” పాలిటిక్స్ ఈజ్ వార్ వితౌట్ బ్లడ్ ” అన్నాడో పెద్దమనిషి శతాబ్దం కిందట. రాజకీయాలు అంటే యుద్ధమే కానీ రక్తపాతం ఉండదని ఆయన అనుకున్నారు. ఎందుకంటే రాజకీయాలనేవి ఎప్పటికీ భౌతిక యుద్ధాలుగా మారని ఆయన నమ్మకం కావొచ్చు. కానీ ఇవాళ ఆయన పెద్ద మనిషి ఉంటే తన అభిప్రాయాన్ని వంద శాతం మార్చుకుని ఉండేవారు. ” పాలిటిక్స్ ఈజ్ వార్ విత్ బ్లడ్ ” అని నిర్మోహమాటంగా చెప్పేవాడు. నిజానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది మరి. కాకపోతే ఇక్కడ రక్తం కళ్ల చూసేది పరస్పరం పోరాడే రాజకీయ నాయకులది కాదు. ప్రజలది. ప్రజ ల రక్తాన్ని కళ్ల జూస్తున్నారు. వాళ్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వాళ్ల కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల జీవితాల్లో రక్తకన్నీరు పెట్టిస్తున్నారు. అన్ని చోట్లా జరుగుతున్న రాజకీయం ఇదే. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే. కాకపోతే.. వేర్వేరు రాజకీయం. కామన్‌గా కనిపించేది ప్రజల రక్తం కళ్ల జూడటం.
ప్రజల మధ్య ఘర్షణలు పెట్టి చలి కాచుకునే రాజకీయం !
దేశం గురించి చెప్పుకుని బాధపడే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూద్దాం. నిజానికి ఇప్పుడు మనకు కాస్త తలెత్తి చూసి అసలేం జరుగుతోందని చూసేంత తీరిక లేదు. ఉన్నా… మన చుట్టూ మీడియా.. సోషల్ మీడియా ఆవరించి.. ఓ రకమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్తోంది. అందుకే జరుగున్నదేదో గుర్తించలేకపోతున్నాం. లేకపోతే తెలంగాణలో జరుగుతున్న రాజకీయం గురించి ఏ మాత్రం తెలియనట్లుగా.. రెండు వర్గాలుగా మారిపోయి .. ఒకరినొకరు నిందించుకునే ప్రయత్నంలో అందరూ మునిగిపోతారా ?. తెలంగాణకు రాజకీయం అనే దెయ్యం పట్టుకుంది. ఈ దెయ్యం మామూలుది కాదు. బ్రహ్మరాక్షసి లాంటిది. అధికారం నిలబెట్టుకోడానికి ఒకరు.. అధికారం పొందడానికి మరొకరు.. ఎలాగైనా పూర్వవైభవం పొందాలని మరొకరు పోరాడుతున్నారు. వీరి పోరాటం గతి తప్పిపోయింది. ఎలాంటి స్థితికి చేరిందంటే… చివరికి మత కల్లోలాలకూ వెనుకాడదని దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. అంతా ప్రీ ప్లాన్డ్ రాజకీయం. ఇంత సున్నిత రాజకీయంలో ప్రజలు ఇరుక్కుపోతారన్న కనీసం రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేకపోవడమే అసలు విషాదం.
ప్రజలు చచ్చిపోయినా అధికారం వస్తే చాలా !
