నారు తప్ప అసలు సమస్య మూలాల్లోకి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా ప్రయత్నించ లేదు. ప్రవీణ్ హనుమంతును అరెస్టు చేసినా.. కఠిన శిక్షలు వేసినా.. పిల్లల్ని పెంచడానికి అనర్హుడని తేల్చినా.. సమస్య అంతటితో పరిష్కారం కాదు. ఎందుకంటే.. అసలు సమస్యలో ప్రవీణ్ హనుమంతు అనే వాడు.. ఓ చిన్న పీలిక మాత్రమే. అతన్ని పీకేస్తే.. అలాంటి వాళ్లు మరికొంత మంది పుట్టుకు వస్తారు. ఎందుకంటే..ఈ వికృతానికంతటికి బీజం.. సోషల్ మీడియాకు ఉన్న విశృంఖలమైన స్వేచ్చ వల్ల వచ్చింది. తాము ఏదన్నా చెల్లుతుందని భావించే సోషల్ ప్రపంచంలో వీరంతా ఇప్పుడు బతుకుతున్నారు. సభ్య సమాజంలో ఉన్నామని… తమను అన్ని కళ్లూ పరిశీలిస్తూంటాయని.. తమ కన్న తల్లిదండ్రులకు తాము చెడ్డపేరు తెస్తున్నామని వారు తెలుసుకునే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే.. సోషల్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయి ఉంటారు.
అపరిమితమైన స్వేచ్చ – అదే అవకాశంగా సమాజంలోకి విషభావాలు
సోషల్ మీడియా అంటే నియమ నిబంధనలు లేని ప్రపంచం. అడ్డూ అదుపూ లేని వికృతాల ప్రదర్శనకు వేదిక. రీల్స్ పేరుతో యువతీ యువకులు చేస్తున్న వికృతాలు చూస్తే.. మనం ఎంత పాతాళానికి దిగజారిపోతున్నామో అర్థం చేసుకోవడానికి ఎంతో సేపు పట్టదు. చివరికి ఫస్ట్ నైట్ ను లైవ్ పెట్టేస్తున్నామని అంటున్నారు. లైకులు, వ్యూస్ ల మాయలో పడి.. ఏం చేయకూడదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఏమైనా చేయవచ్చని..దాన్ని వీడియోగా మార్చి అందకీ చూపించవచ్చని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారికి జరిగే నష్టం ఏమో కానీ.. వాటిని చూసి ఇతరులు కూడా దారి తప్పుతున్నారు.ఇప్పుడు అదే అసలు సమస్య. మరి ఇలాంటి దాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షిస్తున్నాయి ?. వాటిపై నియంత్రణ ఉండక్కర్లేదా ? . సెన్సార్ లాంటి ఆలోచనలు ఎందుకు చేయడం లేదు ? అని ప్రశ్నిస్తే…అందరూ ప్రజల గొంతు నొక్కేస్తారా అని మీడియా ముందుకు వచ్చేస్తారు. ఇలాంటి స్వేచ్చ అవసరమా అని.. ఒక్కరు కూడా ప్రశ్నించండం లేదు. ఒక టీవీ చానల్ పెట్టాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయి. కోట్లు ఖర్చు పెట్టాలి. లైసెన్స్ తెచ్చుకోవాలి. కానీ ఓ యూట్యూబ్ చానల్ ఓపెన్ చేయాలంటే కేవలం ఈ-మెయిల్ ఐడీ చాలు. ఓ ఎఫ్ఎం చానల్లో వార్తలు ప్రసారం చేయాలన్నా కేంద్రం నుుంచి ఖచ్చితంగా అనుమతి తెచ్చుకోవాలి. కానీ సోషల్ మీడియాలో ఎవరికి వారు వార్తలను ప్రసారం చేయడానికి, వర్గారిటీని ప్రదర్శించి డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. యూట్యూబ్ చానల్స్ పెట్టుకుని సోషల్ మీడియాల్లో ప్రచారం చేసుకుని ఫాలోవర్స్ తెచ్చుకుని తమలో ఉన్న వికృతాన్ని సమాజంపైకి వెదజల్లుతున్నారు. ఇప్పుడు మన ముందు ప్రవీణ్ హనుమంతు కనిపిస్తున్నారు. కానీ అలాంటి వాళ్లు వందలు, వేల మంది ఉన్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా ఫ్రీ కాదు అంతా మనీ ట్రెండింగే !
