” In politics stupidity is not a handicap ” అంటాడు నెపోలియన్. నెపోలియన్ చెప్పింది శారీరకమైన వైకల్యం గురించి కాదు.. రాజకీయ నాయకుల బుద్దిపరమైన వైకల్యం గురించి. నెపోలియన్ రాజకీయ నాయకుడు కాదు. ఫ్రెంచ్ రివల్యూషనరీ ఆర్మీస్ కు నాయకత్వం వహించిన ఓ జనరల్. ఆయన పదకొండేళ్ల పాటు ఫ్రాన్స్‌ను ఏకఛత్రాదిపత్యంగా పరిపాలించాడు. చరిత్రలో నిలిచిపోయాడు. ఎలా ? రాజకీయ నాయకుల స్టుపిడిటిని తనకు అవకాశంగా మాల్చుకుని మిలటరీ పాలకుడిగా విజయవంతమయ్యారు. అందుకే రాజకీయ నాయకుల లోపాన్ని సులువుగా ఎత్తిచూపగలిగారు. నెపోలియన్ ఈ మాట చెప్పింది 1804లో. ఇప్పటికి 120 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ఆ మాటకు ఏమన్నా విలువ తగ్గిందా అంటే… రాజకీయ నేతలు ప్రపంచవ్యాప్తంగా ఆ మాట ఎంత ఆణిముత్యమో నిరూపిస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పోటీ పడి మరీ నిరూపిస్తూంటారు.
నేరస్తులకిచ్చే ప్రాధాన్యతలో కొంచెమైనా ప్రజలకివ్వలేరా ?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే ఎవరికైనా.. రాజకీయం అంటే ఎవరి కోసం అన్న ప్రశ్న వేసుకుంటారు ?. ఏపీలో అధికారిక హోదా లేని ప్రతిపక్షం అయినా…తెలంగాణలో హోదా ఉన్న ప్రతిపక్షం అయినా ఏం చేస్తున్నారు ?. ప్రజల కోసం మానేసి… తమ కోసం పోరాడుకుంటున్నారు. ఆ పోరాటం కోసం రోడ్డెక్కుతున్నారు కానీ.. నిజంగా రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ఒక్క శాతమైనా ప్రయత్నిస్తున్నారా అన్నది మాత్రం డౌట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి స్టైల్ చూస్తే.. నెపోలియన్ చెప్పిన మాట ఆయనకు వందకు శాతం వర్తిస్తుంది. ఓ సారి అధికారం ఇచ్చారు. ముఫ్పై ఏళ్ల పాటు పరిపాలించేలా చేసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఆయన తీరు ప్రజల్నే భయపెట్టేలా ఉండటంతో పదకొండు సీట్లకు పరిమితం చేశారు. లోపాల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకుండా.. తాను అంతా మంచే చేశాననే వితండవాదంతో ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. రాజకీయాల్లో ఉండకూడదని కక్ష పూరిత మనస్థత్వం. కానీ జగన్ రెడ్డిలో అదే ఉంది. ఆయన అవినీతి చేసి జైలుకు పోతే.. దానికి కారణం టీడీపీ నేతలని జైలు గోడలపై .. మనీ సినిమాలో బ్రహ్మానందం రాసుకున్నట్లుగా… రాసుకుని తనకు చాన్స్ వచ్చినప్పుడు అందర్నీ జైల్లో వేశారు. వారు తప్పు చేస్తే అలా చేయడంలో తప్పు లేదు. తప్పుడు ఆధారాలు సృష్టించి.. మరీ అరెస్టులు చేయడం… సొంత విలాసాల కోసమే ప్రజాధనం వినియోగించడం.. తాను దైవాంశ సంభూతుడ్ని ఐదేళ్లలో ఇంట్లోనే ఉండి… బయటకు వచ్చినప్పుడు పొర్లు దండాలు పెట్టించుకోవడం వంటి మానసిక వికృతానందాలతో మొత్తానికి బేస కోల్పోయరు. ఇప్పుడైనా ఆయన మారాడా అంటే… నందిగం సురేష్, అవుతు శ్రీనివాస్ రెడ్డి అనే క్రిమినల్స్ ను ప్రత్యేకంగా పరామర్శించడానికి జైలుకు వెళ్లి… ఆయన బయట చేసిన వ్యాఖ్యలతో ఆ పొలిటికల్ స్టుపిడిటి.. ఓటములతో పొయ్యేది కాదని.. తేలిపోయింది.
