” ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒకే ఒక్క పెద్ద వైరస్ సోషల్ మీడియా. అది కరోనా కంటే భయంకరమైనది. దేశాలకు దేశాలు.. సమాజాలకు సమాజాలను నైతికంగా దిగజారుస్తోంది. విలువల్లేకుండా చేస్తోంది.!” ఒక్క సారి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సహా సమస్త సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల నుంచి సైనాఫ్ అయి తల ఎత్తి చూస్తే.. ప్రతి ఒక్కరికి అనిపించే.. కనిపించే వాస్తవం ఇది.
జీవితాలను కమ్మేస్తున్న సోషల్ మీడియా
గూగుల్‌లో ఆర్కుట్ అనే ఓ సోషల్ నెట్ వర్క్ వచ్చినప్పుడు అందరూ అబ్బురంగా చూశారు. యువత కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ అలా కనెక్టయ్యే వంద మందిలో 90 శాతం మందివి దురాలోచనలే. ఆ తర్వాత ఫేస్బుక్ వచ్చింది. ఆర్కుట్ మూతపడిపోయింది. కానీ ఫేస్ బుక్.. ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకుంది. బిలియన్లకు బిలియన్ల డాలర్లు ఆర్జిస్తోంది. ఇదంతా ఎన్ని జీవితాలను నాశనం చేసి.. ఎన్ని సమాజాలను విచ్చిన్న చేసి.. ఎన్ని కుటుంబాల్లో నిప్పులు పోసి సంపాదిస్తుందో అంచనా వేయడం కష్టం. ఫేస్బుక్ కు జనం అంతా కనెక్టయిన తర్వాత ఓ దశలో అమెరికాలో అత్యధిక విడాకులకు ఫేస్బుక్ కారణం అయింది.అందులో చేసే చాటింగ్‌లు కారణం అయ్యాయి. తర్వాత వాట్సాప్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మెల్లగా యూట్యూబ్, ఎక్స్ గా మారిన ట్విట్టర్, ఇన్ స్టా, లింక్డ్ ఇన్ ఇలా ఎన్నో లెక్కలేనన్ని వచ్చి పడ్డాయి. ఈ సోషల్ సాలెగూడులో ఇరుక్కున్న వారు ఒక్క దానితో సరి పెట్టుకోలేరు. అన్నింటిలోనూ ఉండాల్సిందే.
సోషల్ నెట్ వర్క్ కలపట్లేదు చిచ్చు పెట్టి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది !
నిజానికి ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే ఈ సోషల్ నెట్వర్క్ మంచికి ఉపయోగించుకుంటే అభివృద్ధి చెందవచ్చు. కానీ ప్రపంచంలో ఏ సమాజంలో అయినా మంచి కంటే చెడునే ఎక్కువ మంది ముందుగా చూస్తారు. వీటిలోనూ అదే చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులు చూసిన తర్వాత అసలు ఆ మీడియాలను వారు ఎలా వాడారు అని తెలిస్తే.. ఇంత ఘోరమైన స్వేచ్చ ఇందులో ఉందా అని తెలియని వారు ఆశ్చర్యపోతారు. నిజానికి ఈ సమస్య ఒక్క ఏపీలో కాదు.. దేశంలోనే కాదు.. ప్రపంంచ మొత్తం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియా చేసిన ఫేక్ ప్రచారాల గురించి అమెరికా ఎన్నికల గురించి ఫాలో అయిన వారికి అర్తం అయిపోతుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా మనుషుల్ని కనెక్ట్ చేయడం లేదు. సమాజాలను..