” భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం “. ఇందులో వంద శాతం నిజం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన.. ప్రజల చేత.. ప్రజల కొరకు.. ఏర్పడే ప్రభుత్వాలు పాలన చేయడం. మన దేసంలో కూడా ప్రజలే ఎన్నుకుంారు. చాలా దేశాలతో పోలిస్తే.. ముఖ్యంగా పాకిస్థాన్ తో పోలిస్తే ఎంతో మెరుగైన పరిస్థితుల మధ్యనే ఎన్నికలు జరుగుతాయి. ఇంత వరకూ మనం సంతోషించాల్సిందే. కానీ ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యానికీ లేని విధంగా భారత ప్రజాస్వామ్యానికి డబ్బు వైరస్ పట్టింది. అది కొద్ది కొద్దిగా ప్రజాస్వామ్య విలువల్ని తినేస్తూ పోతోంది. ఈ డబ్బు ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే.. ఓటర్లు కూడా డబ్బులిస్తేనే ఓటు వేస్తామన్నంతగా వైరస్ పాకిపోయింది. రాజకీయ పార్టీలు వందలు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అధికారికంగా పెట్టే ఖర్చు గోరంత.. కానీ అనధికరికంగా పెట్టే ఖర్చు కొండంత. ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చు కనీసం రూ. యాభై నుంచి వంద కోట్లు వరకూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇంత ఖర్చులో అత్యధికం ఓట్లు కొనడానికే వెచ్చిస్తున్నారు. కొనుక్కున్న ఓట్లతో వచ్చే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అవుతుందా.. ఆ వ్యవస్థ ప్రజాస్వామ్యమే అవుతుందా ?.
ప్రభుత్వ ఎన్నికల నిర్వహణ ఖర్చు స్వల్పమే !
దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియతో పాటు నాలుగు రాష్ట్రాల ్సెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ఎన్నికలు నిర్వహించడం అంత సులువేమీ కాదు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ మరింత సుదీర్ఘ ప్రక్రియ. ఏడు విడతలుగా నిర్వహిస్తోంది ఈసీ. 1951లో ఎన్నికల ఖర్చు కేవలం 10 కోట్లు. 2014 నాటికి అది 3,870 కోట్లుగా ఉంది. కానీ…2019 వచ్చే సరికి ఇది ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. 1952 నుంచి 2019 వరకూ చూస్తే ఈ వ్యయం 5 రెట్లు ఎక్కువైంది. ఈ పదేళ్లలో ఇంత మార్పు రావడానికి కారణం EVMల నిర్వహణకు అయ్యే ఖర్చు పెరగడం. 2004 నుంచే వీటి వినియోగం ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ బడ్జెట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన పద్దులో .1,891 కోట్లు కేటాయించింది. ఇది కూడా చాలదన్న వాదనలు వినిపించడం వల్ల ఆ బడ్జెట్‌ని మరి కొంత పెంచింది. అయితే వంద కోట్ల మంది ఓటర్లు ఉన్న భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణకు ఆ మొత్తం ఖర్చు ఎక్కువేం కాదు..చాలా స్వల్పమే.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పెట్టే ఖర్చే అసలైన ఖర్చు !
ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎలా చూసినా కేంద్రానికి రూ. ఐదువేల కోట్ల లోపే ఉంటుంది. కానీ రాజకీయ పార్టీ పార్టీలు అంతకు పది రెట్లు ఖర్చు పెడతాయి. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు కలిసి రూ. 55 వేల కోట్లు ఖర్చు చేశాయని అంచనా వేసంది. ఈ ఎన్నికల్లో ఆ ఖర్చు రూ. లక్ష కోట్లు దాటవచ్చని అంచనా. సభలకు జనాలను సమీకరించడం నుంచి వాళ్లను ఇంట్లో దిగబెట్టేంత వరకూ అన్ని ఖర్చులూ పార్టీలే భరిస్తుంటాయి. ఏపీలో వైసీపీ ఆర్టీసీ బస్సులు వాడుకున్నందుకు నగదు రూపంలో రూ. ఇరవై కోట్లు చెల్లించింది. కానీ సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తున్న సభలకు .. కేవలం ఆర్టీసీ బస్సుల కోసమే రూ. వంద కోట్లు బిల్లు చేసినట్లుగా అంచనా వేయవచ్చు. ఒక్కో సభకు పన్నెండు వందల బస్సులు బుక్ చేసుకుంటున్నారు. ఇది కేవలం ఆర్టీసీ బస్సుల ఖర్చే. ఇక మిగతా ఖర్చుల గురించి లెక్కలేస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వరకూ ఎన్నో తయారు చేయించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ తడిసి మోపెడవుతుంది. ఇవి కాకుండా ఆఫీస్‌ల రెంట్, కరెంట్ బిల్స్ అదనం. ఇలా చిల్లర మల్లర అన్నీ కలుపుకుని బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక అసలైన ప్రచారానికి అయ్యే ఖర్చుల గురించి అంచనా వేయడం కష్టం. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ 75 రోజుల పాటు కొనసాగింది. ఈ సారి ఎన్నికల ప్రక్రియ 80 రోజులకు పైగానే ఉంది. ఈ గడువు పెరిగే కొద్దీ ఖర్చులూ పెరుగుతున్నాయి. భారీ బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది. వీటికీ ఖర్చులు గట్టిగానే పెట్టాల్సి వస్తోంది.
ఓట్ల కొనుగోలు అసలైన ఉత్పాతం
ఒకప్పుడు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండేది. అప్పుడు నియోజకవర్గాలు తక్కువగా ఉండడం వల్ల ఆ మేరకే ఖర్చులు అయ్యేవి. కానీ…ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 543 నియోజకవర్గాలకు మొత్తంగా 8 వేల మందికి పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 670కి పార్టీలు పోటీలో ఉంటున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే…ఈ మొత్తం ఖర్చుల్లో మూడో వంతు ప్రచారానికి అవుతుండగా…మిగతాది ఓటర్లకు ఇస్తున్న తాయిలాలకు సరిపోతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓటర్లు ఏ పార్టీ ఎంతిస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఇది అనైతికం అన్న విషయం తెలియంది కాదు. కానీ అటు పార్టీలు ఇవ్వడం అలవాటు చేశాయి. ఇటు ఓటర్లూ తీసుకోడానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఓటర్లు తమకు డబ్బులివ్వకపోతే ఓటు వేయమనే స్థాయిలో చైతన్యవంతులయ్యారు. ఈ పాపం ఖచ్చితంగా రాజకీయ పార్టీలదే. ఓట్లు కొనాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడే భారత ప్రజాస్వామ్యానికి వైరస్ పట్టింది. అది అంతకంతకూ కొత్త పుంతలు తొక్కుతూ పోతోంది.
పథకాల పేరుతో కొనుగోళ్లు – పార్టీల కొనుగోళ్లు
ప్రస్తుతం రాజకీయ పార్టీలు రెండు రకాలుగా కొనుగోళ్లు చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల రూపంలో డబ్బులు పంచి ఓట్లు వేయాలని అడగడం అందులో మొదటిది. ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బులు పంచడం రెండోది. ఎలక్షనీరింగ్ అనే పదానికి అర్థం ఇప్పుడు మారిపోయింది. ఎలక్షనీరింగ్ అంటే.. ఓట్లను కొనుగోలు చేయడం. ప్రభుత్వ పథకాలు ఎంత ఇచ్చారు.. ఎంత మేలు జరిగిందనేది. పోలింగ్ రోజు ఓటర్లకు గుర్తు ఉండదు. ఏ రాజకీయ పార్టీ ఎంత ఇచ్చారన్నదే చూసుకుంటారు. రాజకీయ నేతల అవినీతి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయాల్లో..వారు ఎన్నికలకు వచ్చిన సమయంలో ఎంతో ఇస్తారని ఆశ పెట్టుకుంటున్నారు. ఒక్కో ఓటుకు ఐదు నుంచి పదివేల రూపాయలు ఎక్స్ పెక్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సారి అది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేకు గ్రామస్థాయిలో నాయకులు నమ్మకంగా ఉండేవారు ఇప్పుడు గ్రామ స్థాయి నాయకులు తమ నాయకుడి దగ్గర నుంచి ఎంతో కొంత ఆశిస్తున్నారు. దానికి కారణం ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే సంపాదించుకుంటున్నారు కానీ తాము ఏమీ సంపాదించుకోవడం లేదన్న భావనే. ఇది అంతకంతకూ పెరిగిపోతోంది. చివరికి వేరే పార్టీ నేత డబ్బులు ఇస్తే.. తన అనుచరులతో ఓటేస్తారన్న భావనతో తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తున్నారు. ప్రస్తుతం రాజకీయపార్టీల నేతలు ఓటుకు డబ్బులు తీసుకోవద్దని చెప్పడం లేదు. తీసుకోండి.. తీసుకుని మాకే ఓటు వేయండని ప్రచారం చేస్తున్నారు. ఓటర్లుకూడా వారికి పూర్తిగా ట్యూన్ అయిపోయారు. అన్ని పార్టీలవాళ్లూ డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇవ్వకపోతే ధర్నాలు కూడా చేస్తున్నారు.