తమ నేత మానసిక వైకల్యానికి ఫలితం అనుభవిస్తున్న వైసీపీ నేతలు
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎవరినో అన్నదాన్ని.. తనను అనుకుని దానికి విపరీత అర్థం చేసుకుని….దాన్ని మీడియా ముందు చెప్పుకుని… ఆ పేరుతో దాడులు చేశామని నిస్సిగ్గుగా చెప్పుకునే స్టుపిడిటి ఏ రాజకీయ నేతలో అయినా ఉంటుందా ?. తనను తిట్టారు కాబట్టి అభిమానస్తులకు కోపం వచ్చి దాడులు చేశారని ఆయన ఇప్పటికీ సమర్థిస్తున్నారు. ఇలాంటి స్టుపిడిటి వల్ల ఆయన పార్టీ నేతలందర్నీ జైలుకు పంపుతున్నారు. ఇవాళ పరారీలో ఉండి.. కనిపించకుండా పోయిన నేతలు చేసిన తప్పులేంటి ?. కొడాలి నాని, వంశీ, జోగి రమేష్, అవినాష్.. ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం ఓ పాతిక మంది ముఖ్య నేతలు పరారీలో ఉన్నారు. దీనికి కారణం వారు చేసిన అవినీతి కాదు. జగన్ రెడ్డిలోని స్టుపిడిటిని .. సంతృప్తి పరచడానికి నోటికి అదుపు లేకుండా చేసిన విమర్శలు… హద్దు లేకుండా చేసిన దాడులే కారణం. భారత రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష పార్టీ ఆఫీసుపై అధికార పార్టీ వాళ్లు దాడి చేస్తారా ?. అంత కన్నా స్టుపిడిటి ఉంటుందా ?. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ దాడిలో పాల్గొన్న వారంతా పరారవుతున్నారు. పరారై బతకలేని వాళ్లు అరెస్టయి కుటుంబాలకు వేదనను మిగుల్చుతున్నారు. కొడాలి నాని, వంశీలు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది . జగన్ రెడ్డికి వినసొంపుగా ఉండేలా బూతులు మాట్లాడి… వారు ఇప్పుడు పరారు కావాల్సి వచ్చింది. అధికారం పోయిన తరవాత వైసీపీ నేతలు పడే ప్రతి బాధ వెనుక కారణం… జగన్ స్టుపిడిటీనే. ఇంత జరిగిన తరవాత అయినా…తన వల్ల ఇంత మంది ఇబ్బంది పడుతున్నారని తెలిసిన తరవాతైనా జగన్ మారుతున్నారా అంటే… ఒక్క శాతం కూడా చాన్స్ లేదు. తన కోసం సమిధలయ్యే వారికి అశ్రువొక్కటి ధారబోస్తా… తప్ప…తగ్గేది లేదంటున్నారు.
ఇంకెంత కాలం భరిస్తారు ?
వరదలు వచ్చాయి. రెండు సార్లు గుంపునేసుకుని బెజవాడలో రెండు పాయింట్లో అరగంట పాటు షో చేశారు. అంతే మళ్లీ పట్టించుకోలేదు. పార్టీ కార్యక్రర్తల్ని ఆదుకునే విషయంలో భాగం చేయలేదు. రూ. కోటి ప్రకటించి.. పులిహోర పొట్లం కూడా పంచలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే జగన్ మాత్రం నింపాదిగా.. అందర్నీ వదిలేసి.. నందిగం సురేష్ ను పరార్శించాడనికి వెళ్లారు. ఓ వైపు తన కోసం పులివెందులలో పని చేసిన పెదనాన్న కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కుమారుడు చావుబతుకుల్లో ఉంటే.. పట్టించుకోలేదట. దీని ద్వారా జగన్ స్టుపిడిటి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జనం లేదు.. అంత మనమే అన్నట్లు ప్రజలు పాలన చేతికి ఇస్తే ఖజానా .. రాష్ట్ర ఆస్తులు చేతికి ఇచ్చేసినట్లుగా భావించి సర్వనాశనం చేయడం… లేకపోతే… అదే రాష్ట్రంపై రాజకీయంగా యుద్ధం చేయడం. ప్రత్యామ్నాయం లేక తనను నమ్మేవాళ్లు ఉన్నారు కదా అని ఆయన చేస్తున్న ఈ వైకల్య రాజకీయానికి ఎప్పుడు తెరపడుతుందో అని ఎదురుచూసేవారు ఎక్కువగానే ఉన్నారు.
కౌశిక్ రెడ్డి స్టుపిడిటి కింద నలిగిపోతున్న బీఆర్ఎస్
తెలంగాణలోనూ విపక్ష రాజకీయంలో జగన్ మోహన్ రెడ్డి అంత స్టుపిడిటి లేదు కానీ… రాజకీయ కోసం చేస్తున్న వీధి పోరాటాలు చూస్తే చాలా మందికి. .. ఆ తాను ముక్కే అని అనుకోకుండా ఉండలేరు. తెలంగాణలో ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలవుతోంది. హామీల గురించి ట్విట్టర్ లో మాత్రమే నిలదీస్తున్నారు. కానీ రాజకీయ కారణాలతో మాత్రం వీధికెక్కుతున్నారు . రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేదని బీఆర్ఎస్ నేతలు ట్విట్టర్లో ఆరోపిస్తున్నారు. ప్రెస్ మీట్లలో ఉదరగొడుతున్నారు. ఊరూరా ఎవరికీ రుణమాఫీ కాలేదంటున్నారు. అలాంటప్పుడు ఏం బీఆర్ఎస్ నేతలు… ఏం చేయాలి ? ఏం చేస్తున్నారు ?. రైతుల్ని ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై పోరాడి… వారికి రుణమాఫీ చేయించడం రాజకీయం. కానీ బీఆర్ఎస్ ఏం చేసింది.. పాడి కౌశిక్ రెడ్డి అనే అతి తెలివి రాజకీయ నాయకుడ్ని ముందు పెట్టుకుని వైకల్య రాజకీయం చేస్తోంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ను పెద్ద నాయకుడ్ని చేసి.. ఆయనపై బీఆర్ఎస్ పార్టీ మొత్తం యుద్ధం ప్రకటించింది.. కౌశిక్ రెడ్డి నాయకత్వంలో. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా … అరికెపూడి గాంధీని నియమించడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ తప్పు చేసిందనేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి కనీ.. ఇలా ఎమ్మెల్యేపై తొడకొట్టి.. ఆయనను రెచ్చగొట్టి ఏదో చేస్తే ఏం ప్రయోజనం. ప్రజల కోసం ఇలా పోరాడలేదే అనిపిచలా.. కౌశిక్ రెడ్డి ఇష్యూలో బీఆర్ఎస్ స్పందించింది. ఇదే గొప్పతనం అయితే కౌశిక్ రెడ్డిని ముందు పెట్టుకుని రాజకీయం చేస్తే… జగన్ మోహన్ రెడ్డిలా కౌశిక్ రెడ్డి కూడా… రాజకీయాల్లో వైకల్యం అనేది ఎంత మాత్రం లోపం కాదు… ఇంకా ప్లస్ పాయింట్ అని నిరూపిస్తారు. కానీ ఆ వైకల్యం కౌశిక్ రెడ్డిది కాదు.. బీఆర్ఎస్ దే అని ప్రజలు నిర్ధారించుకుంటారు.
ప్రజాకోణంలో రాజకీయాలు చేయలేకపోతే కష్టమే !
రాజకీయం ప్రజల కోసం చేయాలి. ప్రజలు మెచ్చితే పదవులు ఇస్తారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా కోణంలోనే రాజకీయాలు చేయాలి. రాజకీయ నేతలు చేసే పనులు.. వ్యవహారాలు… అన్నీ తమ కోసం కాదని వారి కోసం అని ప్రజలు అనుకున్న రోజున … ఎవర్నీ లెక్క చేయరు., కేసీఆర్ భాషలో చెప్పాలంటే బండకేసి బాదుతారు. ఏపీలో.. తెలంగాణలో అదే జరిగింది. ప్రజలు ఎంత వైల్డ్ గా ఎన్నికల్లో స్పందించారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ పర్ ఫెక్ట్ కాదు. కానీ.. ఆ లోపాల్ని బరిహంగ పర్చుకుని మేమింతే … మాకు బానిసల్లా ఉండాలని రాజకీయ నేతలు ఆశిస్తే.. అధికార గర్వంతో వ్యవహరించినా… తాము తప్ప మరో దిక్కు లేదని… మరో పార్టీ నేతలు ఎవరైనా ఫీల్ అయినా ప్రజలు వారికి కావాల్సిన రీతిలో తగిన బుద్ది చెబుతారు. రాజకీయాల్లో ఇది చాలా కాలంగా నిరూపితమవుతున్న విషయం. నేర్చుకున్న వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నేర్చుకోలేని వారు అంతర్థానమవుతున్నారు. ప్రజా తీర్పును సరిగ్గా అన్వయించుకుని తప్పుల్ని దిద్దుకున్న వారే ముందుకు వెళ్తారు. లేకపోతే…. వెనక్కి కాదు పాతాళంలోకి పాతారు. గతం…వర్తమానం…భవిష్యత్ లో కూడా జరగబోయే రాజకీయం ఇదే.