దేశంలో ఇప్పుడో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది. తాము ఏ నిర్ణయం తీసుకున్నా.. తమను ప్రపంచం మొత్తం పొగిడేసిందని చెప్పుకోవడం.. ప్రపంచానికి దిశానిర్దేశమయ్యామని డబ్బా కొట్టుకోవడం కామన్ అయింది. అదే రాష్ట్రాలయితే దేశం మొత్తం తమ వైపు చూస్తోందని చెప్పుకుంటారు. దానికి సోషల్ మీడియా ప్రచారాలు ఉండనే ఉంటాయి. చివరికి తాము తీసుకున్న నిర్ణయం పేదల దగ్గర డబ్బులు వసూలు చేసేది అయినా సరే ఈ తంతు ఉంటుంది. చివరికి కేంద్రం కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ విషయం బడ్జెట్ విషయంలో తేలిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. గతంలో ఎప్పుడూ చూడనంతటి నిస్సారమైన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కానీ వెంటనే స్వీయ పొగడ్తలు.. అందులో ఏముందో తెలియనేవారికి బుర్ర లేదనే సెటైర్లు కూడా ప్రారంభించేశారు. అందులో ఏముందో.. ఎవరెవరికి లాభం కలుగుతుందో అర్థమయ్యేలా చెప్పలేకపోవడం ఎవరి వైఫల్యం…? అసలు అందులో ఏమీ లేకపోతేనే కొసరు హడావుడి ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా అదే జరుగుతోంది.
బడ్జెట్ పద్దుల్లో ఏ రంగానికి మేలు చేసే నిర్ణయాలు ఉన్నాయి ?
కేంద్ర బడ్జెట్లో ఓ ధీమ్ ఉంటుంది. ప్రతీ ఏడాది లేదా కొన్నాళ్ల పాటు ఓ రంగాన్ని హైలెట్ చేసి అభివృద్ధి చేసుకుందామన్న ప్లాన్ కనిపిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్లో అదేమీ కనిపించలేదు. ఏ రంగమూ ప్రాధాన్యాతాంశంగా కేంద్రం తీసుకోలేదు. చివరికి ప్రజల ప్రాణాలను కూడా. కరోనా దెబ్బకు దేశం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా సెకండ్‌వేవ్‌లో దేశం ఎలా వణికిపోయిందో మనం చూశాం. ఆక్సిజన్ దొరక్క జనాలు రోడ్లపైన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. శవాలను సామూహికంగా తగులబెట్టారు. అవన్నీ మన దేశ మెడికల్ వైద్య రంగ దుస్థితిని కళ్ల ముందు ఉంచింది. ప్రాణాలతో బతికున్న వాళ్లను తామే కాపాడుకున్నామన్న సర్టిఫికెట్ కేంద్రం మెడలోతగిలించుకుని తిరుగుతోంది కానీ.. ముందు ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా ఏమీ చేయలేదు. కేవలం మాటలే చెప్పింది. ఇప్పటికీ మేలుకోలేదని బడ్జెట్ కేటాయింపులే నిరూపించాయి. వైద్య సదుపాయాలు మెరుగు చేయడం అన్నది దీర్ఘ కాలిక ప్రణాళిక. జీడీపీలో పదిశాతం వైద్యానికి ఖర్చు చేయాలని దేశంలో మేధావులు మొత్తుకుంటున్నారు. కరోనాతో ఇంత జరిగాక కూడా వైద్యానికి కేటాయింపులు పెంచింది లేదు. ఇక ఏ ఇతర రంగానికీ ప్రాధాన్యత దక్కలేదు. ఫలానా అంశంలో ప్రత్యేక దృష్టి పెడతామని చేతల్లో చెప్పింది లేదు.
నిరుపేదల్ని ఆదుకునే కేటాయింపులు తగ్గిపోతున్నాయి !