మునావర్ ఎప్పుడో .. మధ్యప్రదేశ్‌లో హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేశారు. దానికి ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నిజానికి ఆయనో చిన్న కమెడియన్. కానీ అలా అన్నాడంటూ.. వీడియో తీసి ఆయనపై దాడులు చేసి కేసులు పెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. ఆయనకంత టాలెంట్ ఉందాలేదా అంటే.. ఆయనను అలా పెంచింది.. ఆయనను వ్యతిరేకించిన వాళ్లే. వాళ్లే ఇప్పుడు ఆయన ఎక్కడికెళ్లినా అడ్డుకుంటామని రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లో షో ఇచ్చారు. కానీ ఆయన తనదైన కామెడీ చేశారు కానీ హిందూ దేవుళ్ల కామెడీ చేయలేదు. కానీ రాజాసింగ్ మాత్రం .. వేరే మతాన్ని టార్గెట్ చేసుకుని వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టేశారు. ఇలా చేయడంలో అసలు ఉద్దేశం ఏమిటి ? మునావర్ ఏమీ వివాదాస్పదం చేయకపోయినా రాజాసింగ్ ఎందుకలా చేశారు ? ఇందులో గొప్పగా ఆలోచించి తేల్చుకోవాల్సిందేమీ లేదు. అదంతా రాజకీయం. బీజేపీ ఆయనను సస్పెండ్ చేసి ఉండవచ్చు గాక.. కానీ దీని వల్ల దేశవ్యాప్తంగా చెలరేగిన దుమారం వల్ల.. ప్రజలు ఎంత మంది అయినా నష్టపోవచ్చు కానీ అంతిమంగా లాభపడేది బీజేపీ. ఈ విషయం తెలియని మాయకులెవరూ లేదు. కానీ నష్టపోయేది ఎవరు ? అమాయక ప్రజలు. పాతబస్తీలో మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితి ఉంది. రోజువారీ కూలీ చేసుకునేవాళ్లు… చిరు వ్యాపారులు.. ఇతర వ్యాపారులు.. ఇలా అందరి ఆదాయం తగ్గిపోయింది. ఎవరో కొంత మంది చేసిన పనికి ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అల్లర్లలో ఒక్క ప్రాణం పోయినా … రాజకీయానిదే తప్పు. కానీ ఎవరు బాధ్యత తీసుకుంటారు ? ఎవరూ తీసుకోరు… ఇంకా చెప్పాలంటే క్రెడిట్ తీసుకుంటారు.. ఆ చావుతో రాజకీయం చేస్తారు. ఎవరూ మాట్లాడటానికి లేదు. ఇంత దారుణంగా మారిపోయిన రాజకీయం ప్రజలకు మేలు చేస్తుందా ? కీడు చేస్తుందా ? ఇలాంటి రాజకీయాల కోసమేనా ప్రజాస్వామ్యం ?
రాను రాను బ్రహ్మరాక్షసిగా మారుతున్న రాజకీయం !
తెలంగాణ రాజకీయంలో బీజేపీది ఒక్కరిదే తప్పు కాదు. అధికార పార్టీదీ అంతే ఉంది. బీజేపీ మత రాజకీయాలు చేస్తుదందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం.. బీజేపీని ప్రత్యర్థిగా ఎంచుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరమైన వ్యూహాన్ని అవలంభించింది. అది ప్లాన్డా లేకపోతే.. మరో కారణమా అన్నది వాళ్లకే తెలియాలి. కానీ ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా బీజేపీతో పోటీ పడి నష్టం చేస్తోంది. నిజానికి టీఆర్ఎస్ కూడా అదే తరహా రాజకీయాల్లో నుంచి పెరిగి పెద్దదై.. అధికారంలోకి వచ్చింది. ఇలాంటి రాజకీయాలంటే ఆ పార్టీకి కూడా ఓ గేమే. తెలంగాణ ఉద్యమం లో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనంతటికి కారణం టీఆర్ఎస్సేనని విమర్శించేవారు చాలా మంది ఉన్నారు. దీనికి కారణంగా టీఆర్ఎస్సా కాదా.. అనేది ఎవరికి వారు ఆలోచించి నిర్ణయించుకోవాలి. కానీ వందల మంది విద్యార్థులు… తెలంగాణ కోసం బలిదానం చేశారన్నది నిజం. వారి ఆశలు.. ఆకాంక్షలు ఫలించాయా లేదా అన్నది వేరే చర్చ.. కానీ ఉజ్వల భవిష్యత్ ఉన్న యువత ప్రాణాలు కోల్పోయారా లేదా అన్నది చూస్తే.. రాజకీయాల వల్ల దేశానికి జరిగిన కీడేంటో అర్థమైపోతుంది. ఇప్పుడు అంత కన్నా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. మతం పేరుతో చిచ్చు పెట్టి ఒకరినొకరు.. రక్తం చిందించుకుని కొట్టుకునేలా చేయడంలో ఎవరికి వారు పోటీ పడుతున్నారు.
