” ద గ్రేటెస్ట్ పవర్ ఈజ్ నాట్ మనీ పవర్.. బట్ పొలిటికల్ పవర్ ” .. అమెరికాకు చెందిన వాల్తెర్ అనెన్బెర్గ్ అనే రాజకీయ పండితుడు చెప్పిన మాట ఇది. కాకపోతే చెప్పి ఆరేడు దశాబ్దాలు అయింది. ఈ ఆరేడు దశాబ్దాల్లో ఎంత మార్పు వచ్చింది అంటే… ఇప్పుడు ఈ ధీయరిని మనం పూర్తిగా మార్చుకోవచ్చు… ఎలా అంటే.. ” ద గ్రేటెస్ట్ పవర్ ఈజ్ నాట్ పొలిటికల్ పవర్.. బట్ మనీ పవర్ “. ఎందుకంటే… ఇప్పుడు డబ్బులతో రాజకీయ అధికారాన్ని కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. ఈ పెద్ద మనిషి అమెరికా వ్యక్తి కాబట్టి ఈ సామెత అక్కడ వర్కవుట్ కావొచ్చు ఎందుకంటే .. ఇక్కడిలా అక్కడ ఓటుకు ఇంత అని విలువ కట్టి ఇచ్చే స్థాయికి ప్రజాస్వామ్యం ఎదగలేదు. కానీ మన దేశంలో మాత్రం వేయి పడగలుగా విస్తరించింది. ఓట్లను కొనడం.. ఓటర్లను కొనడం.. ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధుల్ని కొనడం.. ఆ ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వాలను సైతం ఏర్పాటు చేసేంతగా కొనడం వంటి స్థాయికి ఎదిగిపోయింది. అందుకే ఇప్పుడు మన దేశంలో పొలిటికల్ పవర్ కాదు..మనీ పవరే కీలకం.
డబ్బుతో అధికారం కొనేస్తున్నారు..ఆ అధికారంతో డబ్బు సంపాదిస్తున్నారు !
కొన్నాళ్ల కిందట మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ అనే డైరక్టర్ “బిజినెస్ మ్యాన్ ” అనే సినిమా తీశారు. అది ఫ్లాప్ అయింది కానీ ఆ సినిమాలో రాజకీయాల సోల్ ఉంది. డబ్బులతో ఏదైనా చేయవచ్చని.. ఎలాంటి అధికారాన్ని అయినా సొంతం చేసుకోవచ్చని హీరో అనుకుంటాడు. కానీ పొలిటికల్ పవర్ కావాలనుకోడు. ఎందుకంటే.. అంతకంటే పవర్ ఫుల్ అయినది డబ్బు అని హీరోకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నేతలకు ఈ క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది. కానీ మరింతగా తెలివి మీరిపోయారు. డబ్బుతో రాజకీయ అధికారం తెచ్చుకుని మరింతగా సంపాదించుకుందామనుకుంటున్నారు. ఫలితంగా ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ప్రతీ రోజూ అమ్ముడవుతోంది.. ఎఎరో ఒకరు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. తాజాగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ ఫామ్ హౌస్‌లో ..తమను తాము అమ్మేసుకోవడానికి బేరాలు జరుపుతూండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు మధ్యవర్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కుట్ర ఉందా..? ప్రీ ప్లాన్డా ? కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారం నడిచిందా ? బీజేపీ ధన ప్రవాహంతో ఇదందా చేసిందా ? అన్నవి పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ సమస్య ఎమ్మెల్యేలు అమ్ముడుబోవడం మాత్రమే. ఆ ఎమ్మె్ల్యేలు రూ. యాభై కోట్లకో.. రూ. వంద కోట్లకో తమను తాము అమ్మేసుకోవడానికి రెడీ అయి వచ్చారు. అంటే వారి విలువ అది. తమకు ఓట్లేసిన ప్రజల విలువ అది. వారి నమ్మకాన్ని వారు అలా అమ్మేస్తున్నారన్నమాట. అదే ప్రజాస్వామ్యం అమ్మకం. మరి ప్రజలు మాత్రం డబ్బులు తీసుకుని ఓట్లేయడం లేదా అని ఆ ప్రజాప్రతినిధులు సందర్భం వచ్చినప్పుడు విరుచుకుపడవచ్చు.. అందులో తప్పేం లేదు. ఎందుకంటే .. ఇక్కడ ప్రజాస్వామ్యం అమ్మేది ప్రజలే. ఓటు వేయడానికి కులం.. మతంతో పాటు నోటు కూడా తప్పని సరి అని చూస్తున్న ఓటర్లే ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తున్నారు. వారి దగ్గర నుంచి అభ్యర్థులు..రాజకీయా పార్టీలు కొనుగోలు చేస్తున్నాయి. తమకు మరింత లాభం వచ్చేలా చూసుకుంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యం ఓ అమ్మకం.. కొనుగోలు వస్తువు అయిపోయింది కానీ.. అది తమ హక్కు అని.. తమ జీవితాల్ని బాగు చేసే బ్రహ్మాస్త్రం అని కానీ భావించడం లేదు. అలా భావించకుండా రాజకీయ పార్టీలే చేస్తున్నాయి.. అది వేరే విషయం.