దేశాల్లోని దూరాలను తగ్గించడం లేదు. మరింత పెంచుతుంది. ఒక్క సోషల్ మీడియా పోస్టు వల్ల వల్ల ఎన్ని వర్గాలు కొట్టుకు చస్తున్నాయో కాళ్ల ముందే ఉంది. ఒకరి కుటుంబాలను మరొకరు కించ పర్చుకోవడం దగ్గర నుంచి కులాలు, మతాలు, వర్గాలు , ప్రాంతాలు ఇలా దేన్నీ వదలకుండా ఇష్టం వచ్చినట్లుగా చిచ్చు పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దీని వల్ల జరిగే అనర్థాలకు సమాజం అంతా ప్రతిఫలం చెల్లించాల్సి వస్తోంది. సోషల్ మీడియా అనర్థాలు.. మొదట కుటుంబంలో కనిపించాయి.. తర్వాత సమాజంలో వచ్చాయి. ఇప్పుడు అవి అంతంకతకూ పాకిపోతున్నాయి. దేశాల మధ్య అంతరాలకూ కారణం అవుతున్నాయి. ఈ వైరస్ ఎవరూ ఊహించని విధంగా విస్తరించింది. కంట్రోల్ చేయాలన్న ఆలోచన రానంత వేకంగా విస్తరించింది. ఇప్పుడు కంట్రోల్ చేయలేనంతగా వ్యాపించింది. సోషల్ మీడియా అనేది ఓ విశృంఖల స్వచ్చగా మారిపోయింది. ఈ వైరస్ వికృతంగా మారిపోతూ విస్తరిస్తోంది. అంతకంతకూ పాకిపోతోంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి కంట్రోల్ చేసే ప్రయత్నం అయినా చేయవద్దా?
ఇప్పుడు నియంత్రణ కలసి కట్టుగా చేయాలి !
ఈ సోషల్ వైరస్ నియంత్రణ వ్యక్తుల స్థాయిలో చేయలేరు.. కంపెనీల స్థాయిలో చేయలేరు..విడివిడిగా ఎవరికి వారు.. అన్ని దేశాలు వేర్వేరుగా చేయలేరు. ప్రపంచం మొత్తం కలసికట్టుగా ఈ వైరస్ ను కంట్రోల్ చేయాలి. కరోనా వైరస్‌పై ఎలా ప్రపంచం అంతా ఏకమై పోరాడిందో అలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఓ టీవీ చానల్ ప్రారంభించాలంటే.. ఎన్నో ఆంక్షలు పెడుతుంది. ఆ తర్వాతే లైసెన్స్ ఇస్తుంది. కానీ ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడనికి ఒక్క ఈమెయిల్ ఐడీ చాలు. ఆ యూట్యూబ్ చానల్ పెట్టుకుని తాము చెప్పాలనుకున్న ప్రతి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలాంటివి ఉండకూడదనే ప్రభుత్వాలు మీడియా సంస్థలకు అనుమతులు ఇచ్చే విషయంలో రూల్స్ పెడతాయి. ఓ యూట్యూబ్ చానల్ పెట్టేవాడి సమాచారం ఏమీ ఉండదు.. ఏదీ కావాలంటే అది పెట్టేస్తాడు. చివరికి చావు వార్తలు కూడా. ఫలానా వ్యక్తి చనిపోయాడు..శ్రద్ధాంజలి అని పెట్టేస్తారు. కాసిని వ్యూస్ సంపాదించుకుని .. డబ్బులు పోగేసుకుంటారు.కానీ ఆ తప్పుడు ప్రచారానికి గురైన వ్యక్తి .. కుటుంబ సభ్యుల పరిస్థితి.. శ్రేయోభిలాషుల పరిస్థితి ఏమిటి ?. ఇలాంటి మానసిక క్షోభ అమితాబ్ బచ్చన్ నుంచి కోటా శ్రీనివాసరావు వరకూ అందరూ అనుభవించారు. ఒక్క ఈ విషయంలో కాదు ప్రతీ విషయంలోనూ అంతే. ప్రతి ఒక్కరూ ప్రజాభిప్రాయం ఇదే అని.. వీడియోలు చేసేస్తూంటారు. ప్రముఖుల వ్యక్తిత్వాలను కించ పరిచేస్తూంటారు. ట్విట్టర్, ఫేస్బుక్లుకూడా అంతే. చివరికి ఇవి రాజకీయ పార్టీల చేతుల్లో పడ్డాయి. ఆయా రాజకీయ పార్టీలు అవినీతి సొమ్ముతో.. ఏకంగా సోషల్ మీడియా సైన్యాలను తయారు చేసి.. అమాయకంగా కనిపించే సోషల్ యూజర్ల మెళ్లలో విషం నింపేస్తున్నాయి. ఫలితంగా.. ఇప్పుడు రాజకీయాలు అంటే వ్యక్తిగత శుత్రుత్వాల స్థాయికి వెళ్లిపోయాయి. ఇది ఒక్క చోట జరుగుతున్న తతంగం కాదు. దేశమంతా జరుగుతున్నదే. ప్రపంచం అంతా చూస్తున్నదే.
