ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్ చూస్తున్న వారికి స్పష్టమైన మార్పు సులువుగానే తెలిసిపోతుంది. ప్రభుత్వంపై నేరుగా ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను మొహమాటం లేకుండా ఎత్తి చూపుతున్నారు. పాలనా వైఫల్యాలు.. శాంతిభద్రతల వైఫల్యాలపై విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కాకుండా.. నేరుగా తామే పోరాటం చేస్తున్నారు. ఈ కథనాలు అందర్నీ ఆలోచింపచేసేవిలా ఉంటున్నాయి. ఈ రోజు కూడా సీఐడీ తీరుపై స్పష్టమైన కథనం ఇచ్చారు. ఆ కథనం చదివిన ఎవరికైనా.. ఏపీసీఐడీ అనే పోలీసు వ్యవస్థ చట్టబద్ధమైన ప్రైవేటు సైన్యంగా మారి… రాజ్యాంగ వ్యతిరేకంగా పని చేస్తుందని తీర్మానానికి వచ్చేస్తారు.
రాజధాని, పోలవరం, ఇసుక విధానం, రోడ్లు, అభివృద్ధి పనులు ఇలా ప్రతి అంశంలోనూ ఈనాడు డైరక్ట్ ఎటాక్ చేస్తోంది. కానీ వైసీపీ దగ్గర సమాధానం ఉండటం లేదు. ఎందురుదాడి చేసి బూతులు తిట్టడానికి కూడా సంశయిస్తున్నారు. దీనికి కారణం ఆ కథనాల్లో ఉన్న స్పష్టతేనని అనుకోవచ్చు. సాక్షి పత్రిక ఖండిస్తే అందులో ఎదురు ఆరోపణలు ఉంటాయి కానీ నిజాలు రాయరు. ఎందుకంటే.. రాసినవన్నీ నిజాలే కాబట్టి.. మీరు చేయలేదా.. చరిత్రలో ఎవరూ చేయలేదా.. ఇప్పుడు మేం చేస్తే నోప్పెంటి అని అసభ్యకరమైన భాషలో తిట్టి కార్టూన్లు వేసి.. ఎదురుదాడి చేయడమే చేస్తూంటారు.
గత మూడున్నరేళ్లుగా ఈనాడు చాలా వరకూ సంయమనం పాటించింది. రిపోర్టింగ్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు నేరుగా బాధ్యత తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పత్రికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇది చాలా మందిని ఆకర్షిస్తోంది. బాధితుల పక్షాల నిలబడటం అంటే ఇదీ అంటున్నారు. ఈనాడులో గత ఫ్లేవర్ రావడానికి ఓ రకంగా వైసీపీనే కారణం. వీలైనంత సంయమనంతో ఉన్న ఈనాడును వైసీపీ నేతలే అనవసర విమర్శలతో రెచ్చగొట్టారు. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాల్సి ఉంది.