” కశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులను కిరాతకంగా చంపడం ఆ ప్రాంతం భద్రత, స్థిరత్వానికి ముప్పు” అని ఆఫ్టనిస్థాన్ పాలకులు అయిన తాలిబన్లు కూడా స్పందించారు. అత్యంత కిరాతకులుగా పేరున్న తాలిబన్లకు కూడా ఈ కశ్మీర్ లోని భారత పర్యాటకుల హత్య చాలా తప్పుగా అనిపించిందంటే.. కశ్మీర్ టెర్రరిస్టులు ఎలాంటి వారు అనుకోవాలి? వారికి ఎలాంటి శిక్ష విధిస్తే న్యాయం జరుగుతుంది ? వారి బారిన మరొకరు పడకుండా ఉండాలంటే వారిని ఏం చేయాలి ?.
మతం రక్షణగా ఉగ్రవాదులు
ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పు. 1990లలో ప్రపంచానికి అతి పెద్ద సమస్య ఉగ్రవాదం. అల్ ఖైదా, ఐసిస్ లాంటి సంస్థలు నరమేధం సృష్టించేవి. ఆ తర్వాత క్రమంగా కనుమరుగు అయ్యాయి. ఆ సమయంలో కశ్మీర్ లోనూ అంతే ఉండేది. జమ్మ కశ్మీర్ లో ఉగ్రదాడులు జరగకపోతే ఓ వింత అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు నలిగిపోయారు. కశ్మీరీ పండిట్లు మాత్రమే కాదు ముస్లింలు కూడా బాధితులే. కొంత మంది చేసే తప్పులకు వారు శిక్ష అనుభవిస్తున్నారు. అయినా అత్యధిక మంది ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా ఉండలేదు. పాకిస్తాన్ కు వెళ్లాలనుకోలేదు. భారతీయులుగానే ఉన్నారు. కానీ తమ దేశానికి ఉగ్రవాదంతో నిప్పు పెట్టుకుని భారత్ కూడా అంటించాలని పాకిస్తాన్ చేసే ప్రయత్నాలతో ఎప్పటికప్పుడు కశ్మీర్ రగులుతూనే ఉంది. కార్గిల్ ఉదంతం తర్వాత శాశ్వత పరిష్కారం అవసరాన్ని దేశం గుర్తించింది. ఆర్టికల్ 370 రద్దుతో అప్పటి వరకూ ఉన్న అడ్డుగోడ కూడా తొలగిపోయింది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ఉగ్రవాదం కూడా తగ్గిపోయింది. పర్యాటకులు పెరుగుతున్నారు. హోటళ్ల వంటి రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కశ్మీర్ మరో స్విట్జర్లాండ్ తరహాలో ప్రపంచవ్యాప్త పర్యాటక కేంద్రంగా మారుతుందని.. ఓ సంపన్న రాష్ట్రంగా ఎదుగుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక్క సారిగా ముసుగు టెర్రరిస్టులు పంజా విసిరారు. పెహల్గాంకు రోజూ పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారని తెలుసుకుని అక్కడ భద్రతా సిబ్బంది కూడా ఉండటం లేదని అంచనా వేసుకుని పంజా విసిరారు. అసలు ఎలాంటి సంబంధం లేని పర్యాటకుల్ని కాల్చి చంపేశారు. చంపే వారు ముస్లింలా, హిందువులా అని అడిగి మరీ చంపేశారు. కానీ అక్కడ పర్యాటకుల్ని కాపాడాలని ప్రయత్నించింది కూడా ముస్లింలే. ఈ పోరాటంలో ఓ గుర్రపు స్వారీ యజమాని చనిపోయాడు. ఇతర ముస్లింలైన టూరిజం ఆపరేటర్లు చాలా మందిని రక్షించారు. ఇక్కడ మతం కాల్చివేతలో ఓ కారణం అయింది కానీ.. ఆ మతం వాళ్లందరిదీ తప్పు కాదు. కేవలం ఆ టెర్రరిస్టులదే తప్పు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల మధ్య చర్చ జరగాల్సింది మతం గురించి కాదు.. క్రూరమైన టెర్రరిజం గురించే. దాన్ని ఎలా నిర్మూలించాలన్న అంశం గురించే.