తెస్తున్న ప్రమాదాలపై ఇప్పటికే ఆలస్యం !
ఇప్పుడు ప్రపంచం ముందు ఆనకొండలా సోషల్ నెట్ వర్క్ ఉంది. దీన్ని అంతం చేయడం అసాధ్యం. కానీ నియంత్రించకపోతే ప్రపంచం మొత్తం దాని నోట్లో చిక్కి అల్లకల్లలోం కావాల్సిందే. మరి ఏం చేయాలి.? ఇప్పుడైనా మేలుకుని ఈ ఆనకొండను నియంత్రించే ప్రయత్నం చేయాలి. అందు కోసం రెగ్యులేటరీలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియాను విచ్చలవిడిగా ప్రారంభించేసి.. చిచ్చు పెట్టేసి.. వెళ్లిపోవాలనుకునేేవారికి కళ్లెం వేయాలి. ప్రతి ఒక్కరికి ఒక్క అకౌంట్ మాత్రమే పరిమితం చేసేలా చూడాలి. అది కూడా అధికారిక వెరీపికేషన్తో . మన దేశంలో ఆధార్‌తో అనుబంధానం చేయాలి. అలా చేసిన సోషల్ మీడియా ఖాతాలు మాత్రమ పని చేయాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫీలయ్యే అవకాశం ఉంది. అది ఎక్స్ అయినా..ఫేస్ బుక్ అయినా సరరే. ఇలా చేయడం వల్ల ఫేక్ అకౌంట్లతో వచ్చి తాము వాగాలనుకున్నది వాగేసి పోవడం కాదు. తాము వ్యక్తం చేసే అభిప్రాయానికి వారు బద్దుడై ఉండాలి. లేకపోతే.. వేరే వారి జీవితాలతో వారు ఆడుకున్నట్లే అవుతుంది. వాట్సాప్ విషయంలో ఇప్పటికే కొన్ని చర్యలను మెటా తీసుకుంది. అలాంటి చర్యలను ఫేస్బుక్, ఇన్‌స్టాల విషయంలో తీసుకోవడం లేదు. ఫేక్ అకౌంట్లను నియంత్రించాల్సి ఉంది. ఎక్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని మానిటైజ్ చేసిన తర్వాత ముంచుకొస్తున్న ముప్పు ఇంకా ఎక్కువగా ఉంది. మానిటైజ్ చేసినప్పుడు కచ్చితంగా ఖాతాల్ని డబ్బులు కట్టిన వారికే వెరీపై ఛేయకూడదు. ఒక వ్యక్తికి ఒక్క ఖాతానే ఉండేలా చూడాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. వీటన్నింటితో పాటు అత్యంత ప్రమాదకమైన సోషల్ మీడియా యూట్యూబ్. న్యూస్ చెప్పాలంటే ముందుగా ఓ అర్హత ఉండాలి. ఎవరు పడితే వారు.. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని వారు తాము దగ్గరకు వెళ్లి చూసి చెబుతున్నట్లుగా చెప్పేస్తున్నారు. ఫేక్ న్యూస్ తో సమాజం కల్లోలం అయిపోతోంది. ఓ టీవీ చానల్ ప్రారంభించడానికి ఎలాంటి లైసెన్సింగ్ వ్యవస్థ ఉండాలో అలాంటి లైసెన్సింగ్ వ్యవస్థను యూట్యూబ్కూ తేవాలి. లేకపోతే ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో యూట్యూబ్ ఓపెన్ చేసి .. థంబ్ నెయిల్స్ చూస్తే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరి జీవితాలతో యూట్యూబర్లు ఆడుకుంటున్నారు. చాలా మంది తమ కుటుంబాల్లో జరిగే వాటినీ ఎక్కించుకుంటున్నారు. వాటినే ఉపాధి గా మార్చుకుంటున్నారు. కొంత మంది వేరే కుటుంబాలను ఇలా ఆన్ లైన్ లో పడేస్తున్నారు.
మంచి మాత్రమే జరిగేలా రెగ్యులేటరీని ఏర్పాటు చేసుకోవాలి !
సోషల్ మీడియాలో మంచే లేదా.. అంతా చెడే ఉందా అంటే.. ఖచ్చితంగా మంచి ఉంది. కానీ అ మంచిని కాకుండా దాన్ని చెడుగా వాడుకుని షార్ట్ కట్లో సమాజాన్ని నాశనం చేసి తాము ఎదగాలనుకునే కొంత మంది అతి తెలివి వ్యక్తుల కారణంగా ఆ మంచి మరుగునపడిపోయింది. సోషల్ మీడియా ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఓ అద్భుతమైన నెట్ వర్క్. జీవితాలను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగడే… అవకాశాలను ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడే సాధనం. కానీ ఇప్పుడు దీన్ని దేనికి వాడుతున్నారు…?. దేశ జనాభాలో 18-35 వయస్సులో 12 కోట్ల మంది అటు చదువుకోకుండా ఇటు ఎక్కడా పని చేయకుండా(సోషల్ మీడియాలో రీళ్లు చూస్తూ) ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రీల్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ప్రతి పది రీల్స్‌లో తొమ్మిది అర్థనగ్న, సాఫ్ట్ పోర్న్ రీల్సే. వీటిని అలవాటు పడిన వారు చూడకుండా ఉండలేరు. ఇదో వైరస్ లాగా పాకిపోతుంది. బిహార్, యూపీ పౌరుల సగటు ఆదాయం నేపాల్, బంగ్లాదేశ్ కన్నా తక్కువ .. వీరికి చేసుకోవడానికి పనులు లేక కాదు.. రీల్స్‌కు అలవాటు పడి ప్రభుత్వం పథకాల రూపంలో ఇచ్చే డబ్బులు తిని బతికేస్తున్నారు. దేశ జనాభాలో ఆదాయపరంగా మధ్యలో ఉన్న 35 శాతం మంది ఆదాయం పదిహేనేళ్లుగా నానాటికీ తగ్గిపోతోంది. దీనికి కారణం సోషల్ మీడీయాకు బానిసలు కావడమే. అదే సమయంలో కటిక దరిద్రంలో ఉన్న చివరి 20 శాతం మందికి ప్రభుత్వ పథకాల సొమ్మును కలుపుకుంటే స్వల్పంగా ఆదాయం పెరిగింది. అంటే పని చేసేవారు చేస్తున్నారు..మిగిలిన వారు మాత్రం వారి ఆదాయాన్నే ప్రభుత్వాల ద్వారా పొందుతున్నారు.
అంటే దేశాన్ని.. దేశ ప్రజలను కాపాడుకోవాలంటే.. సోషల్ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనిపెట్టాల్సిందే. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తాయని ఆశిద్దాం !