భారత్‌కి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది..? తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించుకున్నారు..? నిర్భయ లాంటి చట్టాలను ప్రభుత్వాలు ఎలా తెచ్చాయి..? . స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు ఎలా ఏర్పాటయ్యాయి…? .. ఇవే కాదు.. దేశంలో మైలురాళ్లు అనదగ్గ కార్యక్రమాలు… అడుగులు అన్నింటినీ పరిశీలిస్తే… దానివెనుక ఉన్న ఒక్కటే… ప్రజల ఆందోళనలు. ప్రజలు అంతా ఒక్కటై పోరాడిన రోజున… వారికి కావాల్సింది వారు సాధించారు. తమ భయం ప్రభుత్వాలకు పెట్టి… తమ సంక్షేమాన్ని తాము కాచుకున్నారు. ప్రభుత్వాలు పీల్చి పిప్పి చేయకుండా… తమను తాము కాపాడుకుంటూ వస్తున్నారు. సుదీర్ఘంగా ఉద్యమాలు చేసి… అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఆరితేరిన వారు ప్రజలు. నాటి స్వాతంత్ర్య సంగ్రామం నుంచి నిన్నామొన్నటి తెలంగాణ ఉద్యమాల వరకూ అదే విషయాన్ని చాటి చెప్పాయి. ఇక అంతర్గతంగాసమస్యల ఉద్యమాలపై చెప్పాల్సిన పని లేదు. ప్రజలు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలే కుప్పకూలేలా ఉద్యమాలు జరిగాయి. అయితే ఇదంతా చరిత్ర.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది….ప్రభుత్వాలు కర్రు కాల్చి వాత పెడుతున్నా ప్రజల్లో స్పందన లేదు.. ఏదోలా బతికేద్దామని అనుకుంటున్నారు. ఫలితంగా అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వాల తెంపరితనం అన్ని విషయాల్లోనూ కనిపిస్తోంది.
ప్రభుత్వాలు తోలు తీస్తున్నా భరిస్తున్న జనం..! ఇంత సహనం అవసరమా..?
ఒకప్పుడు..పెట్రోల్‌పై పావలా రేట్లు పెంచితేనే… ప్రభుత్వాలను గడగలాడించేలా ఉద్యమించిన జనం ఇప్పుడు.. నెలకు రూ. ఇరవై రూపాయలు పెంచినా నోరు మెదపలేని దుస్థితికి మారిపోయారు. వారెందుకు అలా మారిపోయారు..?. ఈ ఆర్థిక సంవత్సరం అంటే.. ఏప్రిల్ నంచి జూన్ పదిహేనో తేదీ వరకు … రెండున్నర నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన ప్రత్యక్ష పన్నులు అక్షరాలా రూ.1,85,871 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఇదే సమయంలో రూ.92,762 కోట్లు మాత్రమే. ఈ రెండున్నర కాలంలో అత్యధిక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. అయినా ప్రత్యక్ష పన్నుల వసూళ్లే అన్ని ఉన్నాయంటే ఏ స్థాయిలో పిండుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఇవి ప్రత్యక్ష పన్నుల వసూళ్లే.. అంటే..ఇన్‌కంట్యాక్స్ లాంటివి. ఖర్చులు విపరీతంగా పెరిగినా .. పన్ను మినహాయింపులు పెద్దగా ఇవ్వకపోవడంతో కుటుంబ ఖర్చులకూ సరిపోని వేతన జీవుల దగ్గరా.. వేతనంలోనే మూల పన్ను వసూలు చేయడం ఎక్కువైపోయింది. ప్రొఫెషనల్స్ అని ఎవరైనా ఫ్రీలాన్సింగ్లాగా పని చేస్తూంటే.. వారు మూడు వేలు సంపాదించినా.. మూడు వందలు టాక్స్ కట్టించుకోవడం ప్రారంభించారు. ఇక పరోక్ష పన్నుల సంగతి చెప్పాల్సిన పని లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ పెట్రోల్ మీద నడుస్తోందా అన్నంతగా టాక్స్‌లు పెంచుతున్నారు. లీటర్ పెట్రోల్ ధర అన్ని రాష్ట్రాల్లో వంద దాటిపోయింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మాత్రం తగ్గుతున్నాయి. ఏడాదికి కేంద్రం పెట్రో పన్నుల ద్వారా రూ. నాలుగు లక్షల కోట్లు ఖాతాలో వేసుకుంటోంది. ప్రజల్ని నిలువుగా దోపిడీ చేయడం అంటే ఇదే. పన్నుల బాదుడే కాదు.. ఇక ప్రభుత్వాల విధానాల పరంగా… ప్రజల్ని పీడించేది ఎక్కువైపోయింది.
