“రెవెన్యూ , పోలీసు, రిజిస్ట్రార్ , ఇతర ప్రభుత్వ వ్యవస్థల్లోని ఉద్యోగులు , అసమర్థులు, అవినీతి పరులు కాబట్టే వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది” అని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నిర్మోహమాటంగా చెప్పారు. వారందరూ అవినీతి పరులు, చేతకాని వాళ్లే అనుకుందాం.. కానీ వారికి ప్రత్యామ్నాయంగా వాలంటీర్లను పెట్టాలని ఏ చట్టలో ఉంది.? ఏ రాజ్యాంగంలో ఉంది ?. వైసీపీ ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర చట్టంలో ఉంది. అమలు చేసే రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంది. అంతే తప్ప.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో.. ప్రభుత్వం వాలంటీర్లను పెట్టుకుని వారికి ఎలాంటి బాధ్యత లేకుండా పూర్తి అధికారం ఇచ్చి.. పాలన చేయమని చెప్పలేదు. కానీ ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తోంది. అదే వాలంటీర్లతో .. దిష్టిబొమ్మలు తగులబెట్టించి.. సానుభూతి పొందాలని చూస్తోంది. ఈ రాజకీయం అంతా పక్కన పెడితే అసలు వాలంటీర్లు ఎవరు ..? వారేం చేస్తున్నారు అని ఆలోచిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత నీచానికి దిగజారిపోయిందనేది అర్థమైపోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇంత ప్రజా ద్రోహానికి పాల్పడే ఆలోచన ఎలా చేస్తుందన్న విస్మయం కూడా కలుగుతుంది. చట్ట బద్దత లేని.. అసలు ఎప్పటికీ రాని వాలంటర్ల వ్యవహారం.. కోర్టులకు వెళ్లినా అక్కడా తేలకపోవడం వ్యవస్థలోని లోపమే. ఈ లోపాలను పక్కాగా ఉపయోగించుకుని.. క్రిమినల్ మైండ్ తో ఉన్న పాలకులు.. అచ్చమైన క్రమినల్ మాస్టర్ ప్లాన్లు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.
వాలంటీర్ల చట్టబద్ధతపై సమాధానం లేని ప్రభుత్వం !
వాలంటీర్లు ఎవరు అంటే.. జగన్ రెడ్డి చెప్పే సమాధానం మానవతా మూర్తులు. మంత్రులు చెప్పే సమాధానం దైవాంస సంభూతులు. ఇంకా ఎన్ని రకాల పొగడ్తలు ఉంటాయో అన్నీ చెబుతారు.ఇవన్నీ సరే.. అసలు ప్రజాధనం ఏటా రూ. రెండు, మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి .. వారికి దోచి పెట్టడానికి ఎలాంటి చట్టబద్ధత ఉంది అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా పథకాలకు అర్హులను నిర్ణయించే అధికారం వలంటీర్లకు ఎక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది.వలంటీర్ వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించింది. వారికి ఉన్న సర్వీస్ రూల్స్ ఏమిటని నిలదీసింది. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ శాఖలు ఉన్నప్పుడు, వలంటీర్లను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. వారికి జబాబుదారీతనం ఏముంటుందని నిలదీసింది.కానీ ప్రభుత్వం వద్ద దేనికీ సమాధానం లేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థనే చట్ట వ్యతిరేకతమైనది. వారితో చేయించే పనులన్నీ చట్ట విరుద్ధమైనవే. పథకాల విషయంలో లబ్దిదారుల ఎంపిక నుంచి అన్నీ పనులు చేస్తున్నరని ప్రభుత్వం చెబుతోంది. కానీ వారు చేసే ప్రతి పనికి.. ప్రజల సొమ్మును జీతంగా తీసుకునే ఉద్యోగులు ఉన్నారు. వీఆర్వోలు దగ్గర్నుంచి ఎంపీడీవోల వరకూ అనేక వ్యవస్థలు ఉన్నాయి. కానీ అసలు ఉద్దేశంతో వాలంటీర్లతో చేసే ప్రజా సేవ కాదు.. పార్టీ పరమైన ప్రయోజనాల కోసం ప్రజాధనంతో పెట్టుకున్న వ్యవస్థ.
