నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని ఇలాంటి సమయంలో దేశాన్ని విడగొట్టి.. దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష స్వయంగా పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇలాంటి విభజన బీజాలు నాటడం సరి కాదని కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. తమ విధానం అది కాదని స్పష్టం చేసింది. అయితే తమపై వివక్ష నిజమని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు ఢిల్లీలో వరుసగా ధర్నాలు చేస్తున్నాయి. నిధుల కోసం కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేసింది. ఆ తర్వాత కేరళ వంతు. ఏపీ సీఎం జగన్ కూడా అసెంబ్లీలో రావాల్సినన్ని నిధులు రావడం లేదన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నిరంతర పోరాటం చేస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అదే అభిప్రాయం చెప్పారు. ఒక్క నిధుల విషయంలోనే కాదు … ఇతర విషయాల్లోనూ దక్షిణాదిలో కేంద్రంపై అసంతృప్తి పెరుగుతోందని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మన దేశంలో రాజకీయం రాచపుండు లాంటిది. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది కి ముందుంటారు. అలాంటి రాజకీయానికి ముడి సరుకు వివక్ష. దక్షిణాది ప్రజల్లో ఇలాంటి భావన పడకుండా చూసుకోవాల్సింది కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే.
పన్నుల పంపిణీలో అసమానతలు
కర్ణాటక నుంచి టాక్స్ రూపంలో కేంద్రానికి రూపాయి వెళ్తూంటే కేవలం పదిహేను పైసలే తిరిగి ఇస్తున్నారని అదే యూపీకి రెండు రూపాయలు ఇస్తున్నారని అంటున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేసే పన్నులు.. తిరిగి వచ్చే పన్నుల్లో ఈ తేడా స్పష్టంగా ఉంది. ఇది మరీ పెరిగిపోవడం సమస్యగా మారుతోంది. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆదాయ పంపిణీ జరుగుతోంది. కాని ఇకపై 15వ ఆర్థికసంఘం సిఫార్సులతో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు 1971 జనాభా లెక్కల ప్రకారమే ఆదాయ వనరుల పంపిణీ జరిగింది. ఇప్పుడు 15వ ఆర్థికసంఘం గైడ్ లైన్స్ప్రకారం 2001 జనాభా లెక్కల ప్రకారం ఆదాయ పంపిణీ జరుగుతుంది. అప్పుడు మొదటగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే అప్పట్లో జనాభా నియంత్రణ విధానాలు పాటించి,గణనీయ కృషి చేసి జనాభాను నియంత్రించారు. అదే ఇప్పుడు శాపంగామారింది. ఉత్తరరాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించలేదు. ఇబ్బడిముబ్బడిగా జనాభాను పెంచాయి. అది వారికి ఇప్పుడు మంచిదైంది. ఈ సందర్భంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే దక్షిణ రాష్ట్రాలు పోరుబాటపడతాయి. దక్షిణాది రాష్ట్రాలు వాటి మౌలిక అభివృద్ధికి కావాల్సిన నిధులను అప్పు తెచ్చుకుంటుంటే, ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రం నుంచి గ్రాంట్లు పొందుతున్నాయి. చేసిన అప్పులను తిరిగి తీర్చాల్సిందే. అదే కేంద్ర గ్రాంటులైతే తిరిగి చెల్లించనక్కర్లేదు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు చేయగల అప్పుల మీద కేంద్రం పరిమితి విధించడంతో ఆ వసతి కూడా లేకుండా పోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కోరిన ఏ ప్రాజెక్టునూ ఎన్డిఎ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీ ఖర్చుతో ఆయా రాష్ట్రాల్లో 12 గోదాములు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఆ12 గోదాముల్లో ఒక్కటీ దక్షిణాది రాష్ట్రాలవి లేవు. తొలి విడతలో ఎంపిక చేసిన 9 రాష్ట్రాలూ ఉత్తరాదివే. అందులోనూ 6 బిజెపి పాలిత రాష్ట్రాలే . ఇవన్నీ తరచూ చర్చకు వస్తున్నాయి. ఉదాహరణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే, అక్కడ పెట్టే ఖర్చుకు 15 శాతం రాబడి రావాలంటున్న ఎన్హెచ్ఎఐ, అదే గుజరాత్లోని సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతులేమీ పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి.
