“ రాజకీయాల్లో బలం ఎంత అన్నది ముఖ్యం కాదు .. ఆ బలాన్ని ఎంత బలంగా ప్రత్యర్థిని కొట్టడానికి ఉపయోగించుకుంటామన్నదే సక్సెస్ ఫార్ములా”. ఈ ఫార్ములాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పక్కాగా పట్టుకున్నారు. ఆయన శ్రేయోభిలాషులమని.. అభిమానులమని.. పార్టీ నేతలమని చెప్పి ఆయనను దారి తప్పించేందుకు ఎంతో మంది ప్రయత్నించినా ఆయన తన బలాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించారు. ఇవాళ తన పార్టీ జయకేతనాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో అడుగులు ఆవేశంతో కాదు ఆలోచనతో వేయాలని పవన్ కల్యాణ్ నేర్చుకున్న పాఠం ఇవాళ రాష్ట్రంలో మార్పులు తెచ్చింది.. రాజకీయాల్లో మార్పులు తెచ్చింది. పవన్ రాజకీయ జీవితంలో మార్పులు తెచ్చింది.
పదవులు కాదు బాధ్యతతో పెట్టిన పార్టీ జనసేన
పన్నెండేళ్ల కిందట పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. రాజకీయాల్లోకి రావాలంటే.. కొత్త పార్టీ పెట్టాలంటే.. ఎన్నికలకు ఓ ఆరు నెలల ముందు అయినా పార్టీ పెట్టడం ఎవరైనా చేసే పని. కానీ పవన్ కల్యాణ్ ఆలోచన ఎప్పుడూ పార్టీ పెడితే ఎన్నికల్లో పోటీ చేసేయాలి.. పదవులు సంపాదించుకేసుకోవాలన్న పాయింట్ దగ్గర టార్గెట్ ఆగిపోదు. అంతకు మించి ఉంటుంది. అందుకే ఎన్నికల్లో పోటీ టార్గెట్ గా జనసేనను పెట్టలేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే మరి ఎందుకు పార్టీ అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అందుకే పవన్ ..తన బలాన్ని అప్పటికీ పొత్తులోకి వెళ్లిపోయిన టీడీపీ, బీజేపీకి మద్దతుగా ఇచ్చారు. అప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. ఆయనకు దేశవ్యాప్త మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో పవన్ కూడా వెళ్లి నరేంద్రమోదీకి మద్దతు పలికారు. తర్వాత ఏపీలో ఎన్డీఏ కూటమికి సపోర్టు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల ఆయనకు రాజకీయంగా సీరియస్ నెస్ లెదన్న అభిప్రాయానికి వచ్చిన వారు ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ తన స్టైల్ రాజకీయాలు తాను చేశారు. ఎప్పుడూ రాజకీయంగా తప్పు చేశాను అన్న భావనకు రానివ్వలేదు. ఇతర పార్టీలు విమర్శలు గుప్పించినా.. వ్యక్తిగత దాడులు చేసినా తగ్గలేదు. పవన్ కల్యాణ్‌కు పార్టీ నడపడం ఎప్పుడూ పూలపాన్పు కాలేదు. నిజం చెప్పాలంటే ఆయన సినిమాల్లో సంపాదించి రాజకీయం చేశారు. సొంత నిధుల్ని పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. 2014-18 మధ్య ఎన్డీఏ కూటమికి సపోర్టుగా ఉన్నప్పటికీ… ఆ తర్వాత ఆయన కూడా సొంత రాజకీయం చేసుకున్నారు. తన బలం ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. అందుకే ఒంటరిపోటీ చేశారు. వివిధ కారణాల వల్ల ఆయనకు గట్టి ఎదురుదెబ్బలు 2019లో తగిలాయి. మరొకరు అయితే .. ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడటం అసాధ్యమయ్యేది.
పవన్‌కు ఆవేశమే కాదు ఆలోచన కూడా ఉంది !
పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్, ఆయన ఐడియాలజీకి ఉన్న ఫ్యాన్స్ తక్కువేమీ కాదు. ఆ క్రేజ్ కు తగ్గట్లుగా 2019 ఎన్నికల ఫలితాలు వచ్చి ఉండకపోవచ్చు కానీ ఆయనను ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. భారతీయ జనతా పార్టీ ఏపీలో తమ పార్టీని విస్తరించుకునేందుకు పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేసుకుంది. చాలా సార్లు విలీన ప్రతిపాదనలను విభిన్న వ్యక్తుల ద్వారా పవన్ ముందు పెట్టింది. అయితే పవన్ కల్యాణ్ ప్రాణం పోయినా సరే తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేసేది లేదన్న పాలసీకే కట్టుబడి ఉన్నారు. పవన్ కల్యాణ్ రెండు, మూడు సార్లు తనకు బీజేపీ నుంచి వచ్చిన విలీన ప్రతిపాదనల గురించి చెప్పారు. అప్పట్లో బీజేపీ ఇంచార్జ్ గా ఉన్న సిద్దార్థనాథ్ సింగ్ పవన్ తో ఈ అంశాన్ని డీల్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ నిర్మోహమాటంగా ఉండటంతో తర్వాత విరమించుకున్నారు. జనసేన పార్టీ ఎప్పటికీ ఉంటుందని.. అది ఇతర పార్టీల్లో విలీనమయ్యే ప్రశ్నే ఉండదని పవన్ ఖరాఖండిగా చెప్పారు. పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని వ్యూహాత్మక తప్పిదాలు, అప్పట్లో పార్టీలో ఉన్న నేతల వ్యక్తిగత స్వార్థాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ అక్కడే అసలైన రాజకీయ పాఠం నేర్చుకున్నారు. రాజకీయంగా గుర్తింపు ఉండాలంటే.. సొంత బలాన్ని కాపాడుకోవాలని తెలుసుకున్నారు. అందుకే ఆయన ఎక్కడా తగ్గలేదు. తన పార్టీని పెంచుకుంటాను కానీ ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చేశారు. ఆ పట్టుదలే ఆయనను ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడిగా మార్చింది. అదే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసి ఉంటే… ఆ పార్టీ పెద్ద ఒత్తిడికి తలొగ్గి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. ప్రజాబలం లేని ఆ పార్టీ లోని కొంత మంది నడమంత్రపు నేతలకే ఎక్కువ ప్రయారిటీ లభించేది. ఎందుకంటే జాతీయ పార్టీల రాజకీయాలు అలాగే ఉండేవి. పవన్ కల్యాణ్ అక్కడే తన పట్టుదల చూపించారు. తిరుగులేని పొజిషన్లో ఉన్న బీజేపీ నుంచి వచ్చిన విలీన ఆఫర్ ను తిరస్కరించి తన పార్టీని కాపాడుకున్నారు. ఆ తర్వాత సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నారు.
2019లో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలసి పోటీ చేద్దాం రమ్మని ఎన్నికలకు ముందు కూడా పిలిచారు. పవన్ రాజకీయ లెక్కల్లో ఎంత గొప్పగా ఉంటారో ఆయన తీసుకున్న నిర్ణయమే తర్వాత తర్వాత నిరూపించింది. చంద్రబాబు పిలిచినా వెళ్లలేదు. కమ్యునిస్టులు, బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. అయితే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. అందరూ ఆయన ఘోరంగా ఓడిపోయారని అన్నారు. కానీ అది ఆయనకు గొప్ప విజయానికి బాటలు వేసింది. ఒక వేళ 2019లో టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. అప్పట్లో ఉన్న రాజకీయం ప్రకారం వైసీపీ ఖచ్చితంగా గెలిచి ఉండేది. టీడీపీ, జనసేన కలిసినా సరే జగన్ గెలిచారన్న అభిప్రాయం ఉండేది. కానీ పోటీ చేయకపోవడం వల్ల 2024కి .. జగన్ పై వచ్చిన వ్యతిరేకతకు.. రెండు పార్టీలు కలిస్తే ఇక జగన్ తుడిచి పెట్టుకుపోతారన్న అభిప్రాయం వచ్చింది. అదే 2019లో కలసి పోటీ చేసి ఉంటే 2024లో అంత ఎఫెక్ట్ కనిపించేది కాదు. అదే వ్యూహం.. పవన్ కల్యాణ్‌లో తొందరపాటు లేని రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ఆ నిర్ణయమే .. మెల్లగా నిరూపించింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి ఉంటే భవిష్యత్ లో జగన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా దక్కడమూ గగనమే అనుకుంటున్నారు. ఎందుకంటే..కూటమిని అంతగా బలోపేతం చేసుకున్నారు.