ఎలాగోలా బతికేస్తే చాలనుకునేలా “కుళ్లిపోయిన” ప్రజల ఆలోచనలు..!
” ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి” అని శ్రీశ్రీ ప్రవచించిన సందర్భం ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. ప్రజలు ఇప్పుడు యాంత్రికమైపోయారు. తమపై జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రశ్నించలేని స్థితికి చేరిపోయారు. సోషల్ మీడియాకు బానిసయ్యారో.. నిజాలు తెలుసుకోలేని నిస్సహాయతకు గురయ్యారో కానీ.. తమ కళ్లముందు కనిపిస్తున్నదాన్ని కూడా నమ్మలేని స్థితి చేరుకున్నారు. ఆ పరిస్థితి వారిని ఎముకలు కుళ్లిన .. వయసులు మళ్లిన సోమరులుగా మార్చేసింది. అంది వచ్చిన సోషల్ మీడియా శక్తితో రాజకీయపార్డీలు ప్రజల్ని.. ఓటు బ్యాంకులుగా మార్చేసుకున్ాయి. రాజకీయ పార్టీలు ప్రజలని “భాగస్వామ్యులు” గా కాకుండా “ఓటర్లుగా” చూడడం ఒకటైతే ఓటర్ల పని కేవలం ఓటు వేయడమే అనుకుని అసలు ప్రశ్నించాలి అంటే భయపడే వ్యవస్థని తయారు చేశారు “రాజకీయనాయకులు. ఫలితంగా ప్రభుత్వాలు చెలరేగిపోతున్నాయి. పన్నులు పిండుతున్నాయి. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. కేసులు పెడుతున్నాయి. కానీ అందరూ భరిస్తున్నారు. ఎవరూ నోరు మెదపడం లేదు. ప్రజల్లో చైతన్యం రావాలి అంటే ప్రజలు ప్రజాస్వామిక వ్యవస్థలో పాల్గొనాలి. కేవలం ఓటు వేసి ఆగిపోవడం కాదు. ఓటు వేసిన నేత అసలు చేసిన వాగ్ధానాలు నెరవేర్చాడా లేదా? అసలు చెప్పేవి చేసేవాటికి ఎంత వరకు పొంతన ఉంది? ఇవన్నీ ప్రశ్నించాల్సిన భాధ్యత ప్రజలది. నాయకులు కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ఆ చైతన్యం ఇప్పుడు పూర్తిగా కనుమరుగు అయింది.
“మన దాకా రాలేదు కదా” అనే భావన ఇంకెంత కాలం..!?
ఊళ్లో ఆ చివర ఇల్లు అంటుకుంటే… ఇక్కడ మన ఇంటిపై నీళ్లు చల్లుకుని … హమ్మయ్య ఆ నిప్పు .. మంటలు మన ఇంటిని చుట్టుముట్టవు అనుకోవడం అవివేకం. ఆ నీళ్లుమొదట్లోనే నిప్పు అంటుకున్న ఇంటిపై చల్లితే… మొత్తం ప్రశాంతం అవుతుంది. మంటలు చల్లారతాయి. అందరూ బాగుంటారు. కానీ ప్రజల్లో ఇప్పుడు ఆ స్పూర్తి తగ్గిపోయింది. ఆ మంటలు మన ఇంటి వరకూ రావు కదా అనే భావనే పెరిగిపోయింది. ఢిల్లీలో నిర్భయ అనే యువతిపై అఘాయిత్యం జరిగితే దేశమంతా ఉద్యమించింది..? అదే ఉత్తరప్రదేశ్ హద్రాస్ లో అంతకు మించి దారుణం జరిగితే ఎవరు స్పందించారు..? దారుణంగా రాజకీయపార్టీల వారీగా చీలిపోయిన ఓ వర్గం… చివరికి నిందితుల్ని సమర్థించే పరిస్థితికి వచ్చింది. చివరికి రైతుల్ని నట్టేట ముంచి… కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టే అత్యంత దారుణమైన చట్టాలుగా నిపుణులు విశ్లేషిస్తున్న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ తో పాటు ఉత్తరాదికి చెందిన రైతులు మాత్రమే ఉద్యమిస్తున్నారు. వారికి దేశ వ్యాప్త మద్దతు కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రం… మాకు సంబంధం లేదనుకున్నారు. ఫలితంగా ఆ రైతులు తమకు మద్దతు అందక… ప్రభుత్వ కుట్రలకు బలైపోతూ.. ఇంకా ఢిల్లీ సరిహద్దుల్లోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రజలు స్పందించాల్సిన అంశాలపై స్పందించకుండా… ఎలాగోలా బతికేద్దామనుకునే మైండ్‌సెట్‌కు వచ్చారని.. చాలా స్పష్టంగానే అంచనా వేసుకోవచ్చు.
