ఈనాడు లో ఉద్యోగం అంటే… ప్రభుత్వ ఉద్యోగంతో సమానం అని భావిస్తుంటాయి మీడియా వర్గాలు. అంత భరోసా ఉంటుందన్నమాట. అయితే ఆ భరోసాకు బీటలు వారుతున్నాయి. ఈనాడు ఉద్యోగం కూడా ఇప్పుడు గాల్లో దీపం చందానే తయారవుతోంది. కరోనా వల్ల.. మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుంది పరిస్థితి. ఈనాడు కూడా అందుకు మినహాయింపు కాదు. ఈనాడులో ఒక్కరోజులోనే 20 ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇది నిజంగానే ఈనాడు చరిత్రలో మొదటిసారి.
ఈనాడులో పదివీ విరమణ తరవాత కూడా సగం జీతంతో పనిచేస్తున్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లలో 20 మందిని ఇంటికి పంపించేశారని తెలుస్తోంది. వాళ్లంతా పేజ్ మేకప్ విభాగానికి సంబంధించిన వాళ్లని సమాచారం. కరోనా వల్ల… పేజీలు తగ్గించేసింది ఈనాడు. పేజీలు ఎప్పుడైతే తగ్గాయో, అప్పుడే.. సిబ్బందినీ తగ్గించుకునే వెసులుబాటు దొరికింది. ఏ డెస్క్‌లో కావల్సినదానికంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నారన్న లెక్కలు వేసింది యాజమాన్యం. వాటిలో కొంతమందిని ఇప్పటికే ఇంటికి పంపింది. పదవీ విరమణ తరవాత కూడా ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్నవాళ్ల లిస్టు సేకరించి, అందులో 20మందిని శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది. మరికొంత మంది లిస్టు కూడా ఈనాడు యాజమాన్యం దగ్గర రెడీగా ఉంది. స్పెషల్ పేజీల కోసం భారీగా సిబ్బందిని నియమించింది ఈనాడు. కరోనా వల్ల స్పెషల్ పేజీలకు బ్రేక్ పడింది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఎప్పుడు తమకు యాజమాన్యం నుంచి పిలుపు వస్తుందో అని భయం భయంగా గడుపుతున్నారు.
ఆంధ్రజ్యోతిలో జీతాల కోత
ఆంధ్రజ్యోతిపై కూడా కరోనా ప్రభావం విపరీతంగా పడింది. సిబ్బందిలో 25 శాతం మందికి యాజమాన్యం సెలవలు ఇచ్చేసింది. వాళ్లు ఆఫీసుకు రానవసరం లేదు. అలాంటివాళ్ల జీతాల్లో 80 శాతం కోత విధించినట్టు సమాచారం. 20 వేలు జీతం అనుకుంటే.. వాళ్లకు 4 వేలు మాత్రమే చెల్లించార్ట. వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసేవాళ్లకి 20 శాతం జీతం కోసేశారు. 20 వేలకు 16 వేలు మాత్రమే చెల్లించారు. పే స్లిప్పులో కూడా జీతంలోని కోతకు సంబంధించిన ఎలాంటి వివరాలూ చెప్పలేదని తెలుస్తోంది. కట్ చేసిన జీతం.. రాబోయే కాలంలో తిరిగి ఇస్తారా లేదా? అనేది పెద్ద ప్రశ్న. అంతేకాదు.. సెలవలు మీద ఇంట్లో ఉన్న ఉద్యోగులకు మళ్లీ పిలుపు వస్తుందో రాదో కూడా అనుమానమే. లాక్ డౌన్ మరో విడత కొనసాగితే మాత్రం ఆంధ్రజ్యోతిలోనే కాదు, మిగిలిన అన్ని సంస్థల్లోనూ భారీ ఉద్యోగాల కోత కనిపించబోతోంది.