ప్రజల మధ్య పార్టీల పేరుతో ఫ్యాక్షన్ గొడవలు పెడుతున్న ఏపీ అధికార పార్టీ !
ఏపీ రాజకీయాలు ఇంకా దారుణంగా తయారయ్యాయి. తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టుకుంటే.. ఏపీలో నేరుగా పార్టీల పేరుతోనే కొట్టుకుంటున్నారు. అందిన అధికారాన్ని ఎల్లకాలం నిలుపుకోవడానికి ప్రజల రక్తం కళ్ల జూసి .. చూపించి భయపెట్టి అయినా నిలబెట్టుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో అక్కడి రాజకీయం నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో రాజకీయ కార్యకలాపాలు చేపట్టడం అనేది హక్కుగా తీసుకుంటుంది. అందరి హక్కు ఉంది. కానీ ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఇలా ప్రజల్లోకి వెళ్తే .. గూండాలు దాడి చేస్తూంటారు. నేరుగా పార్టీ ఆఫీసుల్లోకి చొరబడి దాడి చేస్తూంటారు. పట్ట పగల హత్యాయత్నాలు చేస్తూంటారు. విమర్శిస్తే ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేస్తూంటారు. అన్ని సీసీ కెమెరాల్లో నమోదవుతున్నా కేసులు ఉండవు. పోలీసులే నిఘా వర్గాల సమాచారం సేకరించి.. అధికార పార్టీ నేతలకు సమాచారం ఇచ్చి దాడులు చేయించే దౌర్భాగ్య రాజకీయం అక్కడ నడుస్తోంది. పట్టపగలు అందరి ముందు నందం సుబ్బయ్య అనే వ్యక్తిని.. హత్య చేశారు. ఆ సమయంలో అక్కడకు ఆ వ్యక్తి వస్తారని చెప్పింది ఓ అధికారి. ఆ విషయం టెక్నికల్ రికార్డులతో ఉన్నా.. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి . ఇలాంటి హత్యలు లెక్కలేనన్ని. ఇక రక్తం కళ్ల జూసే ఘటనలు… గంట గంటకూ జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా నోరెత్తితే అంతు చూస్తామన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి లేదు కానీ.. ప్రజల సంగతి తేలుస్తామన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీ అండ ఉందని గూండాలు చెలరేగిపోతున్నాయి. కులం పేరుతోనో.. మతం పేరుతోనే.. పార్టీ పేరుతోనే కొంత మందిని కూడగట్టి.. మూకలుగా తయారు చేసి ఈ రాజకీయం చేసేస్తున్నారు.
ఏ రాజకీయం అయినా సాధారణ ప్రజలే సమిథలు !
అయితే ఈ రాజకీయంలో బాధితులుగా అధికార పార్టీ కానీ.. ప్రతిపక్ష పార్టీ కానీ కాదు. ప్రజలే. ఆ పార్టీలను నమ్ముకున్నవారే బాధితులు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు వెంటబడి కొడతారు. రేపు అధికారంలోకి వచ్చేవారు ఊరుకుంటారా ? అంతకు అంత బదులు తీర్చుకుంటారు ? ఎవరు నష్టపోయేది.. ఇక్క పార్టీలు నష్టపోవు.. పార్టీల నేతలూ నష్టపోరు. ఎన్ని గొడవలు జరిగినా ఆయా పార్టీల నేతలు మాత్రం సేఫ్ గానే ఉంటారు. కానీ కింది స్థాయి వారు మాత్రం ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. ఈ రాజకీయంలో బలి కావాల్సిందే. కింది స్థాయి వ్యక్తులను బలిచ్చి రాజకీయా పార్టీలు తమ అధికారానికి సోపానాలుగా వాడుకుంటాయి. లేదంటే నిలబెట్టుకునేందుకు ఉపయోగించుకుంటాయి.
