” సినిమా కథల్ని ఎలా కావాలంటే అలా హీరోలు మలుపు తిప్పగలరు. ఎందుకంటే అది వారి చేతిలో పవర్. అది సినిమాల వరకే ఉంటుంది. కానీ నిజ జీవితంలో కథల్ని ఎలా కావాలంటే అలా తిప్పగలిగే సామర్థ్యం రాజకీయ నాయకులకు ఉంటుంది. ముఖ్యంగా పవర్ ఉన్న వాళ్ల చేతిల్లో ఉంటుంది”… ఈ విషయం గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రంగస్థల నాటకమే నిరూపిస్తోంది. ఇక్కడ స్టేజీ, నటీనటులు అందరూ రియలే. జరుగుతున్న పరిణామాలూ రియలే. చూస్తున్న ప్రేక్షకులూ రియలే. అంటే రియల్ రంగస్థలం అనుకోవచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు గత శుక్రవారం రోజున ఉరుముల్లేని పిడుగుల్లా పోలీసులు అల్లు అర్జున్ ఇంటికెళ్లిపపోయారు. తొొక్కిసలాట ఘటన తన మీదకు రాదని అల్లు అర్జున్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్లో తన పేరు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేసుకుని పుష్ప సక్సెస్ టూర్ ప్రారంభించారు. ఢిల్లీలో సక్సెస్ మీట్ పూర్తి చేసి నెక్ట్స్ ఏ సిటీకెళ్లాలో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు పోలీసులు ఊడిపడ్డారు. అప్పటికప్పుడు అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్నా ఒక రోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందో అర్థం చేసుకునేంత రాజకీయ కథా నైపుణ్యం బన్నీకి కానీ ఆయన క్యాంప్‌నకు కానీ లేదు. అందుకే ఒక దాని తర్వాత ఒకటి అలా తప్పులు చేసుకుంటూ పోయారు. చివరికి అది కొండ చిలువ చుట్టేసుకున్నట్లుగా మెడకు చుట్టేసుకుంది. దాన్ని విడదీయడం ఎలా అనేది తెలుసుకోవడానికి అల్లు అరవింద్ కూడా కిందా మీదా పడుతున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ టార్గెట్ కాలేదు. సినీ పరిశ్రమ మొత్తం టార్గెట్ అయింది. అలా అవడానికి కారణం టాలీవుడ్ కు ఉన్న ఈగోనే.
కొండా సురేఖ, అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ స్పందనపై ప్రభుత్వానికి ఆగ్రహం
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడాది అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంతో సెలబ్రిటీలు ఎలా వ్యవహరించేవారు..ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు ?. రేవంత్ రెడ్డి తన పాలనలో ప్రతిపక్షానికి విధేయంగా ఉండాలని కోరుకోరు. కానీ టాలీవుడ్ పెద్దలు ఆ మాత్రం లౌక్యాన్ని ప్రదర్శించలేకపోయారు. కాస్తంత తెలివి ఉన్న ఎవరైనా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాడే హడావుడి చేసి ఉండేవారు. కానీ అంతా సైలెంట్ గా ఉండిపోయారు. తర్వాత రేవంత్ చాలా సార్లు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆయన వైపు నుంచి సహకారం విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. టిక్కెట్లు పెంపు కావాలని వస్తే పెంచుకోమన్నారు. ప్రీమియర్స్ వేసుకోమన్నారు. అయితే ఈ సహకారాన్ని అలుసుగా తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని చాలా లైట్ తీసుకున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టక ముందే అసలు రాజకీయం ప్రారంభించాల్సి ఉంది. కానీ ఏం చేస్తాడులే అనుకున్నారు. అప్పుడైనా ప్రారంభించాల్సింది. కానీ రేవంత్ రెడ్డి అయితే మాకేంటి.. ఇక్కడ ఉంది పుష్ప..పుష్ప అనుకున్నట్లుగా ఉన్నారు. కదల్లేదు. కొండా సురేఖ ఇష్యూ వచ్చినప్పుడు టాలీవుడ్ అంతా కాంగ్రెస్ పార్టీపై దండెత్తినంత పని చేసింది. పీసీసీ చీఫ్ చెప్పిన తర్వాత అయినా సైలెంట్ గా ఉండాల్సింది. రేవంత్ ను తక్కువ అంచనా వేశారు. బహుశా అప్పుడే రేవంత్ రెడ్డి వీరికి సరైన గుణపాఠం చెప్పాల్సిందేనని అనుకుని ఉంటారు. తర్వాత కూడా టాలీవుడ్ తమకు చాలా అహంకారం ఉందన్నట్లుగా కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టారు. ఘటన జరిగిన తర్వాత కొంత విరామం తీసుకుని నోటీసులు కూడా ఇవ్వకుండా అర్జున్ ను ఎందుకు అరెస్టు చేశారో ఊహించలేకపోయారు. బెయిల్ వచ్చిందని బలప్రదర్శన చేశారు. ఇండస్ట్రీ మొత్తాన్ని పరేడ్ చేయించారు. ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడమే. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి సవాళ్లను సీరియస్ గా తీసుకుంటే సినిమా కథ మారిపోతుంది. అదే జరిగింది. అక్కడేం జరిగిందో కళ్ల ముందే ఉంది. ఇన్ సైడ్.. ఏం జరిగిందో మొత్తం అసెంబ్లీలో బయట పెట్టారు. వాటిలో ఎంత నిజం ఉందో … ఎంత అబద్దం ఉందో కానీ అది ఓ హీరో .. కష్టపడి ఇమేజ్ బిల్డప్ చేసుకున్న హీరో ఇమేజ్ కు ఎంత డ్యామేజ్ చేస్తుంది. బన్నీ అంటే కుమారుడికి ప్రాణం అని భారం అయినా భారీ ధర పెట్టి సినిమా చూపిద్దామని వచ్చిన ఓ తల్లి తన ఫ్యాన్స్ తొక్కిసలాటలో చనిపోతే తన సినిమా సూపర్ హిట్ అయిపోతుందని సంబరపడతాడా?. పోనీ అప్పటికైనా జరిగిందేదో జరిగిపోయిందని అనుకోక.. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అసలు ఇలా అసెంబ్లీలో రేవంత్ ప్రెస్ మీట్ అయిపోగానే అలా బన్నీ ప్రెస్‌మీట్ అనే సమాచారం మీడియాకు అందింది. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది..క్షమాపణలు అని చెప్పినా దానికి ఎన్నో అర్థాలు వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన ఏమైనా అక్కడ మాట్లాడవచ్చు. అసెంబ్లీకి ఆ పవర్ ఉంది. కానీ అల్లు అర్జున్ కి అలా మాట్లాడే పవర్ లేదు. ఎందుకంటే ఆయన ఆ కేసులో నిందితునిగా ఉన్నారు. మాట్లాడితే ఎన్నో ఆర్థాలు తీస్తారు. ఈ లాజిక్ లీగల్ టీమ్ చెప్పలేదో.. బన్నీనే ఆవేశపడ్డారో కానీ మొత్తం రెడీ చేసిన ట్రాప్ లోకి నేరుగా వెళ్లి పడినట్లయింది.
టాలీవుడ్ ను అడ్డం పెట్టుకుని తనను టార్గెట్ చేస్తూంటే ఎందుకు స్పందిచరనేది రేవంత్ ప్రశ్న
ఇప్పుడు బన్నీ పరిస్థితి ఏమిటో అల్లు అరవింద్ కు కూడా అర్థం కావడం లేదు. నిజానికి వారిదేమైనా చిన్న ఫ్యామిలీనా. పొలిటికల్ పవర్ కూడా చేతుల్లోనే ఉన్న ఫ్యామిలీనే. చిరంజీవి అంటే అందరూ గౌరవం ఇస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆ కుటుంబంలోని వ్యక్తి. అయినా ఓ సామాన్యుడిలా కేసులు, జైలు నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. బన్నీ కేసును పావుగా వాడుకున్నారు రేవంత్. ఆయన ట్రాప్ లో పడిపోయింది అల్లు ఫ్యామిలీ. పరిశ్రమ మొత్తాన్ని గ్రిప్ లోకి తెచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి వేసిన ట్రాప్ అది అని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆయన ఏం మాట్లాడారో కాస్త తీరిగ్గా సినీ ప్రముఖులు విశ్లేషించుకుంటే..ఆయన తమకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశాడని అర్థమవుతుంది. ఇప్పటి వరకూ ఏం చేశారో కానీ ఇక ముందు మాత్రం..తాను చెప్పినట్లే చేయాలని రేవంత్ సందేశం పంపించారు. మిమ్మలను ఉపయోగించుకుని బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తూంటే ఎందుకు ఖండించడం లేదని రేవంత్ చాలా సూటిగానే అడిగారు. పేరు మర్చిపోయాడన్న కారణంగానే అరెస్టు చేయించారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి టాలీవుడ్ ప్రముఖుల వద్ద సమాధానం లేదు. కానీ ఇలాంటి పరిస్థితే వస్తే ఈ సారి ఖచ్చితంగా స్పందించాలన్న సంకేతాలను ఇచ్చారు. అలాంటి కోపరేషన్ ఉంటేనే ఇక ముందు ప్రీమియర్ షోలు, టిక్కెట్ రేట్ల పెంపు వంటి అంశాలపై ఆలోచిస్తారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు రేవంత్ కట్టుబడి ఉంటారని అన్నారని ప్రచారం చేస్తున్నారు కానీ.. మరోసారి మాట్లాడుకుందామని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. అంటే టాలీవుడ్ సిన్సియారిటీని మరోసారి పరీక్షించి ఆ తర్వాత రేవంత్ నిర్ణయం తీసుకుంటారు.
