తెలుగునాటే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తాము అభిమానించే పార్టీలే అధికారంలో ఉండాలనే కోరికను పరోక్షంగా అయినా వ్యక్తపరుస్తుంటాయి మీడియా వర్గాలు. ఈ విషయంలో ‘ఈనాడు’ మీద గట్టి ఆరోపణలే ఉన్నాయి. ఏపీ లెవల్లో బాబును, సెంట్రల్ లెవల్లో మోడీని మోసే ఈ మీడియా వర్గం… అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి వంత పాడుతూ ఉంటుంది. ఏ అంశం విషయంలో అయినా బీజేపీకి అనుకూలమైన వెర్షన్ నే వినిపిస్తూ ఉంటుందనే పేరుంది! అందుకు తగ్గట్టుగా అనేక అంశాలను ప్రస్తావించుకోవచ్చు.
వెనుకటికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని కూడా ఈనాడు పత్రిక ప్రముఖంగా ఎడిటోరియల్ లో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మహా అంటే ఇరవై లోపు సీట్లతో సంతృప్తి పడాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఈనాడు ఎడిటోరియల్ లో పేర్కొన్నారు. అయితే తీరా ఆ ఎన్నికల్లో మాత్రం ఈనాడు అభిప్రాయం అడ్డం తిరిగింది. బీజేపీ గెలవబోతోందన్న ఈనాడు అభిప్రాయానికి పూర్తి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. దేశ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక రీతిలో ఆప్ అధికారంలోకి వచ్చింది.
ఇలా మనకు ఎంతో దూరంలో ఉన్న రాష్ట్రాల గురించి కూడా ఈనాడు బీజేపీ అనుకూల కథనాలు రాస్తూ అభాసుపాలైంది. ఇటీవలి కాలంలో చూస్తే పంజాబ్ ఎన్నికల గురించి ఈనాడులో వివిధ రకాల కథనాలు, కార్టూన్లు వచ్చాయి. వాటి సారాంశం అయితే ఒక్కటే.. అక్కడ ఆప్ కు ఎదురుదెబ్బ తప్పదనేది! కేజ్రీవాల్ కుంటుతూ పంజాబ్ ఎన్నికలను ఎదర్కొనడానికి వెళుతున్నాడని కార్టూన్లు కూడా ప్రచురించారు ఆ పేపర్లో! అయితే నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ కి రాజీనామా చేసిన నేపథ్యంలో రాసిన కథనంలో మాత్రం భిన్నమైన భావన వ్యక్తం అయ్యింది. ఈ పరిణామం బీజేపీకి ఎదురుదెబ్బే అని.. గత ఎన్నికల్లో 30 శాతం ఓట్లను సొంతం చేసుకున్న ఆప్ బలానికి సిద్ధూ తోడవ్వడం అక్కడ ఆ పార్టీకి మరింత ఊపునిచ్చే అవకాశం ఉందనే భావన వ్యక్తం చేసింది ఈ తెలుగు లార్జెస్ట్ డెయిలీ!