“భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం” అంటూ ఒకప్పుడు సాగిన నక్సల్ ఉద్యమం చీలికలు.. పేలికలై చిక్కిపోయినా .. ఇప్పటికీ ఉనికి చాటుకుంటూనే ఉంది. ఇక్కడ ఉనికి అంటే.. ఒక్కటే…అదను చూసి బలగాల్ని లేదా ప్రముఖుల్ని హతమార్చడమే ఉనికి చాటుకోవడం. నక్సలైట్లను చంపాలని పోలీసులు… తమను చంపేందుకు వస్తున్న పోలీసుల్ని చంపాలని నక్సలైట్లు అదే పనిగా ఓ రకమైన యుద్ధవాతావరణం ఏర్పాటు చేసుకోవడంతో నక్సల్ ప్రభావిత ప్రాంతాల అడవులు ఎప్పుడూ సరిహద్దుల్ని తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం ఎప్పుడూ ఉంటోంది. దీనికి పరిష్కారం ఏమిటి..? అలా ఒకరినొకరు చంపుకుంటూ పోవడం ఇంకెన్నాళ్లు..? ఎవరైనా పరిష్కారం దిశగా ఆలోచించారా..?
అడవిలో పోతున్న ప్రాణాలు ఎవరివి..?
బలగాలను ట్రాప్ మరీ నక్సల్స్ చంపేశారని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎలా ట్రాప్ చేశారో కూడా చెబుతున్నారు. అయితే… తమను చంపడానికి వేల మంది దండులా విరుచుకుపడితేనే తాము ఎదురుదాడి చేశామని నక్సల్స్ చెబుతున్నారు. ఎవరి వాదన కరెక్ట్.. ఎవరి వాదన తప్పు అన్నది కాదు… అసలు పోయిన ప్రాణాలకు ఎవరిది బాధ్యత అన్నది క్వశ్చన్. మావోయిస్టులు చెప్పినట్లు బలగాలతో తమకు శత్రుత్వమేదీ లేదు. అలాగే… బలగాలకు మావోయిస్టులతో శత్రుత్వమేదీ లేదు. ఉన్నదల్లా సిద్ధాంతాల మధ్య యుద్ధమే. మావోయిస్టులు.. ప్రజాస్వామ్య ప్రభుత్వంపై నమ్మకం లేక… తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాగించాలన్న లక్ష్యంతో ప్రజలకు దూరంగా అడవుల్లో పోరాడుతూంటారు. ఆ అడవులకు వెళ్లి అయినా వారందర్నీ తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బలగాలు ప్రయత్నిస్తూంటాయి. తరచి చూస్తే రెండింటి మధ్య రాజ్యాధికార పోరాటం ఉంటంది. ప్రజాస్వామ్య వ్యవస్థను నక్సల్స్ నుంచి కాపాడాలని బలగాలను అడవుల్లోకి పంపుతున్న ప్రభుత్వాలు అనుకుంటూ ఉంటాయి. కానీ ఆ బలగాలను నిర్మూలిస్తే..రాజ్యాధికారం వచ్చేస్తుందన్న భ్రమలో మావోయిస్టులు ఉంటూంటారు. కానీ రెండింటిలో ఏదీ కూడా ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని మాత్రం రెండు వర్గాలు గుర్తించడానికి సిద్ధపడటం లేదు. ఫలితంగా ఆ హింస నిరంతరం సాగుతూనే వస్తోంది.
ప్రాణానికి ప్రాణం తీస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందా..?
“మావోయిస్టులను దెబ్బకు దెబ్బ తీస్తాం.. చూస్తూ ఊరుకోం..!” .. ఇది భారత హోంమంత్రి గారి స్పందన. సుక్మా అడవల్లో మావోయిస్టులు ఎటాక్ చేసి ఇరవై మూడు మంది జవాన్లను చంపేశారని తెలిసిన తర్వాత హోంమంత్రి అమిత్ షా…. అంతకు అంత దెబ్బతీస్తామని ప్రకటించారు. సీఆర్పీఎఫ్ చీప్… మావోయిస్టు నేత హిడ్మా లాంటి వారు చరిత్రలో కలిసిపోతారని హెచ్చరించారు. వీరి స్పందన…కన్నుకు కన్ను అన్న పద్దతిలోనే ఉంది కానీ.. సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ఉందా అన్నదే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు చత్తీస్ ఘడ్ అడవుల్లో మావోయిస్టు కంచుకోట లాంటి ప్రాంతాలకు బలగాలు వెళ్లడానికి అవకాశం ఎక్కడ ఉంది..?. అక్కడ మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాల్ని నడుపుతున్నారు. గ్రామాల వారీగానో.. క్లస్టర్ల వారీగానో చూసుకుని.. జనతన సర్కార్లు నడుపుతున్నారు. వారు సొంతంగా స్కూళ్లు, హాస్పిటల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం.. బలగాలు అంగీకరించడానికి సిద్ధపడకపోవచ్చు. కానీ అడవల్లో ఉంటున్న కొన్ని వందల గ్రామాల ప్రజలకు ఆ మావోయిస్టులే పాలకులు. వారే ప్రజల కనీస అవసరాలు వీలైనంత వరకూ తీరుస్తున్నారు. అక్కడ ప్రభుత్వం అంటే… చత్తీస్ ఘడ్ ప్రభుత్వమో… భారత ప్రభుత్వమో కాదు. మావోయిస్టుల ప్రభుత్వమే. ఇలాంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల వరకూ ఉండటం ఆశ్చర్యం అయితే… ఇప్పుడు కూడా… ఆ సమస్యను అర్థం చేసుకోకుండా.. నిర్మూలించేస్తామని ప్రకటించడమే పాలకుల హ్రస్వదృష్టికి నిదర్శనంగా కనిపిస్తోంది.
చంపుకుంటూ పోతే రాజ్యాధికారం వచ్చేస్తుందా..?
మావోయిస్టు నేత హిడ్మానో… లేక ఉన్నత నాయకత్వం అయిన ఆర్కేనో… లేక నక్సలైట్ల కమిటీ మొత్తాన్నో తుడిచి పెట్టేస్తే మావోయిస్టులు అంతరించిపోతారా..?. అది సాధ్యం కానే కాదు. ఆ విషయం ఇప్పటికే స్పష్టమయింది. ఇప్పటికే మావోయిస్టు నాయకత్వం తరాలు మారింది. పాత నాయకత్వం వృద్ధతరమైపోయింది.. ఇక ఏమీ చేయలేరనుకుంటున్న సమయంలో హిడ్మా లాంటి వాళ్లు… సవాల్ చేస్తున్నారు. అవకాశం వచ్చింది కాబట్టి హిడ్మా వెలుగులోకి వచ్చాడు… కానీ మావోయిస్టు సిద్ధాంతాలో ఆకర్షణకు గురవుతున్న వారిలో అలాంటి నేతలు ఎంత మంది ఉంటారో చెప్పడం కష్టం. ఇక్కడ సమస్య సిద్ధాంతం ద్వారానే కానీ.. హిడ్మానో.. ఆర్కేనో కాదు. అందుకే.. వారిని నిర్మూలించడం వల్ల మావోయిస్టుల సమస్య అంతం కాదు సరి కదా.. వారి వీరమరణం స్ఫూర్తితో మరికొంత మంది ఆ వైపు ఆకర్షితులవుతారు. ఇప్పటి వరకూ జరిగింది ఇదే. జరుగుతోంది కూడా ఇదే. మొన్నటి ఎదురు కాల్పుల్లో ఇరవై మూడు మంది జవాన్లే కాదు…. నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయారు. వారి అంత్యక్రియలకు అడవిజనం అంతా వెల్లువలా వెళ్లడమే వారికి అక్కడ ఉన్న ఆదరణ చూపిస్తోంది. ప్రభుత్వానికి పెద్ద బలగం ఉంటుంది. కావాలనుకుంటే సైన్యాన్ని కూడా దింపేసి… అడవులపై విరుచుకుపడొచ్చు. మావోయిస్టు అన్న వాడ్ని పట్టుకుని కాల్చి పడేయవచ్చు. అలా మావోయిస్టు అన్న ముద్ర ఉన్న ప్రతి ఒక్కరినీ నిర్మూలించినా.. మావోయిస్టు ఉద్యమం అంతమవుతుందా..? ఈ విషయాన్ని పాలకులు తమ గుండెమీద చేయి వేసుకుని చెప్పగలరా…? అలా నిర్మూలించడం అంటే పేదరికాన్ని నిర్మూలించడమే అవుతుంది. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా భారత్లో నలభై శాతానికి మందికిపైగా బిలో పావర్టీ లైన్.. బీపీఎల్ కేటగిరీ కిందనే ఉన్నారు. కానీ ఎందుకు నిర్మూలించలేకపోయారు. ఈ పేరుతో పేదలను నిర్మూలిస్తే..పేదిరకం అంతమయిపోతుందన్న ఆలోచన చేయడం ఎంత ఫూలిష్గా ఉంటుందో… అడవుల్లో మావోయిస్టుల పేరుతో తిరుగుతున్న వారిని అంతం చేస్తే మావోయిజం అంతమైపోతుందని అనుకోవడం కూడా అంతే అవుతుంది.
