ఏపీ అసెంబ్లీలో చీఫ్ మార్షల్‌ను నియమించారు. ఆయన పేరు ఏడుకొండలు రెడ్డి. వైసీపీ వచ్చిన తర్వాత ధియోఫిలిప్ ను నియమించారు. విపక్ష సభ్యుల విషయంలో మార్షల్స్ దారుణంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయనను సొంత శాఖకు పంపేసి.. ఏడుకొండలు రెడ్డి ని నియమించారు. ఆయనకు కూడా ప్రమోషన్లు ఇచ్చి మరీ ఈ పదవికి ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావడం లేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు. మొత్తం టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో గట్టిగా 18 మంది కూడా యాక్టివ్‌గా లేరు. మిగతా వారు వైసీపీకి మద్దతు ప్రకటించడమో.. సైలెంట్‌గా ఉండటమో చేస్తున్నారు. కానీ 150 మందికిపైగా బలం ఉన్న వైసీపీ.. ఈ కొద్ది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతోంది. తాను మొదట వైసీపీ కార్యకర్తనని..తర్వాతే స్పీకర్‌నని నేరుగా చెప్పుకునే తమ్మినేని సీతారాం చాలా సార్లు కంట్రోల్ తప్ప ప్రతిపక్ష నేత మాదిరిగా స్పీకర్ చైర్ నుంచే విమర్శలు చేస్తూంటారు.
ఇక చీటికి మాటికి.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి.. ఎత్తేయండి అని స్పీకర్ .. మార్షల్స్ ను ఆదేశించడం సభ జరిగినప్పుడల్లా ప్రతీ రోజూ కనిపించేదే. ఇప్పుడు అంతా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో మార్షల్స్ పని మరింత ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారేమో కానీ .. తమవారిని నియమించుకున్నారు. ప్రస్తుతం పని చేసే పనులు.. పదవుల్లో… ఏ పేరు చూసినా… చివరి రెండు అక్షరాలు ఒకటే వినిపిస్తూంటాయి. అది కామన్. ఈ విషయంలోనూ అదే నిజం అవుతోంది.