ఓటర్లను నేతలు కొంటారు.. నేతలను రాజకీయ పార్టీలు కొంటాయి.. ఇదో నిరంతర ప్రక్రియ !
గతంలో ఓట్లను కొనేవాళ్లు కానీ ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేలను బహిరంగంగా కొనడం కామన్ అయిపోయింది. ఇటీవల జార్ఖండ్‌కు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు అస్సాం వెళ్లి డబ్బు మూటలు తెచ్చుకుంటూ బెంగాల్లో దొరికిపోయారు. వారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ.. జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని కొనేసే టాస్క్ తీసుకున్నారని ఆయనే బేరం పెట్టారని అందరికీ తెలిసిపోయింది. కానీ బెంగాల్లో డబ్బులతో ఎమ్మెల్యేలు దొరికిపోవడంతో ప్లాన్ రివర్స్ అయింది. అయితే ఎలాగైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారమో కానీ.. జార్ఖండ్ సీఎంపై అనర్హతా వేటు వేసి.. ఇతర ఎమ్మెల్యేల్ని బ్లాక్ మెయిల్ చేసి అయినా ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. కానీ ఎక్కడో బెసిడికొట్టింది. మొత్తంగా సైలెంట్ అయ్యారు. సమయం , సందర్భం కలసి రాలేదని ఆగిపోయారేమో కానీ.. రేపు కాకపోతే ఎల్లుండి అయినా జార్కండ్లో ప్రభుత్వాన్ని వారు కొనుగోలు చేయకుండా ఉంటారని మనం అనుకోలేం. ఎందుకంటే… ఆపరేషన్ కమలాలు ఇచ్చిన ప్రభుత్నాలు ఇంకా మన కళ్ల ముందునే ఉన్నాయి. కర్ణాటకలో ఏం జరిగిందో చూశాం.. మహారాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం.. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యం అమ్మకం. కొనుగోళ్లు జరగడం లేదని మనం అనుకోలేం. గతంలో ఒక్క ఎంపీ తక్కువ అయ్యారని.. వాజ్ పేయి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదే ఇప్పుడు.. వంద మంది ఎమ్మెల్యేలు తక్కవైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే.. పొలిటికల్ పవర్ కన్నా.. మనీ పవర్ ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ప్రజాస్వామ్య కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో బరితెగింపులకు దిగింది.. బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ వంటి అధికారం చెలాయించిన . చెలాయిస్తున్న ప్రభుత్వాలే. బీజేపీ మొదటగా ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రారంభించింది. అక్కడి ఎమ్మెల్యేలకు డబ్బుల రాజకీయం కొత్త. వాటిని చూసేసరికి ఆగలేకపోయారు. అక్కడ్నుంచి ప్రారంభించారు. ప్రభుత్వాలకు ప్రభుత్వాలనే మార్చేశారు. 2019లో కర్నాటకలో, మార్చి 2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ ఎంఎల్ఏలను ప్రలోభపెట్టడం ద్వారా, బెదిరించడం ద్వారా ప్రభుత్వాల కూల్చివేతలో సఫలీకృతమైంది. తాజాగా శివసేన ఎమ్మెల్యేలలో చీలిక తీసుకొచ్చి ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ కొనేశారు.
