“ సాదాసీదాగా వచ్చే విజయం ఎప్పటికీ కిక్కివ్వదు. కష్టపడి, ఇష్టపడి చేసిన శ్రమతో సాధించిన విజయం కళ్ల ముందు ఉన్నప్పుడు, ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆనందం, అనుభూతి మాటల్లో వర్ణించలేం”. ఇలాంటి విజయాలను రాజకీయాల్లో అందుకున్న నేత రేవంత్ రెడ్డి, ఆయన పాలనకు ఏడాది పూర్తి అయింది. ఖచ్చితంగా గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తన లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని నిర్మోహమాటంగా చెప్పే రేవంత్ రెడ్డి తన లక్ష్యాన్ని గత ఏడాది డిసెంబర్ ఏడో తేదీకి అందుకున్నారు. కానీ అక్కడే ఆయన మరో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దానికి తగ్గట్లుగానే పాలన సాగిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన ఏం చేశారు.. ఏం చేయాలనుకున్నారు అన్నది పక్కన పెడితే కొన్ని పాఠాలు మాత్రం ఆయన నేర్చుకున్నారని అనుకోవచ్చు. జీవితంలో ఎప్పుడు అయితే నేర్చుకోవడం ఆపేస్తారో అప్పుడే ఎదుగుదల ఆగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాల వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. నిరంతరం నేర్చుకుంటూ తప్పులు దిద్దుకుంటూ ఆయన పాలన సాగిస్తున్నారు. అదే రేవంత్ రెడ్డిని అసలైన రాజకీయ నేతను.. తెలివైన వ్యూహకర్తను ప్రత్యర్థుల ముందు ఉంచుతోంది.
అహమే లేని ముఖ్యమంత్రి రేవంత్
చపాతీ ఎలా చేయాలో క్లాసులో నేర్పుతారు కానీ నిజంగా ఆ చపాతీని చేయడానికి ప్రాక్టికల్స్ శిక్షణ ఉండాల్సిందే. క్లాస్ రూమ్‌లో నేర్చుకుని నేరుగా వంట గదిలోకి వెళ్లిపోతే చపాతి కాస్త ప్రోగా అవ్వొచ్చు. అందుకే ప్రాక్టికల్స్ శిక్షణ చాలా అవసరం. రాజకీయం ఎలా వచ్చినా.. ఎందుకు అలా జరిగినా రేవంత్ రెడ్డి మాత్రం పాలనలో సరైన అనుభవం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. తనపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ఒకేమాటలో విశదీకరించే ప్రయత్నం చేసేవారు. అదేమిటంటే తాను ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క సారి కూడా అధికార పార్టీలో లేనని .. అలాంటిది తాను ఎలా అక్రమాలు చేస్తానని ఆయన ప్రశ్నిస్తారు. ఇందులో వంద శాతం నిజం ఉంది. రేవంత్ రెడ్డి ఎప్పుడూ అధికార పార్టీలో లేరు. మొదట ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. అక్కడ తనను గుర్తించడానికి నిరాకరించే పరిస్థితులు ఉండటంతో సొంతంగా రాజకీయం చేసుకున్నారు. జడ్పీటీసీగా.. ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి .. కాంగ్రెస్ లోకి రావాలని బంపర్ ఆఫర్లు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలోనే చేరారు. టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరారు. అంటే రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు కానీ.. అధికారాన్ని మాత్రం అనుభవించలేదు. అంటే నెగెటివ్ కోణంలో అయితే రేవంత్ రెడ్డికి కనీస పాలానానుభవం లేదు. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారు. మంత్రిగా కూడా ఎప్పుడూ బాధ్యతలు నిర్వర్తించలేదు. కానీ నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయనకు ఆ సామర్థ్యం రాజకీయంగా ఉంది కాబట్టే ఆ పదవి వచ్చింది. మరి పాలనలో ఆయనకు ఆ సామర్థ్యం ఉందా అన్న అనుమానాలు చాలా మందిలో ఉండేవి. వాటిని రేవంత్ రెడ్డి ఏడాదిలో పటా పంచలు చేశారు. తాను రాజకీయంలోనే కాదు.. పాలనలనూ కేసీఆర్ తో సమ ఉజ్జీ అయిన నేతను అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ లో ఉన్నది. రేవంత్ రెడ్డిలో లేనిది ఒక్కటే.. అదే అహం. వేరే వాళ్లు చెబితే మేము వినుకునేది ఏమిటి అనే అహం మాత్రం రేవంత్ రెడ్డిలో లేదు. అదే ఆయనను రాను రాను రాటుదేలుస్తుందని అనుకోవచ్చు.