ప్రవీణ్ హనుమంతు వ్యవహారంంపై యాక్టర్ సాయి దుర్గ తేజ్ ట్వీట్ కారణంగా వెలుగులోకి వచ్చింది. అత్యంత జుగుప్సాకరంగా ఉండటంతో అందరూ స్పందించారు. తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు.. వెంటనే నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అరెస్టు కూడా చేశారు. ఇంతటితో సమస్య పరిష్కారం కాలేదు. దొరికింది ఒక్కరే. ఇలాంటి బ్యాచ్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వీరు చేసే అరాచకాలకు అనేక మంది ఇన్ల్ఫూయెన్స్ అవుతున్నారు. ఒకరి తర్వాత ఒకర్ని అందర్న అరెస్టు చేయడం సాద్యమేనా ?. అరెస్టు చేసినా సమస్య పరిష్కారమవుతుందా అంటే.. ఎవరూ కూడా అవుతుందని చెప్పలేరు. సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదని చాలా మంది చెబుతూ ఉంటారు. నిజమే ప్రతి దానికి మంచి చెడూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియాకూ ఉన్నాయి. కానీ సోషల్ మీడియా వల్ల జరిగే మంచి కూడా చెడుగా మారుతోంది. అదే సమస్య. ప్రజా చైతన్యం కోసం ఉపయోగించాల్సిన సోషల్ మీడియా .. పూర్తిగా సమాజాన్ని కలుషితం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. రాజకీయ పార్టీల చేతుల్లో వైరల్ కంటెంట్ టూల్ గా మారిపోయింది. నచ్చని వాళ్లపై ద్వేషాన్ని పెంచేలా చేయడం, వ్యతిరేకతను పెంచడానికి.. మహిళల పై ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెట్టడం సెలబ్రిటీలను బూతులు తిట్టడం. ఇలా సోషల్ మీడియాలో జరిగే అకృత్యాలకి అడ్డు అదుపే లేకుండా పోయింది. కనీసం చిన్న పిల్లలు అనే ఇంగితం కూడా లేకుండా వారిపై కూడా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరు ఎటు పోతే ఏంటి.. అతనికి వ్యూస్ కావాలి. అతని వాదన హైలైట్ కావాలి. అందుకు ఏమైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారు. సభ్య సమాజంతో పని లేదు.. తమ మైండ్లో ఉన్న చెత్తనంతా సోషల్ మీడియాలోకి డంప్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఎంత వికృతంగా తయారైందో.. ఇన్ఫ్లూయన్సర్ల ముసుగులో ఎలాంటి నరరూప రాక్షసులు ఉన్నారో దాన్ని అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది.
సోషల్ స్వేచ్చకు సంకెళ్లు వేయాల్సిన సమయం
సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం పెద్ద తప్పేమీ కాదు. కానీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో.. ఏం అన్నా తమనేం చేయలేరన్న ధీమా వచ్చేస్తుందో అప్పుడు అన్నీ అదుపు తప్పుతాయి. కామెంట్లు కంట్రోల్ తప్పుతాయి. ఇప్పుడు అలాంటి ప్రమాదం ముంచుకొచ్చేసింది. కొద్ది రోజుల కిందట చెన్నైలో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. తన కూతుర్ని సరిగ్గా చూసుకోలేదని ఓ వీడియో కారణంగా ట్రోల్ చేయడంతో భరించలేక నిర్ణయం తీసుకుంది. చెప్పుకుంటూ పోతే అనేక మంది ట్రోల్స్ కి బలవుతున్న వారే. ఇలాంటి వికృతాలు ప్రతీ రోజూ బయటపడుతున్నాయి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ప్రభుత్వానికీ తెలుసు. మరి పరిష్కారం ఏమిటో