అంతే లేని రాజకీయ అవినీతి వల్లే ఈ దుస్థితి !
రాజకీయ పార్టీలకు, రాజకీయ నేతకు ఈ డబ్బంతా ఎలా వస్తుంది ?. ఈ ప్రశ్న సగటు ఓటర్ వేసుకుంటే సమాధానం లభిస్తుంది. అదంతా ప్రజల డబ్బే. అధికారం అండగా చెలరేగిపోయి.. విచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు. ఓ సామాన్యుడు ఓ నాలుగు లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే.. అంత సొమ్ము ఎక్కడిదని నోటీసులు పంపే దర్యాప్తు సంస్థలు ఓ రాజకీయ నాయకుడు సులువుగా వేల కోట్ల ఆస్తులు కూడబెడితే ఎక్కడిదని ప్రశ్నించవు. ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా రాసిచ్చేసి.. ప్రతిఫలంగా తన సంస్థల్లోకి పెట్టుబడులుగా పనికి రాని షేర్లను అమ్మేసి లంచాలు తీసుకుంటే మన వ్యవస్థలు ఏమీ చేయలేవు. మద్యం, ఇసుక పేరుతో కేవలం నగదు లావాదేవీలు జరిపి.. ఎన్నికల కోసం వేల కోట్ల కూడబెట్టినట్లుగా కళ్ల ముందు కనిపిస్తున్నా చర్యలు తీసుకోలేని వ్యవస్థల నిస్సహాయత కళ్ల ముందు కనిపిస్తుంది. ఒక్క సారి ఎమ్మెల్యే అయితే.. తరతరాలుగా తరగనంత సంపాదించుకునే అవకాశం లభిస్తోంది. ఇంత అవినీతి చేసే అధికారం ఉండటం వల్లనే.. ఆ సొమ్ములో కొంత భాగం పెట్టి ఓట్లు కొని అయినా గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ సొమ్మంతా ప్రజలదే.. తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం !
రాజకీయ నాయకుడు అప్పనంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు. అది పెట్టుబడిగా భావిస్తాడు. అంతకు మించి సంపాదించుకునే అవకాశం ఉంటేనే ఖర్చు పెడతాడు. చాన్స్ వచ్చినప్పుడు అదే చేస్తాడు. అలా సంపాదించుకునేది ప్రజల్ని.. ప్రజా ఆస్తుల్ని దోపిడీ చేసే. ప్రజలు కూడా వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ఆలోచన చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రజలు మాత్రం అలాంటి ఆలోచనలు చేయలేకపోతున్నారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని తీుకుంటున్నారు. తమకు తాము ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నామని హక్కులకు సంకెళ్లు వేసుకుంటున్నామని, రాష్ట్ర భవిష్యత్‌ను అమ్మేస్తున్నామని తెలుసుకోలేకపోతున్నారు. ఓటర్లలో ఈ చైతన్యం వచ్చిన రోజున ప్రజాస్వామ్యానికి పట్టున డబ్బు వైరస్ తగ్గడంప్రారంభమవుతుంది. లేకపోతే అది ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చేస్తుంది.