నాడు..
ఎఫ్ఐఆర్లో పేరు లేదు. ఏ కేసులో అరెస్టు చేస్తారో చెప్పలేదు.. ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. కానీ ఓ మాజీ ముఖ్యమంత్రిని అర్థరాత్రి కర్నూలు జిల్లా పర్యటనలో .. విశ్రాంతిలో ఉంటే బస్సును కూడా లాక్కెళ్లిపోతామని బెదిరించి అరెస్టు చేశారు. ఆ తర్వాత 24 గంటలకు కోర్టులో హాజరు పరిచారు. 74 ఏళ్లు, పధ్నాలుగేళ్లు సీఎంగా చేసిన నేతతో ”వ్యవస్థ” వ్యవహరించిన తీరు ఇది. నోటీసులు ఇచ్చి వివరణ అడిగి.. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుంచి అనుమతి తీసుకుని చేయాల్సిన అరెస్టులో రాత్రికి రాత్రి వ్యవస్థ అద్భుతంగా పని చేసింది. ఇదేమిటని ఏ ఇతర రాజ్యాంగ వ్యవస్థా అడగలేకపోయింది.
నేడు
“మీరు నోటీసులిస్తే మాకు తీరిక ఉండొద్దా..?. మేం చాలా బిజీ. ఖాళీగా ఉన్నప్పుడు వస్తాం. అది కూడా సాధ్యం కాదు..కావాలంటే ప్రశ్నలు పంపండి లాయర్లతో సమాధానాలిస్తాం ?” .
ఇదీ సేమ్ పధ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చట్టం ముందు అందరూ సమానమేనని.. కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా నోటీసులు జారీ చేయకుండా.. వివరణ తీసుకోకుండా అరెస్టు చేసిన వ్యవస్థకు .. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేసుకున్న నిందితులు ఇస్తున్న సమాధానాలు. ఈ సమాధానాలకు ఆ వ్యవస్థలకు కోపం రావడం లేదు. పాపం నిజంగానే బిజీగా ఉన్నారని సమాధానపడుతున్నారు. మరో నోటీసు ఇస్తున్నారు. అంతే కానీ .. చర్యలకు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.
ప్రజల రక్తమాంసాలు పీల్చినా వాళ్లపై జాలి, దయ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం మామూలు అవినీతి కాదు. సహజ వనరులు కొట్టేసిన అవినీతి అయితే ..ప్రజా సంపదను మాత్రమే దోచుకున్నట్లు అవుతుంది. కానీ ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్న స్కాం. వారి రక్త మాంసాలను ఐదు సంవత్సరాల పాటు పీల్చుకున్న స్కాం. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు రాక్షసులతో సమానం. మద్యనిషేధం చేస్తామని చెప్పి.. షాక్ కొట్టే ధరలు పెడితే కొనరు అని చెప్పి దోపిడీకి మొదటి అడుగు వేశారు. ప్రభుత్వం తమదే కాబట్టి..దుకాణాల్లో మద్యం విక్రయించే వారి దగ్గర నుంచి.. మద్యం తయారీ వరకూ మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు చేస్తే లెక్కలు తెలుస్తాయని కేవలం నగదు లావాదేవీలే కొనసాగించారు. ఒక్క ఇతర బ్రాండ్ మద్యాన్ని ఏపీలోకి రానివ్వలేదు. సొంత వ్యాపార సామ్రాజ్యం అన్నట్లుగా ఏపీని మార్చుకుని నకిలీ మద్యాన్ని అత్యధిక రేట్లకు అమ్మారు. కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు ఈ మద్యం దెబ్బకు పాడయ్యాయని నివేదికలు ఉన్నాయి. కొన్ని వేల కోట్ల నగదు మనీ లాండరింగ్ జరిగిందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కేసులో దర్యాప్తు ఎలా జరుగుతోంది?. నిందితులు ఎలా వ్యవహరిస్తున్నారు ?