ప్రతి ఇంటిపై నిఘా – సమాచార సేకరణే వారి పని !
వాలంటీర్లు పూర్తిగా వైసీపీ కార్యకర్తలు. వారు చేసే పని ఒకటో తేదీన ప్రభుత్వ పించన్లు పంపిణీ చేయడం. ఆ తర్వాత తమకు కేటాయించిన యాభై ఇళ్లపై నిఘా పెట్టడం. టాస్కుల ప్రకారం ఇచ్చే సమాచారన్ని సేకరించి.. యాప్ లో అప్ లోడ్ చేయడం. తద్వారా తాము ఎంత తప్పుడు పనులు చేస్తున్నామో.. తెలియకండానే.. ఆ వాలంటీర్లతో క్రిమినల్ మైండ్ సెట్‌తో ఉన్న పెద్దలు చేస్తున్న పెద్ద కుట్రల్లో భాగం అవుతున్నారు. జగన్ సర్కార్ నియమించిన సుమారు 2.61 లక్షల మంది ‘గూఢచారులు’..ప్రజల కదలికల్ని నిరంతరం డేగకళ్లతో కనిపెడుతున్నారు. ప్రజల కదలికల్ని ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చేరవేస్తున్నారు. పేరుకే వాళ్లు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛంద సేవకులు. నిజానికి ఆ ముసుగులో పనిచేస్తున్న అధికార పార్టీ వేగులు.! వాళ్లంతా ప్రజల సొమ్మును జీతాలుగా స్వీకరిస్తూ.. వారి వివరాల్ని అధికార పార్టీకి అందిస్తున్న అసలు సిసలు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కోసం పెంచి పోషిస్తున్న ఈ సమాంతర వ్యవస్థ..ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడింది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన.. స్వేచ్ఛగా జీవించే హక్కుకి, భావ ప్రకటన స్వేచ్ఛకు పెను విఘాతంగా మారింది. ప్రజలపైనా, ప్రతిపక్షాలపైనా నిఘా పెట్టడం, వారి బలాల్ని, బలహీనతల్ని కూపీలాగి అధికార పార్టీకి చేరవేయడమే వారి ప్రధాన విధి. అంతే కాదు ఎన్నికల సమయంలో ఓటర్ల గుట్టు గుప్పిట పట్టుకుని.. వారిని వైసీపకి ఓటు వేసేలా బెదిరించడం వారి విధుల్లో ఒకటి.
ఓటర్ల జాబితా అస్తవ్యస్తం చేసింది వాలంటీర్లు కాదా ?
