గత కొన్ని నెలలుగా సాగుతున్న ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై సాగుతున్న డ్రామాలకి సోమవారం తెర పడింది. ఈదర హరిబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే మంజూరు చేయడంతో ఆ తీర్పు కాపీని పట్టుకొని ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించడానికి వెళ్లినప్పుడు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ తాళం వేసి ఉండటంతో వెనుతిరగవలసి వచ్చింది.
సుప్రీం కోర్టు అనుమతించినా తనను భాద్యతలు చేప్పట్టడానికి అనుమతించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారుల తీరుకి నిరసనగా ఆయన అనుచరులు పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించారు. ఒకవేళ ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్ళినట్లయితే అది కోర్టు ధిక్కార నేరం క్రింద పరిగణింపబడుతుంది. కనుక అధికారులు సోమవారం సాయంత్రం ఆయన ఛాంబర్ తాళాలు తీసి ఆయనకి అప్పగించారు. ఇంతకాలం ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నూకసాని బాలాజీ రాజీనామా చేసి తప్పుకోవడంతో హరిబాబు ప్రకాశం జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమం అయ్యింది.