అనుభవం లేకపోవడం సమస్యే కానీ నేర్చుకునే తత్వం !
మూడు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తున్నామని జనవరిలో రైతు ఖాతాల్లో నగదుజమ చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు రైతుబంధు పథకంపై పునరాలోచనలో ఉన్నారు. ఎందుకంటే రెండు లక్షల వరకూ రుణమాఫీ చేశారు. సన్నవడ్లు పండించే రైతులకు రూ. ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు. దీని వల్ల ఒక్కో రైతుకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది. అందుకే ఇంకా రైతు బంధు ఎందుకు అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఆ రైతు బంధు వేదికగానే రాజకీయం చేస్తోంది. ప్రజల్లో పాత పథకాలు ఆగిపోతే అసంతృప్తి ఉంటుందన్న ఫీడ్ బ్యాక్ రావడంతో ఆయన ఆలస్యం చేయలేదు. తన ఇంట్రోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించేశారు. ఇక్కడే ఆయన భేషజాలకు పోలేదు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు దూకుడుగా ఉంటున్నాయని.. ఆయనకు నష్టం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపించినప్పుడు తన విచక్షణ మేరకు పునరాలోచించడం చేస్తున్నారు. ఈ పరిణితి రేవంత్ రెడ్డిని రోజు రోజుకు బలోపేతం చేస్తోంది. అధికారం వచ్చిందని ఆయన నియంత స్వామ్యంతో ఉండటం లేదు. అందరికీ స్వేచ్చ ఇస్తున్నారు. ఆ స్వేచ్చ దుర్వినియోగం చేస్తే వ్యవస్థలు ఎలా పని చేస్తాయో చూపిస్తున్నారు. గతంలో ప్రజాస్వామ్యం లేదు.. ఇప్పుడు ఉంది అని అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే హీరోలు.. వాళ్లే పాలకులు. ఈ సూత్రాన్ని అధికారంలో ఉన్న వారు మర్చిపోతే ఇవాళ కాకపోతే రేపు కిందకు లాగేస్తారు ఓటర్లు. ఈ విషయం రేవంత్ రెడ్డి ఎప్పుడు మనసులో పెట్టుకునే పరిపాలన చేస్తున్నారని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. హైడ్రా విషయంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు కానీ వ్యూహాత్మకంగానే కూల్చివేతలు ఆపేశారు. మూసి కూడా అంతే. .నిజానికి ఈ రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి తాను అనుకున్నట్లుగా అయిపోతుందని అనుకున్నారు. అందుకే దూకుడుగా ముందడుగు వేశారు. అదే పాలనానుభవం లేకపోవడం. కానీ వెంటనే తెలుసుకున్నారు. అక్కడే ఆయన రాజకీయ నాయకుడిగా ఎంతో దూరం ప్రయాణించబోతున్నారని ఎవరికైనా అర్థమవుతుంది.
