“ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు ఏదైనా వందకు వంద శాతం కరెక్ట్. దాన్ని ఎవరైనా శిరసావహించాల్సిందే.”. ప్రజలే ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పదనం ఇదే. ప్రజా తీర్పు వల్ల ఎలాంటి పరిణామాలు జరిగినప్పటికీ వారి తీర్పును ఎవరూ తప్పు పట్టలేరు. వారిచ్చిన తీర్పును దుర్వినియోగం చేసిన వారిదే అసలు తప్పు. తప్పు చేస్తున్నారు అని ప్రజలు అప్పుడప్పుడూ సంకేతాలు పంపుతూ ఉంటారు. వాటిని గుర్తించాల్సింది ప్రజలు బాధ్యతలు ఇచ్చిన వాళ్లే. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అటు అధికార పార్టీలకు.. ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు సందేశం గట్టిగానే పంపించారు. ప్రభుత్వం అంటే కేవలం పాలకపక్షం కాదు.. ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలో భాగమే. ప్రతిపక్షానికీ బాధ్యతలు ఉంటాయి. వారి బాధ్యతలు ప్రజల్ని మెప్పించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఇదే సంకేతాలను ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ ఫలితాలపై పార్టీలు ఏం నేర్చుకుంటాయి ?
తెలంగాణలో ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ఓ టీచర్ ఎమ్మెల్సీని, హోరాహోరీ పోరులో మరో పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీకి ఇవి అద్భుతమైన ఫలితాలే. టీచర్ ఎమ్మెల్సీగా గెలవడం అంటే.. టీచర్లలో పట్టు సాధించాలి. వారి సంఘాలు, సమస్యలు వేరుగా ఉంటాయి. అయినా అక్కడ బీజేపీ విజయం సాధించింది. తెలంగాణ లో చదువుకున్న వారిలో భారతీయ జనతా పార్టీ ఇమేజ్ రాను రాను మెరుగుపడుతోందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సాధించిన ఎనిమిది అసెంబ్లీ సీట్లలో ఏడు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. అలాగే ఎంపీ స్థానాల విషయంలోనూ అత్యధికంగా ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే గెలిచారు. అలాంటి చోట .. పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీని కూడా గెలుచుకున్నారు. ఓ రకంగా ఇది తెలంగాణలో బీజేపీ పాతుకుపోతోందనడానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత మెరుగుపడలేదని ..పాలన విషయంలో ప్రజల్ని మెప్పించలేకపోతున్నారని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఉండే సమస్యే అది. రాక రాక అధికారంలోకి వచ్చిన పార్టీ అంతర్గత రాజకీయాలతో ఇబ్బంది పడుతోంది. ముఖ్యమంత్రి స్వేచ్చగా పని చేయలేకపోతున్నారని అంటున్నారు. ఆయన కాళ్లూ, చేతులూ కట్టేసినా పథకాల అమలు భారం మాత్రం ఆయనదే. ఈ పథకాల సుడిగుండంలో చిక్కుకున్న రేవంత్..తాను తెలంగాణను ఎలా మార్చుకోవాలని కలలు కన్నారో.. వాటి దిశగా అడుగులు వేయడానికి అసలు అవకాశమే దొరకడం లేదు. హైడ్రాతో ఆక్రమణలన్నీ తొలగించేసి.. నాలాలు పెద్దవి చేసి వరదలు రాకుండా చేయాలనుకున్నారు. కానీ చేసిన కొద్దిపాటి పనికే సీఎంకు బురద అంటుకుంది. మూసిని ప్రక్షాళన చేద్దామనుకున్నారు. ఆర్థిక వెసులుబాటు దక్కడం లేదు. ఫోర్త్ సిటీ గురించి ఏడాదిగా చెప్పడమే కానీ ఇంత వరకూ మాస్టర్ ప్లానూ రెడీ చేయలేకపోయారు. కానీ సంక్షేమం విషయం వచ్చే సరికి గతంలో చేయనంత చేశారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశారు. రైతు బంధు ఇచ్చారు. వరి సన్నాలకు బోనస్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. గత పదేళ్లలో జరగనంత సంక్షేమం ఇప్పుడే జరిగిందని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయినా ఎందుకు అసంతృప్తి కనిపిస్తోంది. అర్హులకు మాత్రమే తమ పథకాలు వస్తాయని అనర్హులు ఆశలు పెట్టుకోవద్దని ముందుగా అందర్నీ సిద్దం చేయలేదు. అందుకే సమస్యలు వచ్చాయి.