మద్దతు కోల్పోతున్న మావోయిస్టులు ఆలోచించరా..?
మావోయిస్టులు చేసే పనుల్ని ఎవరూ సమర్థించరు. ఇప్పుడు సమాజంలో వారిని అసలు సమర్థించరు. ఒకప్పుడు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని ప్రకటించి.. ప్రజల మద్దతు పొందిన రాజకీయ నేతలున్నారు. సుమారు యాభై ఏళ్లుగా తెలుగునేలపై నక్సలిజం వేళ్లూనుకుంది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా దాని ఉనికిని ప్రదర్శిస్తూ, సరిహద్దు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఒకప్పుడు గ్రామాల్లో భూస్వాముల ఆగడాలు, వెట్టి చాకిరీలు, స్త్రీలపై అత్యాచారాలు, నిమ్నకులాలపై దౌర్జన్యం వంటి వాటిల్ల్లో బాధితులకు నక్సల్స్ అండగా నిలిచారు. అందుకే్ అప్పట్లో బాధిత వర్గాలు వారికి తోడు నిలిచాయి. అన్నం పెట్టాయి, ఆశ్రయమిచ్చాయి. నిజానికి నక్సలైట్ల నాయకత్వం… తమ కుటుంబాలను… సంబంధాలను… ఇహపర సౌఖ్యాలను వదిలేసి.. అడవులకే పరిమితమయ్యారు. వారి జీవితాన్ని వారు నమ్ముకున్న సిద్ధాంతానికే అప్పగించారు. వారిది నిజమైన లక్ష్యంతో కూడిన త్యాగం. అందుకు వారిని అభినందించాల్సిందే. కానీ తమ లక్ష్యం కోసం వారు ఎంచుకున్న మార్గమే తప్పనేది చాలా మంది అభిప్రాయం. అడవుల్లో తుపాకీ గొట్టం పట్టుకుని .. కనిపించిన బలగాల మీద కాల్పులు జరపడమో.. రహస్యంగా పట్టణాలకు వచ్చి రాజకీయ నేతల్ని అంతమొందించడం ద్వారానో విప్లవం రాదు. ఒకప్పుడు ప్రజల్లో నక్సలైట్ల పట్ల సానుభూతి ఉండేది. ఇప్పుడు అది లేదు. దీనికి కారణం మావోయిస్టులు వేసిన హింసాత్మక తప్పటడుగులే. కారణం లేకుండా ప్రజాప్రతినిధుల్ని చంపేశారు. బలగాల్ని హతమార్చారు. ఇన్ని చేస్తున్న వారిని … బలగాలు చంపేస్తే తప్పు లేదన్న ఓ అభిప్రాయాన్ని వారే కల్పించుకున్నారు. అందుకే సంయమనంతో ఉండాల్సిన హోంమంత్రి వంటి వారు.. అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అంతర్గత యుద్ధంలో బలిపశువులు భారత పౌరులే..!
