పత్రికా రంగంలో తిరుగులేని రారాజుగా పేరు తెచ్చుకొంది ‘ఈనాడు’. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్యులేషన్ నేటికీ ఈనాడుదే. అయితే.. ఈనాడుకి ‘ఆంధ్రజ్యోతి’ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ‘ఈనాడు’ని క్రాస్ చేయడం, దరి దాపుల్లోకి రావడం ఆంధ్రజ్యోతికి అసాధ్యంగా కనిపిస్తున్నా – ఈ పోటీని తట్టుకోవడానికి ఈనాడు ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘నెంబర్ వన్’ స్థానాన్ని కాపాడుకోవడానికి, వీలైతే మరింత పటిష్ట పరచుకోవడానికి ‘ఈనాడు’ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ‘స్పెషల్’ పేజీల్ని తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకోసం ఓ శక్తిమంతమైన టీమ్‌ని కూడా తయారు చేసింది.
ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ స్పెషల్ పేజీలను మించేలా… ఈనాడు స్పెషల్స్‌ని తీసుకురావాలని యాజమాన్యం కంకణం కట్టుకొంది. అందుకోసం కొంతమంది ఫ్రీ లాన్సర్స్నీ, ఒకప్పటి ఈనాడు మాజీ ఉద్యోగుల్ని భారీ వేతనాలు ఇచ్చి నియమించింది.
అయితే ఇప్పుడు ‘స్పెషల్’ పేజీల విషయంలో ఈనాడు వెనుకంజ వేసినట్టు సమాచారం. స్పెషల్ పేజీల వల్ల… సర్క్యులేషన్ పెరిగే అవకాశం లేదని, దాని వల్ల ఖర్చు కనిపిస్తుంది గానీ, అదనపు ఆదాయం ఉండదని ‘ఈనాడు’లోని పెద్ద తలకాయలు కొంతమంది ఈ ప్రయత్నాన్ని అడ్డుకొంటున్నట్టు తెలుస్తోంది. న్యూస్ ప్రింట్ రేటు కూడా ఈమధ్య అమాంతం పెరగడంతో… ‘ఈనాడు’ యాజమాన్యం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొందని సమాచారం. పైగా ఈనాడు అనుబంధ పత్రికలైన సితార, విపుల, చతుర సర్క్యులేషన్ ఈమధ్య బాగా పడిపోయాయని, వాటిపై దృష్టి పెట్టడం మంచిదని యాజమాన్యం భావిస్తోందట. ఈ పత్రికల్ని మూసేసే ఆలోచనలు ఉన్నాయని, ఈ యేడాది చివర్లో ఓ నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. త్వరలో ఈనాడులో భారీ మార్పులు తప్పవన్నమాట.