చివరి చాన్స్ ఇచ్చిన సీఎం
టాలీవుడ్‌కు సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో సీఎం రేవంత్ రెడ్డికి తెలియనిదేం కాదు. అక్కడ ఆయన ప్రత్యేక సౌకర్యాలు, అనుమతులు కల్పించకుండా ఆపేస్తే చాలా నష్టపోతుంది. అందుకే ఆయన దిల్ రాజు ఒక్క గంట సమయం ఇవ్వాలని వచ్చి కలుస్తామని సమాచారం ఇవ్వగానే అంగీకరించారు. అసలు హీరోల కన్నా తానే రియల్ హీరోనని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉంది. సీనీ పెద్దలు చెప్పింది రేవంత్ రెడ్డి విన్నారో లేదో ఎవరికీ తెలియదు.. కానీ ఆయన చెప్పింది మాత్రం రోమాలు నిక్కబొడుచుకుని టాలీవుడ్ ప్రముఖులు వినాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి తెచ్చి పెట్టారు. టాలీవుడ్ స్టార్లు తెచ్చుకున్నారు. ఇప్పటితో అయిపోతే ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. రేవంత్ ప్రభుత్వంపై టాలీవుడ్ ఎంత మేర విధేయత చూపుతుందన్నదానిపై రేవంత్ రెడ్డి తదుపరి అడుగులు ఉండవచ్చు. తొక్కిసలాట ఘటనలో ఏ 11గా ఉన్న అర్జున్ కు ఈ పరిస్థితి కల్పించారంటే.. డ్రగ్స్ కేసుల్లో స్వయంగా ఆయన టాలీవుడ్ పై కోర్టుకెళ్లి పోరాడుతున్నారు. ఇప్పుడు దాన్ని బయటకు తీయాలనుకోవడం చాలా చిన్న విషయం. కానీ ఆయన టాలీవుడ్ ను టార్గెట్ చేయాలనుకోవడం లేదు. తన ఫోల్డ్ లోకి వస్తే చాలనుకుంటున్నారు. సినీ రంగంలో ఈగోలకు తావు లేదు. తమతో పని ఉన్నప్పుడు ఈగో చూపిస్తూంటారు.. తమకే అవసరం ఉన్నప్పుడు కాళ్లు పట్టేసుకుంటారు .. అలాంటి మనస్థత్వం ఉన్న వారు మాత్రమే టాలీవుడ్లో నిలదొక్కుకుంటారన్నది బహిరంగరహస్యం. అలాంటప్పుడు అధికారంలో ఉన్న పార్టీపై అభిమానాన్ని కనీసం పైకి అయినా చూపించడం వల్ల పోయేదేంటి?
క్రైమాక్స్ ఎలా ఉండాలో టాలీవుడ్ చేతుల్లోనే !
ప్రభుత్వాలను, రాజకీయాలకు దూరంగా ఉండాలనుంటే.. పూర్తిగా దూరంగా ఉండాలి. కానీ సహకారం కావాలి అయినా దాడి చేస్తామని.. మా ఈగోని శాటిస్ ఫై చేసుకుంటామంటే.. మరి అధికారంలో ఉన్న వారు ఏమనుకోవాలి ?. నాగార్జునపై కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన సమయంలో.. అలాగే అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఐక్యత చూపించినట్లుగా.. మొదట్లోనే ప్రభుత్వం ఏర్పడినప్పుడే.. అందరూ ప్రభుత్వాన్ని మెచ్చుకుని ఉంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చి ఉండేది కాదు. కానీ వచ్చింది. దాన్ని పెంచి పెద్దది చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ టాలీవుడ్ కు విధేయత నిరూపించుకోమని పరీక్ష పెట్టాడు. నిరూపించుకున్నదాన్ని బట్టే టాలీవుడ్‌కు నష్టాలో.. కష్టాలో… లాభాలో ..సుఖాలో తేలుతాయి. వారికి అభిమానం ఉన్నా లేకపోయినా .. తమకు అలవాటైనా నాటకాలను రంగస్థలం మీద ప్రదర్శించి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం అయితే పడింది. ఇక క్లైమాక్స్ వారి చేతుల్లోనే ఉంది.