” ఎప్పుడూ ఎవరూ “హై”లోనే ఉండరు. ఓ సమయంలో అత్యంత దిగువకు రావాల్సి ఉంటుంది. “హై”లో ఉన్నప్పుడు మిడిసిపడితే “లో”లో ఉన్నప్పుడు మళ్లీ లేవకుండా తొక్కుతారు”. ఈ సూక్ష్మం తెలుసుకున్నవారు కాస్త లౌక్యంగా ఉంటారు లేని వాళ్లు వైసీపీ నేతల్లా తలో దిక్కుకు పారిపోయి.. ఎవరు ఎప్పుడు వచ్చి పట్టుకుపోతారా అని బిక్కుబిక్కుమంటూ ఉండాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, అధికార దుర్వినియోగం మరచిపోయేవి కావు. అందుకే “రెడ్ బుక్ పెట్టుకున్నాం.. ప్రతి ఒక్కరి తాట తీస్తాం” అని నారా లోకేష్ ఊరూవాడా చెప్పినా సరే ప్రజలు సపోర్టు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పశువులకు, మనుషులకు తేడా ఉండాలి కదా అని సంయమనం పాటిస్తున్నారు. కానీ చట్టపరంగా శిక్షించాల్సిన వారిని శిక్షించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇది ఆలస్యమవుతున్న కొద్దీ టీడీపీ క్యాడర్ లోనే కాదు.. వైసీపీ బాధితులందరిలోనూ అసహనం పెరుగుతోంది. వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే సామాన్య ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న.. “ఇంత కాలం ఎందుకు ఆలస్యం అయింద”ని. ఈ ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మరింత ఉత్సాహంగా రెడ్ బుక్ వేట కొనసాగించవచ్చు. అయితే ఏదైనా చట్ట పరిధిలోనే చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గ దూకుడు మాత్రం చూపించాల్సిందే.
నాటి పాపాలు – నేటి శాపాలు
ప్రజలు ఐదేళ్లకు అధికారం ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓట్లు వేయాలి. ఈ అంశం మర్చిపోయి మానసిక సమస్య ఉన్న వ్యక్తిలా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి విపక్ష పార్టీల నేతల్ని వ్యక్తిగత శత్రువులుగా చూశారు. ఎంత ఘోరం అంటే చిన్న ఆధారం లేని కేసుల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు సహా చంద్రబాబు వరకూ అందర్నీ అరెస్టు చేసి పగలబడి నవ్వుకున్నారు. పార్టీ నేతలతో దాడులు చేయించారు. చంద్రబాబుపై రాళ్లేయించి చంపాలని చూశారు. చివరికి కుటుంబాన్ని వదిలి పెట్టలేదు. ప్రజల ఖాతాల్లో ఓ ఐదు వేలు ముష్టి పడేస్తే వారు కూడా ఈ ఆకృత్యాలన్నింటికీ మద్దతు పలుకుతారన్న ఓ బలుపుతో పాలన సాగించారు. అందుకే ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబును అరెస్టు చేశారు. వైసీపీలో ఏం జరిగినా.. వైసీపీ నేతలు ఏం చేసినా.. ప్రతి ఒక్కటీ స్క్రిప్టే. తాడేపల్లి ఆపీసు నుంచి వచ్చిన స్క్రిప్టు ప్రకారమే చదువుతారు. ఇలా తాము చేయమన్న పనులను ఎలా చేశారో .. ఎలా చేశారో బేరీజు వేసుకుని విశ్వసనీయత..విధేయత అనే లెక్కలు వేసుకుని పదవులు ఇచ్చేవారు. తాము చెప్పిన దాని కన్నా ఎక్కువ చేశాడని.. జోగి రమేష్ ను మంత్రిని చేశారు జగన్.. దాని కోసం అప్పటికే అటు జనసేనను ఇటు టీడీపీని దూషించి ఆ రెండు పార్టీల్లోకి ఎంట్రీ కోల్పోయిన పేర్ని నాని, కొడాలి నాని పదవుల్ని పీకేశారు. అప్పటికే కాదు.. ఇప్పటికీ వారికి మరో ఆప్షన్ లేదు. జగన్ రెడ్డికి మానసిక వికృత ఆనందం కల్పించడానికి ఎంతో మంది నేతుల పావులుగా మారారు. ఇప్పుడు వారంతా బలి పశువుల్లా మారారు.