ప్రజలకు ఏది కావాలో అంచనా వేయడంలో సఫలం
రేవంత్ రెడ్డికి పాలనానుభవం లేదు కానీ ప్రజా సమస్యలను గుర్తించడం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం కావాల్సినంత ఎక్స్ పీరియన్స్ ఉంది. అంతే కాదు పాలనలో తన మార్క్ అంటే ఏమిటో.. ముఖ్యమంత్రిగా తాను చేసిన పనులు చరిత్రలో నిలిచిపోవాలంటే ఏం చేయాలో కూడా క్లారిటీ ఉంది. అందుకే రుణమాఫీతో పాటు ఉచిత బస్సు వంటి పథకాలను ముందూ వెనుకా చూడకుండా అమలు చేశారు. ఏ పథకంలో అయినా వంద శాతం సంతృప్తి అసాధ్యం. రుణమాఫీలో కూడా అంతే. ఎవరికిరాలేదో వాళ్లను ముందు పెట్టి రాజకీయాలు చేస్తాయి విపక్షాలు.. కానీ వచ్చినవాళ్లను ముందుపెట్టి అదే రాజకీయం చేయలేదు అధికారపార్టీ. అయితే భేషజాలకు పోకుండా వారికీ రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది వివక్ష లేని తెలంగాణ. గత పదేళ్ల కాలంలో ప్రజలు తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారని ఉమ్మడి రాష్ట్రం కంటే ఘోరంగా పరిస్థితి మారిందన్న భావనకు వచ్చారు. దానికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ ఓ దొరలా గడీకే పరిమితం కావడం. దాన్ని రేవంత్ రెడ్డి మార్చేశారు. ఈ రోజున ముఖ్యమంత్రిని ఎవరైనా సులభంగా కలవొచ్చు. ఆయన వస్తున్నాడని.. జన జీవితాన్ని స్తంభింపచేయరు. ఇలా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పాలనలో లోపాలను సరిదిద్దుతూ ఆ మార్పును ప్రజల ముందు ఉంచేలా చూసుకుంటూ పాలన సాగిస్తున్నారు.
సీనియర్ల రాజకీయాలతో సమన్వయం
కాంగ్రెస్ లో ఉండే మరో టాస్క్ .. పార్టీని ఏకతాటిపై నడిపించుకోవడం. రేవంత్ రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో లేరు. కేసీఆర్ ను రాజకీయంగా పదవీచ్యుతుడిని చేయడానికి రాజకీయ పునరేకీకరణ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న నేతల వల్ల అది కాలేదు. కానీ అందరి శక్తి, యుక్తులకు తన బలాన్ని ఉపయోగించి రేవంత్ ఆ లక్ష్యం సాధించారు. ఇప్పుడు సీనియర్ల ఆశలు కూడా అలాగే ఉంటాయి. అందర్నీ ఏకతాటిపై నడిపించేలా రేవంత్ రెడ్డి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. రేవంత్ అధికారం చేపట్టిన మొదట్లో అందరూ వైఎస్ మోడల్ అమలు చేసి పార్టీపై పట్టు సాధించుకోవాలని సలహాలిచ్చారు.కానీ ఆయన రేవంత్ మోడల్ అమలు చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిని అయినా.. తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నా.. సీనియర్లకు ఏ మాత్రం గౌరవం తగ్గనీయడం లేదు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్కసహా అందరూ రేవంత్ విషయంలో సాఫ్ట్ గానే ఉంటున్నారు. తమకు చాన్స్ వచ్చినప్పుడు వారు విశ్వరూపం చూపిస్తారేమో కానీ అలాంటి పరిస్థితి తన వైపు నుంచి రాకుండా అందర్నీ గౌరవిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లోఇలా కలుపుకుని వెళ్లడం క్లిష్టమైన విషయం. కానీ దాన్ని రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చేసి చూపిస్తున్నారు.
సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు మొదటి ఏడాది గట్టి పునాది !
తప్పులు అందరూ చేస్తారు. తప్పు చేయకపోతే అనుభవం రాదు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలోనూ అలాంటి తప్పులు జరిగి ఉంటాయి.. కానీ ఎప్పటికప్పుడు ఆయన కరెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడా బేషజాలకు పోవడం లేదు. తాను చేసింది కరెక్ట్ అని నమ్మితే ఎవరి మాటలు వినడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. వంద శాతం పర ఫెక్ట్ గా ఎవరూ ఏ పనీ చేయలేరు. కానీ ఎంత సాధ్యమయితే అంత పర ఫెక్ట్ గా చేయాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఏడాది పాలనలో వందకు వంద మార్కులు పడతాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే విషయంలో ఆయన భాషపై కొంత మంది విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే రాజకీయం గురించి ఆయనకు నేర్పాల్పిన పని లేదు. ఆయనే పయనమే రాజకీయంగా ఓ పాఠం . మొత్తంగా రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఓ బ్యాట్స్‌మెన్‌గా హిట్టింగ్ చేయడమే కాదు.. నిలకడగా ఆడటం కూడా వచ్చు అని నిరూపించారు. ఇక మనం చూడాల్సింది లాంగ్ ఇన్నింగ్సే.