ప్రజల్లో చీమూనెత్తురు తీసేశామని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయా..?
ఆరేడేళ్ల కిందటి వరకూ ప్రజల్లో చురుకుదనం ఉండేది. కానీ..ఆ తర్వాతే ప్రజల్ని నిమిత్తమాత్రులుగా చేస్తూ… వారిని ఓటర్లుగా విభజించేసి రాజకీయం చేయడం ప్రారంభించించారు. ఫలితంగా ప్రజలు ఇప్పుడు ఒక్కటి కాదు. పూర్తిగా విభజనకు గురయ్యారు. కుల, మత, ప్రాంతాల వారీగా విభజనకు గురయ్యారు. ప్రజల ఐక్యతను.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాకుండా చేయడంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా పాలక పార్టీలు సక్సెస్ అయ్యాయి. అందుకే… అసాధారణంగా పన్నులు పెంచి…ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నా.. కొంత మంది సమర్థిస్తున్నారు. ఓ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడితే.. తప్పేంటని ఎదురు వాదించే మేధావులూ తయారయ్యారు. దేశంలో వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నా… ప్రశ్నించే వారిని వేధిస్తున్నా… స్పందించే ప్రజలు కరవయ్యారు. అలా ఎవరైనా నోరెత్తితే.. వారికి మద్దతు కూడా ఉండటం లేదు. ప్రభుత్వాలు వారిని వేధిస్తున్నా.. మనకెందుకే అన్నట్లుగా ఉంటున్నారు. అంటే… ఓ రకంగా ప్రజల్లో స్పందనలను పూర్తిగా తగ్గించేశారు. విమర్శిస్తే బతుకు మీద దెబ్బకొడతారనే భయం… ప్రభుత్వాలను కాదంటే కుటుంబానికే రక్షణ ఉండనే ఆందోళన… ఇలా అన్నీ కలిసిపోయాయి. ఓ వైపు ప్రజల్ని చీల్చే రాజకీయం.. మరో వైపు కేసుల పెరుతో భయపెట్టే అధికార రాజకీయం కలిసి ప్రజల్ని … చీమునెత్తురూలేని వారిగా మార్చేశాయి. ప్రజల్ని రాజకీయ కుట్రలు చీల్చేశాయి. చైతన్యం తెచ్చుకోవాల్సింది ప్రజలే..!
అణిచివేత ఎంత అధికమయితే తిరుగుబాటు అంత వేగంగా వస్తుంది..!
” అణిచివేత ఎంత అధికమయితే తిరుగుబాటు అంత వేగంగా వస్తుంది..” చరిత్ర చెప్పిన .. నేర్పిన పాఠం ఇది. దీన్ని పాలకులు మర్చిపోవచ్చు. తాత్కాలికంగా విజయం తమదేనని భావించవచ్చు. కానీ ప్రజల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఎంతగా అణిచివేస్తే.. సమయం వచ్చినప్పుడు అంతకు రెండింతలు ఎక్కువగా ఎగసిపడతారు.అప్పుడు అది జ్వాలాగ్ని అవుతుంది. ప్రభుత్వాలు మాడి మసైపోతాయి. ప్రజలకు ఐదు వేలో పదివేలో ఇస్తున్నామని… దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాలను బూచిగా చూపి… దేశంలో కులాల్ని.. మతాల్ని బూచిగా చూపి చేసే రాజకీయం ఎల్లకాలం సాగదు. దేశం కోసం.. దేశంలోభాగమైన ప్రజల బాగు కోసం చేసే రాజకీయమే ఎప్పుడైనా కలకలం నిలుస్తుంది. కానీ గతి తప్పినరాజకీయ పార్టీలు ప్రజల్ని నిర్వీర్యం చేశామని సంతోషపడుతున్నాయి. కానీ ఏదో నాడు… మన ప్రజలు… మన పోరాట వారసత్వాన్ని గుర్తు చేసుకుంటాయి. గుండెల నిండా పోరాట స్ఫూర్తితో తెర ముందుకు వస్తాయి. గుండె చూపి హక్కుల కోసం పోరాడుతాయి. అందుకే యువతకు నాడు శ్రీశ్రీ పిలుపునిచ్చిన ఓ స్ఫూర్తిమంత్రాన్ని ఇక్కడ గుర్తు చేసుకుందాం..!
కదన విహారానికి కత్తి పట్టు
కార్మిక వీరుడవై సుత్తి తిప్పు
ప్రగతి విరోధుల భిత్తి కొట్టు
సామ్య వాదాన్ని నీ గుండెల్లో హత్తి పెట్టు
సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు .. శ్రీశ్రీ