జగన్ హ్యాపీ – వీళ్లే బలి పశువులు
సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరారు. కూటమి పార్టీల్లో అభ్యంతరాలు రాలేదు. గురువారమే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ టీడీపీలో చేరారు. లోకల్ పాలిటిక్స్ వల్ల కొంత మంది వ్యతిరేకించారు కానీ ఆయన చేరికను ఎవరూ ఇతర కారణాలతో అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఈ ఇద్దరూ వైసీపీలో రాజకీయ విమర్శలను రాజకీయ విమర్శలుగానే చేశారు. పదవులు ఇస్తామని .. గీత దాటాలని.. వ్యక్తిగత దూషణలకు పాల్పడాలని సంకేతాలు పంపించినా వీరు మాట్లాడలేదు. వైసీపీలో కృష్ణా జిల్లాలో సామినేని కంటే సీనియర్ నేత లేడు. అయినా ఆయన పవన్ కల్యాణ్ ను తాము అనుకున్నంత స్థాయిలో..తాము సూచించినంత స్థాయిలో తిట్టలేదని మంత్రి పదవి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి రాజకీయ భవిష్యత్ ను .. వ్యక్తిగత జీవితాలను రిస్క్ లో పెట్టుకున్న వారికి లెక్కేలేదు. అందుకే కొన్ని వందల మంది వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. జగన్ దగ్గరకు వెళ్తే మళ్లీ ఏ స్వార్థంతో తమను బలి చేసి.. ఆయన మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తాడోనని భయపడిపోతున్నారు. బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని విధంగా మాట్లాడుతున్నారు. ఇంకెవరూ మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఒక్క అంబటి రాంబాబు మాత్రమే ప్రతి దానికి వచ్చి మాట్లాడుతున్నారు. చివరికి రోజాను కూడా నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు. ఆమె అటు టీడీపీ .. ఇటు జనసేన నీడలోకి కూడా పోలేని విధంగా తిట్టించి ఇప్పుడు నగరి సీటును గాలి ముద్దుకృష్ణమనాయుడు మరో కుమారుడికి ఇస్తామని చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. రోజాకు సినిమా అర్థమైపోయి చెన్నై వెళ్లిపోయారు. కిరణ్ రాయల్ ఇష్యూ జరుగుతున్నా ఆమె నోరెత్తలేదు. తిట్లుమాత్రమే కాదు అరాచకాలకు పాల్పడిన వారు ఇప్పుడు చాలా మంది కనిపించడం లేదు. ఆజ్ఞాతంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భయంతో పారిపోయి బతుకుతున్న వారిని భయపడుతూ బతకమని ఆఫర్ ఇచ్చింది కానీ వెతికి వెంటాడి తీసుకురావడం లేదు. దీన్ని అలుసుగా తీసుకున్న వంశీ.. ప్రభుత్వంతోనే గేమ్స్ ఆడాలనుకున్నాడు. ఏకంగా ఫిర్యాదినే బెదిరించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వానికి చురుకు తగిలింది కాబట్టి అరెస్టయ్యాడు.
అధికారం శాశ్వతం కాదు !
అధికారంలో ఉన్నప్పుడు వీరంతా “ల” భాషనే వాడేవారు. అప్పట్లోనే చాలా మంది అధికారం పోతే మీ పరిస్థితి ఏమిటి అని గుర్తు చేసేవారు. తెలుగు360 కూడా ఎన్నో సార్లు చెప్పింది. అధికారం శాశ్వతం కాదు.. రేపటి రోజున అధికారం కోల్పోతే.. అంతకు రెట్టింపు అనుభవించాల్సి వస్తుంది. ఒకే వేళ ప్రభుత్వపెద్దలు పద్దతిగా ఉన్నా.. ప్రజలు చేతకాని వారంటారు..అందుకే ప్రభుత్వానికీ తప్పదు.. అలాంటి సిట్యూయేషన్ వస్తే తప్పించుకోలేరని చెప్పాం. కానీ వాళ్లకు ఎవరి మాటలూ ఎక్క్లేదు. తాము ముఫ్పై ఏళ్లు అధికారంలో ఉంటామని రెచ్చిపోయారు. ప్రజల్ని ఇంత తక్కువగా అంచనా వేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత అప్పట్లో హీరోయిజం అని బూతులు తిట్టిన వారు.. దాడులు చేసిన వారు కనిపించకుండా పోయారు. వంశీ అసలు అమెరికా పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు కానీ సాధ్యం కాలేదు. తప్పని సరిగా రావాల్సి వచ్చింది. కొడాలి నాని ఎక్కడున్నారో తెలియదు. వీరే కాదు ఎంతో మంది అప్పట్లో తొడలు కొట్టిన వాళ్లు ఇప్పుడు అధికారం పోగానే ఎందుకైనా మంచిదని చెప్పి సైలెంట్ అయిపోయారు. కలుగుల్లో దాక్కున్నారు. నాడు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే.. ఎవరు వచ్చినా సరే మా రౌడీయిజం మేం చూపిస్తామనేవారు కానీ.. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కడా మాట్లాడటం లేదు.. కనీసం కనిపించడం లేదు. ఇంతకు ముందే చెప్పినట్లుగా చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మెల్లగా ముందుకు కదులుతూ.. నిందితులు అందరికీ న్యాయపరమైన అవకాశాలు కల్పిస్తూంటే.. ప్రభుత్వాన్ని చాలా మంది చేతకాని ప్రభుత్వం అంటున్నారు. ఇలాంటి మాటలు అనిపించుకోవాలని ఏ ప్రభుత్వమూ అనుకోదు. నిజం చెప్పాలంటే.. ఇలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిన తరవాత ప్రజలంతా గత ప్రభుత్వం లో అరాచకాలకు పాల్పడిన వారిని వదిలి పెట్టకూడదని గట్టిగా పట్టుబట్టేలా చేసి..ఒక్క సారిగా గట్టిగా కొట్టే వ్యూహం అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. వంశీ.. ప్రత్యేకంగా ప్రభుత్వాన్నే తక్కువగా అంచనా వేసి అనుభవిస్తున్నారు.
ఎవర్నీ వదలకూడదు !
పరిపాలన విషయంలో చంద్రబాబు సీఎంగా ఉంటే ఎలాంటి రిమార్కులు ఉండవు. అన్నీ సాఫీగా సాగిపోతాయి. కానీ ఈ సారి ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇవ్వడానికి కారణం ఉంది. అదే తాము ఐదేళ్ల పాటు పరిపాలించమని అధికారం ఇస్తే దాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసిన వారి భరతం పట్టమని కనీ వినీ ఎరుగని మెజార్టీ ఇచ్చారు. ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు సామాన్యులను .. మెప్పించలేదు. ఆ విషయం స్పష్టమవుతోంది. చట్టాన్ని ఉల్లంఘించి అరెస్టులు చేసి.. వారికి థర్డ్ డిగ్రీ ఇచ్చి లైవ్ లో చూడాల్సిన అవసరం లేదు కానీ.. చట్ట ప్రకారం వారిని కోర్టుల ముందు నిలబెట్టి వారు చేసిన పాపాలను ప్రజల ముందు ఎక్స్ పోజ్ చేయాల్సి ఉంది. అలా చేయకపోతే ప్రజలు ప్రభుత్వానిది కూడా చేతకానిదంటారు. అందుకే ఇక ముందు దూకుడు పెంచాల్సి ఉంది. నిజానికి ఇప్పుడు బాధితులుగా మారిన వైసీపీ నేతలంతా పావులే. వారెవరూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. జగన్ రెడ్డి కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చిన వారు. కొడాలి నాని అయినా.. పేర్ని నాని అయినా.. మరో ధర్మాన అయినా జగన్ కంటే ముందే రాజకీయాల్లో ఉన్నారు. అయితే జగన్ తో కలిసి పని చేసిన తర్వాతనే వారి పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు అయిందో వారికి అర్థమవుతుంది. నాయకుడ్ని నమ్ముకున్న వారు తమ జీవితాలను రిస్కులో పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పాత్రధారుల్ని శిక్షిస్తారు సరే.. మరి సూత్రధారిని వదిలేస్తారా ?. అందరి జీవితాలను నాశనం చేసిన సూత్రధారిని ప్రభుత్వం ఇతర కేసుల్లో పట్టుకుంటుందేమో కానీ.. వీరి జీవితాలను రిస్కులో పెట్టిన కేసులు మాత్రం రిజిస్టర్ కావు.అందుకే ఇలాంటి నేతల్ని వదిలించుకుని రాజకీయ సన్యాసయమైన తీసుకుని ప్రశాంతంగా గడపాలి కానీ.. ఇప్పటికీ 2.0 అంటున్నారని రెచ్చిపోతే ఇప్పటికే చెట్టుకొకరు.. పుట్టకొకరుగా పారిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకోవాలి.
నాయకుడు అంటే నలుగుర్ని బాగు చేసేవాడిలా ఉండాలి కానీ అందర్నీ తన స్వార్థం కోసం నాశనం చేసి తాను ఎదిగిపోవాలని అనుకోకూడదు. దురదృష్టవశాత్తూ జగన్ అలాంటి వాడే. ఆయన దెబ్బకు ఎంత మంది సివిల్ సర్వీస్ అధికారులు దారి తప్పారో.. వ్యవస్థకు మచ్చలా మారాలో చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లోనే ఓ విష సంస్కృతికి చాలా మంది నేతలు బలైపోయారు. ఇప్పుడు 2.O అని ఎవరైనా ఆవేశపడితే.. ఈ సారి చాలా షార్ట్ గానే వారి జీవితాలు సంకనాకిపోతాయి. జరుగుతున్న పరిణామాలు అవే.