లోక్సభ సీట్ల తగ్గింపు మరో వివాదం
దక్షిణాదిపై కేంద్రం అన్ని స్థాయిలో వివక్ష చూపిస్తోందని ప్రజల్లో చర్చ తరచూ జరుగుతోంది. రాజకీయంగానూ ఈ వివక్ష ఉందని అనుకోవచ్చు. రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్రంలో ఉన్న అధికార వర్గం అంతా… పూర్తిగా ఉత్తరాది వారే ఉంటున్నారు. దేశాన్ని నడుపుతున్న కేబినెట్ లో కానీ.. రాష్ట్రపతి వంటి పదవుల్లో కానీ ఎవరైనా దక్షిణాది వారున్నారా అంటే.. వెదుక్కోవాల్సిన పని . ఎవరూ లేరు. నిర్ణయాత్మక శక్తిగా ఎవరూ లేరు. దక్షిణాదికి లభించే ప్రాధాన్యత ఏమీ ఉండదు. ఇప్పుడు లోక్ సభ సీట్ల తగ్గింపు వివాదం కూడా ఉంది. ప్రతి 25 ఏండ్లకు డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే దీనికి 2021 జనాభా గణనను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా అప్పుడు జనాభా లెక్కలు తీయలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలంటే 2026 తర్వాత జరిగే జనగణనను పరిగణనలోకి తీసుకోవాలి. అంటే 2031లో జనాభా లెక్కలు ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది నియోజకవర్గాల పునర్విభజన పూర్తిగా జనాభా లెక్కల ద్వారానే జరుగుతోందని స్పష్టమవుతుంది. అదే జరిగితే దక్షిణాదికి జరిగే అన్యాయం ప్రజల్ని కుదురుగా ఉండనీయదు. ఎందుకంటే.. దేశం కోసం దక్షిణాది త్యాగం చేసింది. జనాభాను నియంత్రించింది. ఇప్పుడీ త్యాగానికి శిక్ష వేసేలా కేంద్రం వ్యవహరిస్తోంది. ప్రతి ఒక్క జనాభా లెక్కల సేకరణ అనంతరం చట్ట సభల్లో రాష్ట్రాల స్థానాల సంఖ్యను కొత్తగా నిర్ధారించాలని పెట్టుకొన్న నియమం జన సంఖ్యను నియంత్రించుకోడం ద్వారా ప్రగతి శిఖరాలను త్వరగా అందుకొనేందుకు చిత్తశుద్ధితో కృషి చేసే రాష్ట్రాల పాలిట శాపంగా మారనుంది. దేశంలో జనాభా పెరిగిపోతోందని జనాభా నియంత్రణను మన ప్రభుత్వాలు చేపట్టాయి. జనాభాను నియంత్రించిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రజలు చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా దక్షిణాదిలో జనాభా పెరుగుదల నిష్ఫత్తి తగ్గింది. అభివృద్ధిలో ముందుకు వెళ్లింది. కానీ ఉత్తరాదిలో జనాభా పెరుగుదల నిష్పత్తి తగ్గలేదు… అక్కడి ప్రజలు జనాభా నియంత్రణ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరికి శిక్ష వేయాలి ?. ఖచ్చితంగా ఉత్తరాదికే. కానీ దక్షిణాదికి శిక్ష పడబోతోంది. జనాభా ప్రాతిపదికగా చేయబోయే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది తీవ్రంగా నష్టపోనుంది.
