“చెడుపై మంచి సాధించే విజయమే దసరా” .. మన చిన్నప్పటి నుండి ఇంకా చెప్పాలంటే పుట్టక ముందు నుంచీ.. పండుగ చేసుకుంటున్నప్పటి నుండి చెబుతూనే ఉన్నారు. మరి ఎప్పటికీ మంచే విజయం సాధిస్తోందా ?. ఎమో మంచి ఏదో.. చెడు ఏదో జడ్జ్ చేసే శక్తి ఎవరికీ లేదు. ఒకరికి మంచి అయింది.. మరొకరికి చెడు అవుతుంది. మరొకరికి చెడు అయింది.. మరొకరికి మంచి అవుతుంది. మరి ఎవరి కోణంలో వారికి మంచీ చెడు ఉంటుంది. అందుకే గెలిచేదంతా మంచి అని చెప్పలేం.. అలాగే ఓడిపోయేదంతా చెడు అని కూడా చెప్పలేం. కానీ మన వరకు ఏది మంచో.. ఏది చెడో నిర్ధారించుకుని చెడుపై పోరాడాల్సిన ఆవశ్యకతను దసరా మనకు నేర్పుతుంది.
మన కృషికి దైవబలం తోడైతే ఎదురే ఉండదు !
మన పండుగులకు పురాణాల్లో ఖచ్చితమైన కథలు ఉంటాయి. అవి కథలు కాదు వాస్తవాలు. మన కళ్ల ముందు కనిపించే వాస్తవాలు. కాల, మాన పరిస్థితులను చూస్తే ఇప్పటికీ ఎన్నో జీవిత సత్యాలు బోధించే వాస్తవాలు. విజయదశమిగా చేసుకునే దసరాలోనూ మనం నేర్చుకోవాల్సిన విషయాలు .. దరి చేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. విజయం కొరకు ప్రయాణం చేసే ఉత్సవం దసరా. ” ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడుండునో మరియు ఎక్కడైతే ధనుర్ధారియైన పార్ధుడు “అర్జునుడు” ఉండునో అక్కడే విజయం ఉంటుంది.” అని వ్యాస మహర్షి భగవద్గీతలో చివరి శ్లోకం ద్వారా కృష్ణుని ద్వారా చెప్పాడు. ఇక్కడ యోగేశ్వరుడు అంటే దైవ సంకల్పం… ధనుర్ధారి అంటే మానవ కృషి… అంటే దైవసంకల్పానికి మానవ కృషి తోడైతే ఎంతటి విజయం అయినా సాధించవచ్చు. మానవ కృషికి భగవంతుని అనుగ్రహంతోడైతే విజయమే అంతిమ ఫలితం అవుతుంది.
మనలోని రాక్షసులయిన దుర్గుణాలను ఓడిస్తే అసలైన దసరా !
శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలోనే ఆది పరాశక్తి మహిషాసురుడిని సంహరించింది. శరన్నవ రాత్రులనే దేవీ నవరాత్రులని కూడా అంటారు. దేవీ నవరాత్రుల్లో శక్తి ప్రధానం. దుర్గ తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి, వధించింది. చివరికి పదో రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగానే పదవ రోజును దసరాగా, విజయదశమిగా నిర్వహించుకుంటారు. నిజానికి ఇక్కడ నిజంగా రాక్షసుడు ఎవరూ ఉండరు. రాక్షసులు ఎక్కడో ఉండరు. మనలోనే ఉంటారు. ప్రతి మనిషిలోనూ రాక్షసులు ఉంటారు. మనలోని దుర్గుణాలే రాక్షసులు. మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించాలని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజల్లోని అంతరార్థం. మనలోని చెడును మనం అంతమొందించుకుంటే అంత కంటే పెద్ద పండుగ సాఫల్యం మరొకటి ఉండదు.
జంతు లక్షణాలను సంహరించడమే దుర్గాదేవికి ఉపాసన !
విజయదశమి నాడు దుర్గాదేవి మహిషాసురిడిని సంహరించింది. మహిషుడు అంటే దున్న అని అర్థం. మనలోని అహంకారం, అజ్ఞానం, ఇత్యాది చెడు అవలక్షణాన్నీ జంతు లక్షణాలే. అవే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు అన్నీ జంతు లక్షణాలే. ఆది పరాశక్తి బలికోరేది మనలోని ఈ దుర్గుణాలనే. హద్దు అనేది సాధారణంగా శత్రువులు, మిత్రులు అనే భేదాభిప్రాయం వచ్చి నపుడు వారిరువురి మధ్య కొన్ని హద్దులు ఏర్పడ తాయి. వాటిని తుడిచేసి, శత్రువులు సైతం పాత కక్షలు మరిచిపోయి అందరూ మిత్రులుగా మారిపోవాలనేదే దసరా పండుగల ముఖ్య లక్షణాల్లో మరొకటి.
అర్థం చేసుకుంటే దసరానే ఓ జీవిత పాఠం !
దసరా లేదా విజయ దశమి గురించి తెలుసుకున్నా.. అర్థం చేసుకున్నా.. మన జీవితానికో పాఠం అవుతుంది. మన గురించి మనం తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. మనం చెడు మార్గంలో వెళ్తూంటే హెచ్చరిస్తుంది. ఆ చెడును అంతం చేసుకుంటే… విజయం వైపు వెళ్తావని గుర్తు చేస్తుంది. తప్పుడు ఆలోచనలు.. తప్పుడు మార్గాలను గుర్తు చేస్తుంది. విజయం కోసం ఎంత సంకల్ప బలం ఉండాలో తెలియచేస్తుంది. దసరా పండుగను విజయానికి చిహ్నంగా భావించేది అందుకే.
ఈ దసరా స్ఫూర్తిని అందరూ అవగతం చేసుకుని విజయం దిశగా పయనిస్తారని ఆశిస్తూ.. హ్యాపీ దసరా !