నిజానికి పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరప రాజయం పాలవ్వలేదు. చివరి వరకూ పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు కాస్త తగ్గించుకుని ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేవారు. బీసీ నినాదం ఎత్తుకున్నప్పుడు.. కులగణన పేరుతో లాభం పొందాలనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నియమించాలి?. కాంగ్రెస్ పార్టీకి ప్రసన్న హరికృష్ణ అనే బలమైన బీసీ అభ్యర్థి అందుబాటులో ఉన్నారు. కానీ చివరికి నరేందర్ రెడ్డిని ఖరారు చేశారు. బీజేపీ కూడా రెడ్డి అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రసన్న హరికృష్ణ కూడా బీఎస్పీ తరపున బరిలోకి నిలిచారు. బీసీ నినాదం నేపధ్యంలో ఆ వర్గం ఓట్లు చాలా వరకూ ఆయన చీల్చారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు.. ఆ పార్టీని ఆ పార్టీనే ఓడించుకుంటుందని చెప్పుకునే జోక్‌ను నిజం చేసుకున్నారని అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఉండే సమస్య అదే. గెలవడానికి కలసి పనిచేయరు.. ఎవరో ఒకర్ని చూసి ప్రజలు గెలిపిస్తే.. మళ్లీ ఓడిపోయే దాకా కష్టపడతారు. ఇలాగే ఉంటే.. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని ప్రజలు సంకేతాలు ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ దీని నుంచి పాఠాలు ఎంత త్వరగా నేర్చుకుంటుందన్నదానిపైనే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇక ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఇలా చేయకపోవడానికి ఆ పార్టీకి ఉన్న కారణాలేమిటో తెలియదు కానీ..బీజేపీకి మాత్రం మెల్లగా తన ప్రాణాన్ని ధారబోస్తోంది. బీజేపీ ఎంత బలపడితే బీఆర్ఎస్ కు అంత ప్రమాదకరమని ఎన్నికల ఫలితాలే చాటి చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ సగానికిపైగా బీజేపీకి తరలి పోయింది. బీఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తే..వారి ప్లేస్‌ను బీజేపీకి ఇచ్చేందుకు మొహమాటపడే అవకాశమే ఉండదని ప్రజలు గట్టి సంకేతాలే పంపారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది భారతీయ రాష్ట్ర సమితినే. వారు బీజేపీతో పోరాడటం కాకుండా.. కాంగ్రెస్ తోనే పోరాడతాం అంటే.. వారు చేసే ప్రతి పోరాటానికి మైలేజీ బీజేపీకి వస్తుంది. రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారికి దీనిపై స్పష్టత ఉంటుంది.
తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పాలనను పదేళ్లు చూశారు. కాంగ్రెస్ పార్టీ పాలనను ఐదేళ్లు చూస్తారు. రేపు తీర్పు ఇవ్వాలనుకుంటే బీజేపీ నేతలు కళ్ల ముందు ఉంటారు. దశాబ్దాలుగా వారు.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటున్నారు. ప్రజలు ఎప్పుడూ కొత్త వారికే అవకాశం ఇవ్వాలనుకుంటారు .. ముఖ్యంగా ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా కొత్త ప్రత్యామ్నాయానికే చాన్స్ ఇస్తారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయం సాధించడం వెనుక ఉన్న కారణం అదే. ఏ రాజకీయ పరిణామం చూసినా.. వారు కాకపోతే వీరు.. వీరు కాకపోతే వారు.. అనేకరాజకీయాల్లో కి బలమైన ప్రత్యామ్నాయం వస్తే ప్రజలు ఏకపక్షంగా వారిపై మొగ్గు చూపుతారు. అలాంటి చాయస్లోకి బీజేపీ వస్తోందని.. ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ చేతులెత్తేస్తే.. కాంగ్రెస్ విసుగెత్తిస్తే.. తమకు బీజేపీ ఉందనే సంకేతాలు పంపారు. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఫలితాల నుంచి ఎంత నేర్చుకుంటాయన్నదాన్ని బట్టి తెలంగాణ రాజకీయ మార్పులు ఆధారపడి ఉంటాయని అనుకోవచ్చు.