ఏపీలో ఓటర్ల జాబితా అస్తవ్యస్థం అయింది. ఇష్టారీతిన దొంగ ఓట్లు చేర్చారు. ఉన్న ఓట్లను తీసేశారు.ఎంత దారుణం అంటే… ఖచ్చితంగా గెలుపు కోసం ఎన్ని ఓట్లు తీసేయాలో..కలపాలో లెక్కలేసుకుని మరీ చేస్తున్నారు. ఇంత డేటా వాలంటీర్ల వల్ల కాదా..వైసీపీకి చిక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు జరిగింది ఇదే. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లలో వారు చేసి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి వాలంటీరు తమకు కేటాయించిన కుటుంబాల్లో అర్హత ఉన్నవారిని గుర్తించి, ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఓటర్లుగా నమోదు చేయించారు. పథకాలన్నీ జగనే ఇస్తున్నారని.. ప్రతి లబ్ధిదారునికి పదేపదే చెబుతున్నారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే పథకాలన్నీ కొనసాగుతాయని ప్రచారం చేస్తున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకుంటే..వచ్చే ప్రభుత్వం ఇళ్ల స్థలాల్ని రద్దు చేస్తుందని లబ్ధిదారుల్ని బెదిరిస్తున్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు.. వాలంటీర్లతో ప్రత్యేక వ్యవస్థను నడుపుతున్నారు. క్రమం తప్పకుండా వారితో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ.. గ్రామాల వారీగా పార్టీల బలాబలాల వివరాలను సేకరిస్తున్నారు. ప్రైవేటుగా ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి సంబంధించిన మండల స్థాయి అధికారులు క్రమం తప్పకుండా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వారి వివరాలను సేకరించి బెదిరింపులకు దిగుతున్నారు. ల ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే ప్రభుత్వ సమావేశాలు, వైసీపీ సభలకు ప్రజల్ని తరలించే బాధ్యత వాలంటీర్లదే. హాజరవకపోతే పథకాలు రద్దవుతాయని ప్రజలను బెదిరిస్తున్నారు. వాళ్లే దగ్గరుండి వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళుతున్నారు. అక్కడ హాజరును నమోదు చేస్తున్నారు. ప్రతి రోజూ డేటా సేకరణలోనే వలంటీర్లు ఉంటున్నారు. ఎవరి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా ఆరా తీస్తున్నారు. ఈ వ్యవస్థ మాఫియాలా మారిందని, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, వారిని నియంత్రించకుంటే వచ్చేఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకోలేరని విపక్ష పార్టీలు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే వస్తున్నాయి.
వారసులు లేని ఆస్తుల దగ్గర్నుంచి – ఖాళీ స్థలాల కబ్జాల వెనుక ఉన్నది ఎవరిచ్చిన సమాచారం ?
ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నీ వాలంటీర్ల చేతుల మీదుగానే నడుస్తున్నాయి. ఇళ్లు కూల్చివేతల దగ్గర్నుంచి .. ఆస్తుల కబ్జాల కోసం వైసీపీ నేతలు తెగబడుతున్న విషయంలో వాలంటీర్లు సేకరిచిన సమాచారమే కీలకం. వారసులు లేని ఆస్తుల్ని సేకరించి ఇప్పటికే కొన్ని వేల చోట్ల కబ్జాలుచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్లు నిర్వహించే యాప్‌లు.. వారు ఇచ్చే సమాచారం మొత్తం ఎఫ్ ఏ వో అనే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి చేరుతుంది. ఆ సంస్థ పులివెందుల వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. అది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. ఆ సమాచారం..ఏ మాత్రం ఆటంకాలు లేకుండా వైసీపీకి చేరిపోతోంది. ఇంత అడ్డగోలుగా తమతో పనులు చేయిస్తున్నందుకు వాలంటీర్లు కూడా ఇక తమకు అడ్డేముంటుందన్నట్లుగా చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని కొన్నిచోట్ల వాలంటీర్లు నేరాలు..ఘోరాలు..త మోసాలకు పాల్పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు వంటి ఘోరమైన నేరాలకు తెగబడుతున్నారు. ఆస్తుల పత్రాలు మార్చేస్తున్నారు. వాలంటీర్లు చేసిన నేరాలపై.. నమోదైన కేసులను బయటకు తీస్తే.. వారెంత ప్రమాదకరంగా మారారో అర్థం చేసుకోవచ్చు.
వాలంటీర్లు లేకపోతే ప్రజలు బతకలేరా ? వైసీపీ బతకలేదా ?