దేశంలో ఇప్పటికీ నిరుపేదలున్నారు. ఆకలితో అలమటించే వాళ్లున్నారు. హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం 106. భారత్ ఇమేజ్ దెబ్బతీయడానికి మోడీ మీద పగబట్టో ఇలాంటి ర్యాంకులు రావు. పరిస్థితుల్ని అధ్యయనం చేసే ఇస్తారు. లాక్ డౌన్ టైంలో రోడ్డు బాట పట్టిన జనాన్ని చూసిన తర్వాత చాలా మందికి ఇదే అభిప్రాయం ఏర్పడింది. కానీ కేంద్రం ఇప్పుడు పేదల కోసం కేటాయిస్తున్న ఆహార సబ్సిడీని అత్యంత దారుణంగా తగ్గిస్తూ పోతోంది. కరోనా కాలంలో సగానికి సగం తగ్గించేశారు. అంతేనా ఉపాధి హామీ నిధులపైనా క్లారిటీలేదు. ప్రతీ సారి ఈ పథకం గురించి గొప్పగా చెప్పి నిధుల కేటాయింపు చేసేవారు. ఈ సారి అసలు ఆ ప థకాన్ని కూడా ప్రస్తావించలేదు. 0 లాక్‌డవున్ టైమ్ లో లక్షలమంది పల్లెల బాట పట్టారు. పల్లెల్లో ఉపాధి లేదు. ఈ సమయంలో వారిని ఆదుకోవడానికి.. ఉపాధి హామీ పథకం బాగా పనికొస్తుంది. దానికి కేటాయింపులు పెంచాలి. కానీ కేటాయింపులు పెంచకపోగా.. తగ్గించారు. దాదాపు పాతిక వేల కోట్లు తగ్గించారు. ఇందులో ఎకనామిక్సే కాదు కామన్ సెన్స్ కూడా లేదు.
ప్రజలు అడిగింది ఉద్యోగాలు.. ఉపాధి !
అరవై లక్షల ఉద్యోగులు కల్పిస్తామని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గొప్పగాప్రకటించారు. కానీ దానికి తగ్గ కార్యాచరణ ఉందా అంటే ఆర్థిక నిపుణులు సైతం దిక్కులు చూడాల్సిన పరిస్థితి. బడ్జెట్‌కు ముందు ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని.. ఆ దిశగా బడ్జెట్ ఉండాలని కోరుకున్నారు. కరోనా కారణంగా చాలా మంది జీవితాలపై దెబ్బపడింది. ఉద్యోగాల గురించి జనాలకు అర్థం కానీ భాషలో అమృత్ కాల్ , వికాస్ అని ఏదో చెబుతారు. ఆదుకోవడం గురించి ఆత్మనిర్భర్ అంటారు. కరోనా దేశాన్ని చిదిమేసింది. మొత్తం 97శాతం మంది ప్రజలు కరోనా దెబ్బకు ఆదాయాన్ని కోల్పోయారని కేంద్ర సంస్థలే లెక్క తేల్చాయి. అంటే ఈ బడ్దెట్‌లో చేయాల్సింది.. ఆదాయాన్ని కోల్పోయిన వారికి లబ్ది చేకూర్చడం.. అభివృద్ధి చేయడం..లాంటివి ముఖ్యం.కానీ ఈ బడ్జెట్లో ఏం కనిపించాయి. గతంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఎవరు లాభపడ్డారో .. ఎంత మేర దేశానికి మేలు జరిగిందో లెక్కలతో సహా కేంద్రం చెప్పాల్సింది. కానీ ఆ లెక్కలన్నీ తేడా లెక్కేలేనని ఒప్పుకోవాల్సి వస్తుందని ఆగిపోయినట్లుగా ఉంది.
అత్యధిక పన్నుల వసూళ్లు అభివృధ్దా !?
జనవరిలో నెలల రూ. లక్షా 40వేల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది ..ఇది చరిత్రలో అత్యధికం అని నిర్మలా సీతారామన్ చిరు దరహాసంతో ప్రకటించారు. ఆ వెంటనే బీజేపీ సభ్యులు చప్పట్లతో మారుమోగించారు. బడ్జెట్ తర్వాత ఇంత కంటే అభివృద్ధి ఏముంది అని మంత్రులు వంత పాడారు. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడమే అభివృద్ధా అని సామాన్యులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. దేశంలో ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉందో.. ప్రజలు ఉపాధి విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో కళ్ల ముందే కనిపిస్తోంది. కానీ ప్రజల వద్ద నుంచి రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేయడాన్ని గొప్పగా కేంద్రం చెబుతోంది. మన ప్రజాస్వామ్యం రాజ్యాంగ నిర్మాతలు ఆశించిటన్లుగా ఫరిడవిల్లుతుందో లేదో కానీ పన్ను స్వామ్యం మాత్రం నాలుగు పాదాల నడుస్తోంది. దేశంలో ఎవ్వరూ పన్నుల నుంచి తప్పించుకోలేరు. ఆదాయపు పన్ను మాత్రమే కడుతున్నామని చాలా మంది భ్రమిస్తూ ఉంటారు. కానీ మనది పన్ను స్వామ్యం. సంపాదించినందుకు పన్నే కాదు ఖర్చు పెట్టినందుకూ పన్ను కట్టాలి. బిచ్చమెత్తుకునే వాళ్లు కూడా తాము కొనుక్కునే చిన్న బన్ను.. బిస్కెట్లకు.. జీఎస్టీ కట్టాల్సిందే.. పరోక్ష పన్నులు ఆ రకంగా ఉంటాయి. దీనికి పెట్రోల్, డీజిల్, మద్యం పన్నులు అదనం. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక్కో మనిషి ఆదాయంలో సగం వరకూ ప్రభుత్వాలే పన్నుల రూపంలో తీసుకుంటూ ఉంటాయి. ఇలా పిండేసి.. దాన్నే అభివృద్ధిగా చెబుతున్నారు మన పాలకులు. దానికీ పాలాభిషేకాలు చేస్తున్నారు వారిని సమర్థించేవారు.
జీతాలపై ఆధారపడేవారిని కాస్తయినా కనికరించరా ?
ఇప్పుడు పాతిక వేల జీతంతో ఓ కుటుంబం నడవగలదా ? అసాధ్యం. ఒక్క గ్యాస్ సిలిండర్‌కే రూ. వెయ్యి వసూలు చేస్తున్నారు. మరి ఉప్పులు , పప్పులు.. ఇంటి అద్దె , పిల్లల ఫీజులు ఇలా చెప్పుకుంటూ పోతే సరిపోవు. కానీ రెండున్నర లక్షలు దాటి సంపాదిస్తే పన్ను బాదేస్తోంది ప్రభుత్వం. ఈ రెండున్నర లక్షల్లో ఏం ఖర్చు పెట్టినా అందులో జీఎస్టీ ఎలాగూ తీసుకుంటుది. పద్దెనిమిది శాతం లెక్క చూసినా కనీయం యాభై వేలు ప్రభుత్వ ఖాతాలో పడుతుంది. ఇక పెట్రోల్, డీజిల్ లాంటివి కొంటే ఇంకా ఎకకువ. చిన్నా చితకా జీతాలకు పనిచేసేవాళ్లు రూ. 40వేలకు పైన సంపాదించే వారు సిటీలో వాళ్ల ఖర్చులకు మిగిలేది ఏముంటుంది? ఈఎంఐలు తీస్తే.. బ్యాంకులో ఎప్పుడూ అప్పులే. కానీ ఈ బాధలు బడ్జెట్ తయారు చేసే పెద్దలకు కనిపించవు.
ఒక్క బడ్జెట్‌తో దేశం రాత మారదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో బడ్జెట్లు వచ్చాయి. కానీ ప్రతీ బడ్జెట్‌కు మెరుగయ్యామన్న భరోసా ప్రజలకు కల్పించాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు అది మిస్సయింది. నేతల ప్రకటనల్లోనూ.. సోషల్ మీడియా ప్రచారంలోనూ మాత్రమే కనిపిస్తోంది.