ఏపీలో కూటమికి తిరుగులేని భరోసా
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి కంగారు కంగారుగానే పోటీ చేసింది. దీనికి కారణాలు ఉన్నాయి. వైసీపీ అరాచకాలు, అవినీతిపై అనుకున్న విధంగా చర్యలు తీసుకోలేదన్న అసంతృప్తిలో టీడీపీ క్యాడర్ అసంతృప్తిలో ఉంది. ఖచ్చితంగా పోలింగ్ ముందు జీవీ రెడ్డి ఇష్యూ వచ్చింది. ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడంతో టీడీపీ క్యాడర్ ఓటింగ్ కు దూరంగా ఉండాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో సహజంగా ప్రభుత్వంపై ఉండే అసంతృప్తి ప్రభావం చూపుతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి తిరుగులేని మద్దతు ఇచ్చారు. దేశ చరిత్రలో ఏ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ రాని విధంగా ఒక్కో స్థానంలో ఎనభై వేలకుపైగా ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అరవై ఐదు శాతం మంది పట్టభద్రులు కూటమి పై ఏ మాత్రం భరోసా తగ్గలేదని నిరూపించారు. అయితే ఇక్కడ ప్రజల్ని కూటమి పార్టీలు టేకిట్ ఈజీగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మద్దతు ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా కాదు. ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. టీచర్స్ ఎన్నికల్లో కూటమి మద్దతిచ్చినప్పటికీ.. బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి విజయం సాధించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ సంఘాల ఆధిపత్య పోరాటం. వాటి మధ్యలో పార్టీలు వెళ్లకూడదు. కానీ వెళ్లడం వల్ల ఇబ్బందిపడ్డారు. ఇది ఓ రకంగా టీచర్లు నేర్పిన గుణపాఠమే. నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఇచ్చారు ఓటర్లు. విపక్ష పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఖచ్చితంగా పరువు పోతుందని తెలుసు కాబట్టే వారు దూరంగా ఉన్నారు. పోటీ చేసినా పెద్దగా మార్పేమీ ఉండేది కాదు. అదే పరాభవం వారికి ఎదురయి ఉండేది. తాము పోటీ చేయకపోయినా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతిచ్చారు. అయితే వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. వారి మద్దతు లేకపోతేనే కొంత మంది మద్దతుగా ఉంటున్నారు కానీ.. వైసీపీ సపోర్టర్లు అన్న ముద్ర పడితే.. ఘోరంగా ఓడిస్తున్నారు జనాలు. దానికి లక్ష్మణరావే ఉదాహరణ. గతంలో అరవై వేల ఓట్ల తేడాతో గెలిచిన ఆయన ఇప్పుడు వైసీపీ పరోక్ష మద్దతు ఇచ్చినప్పటికీ ఎనభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీకి ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా విడాకులు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నారు.
కూటమికి సపోర్టుగా ఉంటామని అభివృద్ధి, సంక్షేమంతో పాటు సుపరిపాలన అందించాలని పట్టభద్రులు ఏకపక్షంగా కూటమి వైపు మద్దతుగా నిలిచారు. దీన్ని తాము అజేయులం అన్న భావనకు వచ్చేలా చేసుకుంటే..కూటమి వెనుకడుగులు అక్కడినుంచే ప్రారంభమయినట్లు. ప్రజా తీర్పు నుంచి ఎప్పుడూ నేర్చుకోవాల్సిన పాఠాలు .. ప్రజల కోణంలోనే ఉండాలి కానీ.. తమ గొప్పతనం అనుకునే లీడర్లు చాలా వేగంగా పతనమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా రాజకీయ నేతలకు అదే సందేశాన్ని ఇచ్చాయి.