పాకిస్తాన్ కుట్రే – టెర్రరిజంతో సగం నాశనం
వారం రోజుల కిందటే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కశ్మీర్ ప్రస్తావన తెచ్చారు. అక్కడి ప్రజల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని నేరుగా ప్రకటించారు. కశ్మీర్ లో ప్రజలు పోరాడటం లేదు. అక్కడి ప్రజలు ఎవరూ తాము పాకిస్తాన్ లో కలుస్తామని కానీ.. స్వాతంత్ర్యం కావాలని కానీ కోరుకోవడం లేదు. అలా కోరుకునేవారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేవారు కాదు. కానీ రికార్డు స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగింది. కశ్మీర్ ప్రజలు అని అనుకునేది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రమే. వారి పోరాటానికి మద్దతు ఇస్తామని పాకిస్తాన్ చెప్పింది. అప్పటికే పక్కాగా ఏర్పాట్లు పూర్తయ్యాయేమో కానీ ఆయన చెప్పినట్లుగానే ముష్కరులు బారత్ పై విరుచుకుపడ్డారు. నిజానికి ఇలాంటి ఉగ్రవాదం వల్ల ఎక్కువగా నష్టపోతోంది పాకిస్తానే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రైలు హైజాక్ చేసినప్పుడు ఏం జరిగిందో పాకిస్తాన్ ఇంకా మర్చిపోయి ఉండదు. ఒకప్పుడు తాలిబన్లను పాకిస్తాన్ ప్రోత్సహించింది. ఇప్పుడు ఆ తాలిబన్ల ఉపశాఖలు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నాయి. వారిని తట్టుకోవడానికి ఏకంగా యుద్ధమే చేయాల్సి వస్తోంది పాకిస్తాన్‌కు. ఇక అంతర్గతంగా కాల్పులు, బాంబుల మోతలతో మోతెక్కిపోతూంటుంది. అలాంటి పాకిస్తాన్ తన ఇంటిని సర్దుకోకుడా కశ్మీర్ గురించి జోక్యం చేసుకుంటోంది. కశ్మీర్ భారత్ లో భాగమని అంతర్జాతీయ సమాజం అంగీకరించింది. అక్కడ మెజార్టీ ముస్లింలు ఉంటారని అక్కడి యువతను రెచ్చగొట్టి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే చాలని అనుకుంటోంది. నిజానికి పాకిస్తాన్ తనకు ఉన్న భూభాగాన్నే పరిపాలించుకోలేకపోతోంది. ఎప్పటికప్పుడు సైనిక కుట్రలు, ఫేక్ ప్రజాస్వామ్యంతో గందరగోళంగా దేశాన్ని నడిపించుకుంటూ ఉంటారు. వారికి మరో ప్రాంతంపై దృష్టి అవసరమా ?
తాము పాకిస్తానీలమని చెప్పుకోలేని దౌర్భాగ్యం
తాను పాకిస్తానీని కాదని ఇమాన్వీ అనే నటి చెప్పుకున్నారు. ఆమె తండ్రి పాక్ సైన్యంలో పని చేసి రిటైరయ్యారు. అమెరికాలో స్థిరపడ్డారు. తమది ముష్కరదేశం అని చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు కొన్ని లక్షల మంది ఉంటారు. ల పాకిస్తాన్ మింగ మెతుకులేని పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ దుర్భరం. గల్ఫ్ షేకో.. ప్రపంచబ్యాంకో చిల్లర పడేయకపోతే రోజు గడవదు. పౌరులకు కనీస జీవన ప్రమాణాలు కూడా అందించే పరిస్థితిలో లేదు. చైనా కూడా అవసరానికి మాత్రమే పాకిస్తాన్ కు సాయం అందిస్తోంది. ఆ దేశానికి వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. బలూచిస్తాన్ నుంచి సిల్క్ రోడ్ ప్రాజెక్ట్ వెళ్తుంది కాబట్టి పాకిస్తాన్ కు కొంత సాయం చేస్తుంది. ఆ అవసరం తీరిపోయిన రోజున పైసా కూడా చైనా సాయం చేయదు. భారత్‌ను గెలుక్కోవాలన్న ఉబలాటంతో టెర్రరిస్టులకు ఇచ్చిన సపోర్టుతో ఇప్పుడు పాకిస్తాన్ మరింతగా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్తోంది. యుద్ధం లో గెలవడం అంటే.. ప్రత్యర్థిని ఓడించడమే కాదు.. చంపడం కాదన్న యుద్ధనీతిని ఇండియా పాటిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ను ఓడించాడనికి తీసుకున్న చర్యల్లో మొదటి అడుగు పాకిస్తాన్ ప్రజలను ఆకలితో అలమటించేలా చేయనుంది. సింధూ నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. భారత్ కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు చేసి సింధూనదిని దారి మళ్లించుకుంటే.. పాకిస్తాన్ తీవ్ర సమస్యల్లో ఇరుక్కుపోతుంది. సగం వ్యవసాయం ఆగిపోతుంది. సగానికిపైగా విద్యుత్ ఉత్పత్తి పడిపోతుంది. ఆహార సంక్షోభం వస్తుంది. అంతకు మించి ఆకలి చావులు పాకిస్తాన్ ను చుట్టుముడతాయి. ఇదంతా వారికి తెలుసు. అందుకే సింధూనది ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే తమపై యుద్ధాన్ని ప్రకటించడమేనని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కు యుద్ధాన్ని ఎదుర్కొనేంత సామర్థ్యం లేదు. ఆ విషయం ప్రపంచం మొత్తానికి లేదు. ఇండియా పది బాంబులేస్తే తాము రెండు బాంబులు అయినా వేయలేమా అన్నది పాకిస్తాన్ ధైర్యం. కానీ భారత్ సంప్రదాయ మిస్సైళ్లు, ఎయిర్ స్ట్రైకుల యుద్ధానికి ఇంకా వెళ్లలేదు. దౌత్యపరమైన యుద్ధమే ప్రారంభించింది. ఈ యుద్ధానికే పాకిస్తాన్ కు ఇ్బబందికర పరిస్థితులు వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుందని చెప్పి వెబ్ సైట్‌ను కూడా మూసేసుకోవాల్సి వచ్చింది.
