“ఓట్లేసిన ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు.. కానీ కీడు మాత్రం చేయకూడదు…” .. అధికారం అందే వరకూ రాష్ట్ర ప్రయోజనాలు.. ప్రజాశ్రేయస్సు మాటలు చెప్పే రాజకీయ నాయకులు.. అధికారం అందగానే.. భిన్నమైన మార్గంలో వెళ్తూంటారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రజల్లో అసంతృప్తి రాకుండా ఉండటానికి వారికి పదో.. పరకో పడేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడుతాము చెప్పిన మాటలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత విలువ ఇవ్వకపోవడం అవడమే కాదు.. రాష్ట్ర ద్రోహానికిపాల్పడటమే అవుతుంది. ప్రస్తుతం పోలవరంప్రాజెక్ట్ విషయంలో జరుగుతోంది ఇదే.
పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి..!
పోలవరాన్ని ఓ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన రేఖ. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఏపీని కరువు కాటకాల నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించే వరదాయని. ఆ ప్రాజెక్ట్‌కు.. యాభై వేలు కాదు.. రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినా… పెట్టుబడిపై లాభమే వస్తుంది కానీ.. నష్టం రాదు. లక్షల ఎకరాల్లో కొత్త ఆయుకట్టు వస్తుంది. లక్షల ఎకరాల్లో స్థీరీకరణ జరుగుతోంది. రాయలసీమలో నీటి కరువు అన్న మాటే రాదు. సిక్కోలు వరకూ గోదావరి నీరు పారించడానికి అవకాశం ఉంది. నీరు లేకపోతే చేయడానికే ఏమీ ఉండదు. జలమే జీవం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్‌ను జీవనరేఖగా భావిస్తున్నారు. కానీ పాలకులు మొదటి నుంచి ఈ ప్రాజెక్టుపై శీతకన్నేశారు. అధికారం వచ్చినప్పటి నుండి… పనులను ఏ విధంగా నిలిపివేద్దామా అన్న ఆలోచనే చేశారు. ఫలితంగా ఇప్పుడు.. అసలు ప్రాజెక్ట్ భవితవ్యానికే ప్రమాదం ముంచుకొచ్చింది.
వరాన్ని శాపంగా మారిస్తే రాష్ట్రం ఎడారే..!
విభజనతో హైదరాబాద్ వదులుకున్నందుకు ఏపీకి దక్కిన నికరమైన హామీ ఒకే ఒక్కటి. అదే పోలవరం. కానీ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కొర్రీలు పెడుతోంది. ప్రత్యేకహోదాను ఎగ్గొట్టి… పోలవరానికి టెండర్ పెట్టేస్తోంది. ఈ సమయంలో… రాష్ట్ర ప్రభుత్వం … నోరు మెదపలేకపోతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిలిచిపోతే…ఆ నీటిని రాష్ట్రం నలుమూలలకు తరలించాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి. ఆ ప్రాజెక్టుల విలువ రూ. 72వేల కోట్లు ఉంటుంది. పోలవరం నీటిని రాష్ట్రం నలుమూలలకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రణాళికలు వేశారు. పోలవరం పూర్తి చేస్తే మొదటగా లాభపడేది రాయలసీమ ప్రజలు. దాదాపుగా రూ. 40వేల కోట్లతో ‘సీమ’ దుర్భిక్ష నివారణ పథకానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే.. విశాఖకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం నీటిని తరలించడానికి పనులు ప్రారంభించారు. దానికి తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. శ్రీకాకుళం వరకు గోదావరి జలాలను తీసుకెళ్లేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిలిపివేసింది. పల్నాడు దుర్భిక్ష నివారణ పథకం, కొల్లేరు భారజల సాంద్రత నివారణ పథకాలు కూడా ఆగిపోతాయి. అదే జరిగితే.. ఏపీలో కరువు కాటకాలు నిత్యనూతంగా ఉంటాయి.
పోలవరంతో అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్..!
పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పూర్తయితే ఏడున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, పదిహేనున్నర లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. గోదావరి – పెన్నా అనుసంధానం జరిగితే రాయలసీమకు గోదావరి జలాల మళ్లిస్తారు. కృష్ణా జలాలను రాయలసీమకే పూర్తిగా అంకితం చేసే బృహత్తర ప్రణాళిక అమలవుతుంది. అంటే అన్ని ప్రాంతాల ప్రజలు.. రైతులు పోలవరం ప్రయోజనాలను పొందుతారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుంది. రైతుకు మరింత ధీమా లభిస్తుంది. ఇదంతా.. కేవలం ఒక్కటంటే.. ఒక్క పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించడం వల్లనే సాధ్యం. కానీ కేంద్రం.. రాష్ట్రం ఏ ప్రయోజనాలను ఆశించి ఆ ప్రాజెక్టుతో ఆటలాడుతున్నాయో అర్థం కాని పరిస్థితి.
తెలంగాణతో కలసి కట్టాలనుకున్న ఉమ్మడి ప్రాజెక్ట్ కోసమేనా..!?
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. గతప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన బిల్లులు వసూలు చేసుకుని ఇతర వాటికి మళ్లించడానికి చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు కానీ.. తర్వాత ఆ స్థాయిలో పనులు చేయడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాంట్రాక్టర్‌ను మార్చడం.. వరదలు రావడం.. ఇలా ప్రతీ విషయం ఆలస్యం అవుతూనే ఉంది. అయితే ఈ పరిణామాల కంటే ముందు.. జరిగిన కొన్ని ఘటనలను మనం గుర్తు చేసుకోవాలి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే.. తెలంగాణతో కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్ కట్టేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ప్లాన్ కూడా సిద్ధం చేశారు. పోలవరంను బలి చేసి.. దాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్లుగా అప్పుడే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారు. పోలవరం అంతం చూసిన తర్వాత దాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే నిజమైతే.. త్వరలోనే ఉమ్మడి ప్రాజెక్ట్ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజంగా అదే నిజైతే… అంతకంటే రాష్ట్ర ద్రోహం… ఇంకేమీ ఉండదు.
కొట్లాడతారా..? రాజీపడతారా..?
కేసుల భయంతో రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతారా.. అని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి శ్రేయోభిలాషులు కూడా.. తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే.. ఏపీలో సర్కార్ పట్ల ప్రజల్లో వస్తున్న మార్పుగా అర్థం చేసుకోవాలి. ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేసిందేమిటి. ఎంపీలందర్నీ గెలిపిస్తే.. ఢిల్లీ పెద్దల కాలర్ పట్టుకుని రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొస్తామని బాకా ఊదారు. కానీ ఇప్పుడు ఒక్కరంటే.. ఒక్క ఎంపీ వాయిస్ కూడా.. వినిపించడం లేదు. గత ప్రభుత్వంలో ఎంపీలు పోరాడనిరోజు లేదు. కానీ ఈ ప్రభుత్వంలో పోరాటం అన్న పదమే లేదు. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడీకి ఎదురెళ్లే ధైర్యం.. సాహసం.. సీఎం జగన్‌కు లేవు చేయరు..,దానికి కారణం.. ఆయన వెనుక ఉన్న కేసుల లగేజీలే. అవే ఇప్పుడు రాష్ట్రానికి .. రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతున్నాయి.
రాష్ట్రం వైపా..? కేసుల వైపా..? నవంబర్ 2న తేల్చేయాలి..!
పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశం నవంబర్ రెండో తేదీన జరుగుతుంది. ఆ సమావేశం ఎజెండాలో పోలవరం సాంకేతిక సలహా మండలి ఆమోదించిన 47 వేల కోట్ల రూపాయల రెండో డీపీఆర్‌ను కూడా చేర్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ బలంతో పట్టుబడితే.. ఆ డీపీఆర్‌కు ఆమోదం లభించవచ్చు. ఇక్కడ ఉండాల్సింది ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రమే. రాష్ట్రంలో ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి… కనీసం స్పందించడానికి కూడా సిద్ధపడటం లేదు. ప్రజలు బాగుపడే అవకాశాలన్నీ చేజారిపోతున్నా ఆయన ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు. ఇలా చేయడం.. ఖచ్చితంగా రాష్ట్ర ద్రోహమే అవుతుంది. ప్రజలకు తీరని అన్యాయం చేయడమే అవుతుంది.