పార్టీనే గుర్తింపు – పార్టీనే బలం
పవన్ రాజకీయ ఆలోచనలకు.. స్థిరత్వానికి 2024 ఎన్నికలు ఓ సాక్ష్యం. ఆయన స్పష్టమైన లక్ష్యంతో ఉన్నారు. తన బలానికి కూటమిగా తయారైతే వచ్చే ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయని అంచనాకు వచ్చారు. అందుకే ఆయనను మునగచెట్టు ఎక్కించేసి.. జుగన్ నెత్తిన పాలు పోసేందుకు ప్రయత్నిచిన శ్రేయోభిలాషుల ముఠా ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఆయన తగ్గలేదు. పైగా తన నిర్ణయాలను ఆమోదించేవారే తన వారని .. వ్యతిరేకించేవారు తన వారు కాదని తేల్చి చెప్పారు. ఆయనతో ఉన్న వారికి రాజకీయ భవిష్యత్ ను కల్పిస్తున్నారు. జనసేన పార్టీని, పవన్ ను కేవలం ఓ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు సిద్ధపడిన కొంత మంది నేతలు.. వైసీపీ మాయలో పడి కనుమరగైపోయారు. పోతిన మహేష్ తో పాటు మరికొంత మంది నేతలు వైసీపీ లాలూచీ రాజకీయంతో జనసేనను ఇబ్బందిపెట్టాలని చూశారు. కానీ వారే కనిపించకుండా పోయారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. ఎక్కడ ఆవేశ పడాలో.. ఎక్కడ సంయమనంతో వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే కూటమి మరో పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఓ రకమైన వైసీపీ ప్రభావానికి లోనయ్యే పార్టీ క్యాడర్ ఎప్పుడూ ఉంటారు. కానీ వాస్తవంలో ఆలోచించి.. రాజకీయ వ్యూహాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసుకోవడం అత్యంత కీలకం. పవన్ కూటమి విషయంలో అలాగే ఉన్నారు. తన వల్లే గెలిచామని కూటమిలో ఏ పార్టీ అనుకోకూడదు. కలసి కట్టుగా ఉండటం వల్ల గెలిచామని అనుకోవాలి. అలాంటి వాతావరణాన్ని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేస్తున్నారని అనుకోవచ్చు.
భవిష్యత్‌కు దిశానిర్దేశం
పార్టీ పెట్టిన తర్వాత నిర్వహిస్తున్న ప్లీనరీల్లో ఇది అత్యంత ఉత్సాహంతో జరుగుతున్న ప్లీనరీ. పోటీ చేసిన ప్రతీ చోటా గెలిచిన అద్భుత రికార్డును సాధించిన పార్టీగా ఇప్పుడా జనసేన ట్రెండింగ్ లో ఉన్న పార్టీ. ఈ విజయం సాధించడానికి జనసైనికుల శ్రమ ఉంది. అందుకే జయకేతనం సభకు వచ్చే వారందరికీ పవన్ కల్యాణ్ కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలని నిర్ణయించారు. సాధారణంగా ప్లీనరీలు నిర్వహించేటప్పుడు పార్టీలు తమ ప్రతినిధులకు.. పార్టీ పదవుల్లో ఉన్న వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తాయి కానీ.. జనసేన పార్టీ మాత్రం కార్యకర్తలకు కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని ఏర్పాట్లు చేసింది. కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు జనసైనికులకు పవన్ కల్యాణ్ కర్తవ్యబోధ కూడా చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని ఇప్పుడు చక్కదిద్దే బాధ్యత కూటమిపై ఉంది. ఆ కూటమిలో కుటుంబంలో ఉన్నన్ని సమస్యలు ఏర్పడవచ్చు. అది సహజం కూడా. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం కాకుండా.. సమన్వయ సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు చర్చించుకుని సర్దుకుపోతే.. కుటుంబం లాగే కూటమి కూడా ఎల్లకాలం మనగలుగుతుంది. కూటమిని విచ్చిన్నం చేస్తేనే తప్ప తమకు రాజకీయ మనుగడ ఉండదనుకుంటున్న పార్టీలు.. అందు కోసం ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తాయి. ఎంత అడ్డగోలు పుకార్లు అయినా పుట్టిస్తాయి. అలాంటి వాటికి కూటమి నేతలు ప్రభావితం కాకూడదు. ముఖ్యంగా జనసేనాని ఈ అంశంపైనే క్యాడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎవరూ పార్టీ గీత దాటి వద్దని.. అధికారంలో ఉన్నామన్న అహంకారాన్ని చూపవద్దని..బాధ్యతగా ఉండాలని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో గీత దాటే వారిని పార్టీకి ఎంత బద్దులైనా చెడ్డపేరు తెచ్చే వారిని ఉపేక్షించే అవకాశం లేదని కూడా ఇప్పటికే చేతల ద్వారా పవన్ సందేశం పంపించారు.
ఇప్పుడు పవన్ తన పార్టీ ద్వారా జయకేతనం ఎగురువేశారు. ఈ జయకేతనం సుదీర్ఘకాలం ఉండేలా చూసుకునేలా ఆయన ఈ ప్లీనరీ ద్వారా దిశానిర్దేశం చేసుకుంటారనడంలో సందేహం లేదు. పాతికేళ్ల భవిష్యత్ కోసం రాజకీయాల్లోకి వచ్చాయనే పవన్… జనసేన భవిష్యత్ ను ఎంత ఉజ్వలంగా ఉంచితే.. ప్రజల భవిష్యత్ ను అంత బాగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా పవన్ తన జనసైన్యాన్ని రెడీ చేస్తారనడంలో సందేహం లేదు.