రాజకీయ పార్టీల అధికార… డబ్బు దాహమే ప్రజాస్వామ్యానికి పెను శత్రువు !
నిజానికి ఇలా ప్రజలు ఎన్నుకున్న సభ్యుడు అమ్ముడుపోకుండా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీల అతి తెలివి వల్ల అవన్నీ నిరుపయోగంగా మారాయి. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీచేసి, విజయం సాధించిన సభ్యుడు ఆ పార్టీకి విశ్వాసంగా ఉండాలి. అలా ఉండకపోతే పదవి కోల్పోతారు. కానీ స్పీక్ర నిర్ణయం అనే రూల్ పెట్టి.. అధికారంలో ఉన్న వారికి అండగా ఉండేలా మార్చుకున్నారు. ఫలితంగా అధికార పార్టీకి అమ్ముడుపోయే వారికి కావాల్సినంత రక్షణ ఉంటోంది. ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పదవికి రాజీనామా చేయకుండా, తనకు టికెట్ కేటాయించిన పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించనపుడు పదవి పోవాలి. లేకపోతే అతనికి ఆ పదవిలో ఉండే అవకాశం కల్పించడం అంటే చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన, నీతి బాహ్యమైన ఫిరాయింపులను చట్టబద్ధం, రాజ్యాంగబద్దం చేయడమే. ఆ పని చేయడానికి అధికార రాజకీయ పార్టీలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఎంతగా అంటే.. చివరికి తమకు ఇష్టం వచ్చిన భాష్యాలను చెప్పుకుని.. ఇతర పార్టీల ఎల్పీలను నేరుగా విలీనం చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తరవాత కేసీఆర్.. ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి ఎంత మంది ఎమ్మెల్యేలను ఆకర్షించారో లెక్కే లేదు. ఆయన ఒక్కొక్కరికి ఎంత ఎంత ఇచ్చారో గుసగుసలుగా చెప్పుకుంటారు. అవన్నీ బయటకు తెలియదు. కానీ తాము ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు తీసుకోకుండా ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించే అవకాశమే ఉండదని చిన్న పిల్లలకూ తెలుసు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉండగా.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్ని అదే విధంగా ఆకర్షించించింది. తమ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడతారని బెదిరించారని అందుకే.. తాము ఆకర్షించామని ఆ పార్టీ నేతలు వాదిస్తూ ఉంటారు. వారు కొనే ప్రయత్నం చేసినా.. వీరు కొనే ప్రయత్నం చేసినా.. అక్కడ జరిగింది మాత్రం ప్రజాస్వామ్యం అమ్మకం.. కొనుగోళ్లు. అధికారంలో ఉన్న పార్టీలు కేవలం డబ్బుతోనే ఈ కొనుగోళ్లు చేయడం లేదు.. పార్టీలో చేరని వారిపై కేసులు పెట్టడం ఇటీవలి కాలంలో ఒక ధోరణిగా మారింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలక పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుని పైన అలాంటి కేసులు లేవు. అలాగే ఆ పార్టీలో చేరిన వారిపై కూడా అప్పటి వరకూ ఉన్న కేసులు ఆగిపోయాయి. అంటే.. కొనుగోళ్లలో ఈ కేసులు కూడా కీలకమైన వస్తుమార్పిడి అంశమన్నమాట.
ఇన్ని వందల వేల కోట్ల రాజకీయ అవినీతి చేస్తున్నది అధికార పార్టీలే..అందుకే ఎవరూ చిక్కరు.. దొరకరు !