భారత దౌత్యయుద్ధంతో సగం చచ్చిన పాకిస్తాన్
2016లోనే ప్రదానమంత్రి నరంద్రమోదీ రక్తం, నీరు ఒకే నదిలో ప్రవహించబోవని పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపారు. అప్పట్లో కశ్మీర్ లో అల్లకల్లోల పరిస్థితులు ఉండేవి. అందుకే భారత్ నుంచి వెల్లే నీటిని అడ్డుకుంటామని సంకేతాలు ఇచ్చారు. కానీ పాకిస్తాన్ మర్చిపోయింది. ఇప్పుడు ప్రారంభించేసరికి వెంటనే గుణపాఠం నేర్పించింది ఇండియా. ప్రపంచం ఇప్పుడు మారిపోయింది. ఉగ్రవాదానికి అర్థం లేకుండా పోయింది. ఉగ్రవాది అన్న ముద్రపడిన వాడిని నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని ఇప్పుడు ప్రపంచం ఆమోదిస్తోంది. ముఖ్యంగా ఇతర దేశాలపై దాడి చేసే ఇలాంటి ఉగ్రవాదుల్ని అసలు సహించడం లేదు. వారిపై జాలి చూపించి వారి కారణంగా వందల మంది అమాయకుల్ని బలి చేయడం కన్నా వారిని చంపేయడమే మంచిదని ప్రజలు కూడా కన్విన్స్ అవుతున్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు అనే వాళ్లను అగ్రదేశాలు వేటాడుతున్నాయి. వెంటాడుతున్నాయి. కశ్మీర్ లోనూ కొన్నాళ్ల పాటు అది జరిగింది. ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ చెలరేగిపోతోంది. హెచ్చరించినట్లుగానే సింధూ జలాలను పాకిస్తాన్ కు పోకుండా ఆపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే సమస్యకు ఇది పరిష్కారమా కాదా అంటే నిపుణులు చాలా రకాలుగా చెబుతారు. కానీ టెర్రరిజం సమస్యకు పరిష్కారం లభించాలంటే.. ముందుగా వేట సాగించాలి. టెర్రరిస్టుల క్యాంపుల్ని .. కశ్మీర్ లో ఉండి సహకరించేవారిని ముందుగా ఏరివేయాలి. అంతే కాదు..అసలు చేయాల్సిన పని ..కశ్మీర్ యువతకు అభివృద్ధి రుచి చూపించడం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. హోటళ్లు ఇతర రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి.ఇలా కొనసాగితే కశ్మీర్ యువతకు చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలా ఉన్న ఉద్యోగాల సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడు వారికి మతం గురించి.. ఉగ్రవాదం గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఈ దిశగా అడుగులు పడుతున్నాయని గుర్తించే ముష్కరులు దాడులు చేసి ఉండవచ్చు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మాత్రం కేంద్రంపై ఉంది.
టెర్రరిస్జు అనే వాడికి బతికే హక్కు లేదు !
ముంబై దాడుల సూత్రధాది తహవ్వూర్ రాణాను భారత్ తీసుకు వచ్చిన తర్వాత దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వచ్చాయి. అందుకే కీలకమైన ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల్ని పట్టుకుంటున్నారు. కానీ కశ్మీర్లో ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఇప్పుడు టెర్రరిస్టులపై ఎలాంటి దాడులు చేసినా ప్రపంచం అంతా భారత్ కు అండగా ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారో.. అండర్ కవర్ ఆపరేషన్లు చేస్తారో కానీ..భారత్‌లో కుట్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి మట్టుబెట్టాలి. కలలో కూడా ఊహించని చావును బహుమతిగా ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. ఆయన మాటలకు తగ్గట్లుగా రేపోమాపో ఉగ్రవాదులు హతం అయిపోతారు అందులో సందేహం లేదు. దాంతో టెర్రరిజానికి అంతం కాదు. కశ్మీర్ లో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేలా చేసి అక్కడి యువతను ఖాళీగా ఉంచకుండా.. విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు పొందేలా మారిస్తే.. వారికి జీవితం అంటే ఏమిటో ఓ దృక్పథం ఏర్పడుతుంది. అప్పుడు టెర్రిజానికి వారు సపోర్టుగా ఉండరు సరి కదా.. వారే దాని అంతంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయంలో భారత్ మెతకగా ఉండకూడదు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అలాంటి చర్యల కోసం భారత్ ప్రజానీకం ఎదురు చూస్తోంది.