మద్యం స్కాంలో అందరూ పరార్
మద్యం స్కాం మొత్తానికి రాజ్ కసిరెడ్డే కర్త, కర్మ, క్రియ అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీలో లిక్కర్ స్కాం జరగలేదన్న ప్రశ్నే లేదని విజయసాయిరెడ్డి స్పందనతో స్పష్టమవుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం చేసింది రాజ్ కసిరెడ్డి. కేవలం ఐటీ సలహాదారుగా.. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే దాన్ని ప్రాసెస్ చేసే సంస్థ ఓనర్ గా ఉన్న రాజ్ కసిరెడ్డి మద్యం స్కాం చేస్తూంటే ప్రభుత్వ పెద్దలు చూస్తూ ఊరుకుంటారా?. అసలు స్కాం చేసే అవకాశం ఆయనకు ఎలా వస్తుంది?. ఆయన పాత్రధారి మాత్రమే.. కాకపోతే కీలక పాత్రధారి. ఆయన ఇలా ప్రజల రక్త , మాంసాలతో దోచుకున్న డబ్బులన్నీ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, ఆస్పత్రులు, సినిమాల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఓ సాధారణ ఐ ప్యాక్ ఉద్యోగి అయిన రాజ్ కసిరెడ్డికి వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాదా?. ఆయన బినామీల పేర్లతో పెద్దల డబ్బులను కూడా పెట్టుబడులుగా పెట్టారు. అందుకే ఇప్పుడు ఆయన కనిపించకుండా పోయారు. మొదట్లో తాను ఐటీ సలహాదారునని మద్యం స్కాంతో తనకేం సంబంధం అని వాదించారు. పోలీసులు ఆధారాలతో నోటీసులు జారీ చేస్తే.. కుటుంబసభ్యులతో సహా పరారయ్యాడు. ఆయన అంత కీలకమని తెలిసినప్పుడు న్యాయపరమైన అవకాశాలు ఎందుకు కల్పించాలి..?. అది కూడా కోల్పోయిన తర్వాత ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోయారు ?. రాజ్ కసిరెడ్డి అక్కడ పెట్టుబడులు పెట్టారు.. ఇక్కడ పెట్టుబడులు పెట్టారని లీకులు ఇస్తున్నారు కానీ.. అసలు పాత్రధారుల దాకా ఇంకా వెళ్లలేదు.
విజయసాయిరెడ్డి సాక్షి ఎలా అవుతారు – దోపిడీలో ఆయన భాగం !
లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పాత్రధారి అయిన ఎంపీ మిథున్ రెడ్డితో సీఐడీ పోలీసుల వ్యవహరిస్తున్న తీరు మరింత జాలి గొలిపేలా ఉంది. ఆయన పాత్ర చాలా స్పష్టంగా ఉందని.. మనీలాండరింగ్ మొత్తం ఆయన చేతుల మీదుగానే నడిచిందని చెబుతున్నారు. ప్రతి శనివారం మద్యం స్కాం లెక్కలు చెప్పేందుకు జగన్ తో సమావేశమయ్యేవారని వైసీపీ అంతర్గత నేతలు కూడా మీడియాకు లీక్ ఇచ్చారు. అలాంటి మిథున్ రెడ్డిని ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. అరెస్టు చేస్తారేమో అన్న భయంతో.. ఢిల్లీకి సీఐడీ బృందాలు అని వైసీపీ ఫేక్ మీడియా ప్రచారం చేసింది. కానీ అది టాపిక్ డైవర్షన్. అలా ప్రచారం చేయించి.. వ్యవస్థల వద్ద వాదించడానికి మిథున్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న స్కెచ్. అనుకున్నట్లుగానే ఆయన రిలీఫ్ పొందారు. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా ఆయన లెక్క చేయడం లేదు. తాను నేరుగా రానని.. ప్రశ్నలు పంపిస్తే లాయర్ తో సమాధానమిస్తానని అంటున్నారు. కుదరదనే సరికి లాయర్ సమక్షంలో విచారించాలని.. రికార్డింగ్ చేయాలని పిటిషన్లు వేశారు. చట్టానికి తాను వీఐపీని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు వ్యవస్థపై ఉన్న తేలికతనం చూస్తే .. ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఆధారాల్లేని కేసులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన వ్యవస్థేనా ఆయనకు ఈ గౌరవాలు ఇస్తోంది అని ముక్కును వేలేసుకుంటారు ప్రజలు. రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే కాదు ఇప్పటి వరకూ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని కూడా అరెస్టు చేయలేదు. ఆయనను చాలా కాలం గ్రిప్‌లో ఉంచుకుని కోర్టుల్లో కూడా వాంగ్మూలాలు ఇప్పించారు. అన్నీ చెప్పేశాడని చెప్పి ఆయనను రైల్వే శాఖకు పంపేశారు. ఆయనపై ఇతర ఆరోపణలు ఉన్నా కూడా వదిలి పెట్టేశారు. లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. చివరికి సాక్షిగా పిలిచిన విజయసాయిరెడ్డి కూడా రాలేనంటూ సమాచారం ఇచ్చారు. అసలు అయన సాక్షి కాదు..అయితే గియితే అప్రూవర్ అవ్వాలి. ఎందుకంటే ఐదేళ్ల పాటు సాగిన ప్రతీ దోపిడిలో విజయసాయిరెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కోటరీలో ఆయన కీలక వ్యక్తి. ఆ కోటరీలోని రాజకీయాల వల్ల ఆయన బయటపడాల్సి వచ్చిందేమో కానీ.. ఆయన పాత్ర లేదని అనుకోవడం కన్నా అమాయకత్వం ఉండదు. ఒక్క లిక్కర్ స్కామ్ కేసులోనే కాదు.. వైసీపీ వాళ్లు చేసిన ఏ అరాచకంలో చర్యలు తీసుకున్నారో ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే.. ఒక్కటంటే ఒక్క కేసులోనూ సరైన చర్యలు తీసుకోలేదని కళ్ల ముందు నిజం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం మంచితనం ఎలా అవుతుంది ?