యువతను ఆలోచించకుండా మీడియా, సోషల్ మీడియా ద్వారా ట్యూన్ చేస్తున్న రాజకీయం !
మతాల రాజకీయంలో అయినా.. వర్గాల పోరాటంలో అయినా ప్రజలే బకరాలు. అందులో డౌటే లేదు. అయితే తామనే పావులుగా చేసి ఆడుకుంటున్నారని ప్రజలకు తెలియదా ? ఖచ్చితంగా తెలుసు. కానీ వారు చుట్టూ ఓ రకమైన ఆలోచనా రహిత ప్రపంచం అలుముకుని ఉంది. సొంత ఆలోచనలు చేయకుండా అది నియంత్రిస్తోంది. మీడియా, సోషల్ మీడియా ప్రభావంలో ఒకరు చెప్పేది.. చేసేది మాత్రం చూసి ఇన్ స్పయిర్ అవుతున్నారు కానీ.. నిజమేంటి అని ఒక్క క్షణం ఆలోచించడం లేదు. ఈ రోజు తెలంగాణలో రాజాసింగ్ చేసింది ఎందుకోసమో జనం ఆలోచిస్తే.. ప్రశాంతంగా ఉంటారు. రెచ్చగొట్టడానికి చేసినట్లుగా ఉన్నా సరే.. ఇప్పుడు తాము స్పందించకపోతే చేతకాని వాళ్లమవుతామని.. ఈ సారి అంతకు మించి చేస్తారన్న కోపం వారిలో ఉంటుంది. అందుకే ఆటోమేటిక్‌గా రెస్పాండ్ అవుతారు. కానీ ఇలాంటి పరిణామాల్ని నిలపాల్సింది వ్యవస్థలు. పోలీసు వ్యవస్థ సహా పలు వ్యవస్థలు ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటూపని చేస్తున్నాయి. కానీ వారంతా ఏం చేస్తున్నారు..?. ఆ ప్రజల్నే పావులుగా ఆడేందుకు రాజకీయ పార్టీలకు సహకరిస్తున్నాయి. ప్రజలు నిజాలు తెలుసుకున్నా… ఆ రాజకీయంలో భాగం కాకపోతే… తమకు విలువ ఉండదనే పరిస్థితికి వచ్చాయి.దీనికి రాజకీయమే కారణం. ఏపీలోనూ అంతే. ఒక పార్టీ కొడుతోంది.. మేం కొట్టకపోతే చేతకాని వాల్లమనుకుంటారని వారూ దాడులు చేస్తున్నారు. ఒక వేళ అధికారం మారితే.. దెబ్బలు తిన్న వారి ఆగ్రహం కట్టలు తెగుతుంది. దాని వల్ల ఎవరు నష్టపోయేది ? బెంగాల్లో పరిస్థితులు చూసిన తర్వాత.. ఏపీలో అధికారం మారిన తరవాత అత్యంత దారుణమైన పరిస్థితులు ఉటాయని ముందుగానే హెచ్చరిస్తున్నారు.
ప్రజలెప్పుడు తెలుసుకుంటారు?
ఇప్పటి రాజకీయం చావుల్ని కోరుతోంది. రక్తం కళ్ల జూస్తోంది. అంతకు మించి… వర్గాలు..కులాలు.. ప్రాంతాల మధ్యచిచ్చు కోరుతోంది. ఎంత మందిని బలిస్తే అంత గొప్ప రాజకీయంగా మారింది. రాజకీయ పార్టీలన్నీ అంతే. అందుకే అవగాహన పెంచుకోవాల్సింది ప్రజలే. ఆ రాజకీయాల బారి న పడకుండా తమను తాము కాపాడుకోవాలి. లేకపోతే ఈ దేశంలో ప్రజలే కాదు.. దేశమే నష్టపోతుంది. ఎందుకంటే… దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులు !