” మణిపూర్‌లో అలాంటి ఘటనలు వంద జరిగాయి. ఆ ఒక్క ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు ” ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్. ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఏ మాత్రం సిగ్గుపడకుండ చెప్పిన మాట ఇది. ఈ మాట విన్న తర్వాత ఎవరికైనా మనం నాగరిక ప్రపంచంలోనే బతుకున్నామా ? అన్న అనుమానం రాకమానదు. మనల్ని పరిపాలిస్తున్నది మనుషులా… డైనోసార్లా అన్న డౌట్ కూడా వస్తుంది. మహిళలపై ఇంత ఘోరంగా ఆకృత్యాలు సహజమేనన్నట్లుగా చెబుతున్న ఆ సీఎం మానసిక స్థితిలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే..ఆయన రాజకీయ నాయకుడు. కరుడు గట్టిన రాజకీయనాయకుడు. దేశంలో అందరిలాగే ఆయన కూడా ఓ నేత. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు..తమ సీటు తమకు ముఖ్యం అనుకునే నేత. మహిళలపై అలాంటి అరాచకాలు జరిగినప్పుడు ఏ సీఎం అయినా సిగ్గుతో తలదించుకోవాలి. కానీ ఆయన మాత్రం అవన్నీ కామనే అని జాతీయ మీడియాతో నిర్మోహమాటంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ దేశం అయినా భారత్‌ను నాగరిక దేశంగా అంగీకరిస్తుందా ? బయట దేశం ఎందుకు.. దేశంలోని ప్రజలు మన దేశం అభివృద్ధి చెందుతున్నామని.. మనం పురోగమిస్తున్నామని ఎవరైనా అనుకుంటారా ?. అనుకునే చాన్స్ లేదు. ఎందుకంటే ఆ మహిళలపై ఆకృత్యానికి పాల్పడటం… కారణం రాజకీయ పార్టీలు పెంచి పోషించిన కులం, మతం, వర్గం, ప్రాంతం అనే విష బీజాలే. అవే నేడు వట వృక్షాలై ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఘోరాలకు కారణం అవుతున్నాయి. దేశ ప్రజల్లో విభజన తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తెచ్చిన రాజకీయ నేతలే నిస్సిగ్గుగా.. అవన్నీ మామూలేనంటూ ఏ పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా మాట్లాడేస్తున్నారు.
మోదీ చెప్పే మాటలు ఉన్నతం .. కానీ ఆయన చర్యలు ?
తాము రష్యా వైపో… ఉక్రెయిన్ వైపో ఉండబోమని.. కానీ శాంతి వైపు ఉంటామని ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బరువైన డైలాగ్ చెప్పారు. అందరూ ఆహో ఓహో అనుకున్నారు. అక్కడి వాళ్లే. కానీ భారత్‌లోని వారికి మాత్రం అనేక సందేహాలు మనసుల్లో మెదిలాయి. అందులో మొదటిది మణిపూర్. అమెరికాలో చెప్పిన శాంతి మంత్రం .. పీస్ డైలాగ్ దేశంలో తగలబడిపోతున్న మణిపూర్ లో ఎందుకు మోదీ పటించడం లేదన్నది దేశంలో చాలా మందికి వస్తున్న సందేహం. మన్ కీ బాత్ లో చాలా గొప్పలు చెప్పుకుంటారు కానీ.. సమస్యలపై ఎందుకు స్పందించరన్న ప్రశ్నలు బాధితులైన మణిపూరీల నుంచే వస్తున్నాయి. అది నిజమే కదా ప్రధాని మోదీ దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎందుకు స్పందించరు ? తగలబడిపోయి చల్లారిపోయిన తర్వాత తానే అంతా సద్దుమణిగేలా చేశానని చెప్పుకుంటారా ? చక్కదిద్దే బాధ్యత లేదా ?. ఇటీవల ప్రధాని మోదీ మన్ కీ బాత్ జరుగుతున్న సమయంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని మహిళలు నిర్వహిస్తున్న ‘ మదర్స్ మార్కెట్ ‘ ప్రతినిధులు రేడియోలను పగులగొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మణిపూర్ హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మౌనం వీడి చర్యలు చేపట్టాలనే డిమాండ్ వారు చేశారు. మణిపూర్‌లో హింసను నిరోధించేందుకు, రాష్ట్ర సమగ్రతను కాపాడేందుకు ప్రధాని చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. వీరి ఆగ్రహానికి కారణం ఉంది. ఎన్నికల సమయంలో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రధాని సహా ఇతర కేంద్ర మంత్రులు తమ రాష్ట్రానికి వరుస కట్టారు. కానీ ఇప్పుడు రాష్ట్రం తగలబడిపోతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడా అరాచకాల స్థాయి దాటిపోయింది. మహిళల్ని నగ్నంగా మార్చి వేధిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చిన ప్రధాని మోదీ.. తనదైన వాయిస్ బేస్ తో.. పార్లమెంట్ ఎదుట మాట్లాడారు. నిందితుల సంగతి చూస్తామని చెప్పారు. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా అది మామూలే అన్నట్లుగా మాట్లాడిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నిందితులకు ఉరి వేస్తామని చెప్పుకొచ్చారు. అక్కడ సమస్య.. నిందితులు కాదు.. ప్రజల మధ్య ఏర్పడిన చిచ్చు. ఒకరు కాకపోతే ఇంకొకరు ఆ పని చేస్తారు. ఎందుకంటే వారి మధ్య అలాంటి ఘోరాలు జరిగేంత శతుత్వం రాజకీయ పార్టీలు తెచ్చి పెట్టాయి. ఇందులో ప్రధాన పాత్ర బీజేపీది.
రాజకీయాల కోసం ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టింది బీజేపీనే !
మణిపూర్ ఇప్పటికీ మండుతోంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో జాతి హింస చెలరేగి మూడున్నర నెలలు దాటిపోయింది. కానీ, పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రాష్ట్రం అగ్నిగుండలా రగిలిపోతోంది. మెయ్తెయి, కుకి తెగల మధ్య రాజుకున్న హింసలో ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మంది గాయపడ్డారు. అరవై వేల మంది నిరాశ్రయులయ్యారు. హింస ఆగడం లేదు. స్థానికుల సహనం నశిస్తోంది. మెయితెయిలు కుకిలు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు చనిపోతారో అక్కడి ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం మణిపుర్ రెండు ముక్కలైంది. ఒక వైపు మెయితెయి ప్రజలు, మరొకవైపు కుకి ప్రజలు. మనుషులు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, తోటలు ధ్వంసమయ్యాయి. గ్రామాలు, పల్లెలు నాశనమైపోయాయు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత, క్రైస్తవాన్ని అనుసరించే కుకి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగల్లో చేర్చారు. మెయితెయ్ తెగలో హిందువులు ఎక్కువ. కొందరికి రిజర్వేషన్లు లేవు. కొంతమందిని షెడ్యూల్డ్ కులం కింద, మరికొందరిని ఓబీసీల కింద చేర్చారు. మెయితెయిలు కుకి ప్రాంతాల్లో భూములను కొనలేరు. అందుకే, తమను కూడా షెడ్యూల్ తెగలలో చేర్చాలని వారు పట్టుబడుతున్నారు. ఇక్కడే గొడవ మొదలైంది.మణిపూర్‌లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా మొయితీలు మెజార్టీగా ఉన్న వారిని ఎస్టీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. వారికి రాజకీయ మద్దతు ఉండటంతో మైనార్టీ గిరిజన తెగలు రగిలిపోతున్నాయి. రిజర్వేషన్ల ఫలితాలు తమకు దక్కవేమోనని ఎస్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఇది ప్రధానమైన సమస్య. గ తంలో అసోంలోకి విదేశీయులు ప్రవేశించారన్న కారణంగా స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. దాదాపుగా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఈ సమస్య ఉంది. అసోంలో ఇలాంటి మెజార్టీ, మైనార్టీలు.. వలస వచ్చిన వారు.. స్థిరంగా ఉన్న వారి మధ్య పెట్టి చిచ్చుతో రాష్ట్రం రగిలిపోయింది. ఇలాంటి వారి ఉద్యమాలకు నేతృత్వం వహించి ప్రపుల్ల కుమార్ మహంత, హిమంత బిశ్వ శర్మవంటి వారు పదవుల్లోకి వచ్చారు. అసోం ఉద్యమంలో భాగంగా 80వ దశకంలో నల్లి అనే ప్రాంతంలో ఎంతోమంది మరణించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణి పూర్ ప్రజల మధ్య ఘర్షణలు జరగడం చాలా తక్కువ. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయితీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఉన్నారు. మణిపూర్ లోయలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మెయితీలకు అనుమతి లేదు. కానీ మెజార్టీ ఉన్నారని రాజకీయ పార్టీలు వారికి మద్దతుగా మారిపోయాయి. ఫలితంగా గిరిజనులు రగిలిపోతున్నారు. కుకీలు, ఇతర గిరిజన జాతులకూ మధ్య ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, విద్యార్ధు లు, యువకులు తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటా యని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెయితీల ఉద్యమాన్ని ప్రతిఘటిస్తూ కుకీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి కి మద్దతుగా ఐదు విద్యార్థి సంఘాల వారు రంగంలో ప్రవేశించడంతో ఉద్యమం హింసాత్మకంగా పరిణమిం చింది. ప్రభుత్వ వాహనాలనూ, అతిధి గృహాలను ఆందో ళనకారులు దగ్ధం చేస్తున్నారు. ఈ ఘర్షణల కారణంగా 9వేల మందిపైగా నిరాశ్రయులయ్యారు. మణి పూర్‌కి మయన్మార్ సరిహద్దు ఉంది. ఒక్క మణిపూర్‌కే కాక, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరంలకు కూడా మయన్మార్ సరి హద్దు ఉంది. మయన్మార్‌లో గిరిజన తెగల వారు మన సరిహద్దు రాష్ట్రాల్లోకి చొచ్చుకుని వచ్చి ఘర్షణలకు కారకులవుతున్నారు.ఇది పాత కథ. ఇప్పుడు మెయితీ తెగ వారు తమను షెడ్యూల్డ్ జాతుల్లో చేర్చాలంటూ ఆందోళన సాగిస్తున్నారు. వారిని ఎస్టీల్లో చేరిస్తే తమకు ప్రస్తుతం లభిస్తున్న సదుపాయాలు ఆగిపోతాయని, లేదా తక్కువ అవుతాయనీ కుకీలు, ఇతర గిరిజన జాతుల వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఉద్యమం లో మయన్మార్ గిరిజన తెగలు ప్రవేశించడంతో పరిస్థితి మరితం తీవ్రం అవుతోంది.
వందేళ్లుగా కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య మరో వందేళ్లు కలవలేనంత శత్రుత్వం
వందేళ్లుగా కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య మరో వందేళ్లు కలవలేనంత శత్రుత్వం ఏర్పడింది. దీనికి కారణం ఓట్ల కోసం మెజార్టీ ఉన్న వారిని ఎస్టీలుగా చేరుస్తామని బీజేపీ రాజకీయం చేయడమే. దీంతో ఆ పార్టీ రాజకీయంగా లబ్ది పొందింది. కానీ మణిపూర్ మాత్రం రెండుగా విడిపోయింది. మణిపూర్ లో ఎక్కువగా బీజేపీపైనే ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. దీనికి కారణం అసలు అక్కడి ప్రజల మధ్య చిచ్చుకు వారే కారణం ఒకటైతే.. అధికారంలో ఉండి కూడా ఆజ్యం పోస్తున్నారు కానీ అసలు కనీసం సమస్యను పరిష్కరించడానికి ప్రయ.త్నించకపోవడం మరో కారణం. ప్రధాని మోదీ.. శాంతి గురించి ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. కానీ మండిపోతున్న మణిపూర్ లో మాత్రం రాజకీయ లాభాల కోసం … ఎలాంటి స్పందన వ్యక్తం చేయకుండా సైలెంట్ గా ఉండిపోవడం అందర్నీ ఆవేదనకు ఆగ్రహానికి గురి చేస్తోంది. రెజ్లర్ల విషయంలోనూ అదే చేశారు.గతంలో రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడూ అదే మౌనం పాటించారు. ఇప్పుడు మణిపూర్ లోనూ అదే చేస్తున్నారు. దేనికైనా కాలమే సమాధానం చెబుతుందన్నట్లుగా అల్లర్లు అవే ఆగిపోతాయని అనుకున్నారు. కానీ అక్కడ అంటుకుంది జాతి విద్వేషం. ఈ అంశాన్ని మోదీ గుర్తించడం లేదు. రాజకీయం వేరు .. పరిపాలన వేరు. పరిపాలన చేసేందుకు అధికారంలోకి రావడానికి రాజకీయం చేయాలి. కానీ పరిపాలనలోకి వచ్చాక రాజకీయం చేస్తే అధికారం ఇచ్చిన ప్రజలు సమిధలుగా మారుతారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు అదే చేస్తున్నాయి. అధికారం ఇచ్చిన ప్రజల్ని సమిధల్ని చేసి రాజకీయం చేస్తున్నాయి. దానికి మణిపూరే సాక్ష్యం మెజార్టీ, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీలకు తాత్కలిక విజయాలు లభించవచ్చు కానీ అది అంతిమంగా అరాచకానికి దారి తీస్తుంది. దానికి తాజా సాక్ష్యం మణిపూర్.
మణిపూర్ తరహా సమస్యలే దేశమంతటా !
మణిపూర్‌లో ఉన్న సమస్య ప్రతీ రాష్ట్రంలోనూ ఉంది. గతంలో ఏపీలో కాపు ఉద్యమం పేరుతో రైళ్లను … పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు. తెలంగాణలో కూడా గిరిజనుల సమస్య ఉంది. ఆదివాసీలు, లంబాడాల మధ్య పోరాటంతో ఎన్ని సార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో అంచనా వేయడం కష్టం. ఇలాంటి ఘటనలు జరగని రాష్ట్రం లేదు. దీనికి కారణం రాజకీయ పార్టీలు.. ఒక్కో వర్గాన్ని ప్రోత్సహించి ఓటు బ్యాంక్‌గా మార్చుకునే ప్రయత్నతాలు చేయడమే. ఫలితంగా వారు రాజకీయంగా లాభపడుతున్నారు. దేశం నష్టపోతోంది. కానీ ప్రజలు మాత్రం ఈ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. రాజకీయ నేతల వలలో పడి.. తీవ్రంగా నష్టపోతున్నారు. రాజకీయ నేతలు ఆడుతున్న చదరంగంలో ప్రజంలతా నష్టపోతున్నారు. వారు మాత్రం లబ్ది పొందుతున్నారు. ఇలాంటి రాజకీయాల్ని భారత ప్రజాస్వామ్యం మనకు ఇచ్చింది. దీనికి పరిష్కారం ఏమిటో ?