అందుకే జగన్ మళ్లీ వస్తే అనే బెదిరింపులు!
వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారిలో ఇప్పుడు ఎవరూ జైల్లో లేరు. డబ్బులకు ఆశపడి సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టిన కొంత మంది.. ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయిన కొంత మంది మాత్రం జైళ్లలో ఉన్నారు. తమ దేవాలయం అని చెప్పుకునే టీడీపీ ఆఫీసు మీద దాడి చేసిన వారిని.. తమ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన వారిని కూడా అరెస్టు చేయలేకపోయారు. దేవినేని అవినాష్ , లేళ్ల అప్పిరెడ్డి హాయిగా ఉన్నారు. ఒక్క రోజు కూడా జైలు జీవితం చూడలేదు. నిజంగా ప్రజల్ని దోచుకున్న వారు.. ప్రజా సంపదను దోపిడీ చేసిన వారు.. వనరుల్ని కొల్లగొట్టిన వారు.. రాష్ట్ర అభివృద్ధిని అస్సాం చేసిన వారు ఇంకా హాయిగా.. ప్రశాంతంగా ఉన్నారు. అందరి జాతకాలు తాము బయటకు తీసి.. ప్రజా సంపదను కక్కిస్తామని చేసిన ప్రచారం తేలిపోతోంది. అందుకే జగన్ మళ్లీ వస్తే అనే బెదిరింపులు ప్రారంభించారు. ప్రభుత్వం ఇప్పుడేగా ఏర్పడింది అని అనుకునే రోజులు కూడా పోయాయి. ఇప్పటికి పది నెలలు గడిచాయి. ఈ పది నెలల కాలం అంటే.. వేడి మీద ఉన్నప్పుడే సుత్తి దెబ్బలు కొట్టాల్సిన సమయం. అద్భుతమైన విజయం.. ఏకపక్ష మ్యాండేట్ వచ్చినప్పుడు.. ప్రచారం చెప్పినవి అయినా చేయాలి. రెడ్ బుక్ అమలుకు ప్రజలు ఆమోదం ఇచ్చారు. వైసీపీ చేసిన అరాచకాలకు శిక్షలు వేస్తారని అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతోంది మాత్రం వేరు. మంచి ప్రభుత్వం అని.. వచ్చిన రెండో నెలలోనే తమకు తాము ట్యాగ్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకోవాలి. నేరగాళ్లు కాదు. నేరగాళ్లు మంచి ప్రభుత్వం అనుకుంటే.. ప్రజలు అనుకోవడం మానేస్తారు. ఎవర్నీ వదలం అనే డైలాగులు ఇప్పటికి విని విని ప్రజలు కూడా అలసిపోయారు. అసలు యాక్షన్ ప్రారంభం కావాల్సిన సమయం వచ్చేసిందని టీడీపీ క్యాడర్ భావన.
చివరికి తమపై పెట్టిన అక్రమ కేసుల విషయంలోనూ దైర్యంగా ఓ అడుగు వేయలేకపోతున్న ఈ ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం అనే ట్యాగ్ ఎంత వరకూ కరెక్టో అంచనా వేయలేం. ఎందుకంటే.. వైసీపీ హయాంలో వందలు, వేల అక్రమ కేసులు పెట్టారని గగ్గోలు పెట్టారు. అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా కమిషన్ వేసి తీసేస్తామని హామీ ఇచ్చారు. గెలిచినప్పుడు అందరి కార్యకర్తల దగ్గర కేసుల వివరాలు తీసుకున్నారు. వాటినేం చేశారో ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా పక్కాగా తప్పుడు కేసులు అని అందరికీ తెలుసు. వాటిని ఎత్తివేయడానికి వచ్చిన కష్టం ఏమిటో .? . వైసీపీ నేతలు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు.. మంచి చేసినా విమర్శిస్తారు.. చెడు చేసినా విమర్శిస్తారు. ఇలాంటి విషయాల్లో వారేమంటారో అని అనుకుంటూ కూర్చుంటే..అతి మంచితనం కన్నా.. చేతకాని తనం అవుతుంది.