రైల్వే ఉద్యోగాల ఎగ్జామ్ కోసం ఎవరైనా దక్షిణాది నుంచి బీహార్ వెళ్తే కొట్టి పంపేసేవారు. బీహార్ దాకా ఎందుకు ఒరిస్సాకు వెళ్లి పరీక్షలు రాసేంత ధైర్యం లేదు. చివరికి కర్ణాటకు కూడా. కానీ దేశం నలుమూలల నుంచి ఆంధ్రకు ఇక్కడ ఆంధ్ర అంటే.. ఉమ్మడి రాష్ట్రం అనుకోవచ్చు.. వచ్చి.. పరీక్షలు రాసుకుని ఉద్యోగులు తెచ్చుకుని స్థిరపడితారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రలోని ముఖ్యమైన పట్టణాలు హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి చోట్ల కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో ఎక్కువ మంది పర రాష్ట్రీయులే కనిపిస్తారు. తెలుగోళ్లకి ఎవరికీ రోషం రాలేదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రోళ్లు ఎక్కువగా ఉద్యోగాలు సాధించారన్న ప్రచారం కారణం కారణంగా కోపం వచ్చింది. అది రాష్ట్ర విభజన ఉద్యమానికి కారణం అయింది. చివరికి ఇలా మిగిలాం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దేశం మొత్తం తెలుగు వాళ్లు ధైర్యం అవకాశాలు వెదుక్కోవడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగువాడు బీహార్‌లో అడుగు పెట్టగలనని నిరూపించే సమయం ఆసన్నమయింది. ఒక్క బీహార్ కారు కర్ణాటక, బెంగాల్, కశ్మీర్… మణిపూర్ .. త్రిపుర .. చివరికి గుజరాత్‌లోనూ తెలుగువాడు అడుగు పెట్టబోతున్నాడు. తెలుగువాడు పెట్టిన పార్టీ అక్కడ దుమ్ము రేపడానికి సిద్ధమయింది. ఇప్పటి వరకూ మనం చెప్పుకుంది భారతీయ రాష్ట్ర సమితి గురించే. ఇంకా గుర్తింపు రాలేదు కాబట్టి … అధికారికంగా నోటిఫై అయ్యే వరకూ ఆ పార్టీ టీఆర్ఎస్సే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి.. పేరుతో జాతీయ రాజకీయాల గురించి చర్చించుకుంటే బాగుండదు కాబట్టి మనం భారత్ రాష్ట్ర సమితిగానే చెప్పుకుందాం. కేసీఆర్ ప్రకటించిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తెలుగువారి జాతీయ పతాకగా నిలవడానికి దండయాత్ర ప్రారంభించబోతోంది.
బీఆర్ఎస్ను కామెడీ చేస్తున్న వారే ఎక్కువ !
కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెడుతున్నారంటే.. అదేదో బిల్డింగ్ రెగ్యూలరైజేషన్ స్కీమ్ లా ఉందని సెటైర్లు వేసేవారు కొందరైతే.. బార్ అండ్ రెస్టారంట్ పార్టీ అని ఎగతాళి చేసేవాళ్లు కొందరున్నారు. బీఆర్ఎస్తో ఇక కేసీఆర్‌కు వీఆర్ఎస్ ఇచ్చినట్లేనని కొంత మంది జోస్యం చెబుతున్నారు. అనే మాటలు ఎప్పుడూ అనే వాళ్లు ఉంటారు కానీ కేసీఆర్ ప్రయత్నాలను మాత్రం తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే కేసీఆర్ హిస్టరీ అంత కామెడీగా లేదు. ఆయన మాటలు చాలా వరకూ నవ్వు తెప్పించవచ్చు కానీ.. ఆ మాటల మంత్రాలతోనే అనుకున్నది సాధించిన రాజకీయ నేత. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవుతుందని ఒక్కరంటే ఒక్కరూ ఊహించలేదు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంటేనే తెలియని తరానికి ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వారిలో తెలిసేలా చేసి .. ఉద్యమాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెరవేర్చారు. ఒకటికి రెండు సార్లు తాను తెచ్చిన రాష్ట్రానికి పాలకుడయ్యారు. ఆయన ఉద్యమం ఎలా చేశాడనే దానిపై చాలా మంది పెదవి విరుస్తూ ఉంటారు. ఆయన ఆంధ్రుల్ని తిట్టారని.. ఆంధ్ర ద్వేషాన్ని పెంచారని.. బడుగు బలహీనవర్గాల పిల్లలను ఆత్మహత్యలకు పురికొల్పారని.. దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేశారని.. ఇలా అనేక రకాల ఫిర్యాదులు చెబుతారు. ఆయన విచ్చిన్నవాది అంటారు. అవన్నీ నిజమే కావొచ్చు.. కానీ నేటి రాజకీయాల్లో అందరి ఆయుధాలు అవే. భారతీయ జనతా పార్టీ .. రెండు అంటే రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా సాధ్యం కానంత తిరుగులేని స్థానానికి ఎలా చేరింది ?. సింపుల్. కేసీఆర్ పాటించిన వ్యూహమే. కేసీఆర్‌ది తెలంగాణ అయితే.. బీజేపీది హిందూ. కేసీఆర్‌ది ఆంధ్ర ద్వేషమైతే.. బీజేపీది ముస్లిం ద్వేషం… కేసీఆర్‌ది తెలంగాణ సెంటిమెంట్ అయింతే.. బీజేపీతో జైభారత్ సెంటిమెంట్ .. ఇలా ప్రతీ దానికి పోలికలు ఉన్నాయి. ఎవరి స్థాయిలో వారు ఆ మాయలో ప్రజల్ని పడేయగలిగారు. అందుకే కేసీఆర్‌ను తప్పు పట్టలేము.. బీజేపీని తప్పు పట్టలేము.. ఆ సెంటిమెంట్లను సృష్టించుకోలేకపోయిన ఇతర పార్టీలనూ తప్పు పట్టలేము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్లదే గెలుపు. వాళ్లేం చేసినా ప్రజలు ఆమోదించారనే అనుకోవాలి. కాబట్టి రాజకీయాల్లో అల్టిమేట్‌గా గెలుపే మాట్లాడుతుంది. ఎలా గెలిచారన్నది కాదు.. గెలిచారా లేదా అన్నదే ముఖ్యం.
నిరాయుధుడిగా బీజేపీని ఎదుర్కోవడానికి వెళ్తున్న కేసీఆర్!
కేసీఆర్ ఇప్పుడు తనదైన రాజకీయంతో బీజేపీని ఎదుర్కోవడానికి జాతీయ స్థాయికి వెళ్తున్నారు. అందుకోసం ఆయన సాహసం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆయన విజయానికి కారణం అయిన తెలంగాణ సెంటిమెంట్‌ను వదిలేస్తున్నారు. అంటే ఆయుధాలను వదిలేసి … యుద్ధం చేయడానికి వెళ్తున్నారన్నమాట. తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటి వరకూ ఆయనపై ఎవరెన్ని విధాలుగా దండయాత్రలు చేసినా కాచుకుంది. కానీ ఇప్పుడు కేసీఆర్.. దేశంలో రాజకీయాలు చేయడానికి తన సెంటిమెంట్‌ను వదిలేసుకుంటున్నారు. ఇది ఎంత క్లిష్టమైన నిర్ణయం అంటే.. తేడా వస్తే తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. దేశంలోని ప్రజలు పట్టించుకోరు. అంటే రెంటికి చెడ్డ రేవడి అవుతుంది. ఇంత కాలం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు.. రాజకీయ ఉన్నది.. అంతా మట్టి కొట్టుకుపోతుంది. తానో సాధారణ నాయకుడిగా నిలబడిపోతారు. తెలంగాణ సాధించారన్న పేరు కూడా ఇవ్వడానికి అప్పుడు ఉద్యమకారులు సిద్ధపడకపోవచ్చు. అంటే సర్వం కోల్పోతారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియనిదేం కాదు. అయినా సరే ఆయన నిరాయుధుడిగా మారి యుద్ధానికి వెళ్తున్నారు. ఆయితే తెలంగాణను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు.. ఆ స్థాయి ఆయుధాలు తయారు చేసుకున్నానని ఇప్పుడు అంతకు మించి ఆయుధాలు రెడీ చేసుకుంటానన్నే నమ్మకం కేసీఆర్‌లో ఉండి ఉండవచ్చు. రైతుల సెంటిమెంట్.. జై జవాన్- జై కిసాన్ నినాదం వంటి వాటితోనే చరిత్ర సృష్టిస్తానని ఆయన నమ్మకం కావొచ్చు. తెలంగాణలో తాను అద్భుతమైన అభివృద్ధి చేశానని ఆ అభివృద్ధిని దేశం అంతటా విస్తరిస్తానని కేసీఆర్ చెబుతున్నారు. దానికి తెలంగాణ మోడల్ అని పేరు పెట్టారు. నిజానికి తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలన్నీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో వెనుకబడే ఉన్నాయి. తెలంగాణకు వచ్చే ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు మెట్రో సిటీలు ఉన్న చాలా రాష్ట్రాలకు ఆదాయం ఆయా నగరాల నుంచే వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో అలాంటి నగరం ఒక్కటీ లేదు. ఢిల్లీ, ముంబై తర్వాత చెప్పుకునే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మూడు దక్షిణాదిలోనే ఉన్నాయి. ఇక అహ్మదాబాద్ కానీ.. కోల్ కతా కనీ..లక్నో కానీ జనాభా పరంగా సిటీలయ్యాయి కానీ ఉపాధి అవకాశాల పరంగా మెట్రోలు కాలేదు. అయితే కేసీఆర్ హైదరాబాద్‌ను చూపించి అన్ని రాష్ట్రాల ప్రజల మనసుల్ని గెలవాలనుకుంటున్నారు. అందులో తప్పు లేదు. అలా నమ్మించగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది.
ఎక్కడైనా ఆయన కాసిన్ని ఓట్లు సాధించడం కూడా సవాలే !
దక్షిణ భారత రాజకీయాలు.. ఉత్తర భారత రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకం. ముందే చెప్పుకున్నట్లుగా ఉద్యోగ పరీక్షలు రాయడానికే మనోళ్లను ఉత్తదారిలో రానివ్వరు. ఇక రాజకీయ పార్టీ పెట్టి పెత్తనం చేస్తానంటే రానిస్తారా ? చాన్సే లేదు. అయితే కేసీఆర్ తాయిలాల వ్యూహం పాటిస్తున్నారు. రైతు సంఘాల్ని పిలిచి ప్రగతి భవన్‌లోనే రాచమర్యాదలు చేసి పంపించారు. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తులు. వారి వల్ల లాభం ఏమిటి అనేది తర్వాత సంగతి కానీ.. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు ప్రతినిధులు దొరికినట్లే అనుకోవాలి. ఇప్పుడు ఉత్తరాదిలో కేసీఆర్ పార్టీకి కనీసం పునాదులు వేయాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడటానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. దక్షిణ భారత రాజకీయం మరింత భిన్నం. అక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ బలంగా ఉన్నాయి. ఓ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ఎవరూ అంగీకరించరు. పార్టీలే కాదు ప్రజలు కూడా అగీకరించరు. ఎదుకంటే అన్ని రాష్ట్రాలు తమ సొంత వ్యక్తిత్వాన్ని కోరుకుంటాయి. బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ కదా అనే డౌట్ రావొచ్చు… కానీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ను పొరుగు రాష్ట్రాలు.. దక్షిణాది వారు జాతీయ పార్టీగా అసలు అంగీకరించరు. ఎవరో కొంత మంది ఓట్లు వేయవచ్చు కానీ.. ప్రభావ శీలంగా పార్టీ మారే అవకాశం ఉండదు. కానీ కేసీఆర్ చెప్పినట్లు రాజకీయాలు కొంత మందికి క్రీడ అయితే తనకు మాత్రం టాస్క్ అని మనం కూడా అంగీకరించాలి. కేసీఆర్ చాలా అంటే చాలా కలసి రాని పరిస్థితుల్లో పార్టీని పెట్టాడనికి తాను ఈ పార్టీని టాస్క్‌గా తీసుకోవడమే కారణం అనుకోవచ్చు.
తెలంగాణ లాంటి అద్భుతాలు ప్రతీసారి జరగవు..కానీ కేసీఆర్‌కు నమ్మకం ఉంది !
అయితే కేసీఆర్ తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారో ఓ సారి సమీక్షించుకోవాల్సి ఉంది. పిడికెడు మందితో ప్రారంభించి తాను తెలంగాణ సాధించానని.. అదే పద్దతిలో దేశంలో ఎందుకు సంచలనం సృష్టించకూడదని ఆయన తనపై తాను అపరిమితమైన నమ్మకం పెట్టుకుని ఉండవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం .. ఓ సందర్భంలో పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. కానీ ఒకే ఒక్క ఘటనతో అందిపుచ్చుకున్నారు. దాన్ని కేసీఆర్ చెప్పే సమైక్యాంధ్ర పాలకులు అణచివేయడంలో నిర్లక్ష్యం చూపారు. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయో లేదో కానీ.. ఉద్యమం కేసీఆర్ చేతుల్లోకి వచ్చింది అనుకున్నది సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ ఉద్యమం పీక్స్ చేరడం అద్భుతం. అలాంటి అద్భుతాలు వందేళ్లకో .. వెయ్యేళ్లకో జరుగుతాయి. చేయాలనుకుని చేయడం సాధ్యం కావు. కానీ కేసీఆర్ అలాంటి అద్భుతాన్ని తాను మరోసారి చేయగలనని గట్టి నమ్మకంతో ఉన్నారు. నమ్మకమే ఏ విజయానికైనా పునాది. ఈ విషయంలో కేసీఆర్ సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ కేసీఆర్ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఆయన విజయమో వీర స్వర్గమోతేల్చుకుంటారు.. కానీ మరో రకమైన కారణాలతో ఈ రాజకీయాలు చేస్తూంటే మాత్రం… మధ్యలో చెప్పుకున్నట్లుగా కేసీఆర్… సర్వం కోల్పోతారు.. పేరు ప్రతిష్టలతో సలహా. ఆయన దిగ్గజ నేతగా ఉండాలనే కోరుకుందాం…! బెస్టాఫ్ లక్ కేసీఆర్ !