” ప్రత్యర్థిపై ప్రజాక్షేత్రంలో గెలవడం నిన్నా, మొన్నటి వరకూ జరిగిన రాజకీయం. కానీ ఇప్పుడు పోటీ లేకుండా ప్రత్యర్థినే లేకుండా చేయడం” అనే కాన్సెప్ట్‌తో నయా రాజకీయ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. సాధారణంగా ఇలా ప్రత్యర్థిని లేకుండా చేయడం అనేది ప్రతిపక్ష పార్టీలకు సాధ్యం కాదు. నిజానికి అధికార పార్టీలకు కూడా సాధ్యం కాదు. కానీ తమ చేతిలో అధికారం ఉంటుంది. పోలీసులు ఉంటారు. వ్యవస్థలు ఉంటాయి. వాటితో ప్రతిపక్షాన్ని లేకుండా చేయవచ్చనే భ్రమలో ఉంటున్నారు. దేశంలో.. రాష్ట్రాల్లో అధికార పార్టీల రాజనీతి ఇలాగే ఉంది. అధికారంలో ఉన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అందర్నీ ఎలిమినేట్ చేసేసి తామే చాంపియన్లుగా ప్రకటించుకోవాలనుకుంటున్నారు. ఇది నేరుగా నియంతృత్వమే. అయితే దానికి సరైన పరిష్కారం ప్రజలు చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి అవకాశం లేదని.. ఇవ్వబోమని ఎప్పటికప్పుడు ప్రజలు నిరూపిస్తూనే ఉన్నారు.
వరుస ఫలితాలతో అధికార పార్టీలకు వాస్తవం తెలుస్తోందా !?
తెలంగాణలోని హుజురాబాద్ ఉపఎన్నిక ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తే పోయేది కాదని నిరూపించిన ఉపఎన్నిక. అంతకు ముందు పట్టుమని వెయ్యి ఓట్లు కూడా సాధించలేని పార్టీ అక్కడ విజయం సాధించింది. అధికార పార్టీకి సవాల్ చేసింది. ఈ మార్పు అక్కడ పార్టీలో చేరిన నేత వల్ల అయి ఉండవచ్చు.. మరో కారణం కావొచ్చు… కానీ ప్రజలు అక్కడ ఓ ప్రతిపక్షాన్ని సృష్టించుకున్నారన్నది నిజం. అధికార పార్టీకి వ్యతిరేకం,.. ఆ పార్టీని ఓడగొట్టే వారినే తమ పక్షంగా భావించారు. ఈ విషయం పాలక పార్టీకి ఇప్పటికైనా అర్థం అయిందో లేదో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే అధికార మత్తు అంత త్వరగా కిందకు రాదు.
ప్రతిపక్షమంటే ప్రజలే నిర్వీర్యం చేయడం సాధ్యమా ?
తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తెలంగాణ కోసమేనన్నట్లుగా అక్కడి అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షాలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించింది.వ్యవస్థల్ని ప్రయోగించింది. వివిద పార్టీల పీక నొక్కే ప్రయత్నాలు చేసింది. తెలంగాణ ఏర్పడినప్పుడు బలంగా ఉన్న తెలుగుదేశం కేవలం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల వల్లే శిథిలమైపోయింది. ఆ పార్టీకి చెంది నేతలు పోలోమని టీఆర్ఎస్లో చేరిపోయారు. తెర వెనుక.. తెర ముందు రాజకీయాలతో ఆ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదల్లేదు. గెలిచిన వారిని గెలిచినట్లుగా తాయిలాలు… కేసులు..బెదిరింపులు ఇలా అనేక మార్గాల ద్వారా పార్టీలో చేర్చుకున్నారు. ద్వితీయ శ్రేణి నేతలనూ వదల్లేదు . ఉన్నత స్థాయి నేతల కక్కుర్తి ఆ పార్టీని మరింత దిగజార్చింది. చివరికి వరుస పరాజయాలతో కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయిందనుకున్నారు. కానీ ఒక్క నాయకత్వ మార్పుతో ఆ పార్టీలోనూ జోష్ కనిపిస్తోంది. ఇటీవల ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు రాలేదు. కానీ ఆ పార్టీకి భవిష్యత్ ఉందనే అభిప్రాయం మాత్రం ఇప్పుడు బలపడటం ప్రారంభమయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తే మరో పార్టీ ఎదగడానికి చాలా సమయం పడుతుందని అప్పటి వరకూ తమకు తిరుగు ఉండదనుకున్న టీఆర్ఎస్కు అనూహ్యంగా ఎదిగిపోయిన బీజేపీ మానులా నిలబడింది. ఏకు మేకైంది. తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీ కన్నా భావజాల ప్రకారం బీజేపీ ప్రమాదకరమైంది. ఆ విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో అధికారపక్షానికి మరీ తెలిసి ఉండాలి, ఎందుకంటే అక్కడి రాజకీయ పరిస్థితులు.. నేపధ్యాలు భిన్నం. అయినా నిప్పుతో చెలగాటమాడినట్లుగా ఇతర పార్టీలను నిర్వీర్యం చేసి బీజేపీ వైపు ప్రజలు వెళ్లేలా చేయడంలో అధికార పార్టీ వ్యూహం అమలు చేసింది. అసలు ప్రజలు అటు పోరు.. తమతోనే ఉంటారని అనుకుని చేసిన వ్యూహాత్మక తప్పిదమే అది. ఎందుకంటే ప్రజలు అందరు ఎప్పుడూ అధికార పార్టీ వైపే ఉండరు. ఖచ్చితంగా ప్రతిపక్షం వైపు ఉంటారు. ఎవరు తమ కోసం పోరాడతారో వారి వైపు ఉంటారు. అంటే అధికార పార్టీకి ప్రతిపక్షం ఉంటుంది.. అది ప్రజలే. కానీ ఆ ప్రజలు ఎవర్ని తమ కోసం పోరాడతారని ఎంచుకుంటారో.. ఆ చాయిస్ ఇప్పుడు అధికార పార్టీలు కల్పిస్తున్నాయి. కల్పించి తీరాల్సిందే. వ్యూహాత్మక తప్పిదాలు చేస్తే ఓ బలమైన ప్రత్యర్థిని మట్టి కరిపిస్తే అంత కంటే బలమైన ప్రత్యర్థి వస్తాడు. ఇది ప్రజాస్వామ్య లక్షణం.
ప్రజాస్వామ్యాన్ని పతనం చేయాలనుకోవడం భస్మాసుర హస్తమే !
తెలంగాణతో పోలిస్తే ఏపీ రాజకీయాలు మరింత దారుణం. అక్కడ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి పూర్తిగా రాజకీయానికి దాసోహమయ్యాయి. ప్రజాస్వామ్య పునాదులైన ఎన్నికలకు ఎప్పుడో అక్రమాల చెద పట్టడం ప్రారంభమయింది. ఏపీలో అసలు పూర్తిగా నాశనం అయిపోయింది. అధికార వ్యవస్థల్ని ఉపయోగించుకుని అసలు ఎన్నికలే లేకుండా గెలిచేద్దామనే ఓ దురాలోచన అక్కడి అధికార పార్టీకి వచ్చింది. దానికి పోలీసులు.. అధికారులు సహకరించారు. పోటీలో ఉండేవారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడం ఎప్పుడైనా చూశామా..? పోలింగ్ బూతులలో ఏజెంట్లను బెదిరించి ఊరు వదిలి వెళ్లిపోవాలని బెదిరించే వాళ్లను చూశామా ? దొంగ సంతకాలతో నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ప్రకటించే అధికారులను చూశామా ? ఇవన్నీ ఏపీ స్థానిక ఎన్నికల్లో చూశాం. ఇలా ఎన్నికలను సైతం అపహాస్యం చేసి ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనుకున్నారు. 90 శాతం గెలిచేశామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇంతటి నిర్బంధంలోనూ ప్రజలు .. ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుందని నిరూపించారు. పార్టీలు.. అభ్యర్థులు లొంగిపోతాయేమో కానీ ప్రజలు మాత్రం ఇలాంటి వాటికి లొంగిపోరని.. నిరూపించారు. దానికి దర్శి లాంటి చోట్ల జరిగిన లోకల్ ఎన్నికలే నిదర్శనం. అక్కడ టీడీపీకి లీడరే లేడు. కానీ ప్రతిపక్షమే గెలిచింది. అక్కడి అధికార పార్టీ నేతల అరాచకాలకు ప్రజలు చెక్ పెట్టాలనుకున్నారు. పెట్టారు.
ప్రమాద ఘంటికలుగా గుర్తించకపోతే ఫలితం అనుభవించాల్సిందే !