మాటకంటే ముందు వాలంటీర్లు ప్రజాసేవకులు..వారు లేకపోతే ఏపీలో ప్రజలు బతకలేరని.. కరోనా కాలంలోనే అందరూ చచ్చిపోయేవాళ్లని కథలు చెబుతున్నారు. నిజానికి కరోనా కాలంలోనే కాదు.. ఆ తర్వాత.. ముందు కూడా ప్రజలు వాలంటీర్లు చేసిన సేవలు ఏమీ లేవు. దేశంలో ఎక్కడా వాలంటీర్లు లేదు. కానీ అక్కడ ప్రభుత్వలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థ ఉంది. అందుకే ప్రజల్ని కాపాడుకున్నారు. ఏపీలో చచ్చిపోయినోళ్లను చచ్చిపోనిచ్చి బతికున్న వాళ్లను వాలంటీర్లే కాపాడారనే ముద్ర వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఎందుకంటే.. ఆయన చట్ట వ్యతిరేక.. రాజ్యాంగ విరుద్ధమైన పాలనకు వారే పిల్లర్లు. రేపు ఎన్నికల్లో గెలిపించేది.. అభ్యర్థులో మరెవరో కాదు..వాలంటీర్లే.. వారి దగ్గర ఉన్న సమాచారం.. వారు ఇచ్చిన సమాచారమే అనుకుంటున్నారు. వాలంటీర్లు లేనప్పుడు పెన్షన్లు ప్రభుత్వాలు పంపిణీ చేయలేదా ?. అప్పుడు ఇంకా పంపిణీలో బాధ్యత ఉండేది.కానీ ఇప్పుడు వాలంటీర్ల చేతుల్లో పెడితే కొన్ని చోట్ల దొంగ నోట్లు పంచుతున్నారు.. మరి కొన్ని చోట్లరద్దయిన రెండు వేల నోట్లు పంచుతున్నారు. ప్రతి పథకంలోనూ కమిషన్లు పొందుతున్నారు. లేకపోతే ఐదు వేలతో వారి జీవితాల్ని ఎందుకు పణంగా పెట్టుకుంటారు ?. తమ కుట్రలు కుతంత్రాలు బయటపడేసరికి.. ఆ వాలంటీర్లనే అడ్డం పెట్టుకుని సీఎం జగన్ రెడ్డి బయటపడాలనుకుంటున్నారు. అందుకే వాలంటీర్లందరికీ దిష్టిబొమ్మలు స్పాన్సర్ చేసి.. మరీ ఆందోళలను చేయిస్తున్నారు. నిజానికి ఇదే వాలంటీర్లు గత ఏడాది..తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డెక్కారు. అప్పుడు వారివి ఉద్యోగాలు కాదని.. సేవ అని జగన్ చెప్పుకొచ్చారు. సేవ అయితే రూ. ఐదు వేల గౌరవ వేతనం ఎందుకు ఇస్తున్నారన్నది అందరికీ వస్తున్న సందేహం. అలా డబ్బులు తీసుకుని చేసేది సేవ ఎందుకవుతుందని న్యాయస్థానాలకు వస్తున్న డౌట్. ఇవన్నీ తీర్చలేని.. సమాధానం చెప్పలేని ప్రభుత్వ పెద్ద.. వారితో దిష్టిబొమ్మలు తగులబెట్టిస్తున్నాడు.
ఈ చట్ట విరుద్ద వ్యవస్థ చేస్తున్న నష్టానికి బాధ్యత వహించేది ఎవరు ?
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ 2019 అక్టోబరు 2న మొదలైంది. 2.61 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. వారికి వార్షిక అవార్డులు, మొబైల్ ఫోన్ ఛార్జీలు, సాక్షి దినపత్రిక కొనుక్కోవడానికిచ్చే నిధులు కలిపి.. మొత్తంగా ఏడాదికి 19వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇదంతా చట్ట విరుద్ధమైన చెల్లింపులే. ఇంకా వ్యవహారం కోర్టులో ఉంది. ఇక్కడ వాలంటీర్లవ్యవస్థ చట్టబద్ధత తేలే సరికి మళ్లీ ఎన్నికలు వస్తాయి. కానీ జరిగిన నష్టానికి ఎవరిది బాధ్యత ?. ఏ వ్యవస్థ బాధ్యత వహస్తుంది ? నష్టపోయిన ప్రజలకు.. ప్రజాస్వామ్యానికి పూచీ ఎవరు ?