రాజకీయ పార్టీలు ఇన్నిన్ని వందల కోట్లు.. వేల కోట్లు ఎలా వస్తున్నాయి ?. ఎన్నికల్లో పంచడానికి వందల కోట్లు వెలుగులోకి వస్తాయి. ఎమ్మెల్యేల్ని కొనడానికి వేల కోట్లు వస్తాయి. ఎక్కడ నుంచి వస్తాయి ?. దేశంలో రాజకీయ అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. చట్టాల ప్రకారం .. కేవలం రూ. రెండు లక్షలకు మించినగదు తీసుకెళ్లినా నగదు లావాదేవీ జరిపినా వెంటనే తెలిసిపోతుంది. కేసులు నమోదు చేస్తారు. కానీ ఇక్కడ కోట్లకు కోట్ల నగదు .. చలామణి అయిపోతోంది. ఎలా జరుగుతోంది? ఇదంతా అధికారంలో ఉన్న పార్టీలకు తెలియదా ? అన్నీ తెలుసు. కానీ దేశంలో వ్యవస్థలన్నింటినీ ఎవరి అధికారానికి తగ్గట్లుగా వారు ఉపయోగించుకుంటూ… పోతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. అవినీతికి తెర తీస్తున్నారు. ఒక్క సారి అధికారం వచ్చిందంటే చాలు.. రాష్ట్ర సంపద మొత్తం అమ్మేసుకోవచ్చన్న అభిప్రాయానికి వస్తున్నారు. అదే చేస్తున్నారు. సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేస్తున్నారు. ఎన్నికల నిధులు తీసుకుంటున్నారు. హవాలా మార్గంలో రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇదంతా ప్రజల సొమ్మే. ప్రజలు పేదవాళ్లుగా ఉండిపోతున్నారు. మరింత పేదవారిగా మారుతున్నారు. వారికి కనీస సౌకర్యాలు ఉండటం లేదు. కానీ రాజకీయ నాయకులు.. వారితో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు మాత్రం కోట్లకు పడగలెత్తిపోతున్నారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి అయినా ఆర్థిక పరంగా అండగా ఉండేందుకు కనీసం పాతిక మంది పారిశ్రామిక వేత్తలు ఉంటారు. వీరే హవాలా డబ్బులు సేకరించి ఇస్తారు. లేకపోతే ఆ పార్టీ నడవదు. అలా అని ప్రజాస్వామ్యాన్ని అమ్మకుంటున్నది… కేవలం రాజకీయ పార్టీలు.. నేతలేనని అనుకోలేం. ఇక్కడ ప్రజలది కూడా కీలక పాత్ర. వారు అసలు జరుగుతున్నదేమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా తెలుసుకోకుండా రాజకీయ పార్టీలు … ప్రజల్ని కుల, మత , ప్రాంతం ఉచ్చులో.. సోషల్ మీడియా .. ఇతర మీడియా ద్వారా వేసి.పబ్బం గడుపుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ద్రోహానికి పాల్పడుతున్నాయి.
ప్రజాచైతన్యమే మార్గం.. కానీ ప్రజాస్వామ్యం అంగడి సరుకైనా గుర్తించడం లేదే !
సమాజంలో చదువుకుంటే చైతన్యం పెరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ చదువు లేనప్పుడు దేశంలో కొన్ని ఆదర్శాలు ఉండేవి. ప్రజాస్వామ్యంపై అవగాహన ఉండేది. ఓటు హక్కు ఎంత పవిత్రమే తెలుసుకనేవారు. ప్రజాప్రతినిధులు కూడా సిద్ధాందాలకు కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు సమాజంలో అందరూ చదువుకున్నవారే. కానీ ఎవరికీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు. నిరక్ష్య రాస్యుల కన్నా దారుణంగా పవర్తిస్తూఉంటారు. నిజాలు తెలిసినా తమ పార్టీ.. తమ కులం.. తమ మతం అని సమర్థిస్తూ ఉంటారు. అక్కడే అసలు లోపం ఉంది. మార్పు రావాలి.. రాకపోతే.. ప్రజాస్వామ్యం ఫెయిలవుతుంది. ఇప్పుడు భారత్ ఆ దిశగానే వెళ్తోంది. దీన్ని ప్రజలే కాపాడుకోవాలి.