జనాభాను నియంత్రించినందుకే శిక్షిస్తారా అని దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహం
భాష, సంస్కృతి, నిధుల పంపకం, రాజకీయ ప్రాధాన్యాల విషయాల్లో ఉత్తరాదితో పోలిస్తే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఢిల్లీ గద్దెనెక్కాల్సిందెవరో నిర్ణయించే అంశంలోనూ తగిన ప్రాధాన్యం దక్కని పరిస్థితి నెలకొంటుంది. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు జరిపినందుకు దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోతుండగా.. జనాభా నియంత్రణలో పూర్తిగా విఫల మై.. జనభా విస్ఫోటంతో నానా అవస్థలు పడుతు న్న ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం లబ్ధి పొందడం వైచి త్రి కాకమరేమిటి అని దక్షిణాది రాష్ట్రాల నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని ఈ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా రు. అందుకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ ఇవ్వాలంటూ ప్రధాని మోడీని డిమాం డ్ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరించడానికి క్షణకాలం ఆలస్యం చేయని కేంద్ర పాలక పక్షం బిజెపి ఇటువంటి విషయాల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోడానికి రాజ్యాంగాన్ని తగు విధంగా మార్చవచ్చు. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాల లోక్సభ స్థానాలు పెరిగేలా చూసి విఫలమైన రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడమే సమంజసంగా వుంటుంది. ఇటువంటి పరిష్కారాన్ని కనుగొనకుండా నియోజకవర్గాల పునర్వవస్థీకరణ జరిపితే ఉత్తరాది దక్షిణాదిల మధ్య అంతరాలు పెరగవచ్చు. ఇది దేశానికి మంచిది కాదు.
ప్రజల మనసుల్లో విభజన బీజం దేశానికి మంచిది కాదు !
దేశంలో దక్షిణాది ఇప్పుడు ద్వితీయ ప్రాధాన్య ప్రాంతంగా మిగిలింది. దేశంలో అత్యున్నత పదవులు చూస్తే.. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కాగ్ ఇలా లెక్కలేసుకుని చూస్తే… దక్షిణాది వాళ్ల జాడే ఉండదు. ప్రధానమంత్రి కార్యాలయంలో .. అధికార వర్గాల్లో కూడా ఎక్కడా దక్షిణాది అధికారులు కీలక పొజిషన్లలో ఉండరు. సీబీఐ చీఫ్ లు.. ఈడీ చీఫ్లు.. ఐటీ చీఫ్లు అందరూ.. గుజరాత్ నుంచో యూపీ నుంచో పుట్టుకు వస్తారు. కానీ దక్షిణాది వాళ్లకు లభించే ప్రాధాన్యం అంతంతమాత్రమే. గతంలో ప్రభుత్వాలు దక్షిణాది మనోభావాలను గౌరవించేవని ఇప్పుడా పరిస్థితి లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశంలో అత్యంత పురోగామి రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే.. ప్రత్యేక దక్షిణాది ఉద్యమం రాదని ఎవరూ చెప్పలేరు. దానికి మన రాజకీయమే కారణం అవుతుందని డీకే సురేష్ మాటలు నిరూపిస్తున్నాయి.
బాధ్యతగా వ్యవహరించాల్సింది ఢిల్లీని ఏలుతున్న పాలకులే. దేశాన్ని సమైక్యంగా ఉంచాల్సింది వాళ్లే. వివక్ష అధికమైతే తిరుగుబాటు అనివార్యమవుతుంది. దర్యాప్తు సంస్థలతో బెదిరించి నాయకుల్ని కంట్రోల్ లో ఉంచగలరేమో కానీ.. కడుపు మండి ప్రజలు ఉద్యమిస్తే.. అది దేశానికి చేటు చేస్తుంది. దక్షిణాది ఆత్మగౌరవం కాపాడకపోతే ఇదే జరుగుతుంది. ఇలాంటివి జరిగితే.. వేర్పాటు వాదం మరింత ఊపందుకుంటుంది. అది దేశానికి మంచిది కాదు. దేశాన్ని కలిపి ఉంచాలనుకుంటే పాలకులు దేశాన్ని సమదృష్టితో చూడాల్సి ఉంది.