యుద్ధం పోలీసులు, నక్సలైట్ల మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. పోలీసులు చేసే ఎన్కౌంటర్ ఒక్కటి కూడా నిజం అని ప్రజలు నమ్మరు. నక్సలైట్ల పట్టపగలు హత్యలు కోర్టులో రుజువుకానట్లే పోలీసుల చిత్రహింసలకు,కాల్చివేతలకు ఆధారాలు ఉండవు. ఈ క్రమంలో ఇరువైపులా జరుగుతున్న దాడుల్లో ఓసారి నక్సలైట్లయితే, మరోసారి పోలీసు జవాన్లు చనిపోతున్నారు. అంతా పక్కకుపోయి ఈ తూటాలకు బడుగువర్గాల కుటుంబ సభ్యులే సమిధలవుతున్నారు. విప్లవం, ఉద్యమ నిర్మాణం, ప్రజల మద్దతు కూడగట్టడం ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఉన్నదల్లా ఏరివేత, కాల్చివేతలే. దీనివల్ల వాస్తవ పీడిత వర్గాలకు లాభించేది శూన్యం. పోలీసు, సీఆర్పీఎఫ్ జవాన్లు చాలావరకు కింది తరగతులలో ఆర్థిక బలహీనులే. వేరే గతిలేక ప్రాణాలను గాలిలో దీపంలా పెట్టి నాలుగు డబ్బుల కోసం, కుటుంబ పోషణ కోసం ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎదురెదురైనప్పుడు నక్సల్స్ వారిని కాల్చకపోతే, జవాన్లు నక్సల్స్ని కాల్చుతారు. బలయ్యేది అటు మావోయిజమో… ఇటు ప్రజాస్వామ్యమో కాదు.. ! భారత పౌరుల ప్రాణాలే.
చర్చలే అన్ని సమస్యలకు పరిష్కారం..!
ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలే అన్ని సమస్యలకు పరిష్కారం. మావోయిస్టులు తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బందీగా చిక్కిన రాకేశ్వర్ శర్మను.. తమ జనతన సర్కార్ల ప్రజాకోర్టులో ప్రవేశ పెట్టి వదిలి పెట్టారు. ఇందు కోసం పదకొండు మంది మధ్యవర్తులు వెళ్లారు. అంటే ఇరువర్గాలు విశాలంగా ఆలోచించి చర్చలు జరపాల్సి ఉంది. ఎప్పటికైనా ప్రజాస్వామ్యానిదే పైచేయి అని మావోయిస్టులు తెలుసుకోవాలి. ఎంక మంది బలగాలను చంపేసినా అంతకు రెట్టింపు వస్తారు కానీ తగ్గదు. అదే సమయంలో మావోయిస్టులు ఎవరి కోసం పోరాడుతున్నారో.. ఆ ప్రజలు కూడా పలు కారణాలతో దూరం జరుగుతున్నారు. మావోయిస్టు చర్యల లక్ష్యం ఏమిటి? వారు చేసే ఒక దాడికి, మరో దాడికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ చర్యల వెనక ఉన్న హేతుబద్ధత విషయమై వారి మద్దతుదారులకు కూడా స్పష్టత లేదు. ప్రజలపై యాజమాన్యం ఎవరిది అనే అంశంపై జరుగుతున్న ఈ పోరాటంలో రాజ్యానిదే ఎప్పటికీ పైచేయిగా ఉంటుంది. మావోయిస్టులు ఎప్పటికీ ప్రభుత్వేతర శక్తులుగా, చట్టవిరుద్ధ శక్తులుగా ఉంటారు. ఈ విషయాన్ని మావోయిస్టులు గుర్తించాల్సి ఉంది.
దేశానికిఉద్యమాలు కొత్త కాదు. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. జరుగుతున్నాయి. ప్రస్తుతం రైతుల ఉద్యమం జరుగుతోంది. ఎవరూ ఆయుధాలు పట్టలేదు. తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేదు. అక్కడే సమస్య వస్తోంది. ప్రభుత్వం కూడా మావోయిస్టులను నియంత్రించడానికి హింసే మార్గం అనుకుంటోంది. రెండు వర్గాల్లోనూ మార్పు వస్తేనే… హింస తగ్గుతుంది. కొన్ని వందల ప్రాణాలు నిలబడతాయి. భారత ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ఈ దిశగా ముందుగా మావోయిస్టులు ఆలోచన చేయాలి… ప్రభుత్వం కూడా మావోయిస్టులంటే చంపేయడానికి అర్హులనే విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే… అరణ్యరోదనం కాస్త తగ్గుతుంది.