ఎందుకు ఆలోచించడం లేదు. స్వేచ్చ పేరుతో విశృంఖలత్వానికి పాల్పడటం నేరం. కానీ ఏది స్వేచ్చ, ఏది విశృంఖలత్వం అన్నది తేల్చే గీత ఇప్పుడు కావాలి. స్వీయ నియంత్రణ అనే మాట వినిపిస్తూ ఉంటారు. అది సోషల్ మీడియాకు వర్తించదని గతి తప్పిపోతున్న ఘటనలు నిరూపిస్తున్నాయి. దీన్ని అలా వదిలేస్తే సమాజం పూర్తిగా కలుషితం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే.. ముందుగా ప్రభుత్వాలు మేలుకోవాలి. స్వేచ్చ అనే గీతను దాటకుండా… కట్టుదిట్టమైన నియంత్రణ ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అయితే ఇలంటి వికృతాలను కూడా స్వేచ్చ అని వాదించే వికృత ప్రజాస్వామ్య వాదులు మన చుట్టూనే ఉండటం అసలు విషాదం. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే.. గొంతు నొక్కేసినట్లేనని ప్రచారం చేస్తూంటారు. నిజానికి ఇప్పుడు ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉండే సోషల్ మీడియాలో స్వేచ్చ లేదు. ఇప్పుడు ప్రధాన సోషల్ మీడియాలన్నీ వైరల్ కంటెంట్ అమ్ముకుంటున్నాయి. ఎవరైనా వ్యక్తి ఓ వీడియోను వైరల్ చేయాలంటే డబ్బులిచ్చి చేసుకుంటున్నారు. ప్రజలు దాన్ని చూసి అదే నిజమనుకుంటున్నారు. అది స్వేచ్చ ఎలా అవుతుంది. ఇప్పుడు నిజంగా.. సోషల్ మీడియాలో వచ్చే విప్లవాలు పూర్తిగా కృత్రిమమైనవే. ఒక్కటీ నిజమైనది ఉండదు. ఓ వ్యాపార కంపెనీపై దాడి చేయాలంటే.. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి.. తప్పుడు ప్రచారం చేసేస్తారు. ఇలాంటి ఘోరాల మధ్య ఎప్పుడో ఓ సారి .. ప్రజాసమస్యలపై స్పందనలు వస్తూంటాయి. నిజానికీ అలాంటి ఉద్యమాల్లోనూ తెలియని ప్రయోజనాలతో కొంత మంది గూడుపుఠాణి చేస్తూంటారు. ఏ నినాదం వెనకు ఎవరి ప్రయోజనం ఉందో సోషల్ మీడియా యుగళంలో అంచనా వేయడం చాలా కష్టం. అయితే ఆ ఘోరాల మధ్య.. సమాజాంలో మనుషుల్ని మృగాలుగా మార్చే.. ఆలోచనలను మొద్దుపరిచే.. జంతువులకు.. మనుషులకు తేడా లేకుండా చేసే భావజాలం కూడా ఈ సోషల్ మీడియా వ్యాప్తి చేస్తోంది. ఇది మరింత ప్రమాకరంగా మారుతోంది.
సోషల్ క్యాన్సర్ పట్టేసింది.. నివారణే మార్గం !
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. ఏదైనా శ్రుతి మించితే అనర్థమే. ఇప్పుడు సోషల్ మీడియా స్వేచ్చ కూడా అతి దాటిపోయింది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది. మేల్కోవాల్సింది ప్రజలు, ప్రభుత్వాలే. సోషల్ వికృత స్వేచ్చకు కట్టడి చేసలా కఠిన చర్యలు తీసుకునేలా ప్రజలు ప్రభుత్వానికి మద్దతివ్వాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలించుకోకపోయినా కనీసం.. ఎక్కడిది అక్కడ ఆపగిలిగితే.. మన పిల్లలు.. మన కుటుంబాలు అయినా..కాస్త ప్రశాంతంగా ఉంటాయి. లేకపోతే.. అరాచక సమాజానికి దగ్గర దారి చూసుకుని అందులో దూకినట్లవుతుంది. అది కుటుంబ వ్యవస్థను… పిసిపిల్లల జీవితాలనూ ప్రశ్నార్థకం చేస్తుంది. అది అనాగరికత ప్రపంచానికి దారి తీస్తుంది. అలాంటప్పుడు మరో కల్కి పుట్టినా బాగు చేయలేనంత దీన స్థితికి మనం వెళ్లిపోతాం. ఇప్పుడు మేల్కోవడమే ముఖ్యం.