ఈనాడులో ఎన్ని కాలమ్స్ ఉన్నా – ‘ఇదీ సంగతి’కి ఉన్న మైలేజే వేరు. కేవలం శ్రీధర్ వేసే కార్టూన్ కోసమే ఈనాడు పేపర్ తిరగేసేవాళ్లెంతోమంది. ఈనాడు పేపర్ రాగానే.. ముందు కార్టూన్ చూసి, ఆ తరవాత మిగిలిన వార్తలు చదవడం దశాబ్దాలుగా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు శ్రీధర్ ఈనాడులో లేరు. ఆ కార్టూన్ కూడా ఆగిపోయింది. శ్రీధర్ రాజీనామా చేసిన తరవాత… ఇదీ సంగతి కి ఈనాడులో ప్లేస్ లేకుండా పోయింది. ఇక మీద `ఇదీ సంగతి` కనిపించడం అనుమానమే.
నిజానికి ఈనాడు చాలా బలమైన వ్యవస్థ. తమకంటూ నాలుగైదు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. `వీళ్లు సడన్ గా ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతే…` అంటూ ముందుగానే ఊహించేసి, వాళ్లకు తగిన ఆప్షన్లని ముందే రెడీ చేసి పెట్టుకోవడం ఈనాడుకి అలవాటు.అందుకే ఎంతమంది వెళ్లినా – ఈనాడు క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. ప్రతీ డెస్క్లోనూ బలమైన ప్రత్యామ్నాయాలు, `వాళ్లు కాకపోతే వీళ్లు` అనే ధీమా ఏర్పాటు చేసుకోవడం ఈనాడు స్టైల్. కానీ.. శ్రీధర్ కి ప్రత్యామ్నాయం ఉందా? కచ్చితంగా లేదు.
దానికి కారణం మళ్లీ ఈనాడే. `ఈనాడు ఉన్నంత కాలం శ్రీధర్ ఉంటాడు` అన్న ధీమాతో.. మరో ప్రతిభావంతుడైన కార్టూనిస్ట్ని తయారు చేసుకోవడంలో ఈనాడు అలసత్వం చూపించింది. ఈనాడులో శ్రీధర్ ఒక్కరే కాదు. చాలామంది కార్టునిస్టులు ఉన్నారు. కానీ వాళ్లెవరూ వెలుగులోకి రాలేదు. కేవలం వాళ్లంతా ఇలస్ట్రేటర్లుగా పరిమితమైపోయారు. ఒకరిద్దరు కార్టూనిస్టులు రెడీ అయినా.. వాళ్లనెవరూ పట్టించుకోలేదు. దాంతో వేరే పత్రికలకు వలస వెళ్లిపోయారు. శ్రీధర్ వెళ్లగానే ఆ స్థానం అలా ఖాళీ అయిపోయింది. ఆ స్థానంలో కూర్చునే ధైర్యం, ప్రతిభ ఎవరికీ లేదన్నది వాస్తవం.
శ్రీధర్ వెళ్లిపోగానే.. ఈనాడు ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచించలేదు. శ్రీధర్ వెళ్లగానే మరో కార్టునిస్ట్ ని తీసుకొచ్చి `ఇదీ సంగతి` కొనసాగించే శక్తి ఈనాడుకి ఉంది. కానీ శ్రీధర్ స్థానంలో మరొకర్ని ఈనాడు యాజమాన్యమే ఊహించలేకపోతోంది. అందుకే ఇదీ సంగతి ఇప్పటికి పక్కన పెట్టేశారు. శ్రీధర్ రాజీనామా తరవాత నుంచి ఈనాడులో పాకెట్ కార్టూన్ రావడం లేదు. ఇక మీద వచ్చే అవకాశాలూ లేవు. ఒకవేళ వచ్చినా `ఇదీ సంగతి` లొగో పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇదీ సంగతి పూర్తిగా శ్రీధర్ సొంత ఆస్తిగా ఈనాడు ఇప్పటికీ భావిస్తోంది. అది.. ఈనాడు శ్రీధర్ కి ఇచ్చిన గౌరవం.