వందకు 97 శాతం మార్కులేశారని ముఖ్యమంత్రి సంబరపడవచ్చు కానీ.. క్షేత్ర స్థాయిలో ప్రజలు ప్రతిపక్షం ఉందని…స్వేచ్చాయుత ఎన్నికలు జరిగితే అది ఏ స్థాయిలో విశ్వరూపం చూపిస్తుందో అంచనా వేయడం కష్టం. మొదటి దశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని విజయాల్ని సాధించింది. మున్సిపాలిటీల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. 70పై చిలుకు మున్సిపాల్టీల్లో ఎన్నికలో జరిగితే ఒక్కటి తప్ప అన్నీ వైఎస్ఆర్సీపీకే. కార్పొరేషన్లన్నీ ఆ పార్టీకే. పరిషత్ ఎన్నికల్లోనూ అదే హవా. కానీ ఆరు నెలలు తిరిగే సరికి జరిగిన మినీ లోకల్ వార్‌లో ప్రతిపక్షం పుంజుకున్నట్లుగా కనిపించింది. జరిగింది 12 నగర పంచాయతీ ఎన్నికలే అయినా రెండు చోట్ల టీడీపీ గెలిచింది. మరో మూడు, నాలుగు చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీకి పలు చోట్ల వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, గుంటూరుల్లో జడ్పీటీసీలను కోల్పోయింది. సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా వచ్చిన ఫలితాల కంటే వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పుడు కీలకమైన అంశం. ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత సహజం. కానీ రెండున్నరేళ్లకే ఇలా వ్యతిరేకత రావడం మాత్రం అనూహ్యం. అది ప్రజాస్వామ్యం మీద ప్రభుత్వం కొడుతున్న దెబ్బపై ప్రజల ప్రతీకారంగా భావించవచ్చు. ఇదే భావన ప్రజల్లో పెరిగిపోతే ఈ సారి ప్రతిపక్ష స్థానం ఇచ్చి ప్రజాస్వామ్య గొప్పదనాన్ని మరోసారి ప్రజలు నిరూపిస్తారు.
అధికారంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం అసాధ్యమని ఇప్పటికైనా గుర్తిస్తారా ?
కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ ఇంత కాలం చేసిన రాజకీయం అదే. చేస్తున్న రాజకీయం అదే. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ ప్రచారం చేసి.. ఒక్క బీజేపీనే ఉండాలన్నట్లుగా వ్యూహాలు పన్నారు. వ్యవస్థల్ని కళ్ల ఎదుటే నిర్వీర్యం చేశారు. సీబీఐ , ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని మిత్రపక్షాలుగా వాడుకుని ఇతర పార్టీల నేతలను టార్గెట్ చేసి .. నిర్వీర్యం చేయడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. అదే సమయంలో తమకు కొమ్ము కాస్తే ఎలాంటి నేరాలున్న వారికైనా రక్షణ కల్పించే ప్రయత్నం చేయడం అసలైన దౌర్భాగ్యం. ఇలాంటి రాజకీయాల వల్ల దేశవ్యాప్తంగా ఢిల్లీలోనూ ప్రజలు ఓ ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే దీనికి ఓ స్పష్టత వస్తుంది. అప్పుడు కేంద్రంలోని అధికార పార్టీకి మాటల్లో చెప్పే ప్రజాస్వామ్య గొప్పదనం చేతల్లో అర్థమవుతుంది.
ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడం అంటే దేశద్రోహంతో సమానం. !
అధికారంలో ఉన్న వారికి దాన్ని తాము ఎల్లకాలం అనుభవించాలనే కోరిక ఉంటుంది. అది సహజం. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే మార్గం ప్రజాస్వామ్యమే. ప్రజలను మెప్పించి.. వారి ఓట్లను పొంది అధికారంలో కొనసాగాలి. అంతే కానీ వారిచ్చిన ఓట్లతో వారి హక్కులను తుంచేసి.. వారి పేరుతో తామే విజయం సాధించాలనుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే అధికారం ప్రజలది. పదవులు అనుభవించేవారు ప్రతినిధులు మాత్రమే. ప్రజలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వారి అధికారం కత్తిరించడానికి రెడీగా ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు. అందుకే రాజకీయ నేతలు అధికారాన్ని ప్రజల కోసం వాడి… రాజకీయాన్ని మాత్రం ప్రజాస్వామ్యంగా చేయడం నేర్చుకోవాలి. అప్పుడే భారత్ సుసంపన్న ప్రజాస్వామ్య భారత్ అవుతుంది. లేకపోతే ఆ పాపం రాజకీయ నేతలదే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడం అంటే దేశద్రోహంతో సమానం. !