“Lower taxes less government spending on domestic programme and fewer regulations mean A better economy for everybody”.. ఆర్థిక శాస్త్రం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా ఈ విషయం అర్థమైపోతుంది. నోబెల్ బహుమతులు సాధించిన నిపుణులూ అదే చెబుతున్నారు. భారత్ లాంటి దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కావాల్సింది కూడా ఇదే. కానీ ఏం జరుగుతోంది..? ప్రజల్ని పన్నుల రూపంలో పిండేస్తున్నారు ? వాటిలో కొంత మొత్తాన్ని మళ్లీ పంచి పెడుతున్నారు. దీని వల్ల దేశానికి మేలు చేస్తున్నారా ? ప్రజలకు మేలు చేస్తున్నారా ? దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తున్నారా ?. ఏమీ చేయడం లేదు. సింపుల్‌గా రాజకీయం చేస్తున్నారు. దేశ ప్రజల ఆర్థిక భవిష్యత్‌ను ఛిద్రం చేస్తున్నారు.
నిన్నటికి ఇవాళ్టికి రూపాయి ఎంత చిక్కిపోయిందో తెలుసా ?
రూపాయి వాల్యూ రూపాయికే ఉంటుందేమో కానీ.. అసలు అసలు విలువ మాత్రం రూపాయి రాను రాను కోల్పోతూనే ఉంది. నిన్నటి రూపాయి కి ఇవాళ్టి రూపాయికి మనం తేడా తెలుసుకోగలమా ? చాలా సింపుల్‌గా తెలుసుకోగలం. నిన్నటితో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ఈ రోజు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయింది. మరి నిన్నటిలాగే ఇవాళ బతగలమా ?. అసాధ్యం ఎందుకంటే.. నిన్న రూపాయిపెట్టి కొనుక్కున్న వస్తువు ఇవాళ రూపాయికి రాదు. ఎందుకంటే… ప్రభుత్వం పన్నులు అలా పెంచేసింది మరి. గత కొద్ది రోజుల నుంచి పన్నుల పెంపు అనే మాట వినపడని రోజే లేదు. విద్యుత్ చార్జీలు పెంపు, ఉప్పుల పప్పుల ధరల పెంపు, సన్ ఫ్లవర్ అయిల్ ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీ పెంపు, మందుల ధరలు పెంపు, పారాసిటమాల్నూ వదలకుండా పెంపు ఇలా చెప్పుకుంటూ పోవడం కన్నా.. పెరగనిది ఏది అని వెదుక్కోవడం బెటర్. ఎందుకంటే పెరగనిది అంటూ ఏదీ లేదు. అన్నీ పెంచేశారు. ప్రజల బతుకుల్ని మరింత భారం చేశారు.
ధరలు పెరగట్లేదు.. ప్రభుత్వాలే పెంచుతున్నాయి.. టాక్స్‌ల ద్వారా !
ధరల పెరుగుదల సహజమే. కానీ ఆ పెరుగుదల డిమాండ్, సప్లయ్ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. పెరగడమే కాదు.. తగ్గడం కూడా ఉంటుంది. నిలకడగా ఉంచాల్సిన రెగ్యూలేషన్లు ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వాలే పన్నుల రూపంలో బాదేసి రేట్లు పెంచుతున్నాయి. ప్రతీ విషయంలోనూ పన్నుల పెంపు ద్వారా ప్రభుత్వాలు ప్రజల్ని నిలువదోపిడి చేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లలో పెట్రో టాక్స్‌ల ద్వారా దేశ ప్రజల దగ్గర కేంద్రం వసూలు చేసింది రూ. ఇరవై లక్షల కోట్ల పైమాటే. ఇది కేవలం పెట్రోల్, డీజిల్ పన్ను. దీనికి జీఎస్టీ అదనం. నెలకు రూ. లక్షన్నర కోట్ల జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. ఆ తర్వాత ఆదాయపు పన్ను వసూలు చేస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లో ఉన్న ప్రతీ అంశంపై పన్ను బాదేస్తున్నాయి. ఇంటిపన్ను.. చెత్త పన్ను…సహా దేన్నీ వదిలి పెట్టడం లేదు. ఎక్కడ లొసుగులు కనిపిస్తాయా.. రూ. లక్షలు ఎలా లాగేద్దామా అని చూస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు మన కళ్ల ముందు ఉన్నాయి. తమ సంపాదన మొత్తంప్రభుత్వానికి పన్నులు కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు కళ్ల ముందు కనిపిస్తున్నారు. కానీ ప్రభుత్వాలకు కనీసం కనికరం ఉండటం లేదు.
పౌరునకి ఒక్క ఆదాయం.. లెక్కలేనన్ని పన్నులు..!
సామాన్యుడు ఒక నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తాడు.. కానీ అతని ఆదాయం నుంచి ప్రభుత్వాలు ఎంత వసూలు చేస్తున్నాయో తెలుసా..? కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను నసూలు చేస్తుంది. ఇక రోడ్డు మీద టీ తాగినా జీఎస్టీ వసూలు చేస్తుంది. అంటే ఆదాయపు పన్ను కట్టగా మిగతా ఖర్చు చేసే నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ కట్టుకుంటామన్నమాట. ఇక పెట్రోల్,డీజిల్‌పై బాదేది అదనం. ఇదంతా కేంద్ర ప్రభుత్వ ఖాతా. ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చే సరికి.. లోకల్ ట్యాక్స్‌లు ప్రారంభమవుతాయి. విద్యుత్ చార్జీలు , ఇంటి పన్ను, వాటర్ పన్ను, చెత్తపన్ను, రోడ్ పన్ను, ఆస్తి ట్రాఫిక్ ఫైన్లు.. డ్రైనేజీ ఫైన్లు.. ఇలా లెక్కలేసుకుంటూ పోతే.. ఎన్ని వేల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలో అంచనా వేయడం కష్టం. అంటే ఒక్కడి సంపాదన మీద ఇంత మంది పన్నులు వేసి.. అధికార వ్యవస్థను నడుపుతున్నారు. అలా ప్రతి ఒక్కరి సంపాదన నుంచి డబ్బులు కాజేస్తున్నాయి ప్రభుత్వాలు. మరి ఇక సంపాదించేవాడికి ఏం మిగులుతుంది . ఇలా తీసుకునేది సరిపోక ఎప్పటికప్పుడు కొత్త కొత్త పన్నులు విధిస్తూ.. విరక్తి పుట్టేలా చేస్తున్నారు.
ప్రభుత్వాలు ఈ పన్నుల సొమ్ములన్నీ ఏం చేస్తున్నాయి ?
కేంద్ర ప్రభుత్వం నెలకు లక్షల కోట్ల పన్నుల ఆదాయం పొందుతోంది. అంతకు మించి అప్పులు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అంతే. ఇక స్థానిక ప్రభుత్వాలదీ అదే దారి. పన్నులు వసూలు చేస్తాయి. అప్పులు చేస్తాయి. ఆ డబ్బులన్నీ ఏమవుతాయో మాత్రం జవాబుదారీ ఉండదు. ప్రజలకు పంచిపెట్టేది కొద్దిగే. మిగతా సొమ్ము అంతా ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. అన్ని లక్షల కోట్లకు జవాబుదారీ ఉండని పరిస్థితి. నిజానికి ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులతో దేశ ప్రజల తలరాతను మార్చే పనులు చేయవచ్చని .. సామాన్యుడు అనుకుంటూ ఉంటాడు. దేశంలో ఉన్న సకల దరిద్రాలకు కారణం విద్య వైద్యం భారం కావడం. దేశ ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందేలా చేస్తే చాలా వరకూ సమాజం సంస్కరణకు గురవుతుంది. ఇన్ని లక్షల కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజలకు కనీస విద్య, వైద్యం అందించలేకపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వా ఆస్పత్రులు, స్కూళ్లలో ఐదు శాతం మందికూడా ప్రజలు సెవలు పొందుతున్నారంటే చెప్పడం కష్టమే. అంతగా దిగజారిపోయింది ప్రభుత్వ వ్యవస్థ. మొత్తం ప్రజలు ప్రైవేటు మీదే ఆధారపడుతున్నారు. మరి ప్రజలుపన్నులు ఎందుకు కట్టాలి?
అందర్నీ బాది కొందరికి పెట్టి అదే గొప్పంటారా ?
దేశంలో ఇప్పుడు ఓ దౌర్భాగ్యమైన రాజకీయం నడుస్తోంది. పన్నులు అందరి నుంచి వసూలు చేసి అందులో కొంత మొత్తాన్ని ఓటు బ్యాంక్‌కు పథకాల రూపంలో పంపిణీ చేస్తున్నారు. దీన్నే గొప్పగా చెప్పుకుంటున్నారు. తాము ఎకానమీలోకి డబ్బుల్ని తీసుకొస్తున్నామని అడ్డగోలుగా వాదిస్తున్నారు. కానీ పన్నులు వసూలు చేసి ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించి.. కొత్తగా వారు పెంచే ఎకానమీ ఏంటో అర్థిక నిపుణులకు కూడా అర్థం కాదు. ఉచితంగా వస్తే దాని విలువ సున్నానే. ఎవరికైనా ఉచితంగా ఒక్క రూపాయి ఇచ్చినా రూపాయి కి విలువ లేకుండా చేస్తున్నట్లే. కానీ ప్రజల మైండ్ సెట్‌ను పట్టుకుని వారి దగ్గర రూ. పదివేలు లాక్కున్నా పర్వాలేదు.. ఊరకనే రూ., వెయ్యి ఇస్తే చాలనుకునే ప్రజల ఎదగని బుద్దిని ఆసరా చేసుకుని ప్రభుత్వాలు ఓ ఆట ఆడిస్తున్నాయి. పన్నుల పేరుతో అందర్నీ బాదేసి.. కొంత మందికి పంచేసి.. ఓటు బ్యాంక్‌కు ఢోకా లేదని అనుకుంటున్నాయి.
ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాలతో బలైపోతున్న జనం !
దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పటికి ఉక్రెయిన్‌లో యుద్ధం వస్తే మన దగ్గర కరెంట్ పోయే పరిస్థితి. ఉక్రెయిన్ నుంచి వచ్చే బొగ్గును పేల్చే పెలుడు పదార్థాలు రావడం లేదని బొగ్గుకు కొరత ఏర్పడిందంటే.. ఇంత కాలం మనం సాధించిన స్వావలంబన ఏమిటి..? సన్ ఫ్లవర్ ఆయిల్‌ని కూడా అత్యధిక శాతం దిగుమతి చేసుకుంటున్నామని.. ఇప్పుడే జనాలకు అర్థం అవుతోంది. మరి ఇంత కాలం మనం ఏం చేస్తున్నాం ? చివరికి ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంలో వేల మందికి భారతీయ ఎంబీబీఎస్ విద్యార్థులకు చదువులు చెబుతున్నారు కానీ మన దగ్గర ఎందుకు లేదు ? ఇలాంటివి ఆలోచించుకుంటూ పోతే.. మన మీద మనకే కోపం వస్తుంది. ప్రపంచం మొత్తం మనమే గొప్ప అని చెప్పే పాలకులు చేసే ప్రకటనలు వెనుక ఉన్న రాజకీయం అర్థం అయిన తర్వాత మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కానీ రాజకీయ నేతలు ఇవన్నీ ఆలోచించేసమయం ఇవ్వరు. ఇవాళ రూపాయి సంపాదిస్తే…అందులో 90 పైసలు పన్ను రూపంలో బాదేసి… రేపు అంత కంటే ఎక్కు వసంపాదించలేకపోతే బతకలేమనే పరిస్థితికి తీసుకెళ్తున్నారు.
ఎలాగోలా బతుకుదాం అనే పరిస్థితికి ప్రజలు !
పెట్రోల్ రేట్లురెండేళ్ల కింద రూ.80 ఉండేవి.ఇప్పుడుఅవి నూట ఇరవైకి చేరువయ్యాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రూ. వెయ్యి దాటిపోయింది. మరోరెండు నెలల్లో పదిహేను వందలుచేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. చివరికి కేబుల్ టీవీని కూడా వంద నుంచి మూడు వందలకు తీసుకెళ్లారు మహానుభావులు. అలాచెప్పుకుంటూ పోతే.. కరెంట్ బిల్లల వరకూ ప్రతీది పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ప్రజలు పట్టించుకుని రోడ్లెక్కి ఆందోళన చేసే శక్తిని కూడా కోల్పోయారు. పని చేసుకుంటేనే ఆ పన్నులు కట్టగమన్న పరిస్థితికి వెళ్తున్నారు. ఎంత కష్టపడినా జీవితాలు మారడం లేదు పైగా దుర్భర స్థాయికి వెళ్లిపోతున్నాయి. గత రెండు,మూడేళ్లుగా పేదరికంలోకి జారిపోయిన మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగుతుల్ని చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది. నోట్ల రద్దు దెబ్బకు… కోవిడ్ లాక్ డౌన్ల దెబ్బకు ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. వారికి సాంత్వన కల్పించాల్సింది పోయి.. మరింత బాదేస్తున్నారు. నిరుపదేలని చేస్తున్నారు.
ప్రజలకు కావాల్సింది పరిపాలనే… పథకాలు కాదు !
ప్రభుత్వాలను ఎన్నుకునేది పరిపాలన చేయమే. పథకాలను అమలు చేసి.., తమ అకౌంట్లలో పదివేలో.. ఇరవై వేలో వేయమని కాదు. కానీ దురదృష్టవశాత్తూ.. ఏది జరగకూడదో అదే జరుగుతోంది. ప్రజల సొమ్ముతోనే పాలకులు ఏదైా చేస్తారని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వాలు పన్నులు బాదేసి.. వసూల చేసి మళ్లీ అరకౌరగా వారికే పంచడంలో రాటుదేలిపోతున్నారు. ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో కానీ.. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నుల బాదుడుతో … జేబులకు చిల్లులు పెట్టుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఈ రాతను మనం మార్చుకోలేం. ఎందుకంటే మన కళ్లు.. కులం, మతం, ప్రాంతం పేరుతో మూసుకుపోయాయి.